అమర జీవి పొట్టి శ్రీరాములు అనగానే ఎక్కువ మంది తోచేది ఆంధ్రరాష్ట్ర సాధనకై అసువులు బాసిన వ్యక్తి అని మాత్రమే. చరిత్రలో త్యాగమూర్తులకు జరిగెే అన్యాయాలలొ ఇది ఒకటి. ఇంకా ముందుకు వెళ్ళితే, ఈ మధ్య దేశ నాయకులను కూడా ఆయా వర్గాలవారు మాత్రమే జ్ఞప్తికి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. భాధాకారమైన విషయం.
ఒక్కొక సారి వాళ్లైనా జ్ఞాపకం పెట్టుకొన్నారు గదా అని సమాధానం పడాల్సి వస్తుంది. శ్రీరాములు విషయాని కొస్తే, ఆయన వినొబా భావె, బాబూ పురుషోత్తమదాస్ టండాన్, ఆచార్య కృపలాని, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత పటవర్ధన్, స్వామి రామానంద తీర్థ, ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, రాజాజి వంటి మహా నాయకుల సరసన ఉండదగిన, ఉండవలసిన గాంధేయవాది. కాని ఆ చోట్లు దక్కలేదు.
ఆయన నిష్కళంక దేశభక్తుడు, మెధావి, రాజకీయ నాయకుడు, ఆద్యాత్మిక చింతకుడు, కర్మయోగి, సర్వసంఘ పరిత్యాగి! ఆంధ్రుల చరిత్ర భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన చిరస్మరణీయుడు, అమరజీవి. మనం సామాన్యంగా మహా పురుషుల జన్మ దినాన్నే ఆచరిస్తాం. ఐతెే స్వామిజి, సన్యాసి, సిద్ధ పురుషుల, ఋషి పుంగవుల వర్దంతిని, పుణ్యతిథి, సమారాధనగా ఆచరిస్తారు. అందువల్ల శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికొరకై ఆత్మాహుతి చెసుకొన్న డిసెంబర్ 15 వ తేదిని ఆయన పుణ్యతిథిగా ఆచరంచడం ఆనవాయితి.
శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళే వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం.
ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తండ్రి గురువయ్య అకాల మరణముతొ, తల్లి మహాలక్ష్మమ్మ, హప్పడాలు, ఒడియాలు, ఉరగాయి, బజ్జిలు, పకోడిలు చెసి అమ్ముతూ, కొడుకుని పెంచింది, పోషించింది, విద్యావంతుణ్ని చేసింది.
తరువాత బొంబాయిలో గ్రేట్ పెనిన్స్యులార్ రేల్వేలో చేరి నాలుగేళ్లు ఉద్యోగం చేసాడు. అతని జీతం నెలకు 250 రూపాయలు. 1927 లొ శ్రీరాములు ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ‘సీతమ్మ’తో వివాహం జరిగింది. రెండు సంవత్సరాలలోపే పురుటి బిడ్డతో సహా భార్య, ఆపైన ఆరు నెలల లోపలె, తల్లి మరణించటంతో జీవితంపై విరక్తిచెందిన శ్రీరాములు ఉద్యోగాన్ని వదిలేశాడు. శాంతికాముకుడుగా మారాలనుకున్నుడు. తన శేషజీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయదలచుకున్నాడు, సబర్మతి ఆశ్రయం చేరుకొని గాంధీజీ అనుచరుడుగా మారారు. తన ఆస్తిపాస్తులను అన్నదమ్ములకు పంచి పెట్టారు.
