చేనేత దేవాంగ సమాజం ప్రగతి కోసం నిరంతర పరితపించి, అవిరళ కృషి చేసిన తూతిక అప్పారావు ( జనవరి 1, 1954- డిసెంబర్ 17,2020) మరణం చేనేత సమాజాాలకు తీరని లోటు. చేనేత సమాజాలు సమీకరణఅవుతున్న సమయంలో ఆయన మరణించడమనేది బాధాకరం.
అప్పాజీది పాతకాలపు వ్యక్తిత్వం. కనిపించకుండా సేవచేయడం ఆయన వ్యక్తిత్వం.మనిషి కాదు కనిపించాల్సింది,మనిషి చేసే పనులు మాత్రమే అని నమ్మిన గొప్ప తాత్విక గుణం ఆయనది. అందుకే ఆయనెపుడూ వార్తల్లో పెద్దగా కనిపించరు.చేసిన సేవ గురించి చెప్పుకోరు. ఫలితాన్నాశించారు. ఆయనది నిష్కామ కర్మ. తమ ద్వారా నలుగురిని చైతన్యవంతం చేయడం,ప్రయోజకుల్ని చేయడమే జీవితాశయంగా పెట్టుకున్న గొప్ప మనిషి అప్పాజీ. దాన్ని అక్షరాల చేతల్లో చూపిన మనిషి.
పది రోజుల కిందట డిసెంబర్ 17న ఆయన మరణించారు. ఆయన మరణంతో చేనేత సమాజం ఒక అండకోల్పోయిందనక తప్పదు. తూతిక అప్పారావు గొప్ప వితరణశీలి. సేవాతత్పరుడు.
పరిచయమున్నోళ్లకే కాదు పరిచయం లేని వాళ్లకు సైతం నేనున్నానంటూ ఎవరికైనా సాయం చేసే సుగణశీలి అప్పాజీ . చేనేత సమాజానికి చెందిన దేవాంగులకు ఆయన ఎంతో అండగా ఉండేవారు. కష్టాల్లో ఉన్న వారికి నేనున్నాననే భరోసా కల్పించేవారు. ఇప్పుడిప్పుడే ఈ సమాజ అస్తిత్వపతాక రెపరెపలాడుతున్న తరుణంలో అప్పాజీ వంటి ఆత్మీయుడిని కోల్పోవడం దేవాంగ చేనేత సమాజానికి తీరని లోటు.
ఆయన 1954 జనవరి 1న దాలప్ప, గౌరమ్మ దంపతులకు కృష్ణాజిల్లా విజయవాడలో జన్మించారు. ప్రాథమికోన్నత విద్యను అభ్యసించిన తర్వాత విజయవాడ ఆటోమొబైల్ రంగంలో ప్రవేశించారు.నగరంలో ఈ రంగంలో “శ్రీనివాస మోటార్స్ ని అగ్రశ్రేణి సంస్థగా అభివృద్ధి చేశారు.
విజయవాడ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చాలా కాలం కొన సాగారు. దేవాంగ కులబాంధవుడిగా నిలబడ్దారు. ఎక్కడ ఎటువంటి చేనేతల సమావేశాలున్నా పాల్గొనే వారు కులబాంధవుల అభ్యున్నతికి పాటుపడుతూ పేద చేనేత కుటుంబాలలో చదువుకునే పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలలో తనవంతుగా బాధ్యత వహించేవారు.
కేంద్రంగా దేవాంగ సమాజం పురోగతికి ఆయన దిక్సూచిగా నిలిచారు. దేవాంగ సమాజం కోసం నిర్మించిన దేవాంగ హాస్టల్ ద్వారా నిరుపేద యువతకు చోదుడువాదోడుగా నిలిచారు. దేవాంగ విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోడానికి, ఇక ఉద్యోగం వచ్చిన బ్యాచిలెర్స్కు, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ఉద్యోగులకు అందరికీ దేవాంగ హాస్టల్ ను అందుబాటులో ఉంచారు.
ఆయన తన మన చూసే వారు కాదు. దేవాంగ మనుగడ కోసం ఆయన నిరంతరం పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రకటించిన తర్వాత దేవాంగ హాస్టల్ రూపురేఖలు మార్చాలని మరింత మంది పేద దేవాంగులకు హాస్టల్ అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం ఏర్పాటులోనూ ఆయన కృషి అనన్యసామాన్యం. కులాభ్యున్నతి కోసం ఏర్పడినా, ఈ సంఘం, కులం అంటే ఒక కలయిక, ఒక చేదోడు, ఒక ఆత్మీయ, ఒక భరోసా అనే ఫిలాసఫితో నడిపించారు.
మరొక విశేషమేమంటే, తానెక్కడ కనిపించకుడా ఆయన సేవాకార్యక్రమాలను సాగించడం. ఆయన ఎవరికీ కన్పించరు. విన్పించరు. ఆలాంటి తాత్విక చింతన తో చేనేత సమాజంలో ఆయన దేవాంగ కులానికి వన్నె తెచ్చారు. చేనేతకుటుంబాలలో సామాజిక, సేవా చైతన్యం తీసుకువచ్చారు
ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం, హైదరాబాద్ దేవాంగ సంక్షేమ సంఘం(కోఠి) కార్యక్రమాలకుఅండగా ఉన్నారు. చురుకుగా పాల్గొన్నారు. వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షుడుగా జాతీయస్థాయిలో దేవాంగుల అభ్యున్నతికి చివరి వరకు కృషి చేశారు.
.”కళ్యాణం కమనీయం-చేయాలి రమణీయం” అనేది వీరి జీవన పిలాసఫీ అదే ఆశయంతో బీదదేవాంగ కులబాంధవులకు వివాహాలను జరిపించే మహత్తర కార్యక్రమం కూడా చేపట్టారు.
సంఘసేవపట్ల ఆయన స్వతహాగా ఆశక్తి కలిగింది. లయన్స్ క్లబ్ లో సభ్యులుగా చేరి. వీరి అమూల్యమైన సేవలతో అనతికాలంలోనే చక్కని కీర్తిగడించారు. ఆయన లేని లయన్స్ క్లబ్ సమావేశం గానీ సేవా కార్యక్రమముగానీ ఉండదు. అప్పాజీ లయన్స్ క్లబ్ లో 5సార్లు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు.
1981లో వీరికి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సూర్య వెంకటలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.