వోల్డేజ్ రీసెర్చ్ లో తెలుగు వాడు, ప్రొఫెసర్ హేమ్ కు అభినందనలు, కొన్ని ప్రశ్నలు

(పరకాల సూర్యమోహన్)
వృద్థాప్యం మీద విస్తృత పరిశోధనలు జరుపుతున్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర వేత్తల బృందంలో మన తెలుగు తేజం,ఆంధ్రులకి ఎంతో గర్వకారణం అయిన పార్లపల్లె హేమచంద్రారెడ్డి గురించి సీనియర్ జర్నలిస్ట్ జింకా నాగరాజు రాసిన ఆసక్తి కరమైన  వ్యాసం నోబెల్, గ్లోబల్ శాస్త్రవేత్తల పక్కన తిరుపతి పూర్వవిద్యార్థికి చోటు చదువుతోంటే ఎన్నో ఆలోచనల్ని రేకెత్తుతాయి. నిజమే, వృద్థాప్యం అంటే ఏమిటి, దాన్ని వాయిదా వేయవచ్చా, చావుని జయించవచ్చా , ఇవి నిజంగానే సాధ్యమేనా అనే అంశాల మీద ప్రపంచ వ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
ఆయన పరిశోధనలు, ఆవిష్కరణలు వృద్ధాప్యంలో వచ్చే ఎల్జైమర్స్, డిమెన్షియా, హంటింగ్టన్ వంటి జబ్బులను అర్థంచేసుకునేందుకు దోహపడుతున్నాయనేది అందరికి గర్వకారణం. ఆయన రాసిన 180 కి పైగా ఉన్నత పరిశోధనా పత్రాలు 18000 సార్లకు పైగా అంతర్జాతీయ పరిశోధనల్లో ఉటంకింపబడ్డాయంటే చాలా గొప్పవిషయం. ఫ్రొఫెసర్ హేమచంద్రారెడ్డి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ఎడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్స్ ఫెలో షిప్ వచ్చి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందలో సభ్యుడు కావడం చాలా గొప్పవిషయం. ఆయనకు అభినందనలు.
నాలాంటి సామాన్య పాఠకుల్లో కొన్ని విపరీతమైన, విచిత్రమైన ఆలోచనలు కలగడం సహజం.
ఈ భూమ్మీద వున్న ప్రతి ప్రాణి ఆయుర్దాయం కచ్చితంగా ఇంత అని చెప్పడం సాధ్యమేనా?
మానవుని ఆయుర్దాయం నూరేళ్ళు అని ఎవరు నిర్థారించారు? నూరేళ్ళు నిండగానే మనిషి టక్కుమని ప్రాణం విడుస్తాడా? లేక వందేళ్ళు దాటికూడా బతుకు తాడా? అలా బతికిన,ఇంకా బతుకు తున్న వాళ్ళు ప్రపంచంలో వున్నారా? అలాంటి వాళ్ళు వుంటే నూరేళ్ళ సిద్ధాంతం తప్పు అని అనుకోవాలా?
ఉదాహరణకు Geert Adrians Boomgard అనే వ్యక్తి 1899 లో తన 110 వ ఏట, Margaret Ann Neve 1903 లో తన110 వ ఏటా, Delina Fillins 1928లో తన 113 వ ఏటా చనిపోయినట్టు నమోదు అయింది. ఇంకా ఇలా ఎన్నో నమోదు అయ్యాయి, నమోదు అవుతున్నాయి. దీని అర్థం ప్రపంచంలో శతాధిక వృద్థులు అంటే నూరేళ్ళు దాటిన వాళ్ళు వున్నారనీ అలాంటి వారి సంఖ్య పెరుగుతోందనీ మనం వింటున్నాం.
మరి అటువంటి వ్యక్తులు వందేళ్ళు అవగానే సిద్ధాంతం ప్రకారం చని పోకుండా ఇంకా ఎన్నో ఏళ్ళు ఎలా బతుకుతున్నారు? అంటే నూరేళ్ళ ఆయుష్షు కచ్చితమైన లెక్క కాదన్న మాట.ఇదేదో ఉజ్జాయింపు, సగటు లెక్క అయివుండాలి.
