( డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీ కోవిడ్ నోడల్ ఆఫీసర్)
1) త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా?
అవును. కరోనా వ్యాక్సిన్ ట్రయిల్స్ వివిధ స్టేజ్ లలో ఉన్నాయి. వ్యాక్సిన్ ను త్వరలోనే ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరింత సమాచారం, అప్ డేట్స్ www.mohw.gov.in లో తెలుసుకోవచ్చు.
2) కోవిడ్ వ్యాక్సిన్ విడతల వారీగా అందరికీ ఇస్తారా?
వ్యాక్సిన్ లభ్యత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమాలను గుర్తించింది. ఎక్కువ వైరస్ ప్రభావానికి గురయ్యేవారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. అందులో మొదటి వారు హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు. 50ఏళ్లకు పైగా వయస్సు ఉండి కోమార్బిడిటీ కండీషన్లు ఉన్న వారిని రెండో గ్రూపుగా ఎంపిక చేసి వ్యాక్సిన్ ఇస్తారు.
3) కోవిడ్ టీకా తీసుకోవటం తప్పనిసరా?
నిజానికి ప్రజలు కోవిడ్-19 టీకా తీసుకోవటం తప్పని సరి కాదు. వ్యక్తులు తమకు అంగీకారమైతేనే వ్యాక్సిన్ను వేయించుకోవచ్చు. ఐతే కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తి రక్షణ పొందేందుకు, సమాజంలో దాని వ్యాప్తిని అరికట్టేందుకు నిర్దేశిత మోతాదులో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని ద్వారా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు కూడా కోవిడ్ సోకటాన్ని నివారించవచ్చు.
4) తక్కువ వ్యవధిలోనే వ్యాక్సిన్ తీసుకువస్తున్నారు కదా..సురక్షితమేనా?
కొవిడ్-19 వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని నిరూపణ అయిన అనంతరం మాత్రమే దేశంలో పంపిణీ జరుగుతుంది. ఇతర వ్యాధులకు ఇచ్చే టీకాల మాదిరిగానే.. కొందరు వ్యక్తుల్లో తేలికపాటి జ్వరం, ఇంజక్షన్ ఇచ్చిన చోట నొప్పి తదితర ఇతర ఫలితాలు ఉండవచ్చు. ఐతే వ్యాక్సిన్ సంబంధిత ప్రభావాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
5) కరోనా సోకిన వారు టీకా తీసుకోవాలా?
కరోనా నిరోధక వ్యాక్సిన్ను కొవిడ్ సోకటంతో సంబంధం లేకుండా అందరూ తీసుకోవచ్చు. ఇప్పటికే కొవిడ్ సోకిన వారు కూడా సూచించిన విధంగా పూర్తి టీకా మోతాదులను తీసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో ఆ వ్యాధి సోకకుండా పటిష్ఠమైన వ్యాధి నిరోధకత లభిస్తుంది. రెండో డోసు తీసుకున్న రెండు వారాల్లో రక్షణ కల్పించే యాంటీబాడీలు శరీరానికి లభిస్తాయి.
6) కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కూడా వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా?
అవును. వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమే. మీరు గతంలో ఎలాంటి రోగాలు, కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఉన్నా వాటితో సంబంధంలేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి మరోసారి ఇలాంటి వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.
7) అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాక్సిన్లనే ఎందుకు ఎంచుకుంటున్నారు?
కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందుకుగానే వివిధ కంపెనీలు తయారు చేసే వ్యాక్సిన్ల యొక్క క్లినికల్ ట్రయిల్స్, డాటా ఆధారంగా వాటి భద్రత, సమర్థతను మన దేశ డ్రగ్ రెగ్యులేటర్ పరిశీలించిన తర్వాతనే లైసెన్స్ జారీ చేస్తారు. కాబట్టి లైసెన్స్ పొందిన అన్ని కోవిడ్ టీకాలు తగిన భద్రత మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
8) +2 నుండి +8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల దగ్గర కోవిడ్ వ్యాక్సిన్ ను నిల్వచేసే సామర్థ్యం మరియు రవాణా చేసే అవకాశం మన దేశంలో ఉందా?
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో టీకాలు వేస్తున్న దేశం మనదే. సుమారు 26 మిలియన్లకు పైగా నవజాత శిశువులు, 29 మిలియన్ల మంది గర్భిణీ స్త్రీలకు టీకాలు ఇస్తున్నాము. ఇప్పుడు కోవిన్ వ్యాక్సిన్ ను కూడా మన దేశ జనాభాకు అనుగుణంగా నిల్వ చేయడం, పంపిణీ చేయడంపై దృష్టి సారించారు. అందుకు తగ్గట్టుగా యంత్రాంగాలు సన్నద్ధమవుతున్నాయి.
9) మన దేశంలో ప్రవేశపెట్టిన వ్యాక్సిన్ ఇతర దేశాలలో ప్రవేశపెట్టిన వాటికంటే సమర్థవంతంగా ఉంటుందా?