గాంధీజీ పూరించిన స్వాతంత్య్రోద్యమ శంఖారావానికి ప్రభావితుడై, శ్రీరాములు గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుండి జాతీయోద్యమంలొ కదం తొక్కాడు. ఆశ్రమంలోని పరివారంలో ప్రధాన సభ్యు డుగా, గాంధీ ఎంపిక చేసుకున్న కొద్దిమంది సర్వోదయ సేవకులలో అగ్రగణ్యుడుగా పదకొండు సంవత్సరాలు నియమబద్ధ ఆశ్రమ జీవితం గడిపారు. సహాయ నిరాకరణోద్య మంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని కారాగార శిక్షలు కూడా అనుభవించాడు. నిరుపమాన ‘సంఘసేవకుడు’. మురికి వాడల పారిశుద్ధ్యం, హరిజనుల ఆలయ ప్రవేశం, ఖాదీ పరిశ్రమ, పతిత జనోద్ధరణ మొదలగు రంగాలలో ఆంధ్ర, గుజరాత్ ప్రాంతాలలో ప్రముఖ కార్యకర్తగా శ్రీరాములు చేసిన సంఘసేవ అపారమైనది.
గాంధీజీ శిష్యులు గా నిర్మాణాత్మక కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. మూడు సార్లు రాజకీయ నిర్భందితులుగా కారాగార వాసంచేశారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘనం వంటి ఉద్యమాల్లో అగ్రగామిగా వుంటూ గాంధీజీ ప్రశంసలందుకున్నారు. 1941-1942 సంవత్సరాల సత్యాగ్రహం, ‘క్విట్ ఇండియా’ ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.
1944లో నెల్లూరు కార్యక్షేత్రంగా ఖద్దరు ఉత్పత్తి, వ్యాప్తి కార్యక్రమాల్లో తీవ్రంగా కృషి చేశారు. మండుటెండల్లో చెప్పులు, గొడుగు లేకుండా జాతీయోద్యమాన్ని చాటి ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు “పిచ్చి శ్రీరాములు” అనేవారు. అవును దేశాభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది. ’పట్టుమని పదిమంది పొట్టి శ్రీరాములు వంటి మహావ్యక్తులు వుంటే, మన పవిత్ర భారతదేశానికి ఒక్క సంవత్సరం లోనే స్వాతంత్య్రం తెచ్చి పెట్టగలను ‘ అన్నారు గాంధీజీ.
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని ‘మంకుతనం’ మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రొవిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాంతంత్య్రం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టీ ఆ స్వాతంత్య్రోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు.
అప్పుడు మహాత్మా గాంధీ టంగుటూరి ప్రకాశంకు ఇలా వ్రాశాడు – “హమ్మయ్య. శ్రీరాములు దీక్ష నువ్వు చెప్పినట్లు విరమించుకోవడం నాకు సంతోషం. దీక్షను మానుకొన్నాక నాకు అతను టెలిగ్రామ్ పంపాడు. అతను ఎంతో దీక్షాపరుడైన ఉద్యమకారుడైనా గాని కాస్త తిక్కమనిషి (eccentric)”. 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేడు. ఉన్నాగాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది.
శ్రీరాములుగారు జీవితపు చివరి దశలో నెల్లూరులో వుంటూ హరిజనోద్ధరణకు నిర్విరామంగా పనిచేశారు. త్యాగమే ధనంగా పెరిగిన ఆయన ముతక ఖద్దరు దుస్తులు ధరించి, నెల్లూరు పట్టణ వీధుల్లో దయగలవారు పెట్టిన ఆహారంతో బ్రతికారు. కాళ్లకు చెప్పులుగాని, తలపై గొడుగుగాని లేకుండా మండుటెండల్లో తిరుగుతూ జాతీయ ఉద్యమ ప్రచారం చేసేవారు.
హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని రాసిన అట్టలను మెడకు తగిలించుకుని ప్రచారం చేశారు.1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష ఫలితంగా హరిజనులు ఆలయంలో ప్రవేశింపగలిగారు. ఆ సంవత్సరంలోనే మద్రాసు ప్రభుత్వంచే హరిజనుల ఆలయప్రవేశం, హరిజనోద్ధరణకు సంబంధించిన రెండు శాసనాలను ఆమోదింప చేసేందుకు 23 రోజుల నిరశన దీక్ష చేశారు.
