కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో చివరి రోజైన ఆదివారం తిరుమల వసంత మండపంలో శ్రీ ధన్వంతరి పూజతో ముగిసింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు, వారికి అభిముఖంగా శ్రీ ధన్వంతరి స్వామివారిని వసంత మండపంలో వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ దేవతలు, దానవులు మందరగిరి పర్వతాన్ని వాసుకి తాడుగా చేసి క్షీరసాగరాన్ని మధించగా అందులో మందరగిరి పర్వతం మునిగిపోతుందని తెలిపారు. ఆ సమయంలో దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా స్వామివారు మహా కూర్మంగా అవతరించి మందరగిరి పర్వతాన్ని తన వీపుపై మోసి అమృతాన్ని ఉద్భవింప చేసినట్లు తెలియజేశారు. క్షీరసాగర మథనంలో మొదట హాలాహలం ఉద్భవించిందని, దీనిని పరమ శివుడు సేవించి కంఠంలో ఉంచుకొన్నారన్నారు.
తరువాత ఐరావతం, కామధేనువు, కల్పవృక్షం, పారిజాతం మొదలైనవి ఉద్భవించాయని, వీటిని త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు గ్రహించాడన్నారు. అనంతరం లక్ష్మీ దేవి ఉద్భవించిందని, అమ్మవారిని శ్రీమహ విష్ణువు గైకొని తన హృదయంలో ప్రతిష్ఠంచుకున్నట్లు తెలిపారు.
క్షీరసాగర మథనంలో చివరిగా శంఖు చక్రాలు, అమృత కళశంతో ఉద్భవించిన ధన్వంతరి స్వామివారు ఆయుర్వేద విద్యకు ప్రసిద్ధి అని, శ్రీ మహావిష్ణువు అవతారమన్నారు. ధన్వంతరి జయంతి సందర్భంగా ఆదివారం తిరుమలలో ధన్వంతరి పూజ వలన విశ్వంలోని ప్రాణి కోటికి హానికలిగించేవి నశించి, సంపూర్ణ ఆరోగ్యాన్ని, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించనున్నట్లు వివరించారు.
ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత శ్రీ ధన్వంతరి పూజ, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.