అవును. ఇతర దేశాలలో తయారైన కోవిడ్ వ్యాక్సిన్ల కంటే మన దేశంలోనే తయారైన వ్యాక్సిన్లు సమర్థవంతంగా ఉంటాయి. అందుకు తగిన విధంగా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, వాటి భద్రత, సమర్థవంతంగా ఉంటాయి.
10) కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి నేను అర్హుడిని అని ఎలా తెలుసుకోవాలి?
ప్రాథమిక దశలో ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి వ్యాక్సిన్ ఇస్తారు. మొదట ఫ్రంట్లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఇందులో పారామెడికల్ సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బంది ఉంటారు. తర్వాత 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ఆ సమాచారాన్ని లబ్ధిదారునికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. ఎక్కడకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలి? ఏ టైమ్ కు వెళ్లాలి? అనే సమాచారం అందులో ఉంటుంది. ఇది వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది.
11) ఒక వ్యక్తి ఆరోగ్య శాఖలో రిజిస్ట్రేషన్ లేకుండా కోవిడ్ వ్యాక్సిన్ పొందవచ్చా?
ఆ అవకాశం లేదు. తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్నిస్ వేయడానికి లబ్ధిదారుడు తన పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే టీకా ఎక్కడ వేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఏ సమయంలో టీకా కేంద్రానికి రావాలి అన్న సమాచారం లబ్ధిదారుడి వస్తుంది.
12) లబ్ధిదారుడు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏఏ పత్రాలు అవసరం?
ఈ కింద ఇచ్చిన జాబితాలో పొటోతోపాటు ఉన్న ఐడికార్డు ఉన్నవారయినా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులవుతారు.
డ్రైవింగ్ లైసెన్స్
కార్మిక మంత్రిత్వశాఖ పథకం కింద ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) జాబ్ కార్డ్
ఎంపీలు / ఎమ్మెల్యేలు / ఎంఎల్సిలకు అధికారికంగా జారీ చేసిన గుర్తింపు కార్డులు
పాన్ కార్డు
బ్యాకులు, పోస్టాఫీసులు జారీ చేసిన పాస్బుక్లు
పాస్పోర్ట్
పెన్షన్ డాక్యుమెంట్
సెంట్రల్ / స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు
ఓటర్ ID
13) రిజిస్ట్రేషన్ సమయంలో ఫొటో/ఐడి ఏమైనా అవసరమవుతాయా?
రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా ఫొటో ఐడి కార్డు అవసరం. అలాగే వ్యాక్సిన్ వేయించుకునే సమయంలోనూ దాన్ని వెరిఫై చేయించుకోవాలి.
14) ఒక వ్యక్తి సెషన్ సైట్ వద్ద ఫోటో ఐడిని చూపించలేకపోతే అతను / ఆమెకు టీకా వేస్తారా?లేదా?
ఉద్దేశించిన వ్యక్తికి టీకాలు వేసినట్లు నిర్ధారించుకోవడానికి సెషన్ సైట్ వద్ద లబ్ధిదారుని రిజిస్ట్రేషన్ మరియు ధృవీకరణ రెండింటికీ ఫోటో ఐడి తప్పనిసరి.
15) టీకా గడువు తేదీ గురించి లబ్ధిదారునికి సమాచారం ఎలా వస్తుంది?
లబ్ధిదారుడు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రం పేరు, తేది, సమయం తదితర సమాచారం ఉంటుంది.
16) టీకాలు వేసిన లబ్ధిదారులకు టీకా తీసుకున్నట్టు ఏమైనా సమాచారం వస్తుందా?
అవును. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పూర్తయిన తర్వాత లబ్ధిదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పొందుతారు.
అన్ని డోసులు పూర్తయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ ఆధారిత సర్టిఫికెట్ ను కూడా రిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్ కు పంపుతారు.
17) క్యాన్సర్, డయాబెటిస్, హైపర్టెన్షన్ వంటి అనారోగ్యాలు ఉన్నవారు ఎవరైనా మందులు తీసుకుంటుంటే, అతను / ఆమె కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
అవును. ఈ కొమొర్బిడ్ లక్షణాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులను అధిక ప్రమాదం కలిగిన వర్గంగా పరిగణిస్తారు. వారు తప్పనిసిరగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి.
18) టీకా అనంతరం ఈ వ్యాక్సిన్ కేంద్రం దగ్గర ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా?
టీకా తీసుకున్న అనంతరం వ్యక్తులు అదే ప్రదేశంలో అరగంట పాటు వేచి ఉండాలి. ఏదైనా అసౌకర్యం తలెత్తితే.. సమీపంలో ఉన్న ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులకు తెలియచేయాలి. టీకా అనంతరం మితిమీరిన నమ్మకంతో మాస్కులు ధరించడం, చేతిని శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరం తదితర నిబంధనలను పాటించటం మానరాదని హెచ్చరించారు.