మరి మనకంటి ఎదురుగా 110ఏళ్ళు, 120ఏళ్ళు వచ్చినా ఇంకా హాయిగా జీవిస్తున్న వాళ్ళు ప్రపంచంలో అనేక చోట్ల కనిపిస్తున్నారు. అలాంటి వ్యక్తులకి ప్రత్యేకమైన వరాలు ఏమైనా వున్నాయా? కాస్త అమృతం ఎక్కడైనా సంపాదించి సేవించారా? అలాంటివి అసాధ్యం. వాళ్ళూ మన లాంటివాళ్ళే. మరి అన్నేళ్ళు ఎలా జీవిస్తునన్నారు?
ఒకవేళ అలాంటి వ్యక్తుల జీవకణాల్లో, కణాంతరాలలో, జన్యువుల్లో, DNA నిర్మాణ క్రమంలో మిగతా వారితో పోల్చితే ఏమైనా తేడాలుంటాయా? ఏమో మరి, ఆ సంగతి మన హేమచంద్రారెడ్డి గారి లాంటి పరిశోధకులు కనిపెట్టాలి.
జాతస్య మరణం ధృవం అన్నారు. అంటే పుట్టిన వాడు గిట్టక మానడు అని. కాని ఎప్పుడు అన్నది నా ప్రశ్న.
కొంతమంది నూరేళ్ళు దాటినా బతికేస్తున్నారు. మరికొంతమంది చాలా త్వరగా చనిపోతున్నారు. ఎందుచేత? వీళ్ళ శరీర కణ నిర్మాణ క్రమంలో లో తేడాలు వుంటాయా? ఒకవేళ తేడాలు వుంటే వాటిని సరిదిద్దడానికీ, లోపాలువుంటే వాటిని సవరించడానికీ వీలుంటుందా? అసలు ఆ తేడాల్ని కనిపెట్టడం సాధ్యమేనా? ఇటువంటి విషయాల మీద శాస్త్ర వేత్తలు పరిశోధనలు జరపవలసివుంది.
పరకాల సూర్యమోహన్
ఏదేమైనా ప్రపంచంలో వృద్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న మాట నిజం. 100-200 ఏళ్ళక్రితం మనిషి సగటు ఆయుర్దాయం షుమారుగా 35-50 ఏళ్ళు వుండేది.ఆ కాలంలో 50 ఏళ్ళు దాటి బతికితే గొప్ప.
టైఫాయిడ్ , కలరా, క్షయ, మశూచి వంటి వ్యాధుల బారిన పడి ఎంతోమంది అకాల మరణం చెందేవారు. ఆ కాలంలో వీటికి సరైన మందులు వుండేవికాదు. వైద్య రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఈ మొండి జబ్బులకు సరైన చికిత్స వుండేది కాదు. ఈ వ్యాధుల నుంచి కోలుకుని బతికి బట్టకట్టిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా వుండేది.
అప్పట్లో కుటుంబంలోఎవరికైనా ఇటువంటి వ్యాధులు వస్తే వాళ్ళ మీద ఆశ వదులు కునేవారు. అతి చిన్నతనంలోనే భర్తని పొగొట్టుకుని చంటి పిల్లలతో పుట్టింటి పంచన చేరిన వింతంతువులు ప్రతి కుటుంబంలోనూ వుండేవారు.
క్రమేపీ వైద్యరంగం అభివృద్ది చెందుతూ రావడంతో చాలా మొండి వ్యాధులకు మందులు వచ్చాయి. ఇటువంటి జబ్బుల బారిన పడిన పడిన రోగులకు మెరుగైన చికిత్స లభించడంతో దాదాపుగా అంతా బతికి బైట పడేవాళ్ళు.ఈనాడు వాటిల్లో చాలా వ్యాధులు అంతరించి పోయాయి. మశూచి వంటి వ్యాధుల్ని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. మనిషి ఎక్కువ కాలం జీవించసాగాడు. అయినా కాన్సర్ వంటి వ్యాధులకి ఇంకా సరైన మందులు రాలేదు .ఒక పక్క వైద్యరంగం విశేషాభివృద్ధి చెందుతూంటే మరోపక్క కొత్త కొత్త వ్యాధులు పుట్టుకు వస్తున్నాయి. మానవునిలో రోగ నిరోధక శక్తిని పెంచి వార్థక్యాన్ని వాయిదా వేయడానికి పరిశోధనలు మొదలయ్యాయి.