ఆయన వజ్ర సంకల్పం ఫలించింది. మూడో మారు వార్థాలో 1948లో నిరాహార దీక్ష 29 రోజులు సాగించారు. హరిజనులకు ఆలయప్రవేశం మీద చట్టం తేవటానికి నిరాహార దీక్ష చేసి సంచలనం సృష్టించారు. నాటి మన ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సంవత్సరానికొక రోజు హరిజన దినోత్సవం గా యావద్భారత దేశమంతటా జరపాలనే, హరిజన సంక్షేమ నిధికై కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపు జరప గలమనీ ప్రకటించడంతో శ్రీరాములు దీక్ష విరమించారు.
హిందూ సంఘ సంస్కరణ నెలకొల్పి అస్పృశ్యతానివారణ, బాల్య వివాహ నిషేధం, వితంతు వివాహ ప్రోత్సాహం, మూఢాచార నిర్మూలనకు ఎంతో కృషి చేశారు.
స్వాతంత్య్రానంతరం, శ్రీరాములు తనను తాను సమాజాభివృద్ధికి, నిర్మాణానికి పాటుపడే కార్యకర్తగా నిర్వచించుకునేవారు. ఆయనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి లేదు. కానీ, రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ సమస్య. అప్పటికే అది చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. అలాంటి రాజకీయ సమస్య కోసం శ్రీరాములు దీక్ష చేయటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పలు గ్రంథాలు, వ్యాసాలను బట్టి తెలుస్తోంది.
స్వాతంత్య్రం అనంతరం ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం తరఫున నిర్మాణ కార్యక్రమ ఆర్గనైజరుగా శ్రీరాములు పనిచేశారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రులకు ప్రత్యేకంగా రాష్ట్రం లేకపోవటం వల్ల నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో ఏ పని జరగాలన్నా రాష్ట్రం లేకపోతే సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. కాబట్టి రాజకీయ ప్రవేశం చేయాలని, అయితే అది నిర్మాణం కోసమేనని ఆయన తెలిపారు.
మహాత్మా గాంధీతో పాటు దాదాపు రెండు దశాబ్దాలు గడిపారు శ్రీరాములు. ఆయన అహింస సిద్ధాంతాన్ని బాగా విశ్వసించి, పలుమార్లు ఆచరించి విజయం సాధించారు. అదే మార్గంలో దీక్ష చేయాలని నిర్ణయించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. (1952అక్టోబర్ 14వ తేదీన మద్రాసు పౌరులకు, ఇతరులకు పొట్టి శ్రీరాములు చేసిన విజ్ఞప్తిలో కొంత భాగం) ‘‘ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం విషయంలో ఆయన (నెహ్రూ) దృష్టికి రాగల వాతావరణాన్ని కల్పించి, ఆ పరిస్థితి నుంచి తప్పించుకొనే అవకాశం లేకుండా.
తనంతట తానుగా దేశం అంతటి క్షేమాన్ని ఆకాంక్షించి, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి పూనుకొనే పరిస్థితులను కల్పించవలసిన అవసరం కలుగుతున్నది. దీనిని సాధించటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి హింసాయుతము, రెండు అహింసాయుతము. అహింసలో నమ్మకం ఉన్నవారు తమకు ఏమీ పట్టనట్లు నిద్రబోతే, ఏమీ పని చేయకుండా కూర్చుంటే హింసావాదులయినవారు పూనుకొని పరిష్కార దుస్సాధ్యమైన పరిస్థితులను కల్పిస్తారు.’’
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన కోరిక ఇరవైవ శతాబ్ధం ఆది భాగమునుండి ఉండేది. 1913 లొ కొండా వెంకటప్పయ్యగారి అధ్యక్షతన ప్రపథముగా ’ఆంధ్ర మహా సభా” బాపట్లలొ సమావేశమైనది. మొదట కొన్ని రోజులలొ సర్కారు, రాయలసీమా వారిలొ కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పిటికి, గాడిచర్ల హరిసర్వొత్తమ రావుగారి వంటి మహనీయుల చొరవతొ ఏకాభిప్రాయానికి వచ్చిసభలు, సమావేశాలు తర్వాత ఉద్యమం రూపు దాల్చింది. రావుగారు స్వయానా మహా సభాధ్యక్షత వహించారు. అప్పటినుండి ప్రాంత, ప్రాదేశిక విభేదాలు లేకుండా, అంధ్ర మహానాయకులు, ప్రతి సంవత్సరం, మహాసభ సమావెశాలు జరుపుతూ, ఉద్యమాన్ని ఉదృతం చెస్తూ వచ్చారు. ఈ రకంగా ఆంధ్ర దెశం, దేశ భాషలకొరకై పోరాటానికి, యావత్ భారతావనికి మార్గదర్శనం చేసిన దారి దేపం అంటె అతిశయోక్తి కాదు.
సర్వోదయ నాయకులు స్వామి సీతారాం ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం ప్రాయోపవేశ దీక్షకు ఉపక్రమించి, కేంద్ర నాయకుల హామీలతో దీక్ష విరమించిన తరువాత ఎంతకాలానికీ రాష్ట్ర నిర్మాణం జరగక పోవటంతో ఆంధ్రులలో నిరాశా నిస్పృహలు అలుముకొన్న తరుణంలో శ్రీరాములు రంగప్రవేశం చేసి ఆంధ్ర రాష్ట్రా వతరణకై 1952 అక్టోబర్ 19న మద్రాస్ లొ శ్రీబులుసు సాంబమూర్తిగారి గృహంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీరాములు కఠోర నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించసాగింది. కండరా లన్నీ కరిగి, శరీరం శల్యమై, గుండెల్లో రక్త ఉత్పాదనా శక్తి ప్రతినిమిషం క్షీణిస్తూ ఒక్కొక్క అవయవం వశం తప్పుతుండ టంతో ఆయన ఆరోగ్య పరిస్థితికి యావ దాంధ్ర దేశం ఆందోళన చెంది “ఆంధ్ర రాష్ట్రం ఇవ్వండి! శ్రీరాములు ప్రాణాలు కాపాడండి” అంటూ నినాదాలు చేశారు.
ప్రముఖ ఆంధ్ర నాయకులు దీక్ష విరమించమని శ్రీరాములును కోరినా తన ఆత్మార్పణ తోనైనా ఆంధ్రరాష్ట్రం రావాలంటూ దీక్ష విరమించడానికి అంగీకరించలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు.
ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం… పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురుపడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడని స్థితిలో ఉన్న శ్రీరాములు, వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు.
స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు. ఈ సన్నివేశాన్ని ప్రకాశంగాఅరు తన ఆత్మకథ, “నా జీవిత యాత్ర”లొ: “శ్రీరాములుగారి నిర్దుష్టమైన ఉపావాస దీక్ష రోజు రోజుకు, ఆంధ్రుల హృదయాలలొ ఆందోళన కలిగించసాగింది. ప్రజల భావాలలొ ఒక వేడిని పుట్టించింది. ప్రకృతి అనుకొనటువంటి ఉష్ణతను ధరించింది. కార్మికులలొనూ, విద్యార్థిలలోనూ, ఆంధ్రరాష్ట్ర విషయమైగాక, శ్రీరాములుగారి, ప్రాణ విషయమై చాలా మనస్థాపం కలిగింది.”
డిసెంబర్ 15 శ్రీరాములు ఆత్మార్పణ రోజు!! ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్లు తెరిచారు. అంతలోనే మూతలు పడపోయేవి. చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 54 పౌనుల (24.5 కేజీలు) బరువు తగ్గారు. నాడి కదలిక, శ్వాసతీరుల్లో మార్పు వచ్చింది. 16 గంటలపాటు మూత్రం స్తంభించింది. నోటిమాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్లేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు కృష్ణమరాజు, ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా, చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.
శ్రీరాములుగారి నిరుప మాన త్యాగ ఫలితంగా ఆయన మరణా నంతరం 1953 అక్టోబరు 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఆంధ్ర రాష్ట్రావతారణతోనే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రేరణ లభించింది. ఫలితంగా 1956 నవంబరు 1వ తేదీన తెలంగాణా జిల్లాలను కలుపుకొని ‘ఆంధ్రప్రదేశ్’ అవతరించింది. కోట్లాది ఆంధ్రులు ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రంగా సంఘటిత మవటానికి, సమైక్య జీవనం గడపటానికి విశాలాంధ్ర ఆవిర్భావానికి మూల పురుషుడు మన పొట్టి శ్రీరాములు.
“ఆంధ్రరాష్ట్రము వచ్చె
మహాంధ్రరాష్ట్ర మేరుపడువేళ
పొలిమేర . ‘చేర పిలిచె”.
అని దాశరథిగారు ప్రజలనుత్తేజపరిచారు.
మిత్రుల వత్తిడిని కాదనలేక కొంత కాలం ఆంధ్రరాష్ట్ర గాంధీ స్మారక సంఘ కార్యదర్శిగా పనిచేశారు. దేశభాషల సమున్నతికి ఆత్మబలిదానం గావించిన ఆయన పదవులకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం ఏనాడూ పోరాడలేదు. గాంధీజీ బోధించిన సత్యాహింసలు, హరిజనోద్ధరణ ఆయన జీవితాశయాలు. మైలాపూర్ రాయపేట హైరోడ్‌లోని 126 నంబర్‌న పొట్టి శ్రీరాములుగారు కన్నుమూసిన ఇంటిని, ఆ త్యాగమూర్తి స్మృతిచిహ్నంగా పొట్టి శ్రీఈరాములు స్మారక సొసైటి మరియు మన రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ వున్నది. ఆ స్మృతి మందిరాన్ని పవిత్ర సాంస్కృతిక క్షేత్రంగా పెంపొందించటం తెలుగు ప్రభుత్వం, తెలుగువారి మొదటి కర్తవ్యం. శ్రీరాములు. భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూల పురుషుడు.
1924 లొ, బెళ్గాములొ, గాంధీజి అధ్యక్షతన జరిగిన కాంగ్రస్ మహాసభలొ భాషా ప్రయుక్త రాష్ట్రాల రచన ఉద్దేశం, ఆవశ్యకతను గురించి తీర్మానించారు. ఉమ్మడి భాషల వల్ల ప్రజల భాషలొ పరిపాలన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్రాలలొ ప్రజల భాషలొ పరిపాలన జరుగాలని రాజ్యాంగం ఉద్దేశించింది. దానిని సాక్షాత్కారం చెయ్యడానికి, భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన జరిగి అరవైనాలుగు సంవత్సరాలు పూర్తి అయినా, ఈ నాటికి ప్రజల భాషలొ పరిపాలన, మండల/ తాలుకా స్థాయిలొ కూడా జరుగడం లేదు.
కనీసం, బెళ్గాం తీర్మానం శతమానోత్సవం, 2024, శ్రీరాములు125 జయంతి ఉత్సవం, 2026, భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన వజ్రోత్సవం 2031, నాటికైనా ప్రజల ప్రజల భాషలొ పరిపాలన ఆశిద్దాం. శ్రీరాములు అత్మకు శాంతి కలిగిస్తాం. ప్రకాశంగారి వాక్యాలతొ నా సందెశాన్ని విరమిస్తున్నాను. “ఆధునిక కాలములొ, ఇచ్ఛా మరణం పొందిన మహార్షివలె, పొట్టి శ్రీరాములుగారు – ఐదు , ఐదున్నర అడుగుల పోడువుగల అందమైన భౌతిక దేహాన్ని వదిలి, సర్వ భారత దేశవ్యాప్తమైన అమర జీవిగా వర్ధిల్లారు. నేడు భారత దేశములొ ఏర్పాటైన భాషా రాష్ట్రాలు నిజముగా ఆ నాడు ఆయన చెసిన మహాత్యాగ ఫలితాలే.”
(చంద్రశేఖర్ కల్కూర కర్నూలులో న్యాయవాది,తెలుగు పాలనా భాషా ఉద్యమ కార్యకర్త)