(ఇఫ్టూ ప్రసాద్ :పిపి)
***
స్థలం: సింఘు బోర్డర్, ఢిల్లీ సమీపాన
ప్రదేశం :నిరసనలో ఉన్న రైతుల మధ్య బస
సమయం: ఇది రాస్తున్నపుడు రాత్రి పది గంటలు, వెలుతురు లేదు, చలి దంచి వేస్తోంది. ఫోన్ లో ఛార్జింగ్ లేదు. త్వరగా మిత్రులకు పంపే ఆతురత.
***
ఊరుకూ ఊరుకూ మధ్య బండి బాటలు ఉంటాయి. రైతు పొలానికీ రైతు పొలానికీ మధ్య కాలిబాటలు ఉంటాయి. చేనుకూ చెలకలకూ మధ్య డొంక దారులు ఉంటాయి. ఊరుకూ పట్నం సంతలకూ మధ్య తారు రోడ్లు ఉంటాయి. ఈ ఆఖరి తారు రోడ్ల మీద తాము ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యంతో ఏడాదికి ఒకసారో రెండు సార్లో మార్కెట్ కోసం రైతు పట్నం వెళతాడు. అది తప్ప ఏడాది పొడవునా తన జీవితమంతా రైతుల నడక ప్రధానంగా బండి బాటలు, కాలిబాటలు, డొంక మార్గాల గుండా సాగడం సహజం. అలా నడిచే రైతులు నేడు నేషనల్ హైవే ఎక్కి, దాన్ని ఏకంగా తమ నివాసంగా కూడా మార్చారు. ఇది భారతదేశ రైతు చేస్తోన్న కొత్త ప్రయోగం.
.
జాతీయ రహదారుల మీద భారతదేశ రైతాంగం కొత్తగా ఇలా నివాసం ఏర్పరుచు కోవడం వర్తమాన దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇది కూడా ఒకటి లేదా రెండు రోజులు కాదు. ఏకంగా నేటికి మూడు వారాలుగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి చేరే పలు హైవేల్ని దిగ్బంధించి, వాటిని తమ స్వంత నివాసాలుగా రైతాంగం మార్చుకోవడం అపూర్వమైనది. రాజ్యం దృష్టి లో స్వర్ణ భుజిగా పేరొందిన హైవేలను దిగ్బంధించి తమ స్వాధీనంలో ఉంచుకోవడం ఒక ఎత్తు. వాటి మీద రైతులు తమ స్వంత ఇష్టం ప్రకారం వంట గదులు (కిచెన్ రూమ్స్), భోజన శాలలు (డైనింగ్ రూమ్స్), పడక గదులు (బెడ్ రూమ్స్) సభా, సమావేశ వేదికలు (కాన్ఫెరెన్సు హాల్స్), రచ్చ బండలు (పబ్లిక్ క్లబ్స్) నిర్మాణం చేసుకోవడం మరో ఎత్తు!
స్వర్ణభుజి పై పది నిమిషాలు రాస్తా రోకో జరిగితే అల్లడిపోయే రాజ్యం నేడు మౌనమూర్తిగా మారింది. ఐనా రైతుల కొత్త నివాసాల్ని కూడా రాజ్యం చూస్తూ గుడ్లప్పగించి మౌనంగా తిలకిస్తోంది.
ఇలా రైతాంగపు కొత్త నివాసాల నిర్మాణాలతో స్తంభించిన హైవేలలో ఒక హైవే పై ఈ రాత్రికి మేము బస చేస్తున్నాం. ఈ అపూర్వ, అసాధారణ అనుభవం నుండి పొందే మా రాజకీయ మధురానుభూతిని మిత్రులతో పంచుకునే చిన్న ప్రయత్నమిది.
ఇది బహుశా షేర్ షా పాలనా కాలంలో భారత ఉప ఖండంలో నిర్మాణమైన గ్రాండ్ ట్రంక్ రోడ్డు కావచ్చునేమో! ఔనుమరి, చరిత్రలో చదివినట్లు కలకత్తా నుండి పెషావర్ వరకు నిర్మాణం చేసిన నాటి రోడ్డు ఇదే కావచ్చని అనిపిస్తుంది. అదే నిజమైతే, నేటి ఆధునిక రాజ్య స్వర్ణభుజి రహదారిగా అదే మారినట్లు భావించాలి. అదే కావచ్చు, కాకపోవచ్చు. అది ఏదయినా నేటి స్వర్ణభుజి తరహా రహదారే. దానిని నేటి భారత రైతాంగం తమ స్వంత నివాసంగా మార్చింది.
ఇలా రైతులు కొత్తగా నిర్మించుకున్న నివాసాలలోనే ఈ రాత్రి గడ్డకట్టే చలిలో మా బృందం కూడా బస చేయాలని ఇంతకుముందే నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడే ఒక బెడ్ రూమ్ లోకి చేరి బసకి ఉపక్రమిస్తున్నాం. ఈ సరి కొత్త నివాసాలకు ఇంకా విద్యుత్ సౌకర్యం సమకూరలేదు. ఐనా గృహ ప్రవేశం జరిగింది. కరంటు లేక పోవడం వల్ల త్వరగా పడుకోక తప్పడం లేదు. నిద్రకు ఉపక్రమిస్తూ మిత్రులకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాము.
(ఢిల్లీ ముట్టడి కథనం-2)