మనిషి జీవిత కాలం పొడిగించడానికి వీలుంటుందా అన్న కోణంలో కూడా పరిశోధనలు సాగుతున్నాయి.
ఏనుగు 69 ఏళ్ళు, గుర్రం 60 ఏళ్ళు, సింహం 25, పులి 30, చింపాంజీ 40, catfish 60, కప్ప 36 ఏళ్ళు బతుకు తాయని పరిశోధనల్లో కనిపెట్టారు. మానవుని ఆయుర్దాయం 100 ఏళ్ళు అని కూడా నిర్థారణకు వచ్చారు. అంటే పైన పేర్కొన్న ప్రాణులతో పోల్చితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడన్నమాట. మరి ఆ జంతువులు మనిషిలా ఎందుకు అంతకాలం జీవించవు? ఏమో ! నాలాంటి సామాన్యుడి బుర్రలో ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వెర్రి ఆలోచనలూ తల
ఎత్తుతూ వుంటాయి. మనిషిలాగా అవీ ప్రాణులే కదా? అవి మనిషికన్నా ఎందుకు ముందే చని పోతున్నాయి?
తాబేలు 150-200 ఏళ్ళు బతుకు తుంది. కొన్ని జాతుల తాబేళ్ళు 500 ఏళ్ళ వరకూ బతుకు తాయని చదివినట్టు జ్ఞాపకం. అదికూడా మనిషి లాంటి ప్రాణేకదా? అంత ఎక్కువ కాలం ఎలా జీవించగలుగుతోంది? మానవుడు వందేళ్ళు బతికితే, తాబేళ్ళు దాదాపుగా మరో వందేళ్ళు ఎక్కువ గా బతుకుతున్నాయి. కారణంఏమిటి? వాటి శరీరంలోని ఏవిధమైన జీవకణ నిర్మాణం వాటిని అన్నేళ్ళు బతికేలా చేస్తోంది?
వాటిలో వున్నదీ మనిషిలో లేనిది ఏమిటి?
కొన్ని పురుగుల జీవిత కాలాన్ని పొడిగించడానికి శాస్త్ర వేత్తలు ఒక మార్గాన్ని కనిపెట్టారని ఈ మధ్య పత్రికల్లో వార్తలు వచ్చాయి. అటువంటి ప్రక్రియ మానవుల్లో కూడా అమలు జరపగలిగితే మనుషుల జీవిత కాలం అమాంతంగా అనేక వందల ఏళ్ళు పెరిగి పోగలదని శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
శాస్త్ర వేత్తలు nematode worms అనే పురుగుల మీద ప్రయోగాలు జరిపారు. వీటి సగటు జీవిత కాలం కేవలం కొన్ని వారాలు మాత్రమే.
శాస్త్ర వేత్తలు “double mutant” అనే టెక్నిక్ ని కనిపెట్టి దానిని ఆ nematode worms మీద ప్రయోగించి నప్పుడు వాటి జీవితకాం ఐదు రెట్లు పెరిగిందట.అంటే కేవలం వారం మాత్రమే బతికే ఈ పురుగులు ఐదు వారాలు జీవిస్తాయన్నమాట.
ఇదే టెక్నిక్ ని మానవుల్లో విజయవంతంగా అమలు జరపగలిగితే మనిషి కూడా 500 ఏళ్ళు బతికే అవకాశం వుండొచ్చు.
నిజంగా ఇదే సాధ్యమైలే మానవ పరిణామక్రమంలో పెను విప్లవం వస్తుంది. ఇంతవరకూ అమలులోవున్న సిద్ధాంతాలు అన్నింటినీ తిరగ రాయవలసి వుంటుంది.
