ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ నెంబరు 77 పేద, బలహీన తరగతులకు శాపంగా మారిందని దానిని వెంటనే ఊపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి చాలా ఘాటైన లేఖ రాశారు.
ఈ జిఓను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తాం.
సోమూ వీర్రాజుకు ఎందుకు కోపం వచ్చిందంటే…
“ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు జీఓ నెంబరు 77 జారీ చేయడం ద్వారా 2020-21 నుంచి విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను మీ ప్రభత్వుం రద్దుచేసింది. యూనివర్శిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ పిజి కళాశాలలు వేళ్లమీద లెక్కపెట్టినట్లుగా మాత్రమే ఉన్నాయని మీకు తెలీదా? ప్రభుత్వ కళాశాలల్లో సీటు దొరకని విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలల్లో చదివితే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్ ఫైనాన్స్ పద్దతిలో 158 ప్రైవేట్ కాలేజీలు నడుస్తున్నాయి. వీటిలో 70 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2018-19 వరకు ఏఎఫ్ఆర్సీ(ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిషన్) నిర్ణయించిన ప్రకారం… ఎంటెక్కు రూ.57 వేలు, ఎంఫార్మసీ రూ.1.10 లక్షలు, ఫార్మాడీ(పోస్టు బ్యాచిలర్) రూ.68 వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ.27 వేలు బోధనరుసుము ఉంది. కన్వీనర్ కోటాలో సీటు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వమే బోధనా రుసుములుచెల్లించేది. ఈ ఉన్నత చదువుతో రాష్ట్రంలో కాకున్నా ఎక్కడైనా వారు ఉద్యోగం సంపాదించగలుగుతారు. కాని మీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీరందరూ నష్టపోతారు,’ అని ఆయన అన్నారు. ఇదే ఆయన ఆగ్రహం తెప్పించింది.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
“అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగంలో మార్పులు తెస్తామన్నారు. అదేనా ఈ మార్పు. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు మీ అసమర్దపాలన గురించి తెలిస్తుందని, వారు మీకు ఓటేయరని భావించి ఇలా కుట్ర చేసి వారికి చదువును దూరం చేస్తున్నారా? పేద విద్యార్థులు ఇంత ఫీజును ఎలా చెల్లించగలరు? రీయింబర్స్మెంట్ నిలిపివేయడం వల్ల వీరు ఉన్నత విద్యకు దూరమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి విద్యా వ్యతిరేక విధానాలను భాజపా తిప్పికొడుతుంది.” అని ఆయన హెచ్చరిక కూడా చేశారు.
విదేశీ విద్యాదీవెన పథకాన్నీ వర్తింపచేయాలి
అలాగే విదేశాల్లో చదివే విద్యార్థులకు ఆర్ధికసహాయం అందిస్తోన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని కూడా మీరు నిలిపివేశారు. ఈ పథకం ద్వారా పలువురు విద్యార్థులు విదేశాల్లోని పలు ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు తెచ్చుకుని అక్కడికెళ్లి కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్దిరపడుతున్నారు. గత ప్రభుత్వం ఇలా విదేశాల్లో చదివేవారికి రూ.10లక్షల ఆర్ధికసహాయం చేస్తే మీరు రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. మీ మాటలు విని ఆర్దికసహాయం వస్తుంది కదా అని ఎంతో మంది విద్యార్థులు అప్పులుచేసి విదేశాల్లో సీటు తెచ్చుకుని చదువుతున్నారు. కాని వారికి ఇంత వరకు మీరు నిధులు విడుదలచేయలేదు. తల్లిదండ్రలు అప్పులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు. అందువల్ల విదేశీ విద్యాదీవెన పథకాన్ని కూడా వెంటనే ప్రారంభించాలి,” సోమూ వీర్రాజు డిమాండ్ చేశారు.