మనిషి అన్నివందల ఏళ్ళు నిజంగానే బతికేస్తే మన ప్రపంచం ఎలా వుంటుంది? ఏమో
నా వూహకు అందడంలేదు. మనిషి దీర్ఘ కాలం బతకడం గురించి పరిశోధనలు చేస్తున్న శాస్త్ర వేత్తలు ఆలోచించవలసిన విషయం అది.
ఒక విషయం మాత్రం నిజం. మనలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ నానాటికి ఎక్కువ అవుతోంది. చాలామంది ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నారు . పార్కుల్లో, కాలేజీ గ్రౌండ్స్ లో ప్రతిరోజూ పొద్దున సాయంత్రం వయస్సు తో నిమిత్తం లేకుండా వాకింగ్ చేసేవాళ్ళు కనిపిస్తూవుంటారు.
ఆరోగ్యం గా వుండాలన్న తపన మనుషుల్లో ఎక్కువ అయింది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు.
ప్రపంచంలో వృధ్ధుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న మాట వాస్తవం. ఈనాడు 70-80 ఏళ్ళు, అంతకు పైబడిన వాళ్ళు దాదాపుగా ప్రతి కుటుంబంలోనూ మనకి కనిపిస్తారు.
క్రమేపీ 90 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది.
మనిషిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఇలాగే కొనసాగితే వందేళ్ళు అంతకు మించికూడా జీవించడం అసాధ్యం కాకపోవచ్చు.

 

(పరకాల సూర్యమోహన్ జర్నలిస్టు, చెన్నై)

4 thoughts on “వోల్డేజ్ రీసెర్చ్ లో తెలుగు వాడు, ప్రొఫెసర్ హేమ్ కు అభినందనలు, కొన్ని ప్రశ్నలు

  1. కణాలలో ఉండే తెలోమియర్స్ అనే పోగులను సాగిపోకుండ,వాటి సంఖ్య తగ్గకుండా ఉంచితే మనిషిని ఎప్పటికీ కుర్రడిలానే ఉందిపోవచ్చును.ఐడీ మూసి తనం రాకుండా ఉంచే పరిశోధనల్లో దాగిన ప్రాథమిక సూత్రం.బయోలాజికల్ ప్రాసెస్ ను తగ్గించి ఆయువు పెంచడంలో వీటి పాత్ర ప్రధానం.ఇక జంతువుల్లో అధిక ఆయుర్దాయాన్ని కారణం అవి సంతానోత్పత్తి చేయడానికి నిర్దిష్టమైన సీజన్ నిర్దేశించబడి ఉంది. మనిషి కి మాత్రం 360 రోజులో లైంగిక క్రియ నిషిద్దం కాదు.వీర్య స్కలనం రేటు పెరుగుతున్న కొద్ది తెలోమియర్ల సంఖ్య,పటుత్వం తగ్గిపోయి ముసలి తనపు ఛాయ త్వరగా వస్తుంది.దీనితో పాటు ఆయుర్దాయము తగ్గిపోతుంది.ఇలా చెప్పుకుంటూ పోతే దీని మీద వొక ధీసిస్ రాయచ్చు.

  2. భవిష్య పురాణంలో, కాలజ్ఞానం లో మనిషి ఆయుర్దాయం, ఎత్తు ల గురుంచి ఆసక్తికరమైన విషయాలు చెప్పబడి ఉన్నాయి.మనిషి కి నడిచే 9 గ్ర దశల ఆధారంగా మన ఆయుర్దాయం నిజానికి 120 యేళ్లు ఉండాలి కని యుగ పడ బేధంలో ఇది మొదటి పాదంలో 120,రెండో పాదం లో 80,మూడో పాదంలో 50,నాలుగో పాదంలో 36 సంవత్సరాలుగా వేద వ్యాసుడు నిర్ధారించాడు.ఈ గణన కలి యుగం లోని పాదాలకు మాత్రమే.బ్రంహం కాలజ్ఞానం లో రాబోయే తారల ఆయువు కేవలం 28 వత్సరాలే.ఎత్తు కేవలం 3 అడుగుల లోపే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *