(విద్వాన్ దస్తగిరి)
అఖిలభారత కిసాన్ సభ (AKS) వల్ల రైతులలో చైతన్యం వచ్చింది. 1943 లో ఎగువపల్లె, ముత్యాలంపల్లి. వెంకటాపురం, నసనకోట, గ్యాదిగకుంట, గంగంపల్లి మొదలగు గ్రామాలలో రైతుసంఘాలు ఏర్పాటు చేసినాము. 1944 లో కొత్త గ్యాదిగకుంటలో ‘మేడే’ జరపాలనుకున్నాము. ఇదుకల్లు సదాశివన్ గారిని, నీలం రాజశేఖర రెడ్డి గారిని ఆహ్వానించినాము. బస్సులు లేవు.ధర్మవరం టు కల్యాణదుర్గం అని ఒక బొగ్గులబస్సు వుండేది. అది ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తిరిగేది. యాడంటేయాడ నిలిచిపోయేది. ఆ బొగ్గుల బస్సును మామిళ్ళపల్లె లో ఎక్కి
కనగానపల్లెలో దిగి నడచిరావాలి. వారికోసం మేము ఒక ఎద్దులబండిని బత్తి చినపోతన్నతో కనగానపల్లె కు పంపి నాము. కానీ రెడ్లు, పెత్తందార్లు, పోలీసులు లాలూచిగా చేతులు కలిపి మీటింగును భగ్నం చేయాలని బండి దారికి అడ్డంగా పెట్టినాడని తప్పుడు నేరారోపణతో బండిని పోలీసుస్టేషన్ లో పెట్టినారు. అది మాకు తెలీదు. చెప్పిన ప్రకా రంగా బండి రాలేదే అని సదాశివన్, రాజశేఖర్ ఎదురుచూస్తున్నారు.. బండిని పోలీసులు స్టేషన్ లో పెట్టుకున్నారని ఎవరో చెప్పినారు.సదాశివన్, రాజశేఖర్ రెడ్డి పోలీసుస్టేషన్ కు పోయి,ఏ ఏసెక్షన్ల క్రింద బండిని నిర్బంధించినారు? అని ఇంగ్లీషులో దబాయించి అడిగినారు. పై అధికారులకు కంప్లైంట్ చేస్తామన్నారు. పోలీసులకు పెద్దగా చదువు రాదు. వారు అడిగే అడగటానికి పోలీసులు దిమ్మె తిరిగిపోయి బండిని వదలేసినారు. ఆ బండి మీద సదాశివన్, రాజశేఖర రెడ్డి వచ్చినారు.సభ బాగా జరిగింది. పోలీసులే బండిని వదలేసినారు అనే వార్త రైతులలో, సామాన్య జనంలో ఉత్సాహాన్ని, కమ్యూనిస్టుల తోడుంటే గెలవగలం అనే నమ్మకాన్ని కలిగించింది.
మీటింగు అంటే ఏమో జనాలకు తెలీదు. దాదాపు 15 గ్రామాల నుండి జనం వచ్చినారు.సదాశివన్ పాటలు పాడినాడు. రాజశేఖర్ కూడా పాడినాడు. రైతాంగం గురించి, రష్యా గురించి, యుద్ధానికి వ్యతిరేకంగా పాడినారు. పాటలు విని జనం వస్తారు. మీటింగు బాగా జరిగింది.ఈ ఉత్సాహంతో చుట్టూ వున్న గ్రామాలన్నీ తిరిగి మీటింగులు పెట్టి,రైతు సంఘాలు ఏర్పాటు చేసినాము. నేను,సదాశివన్, రాజశేఖర రెడ్డి గ్రామానికి పోయి తప్పెట కొట్టిస్తాము, పదిమంది రాని, నూరుమంది రాని మీటింగు చెప్తాము. సంఘము ఏర్పాటు చేస్తాము. ముత్తపుకుంట లో కూడా మీటింగు పెట్టాలనుకున్నాము. ముత్తపుకుంట చిన్నపురెడ్డి పర్మిషన్ లేనిదే అక్కడ ఏ కార్యక్రమము జర పడానికి వీలు లేదు. మేము దాన్ని ధిక్కరించి మీటింగు పెట్టినాము.బయటి నుండి జనాలను తీసుకొని పోయినాము. రెడ్డి భయంతో ఊరి జనాలు మీటింగుకు రాలేదు. సమావేశ స్థలానికి రాలేదు కానీ, సందులో నిలబడి,గోడల చాటు న దాక్కొని, మిద్దెలపై పడుకొని –నిలబడితే రెడ్డి మనుషులకు కనపడతామని – ముందుగానే సమావేశస్థలం దగ్గర లోని ఇండ్లలోకి చేరుకొని. ఉపన్యాసాలు విన్నారు. రాజశేఖరరెడ్డి గారి ఉపన్యాసం కన్నా సదాశివన్ గారి ఉపన్యా సం జనాలను ఆకట్టుకొనేది. ఐకమత్యంగా వుంటే ఏమైనా సాధించవచ్చు అని కట్టెల మోపు ఉదాహరణ చెప్పేవాడు. కట్టెలు ఒక్కొక్కటిగా విడి విడిగా ఉంటే సులభంగా విరచవచ్చు. అదీ మోపు గా కలిసి వుంటే విరచలేం. ఇట్లాంటి ఉదాహరణలు చెప్పేవాడు. అందువల్లనే రాజశేఖర రెడ్డిగారు సదాశివన్ గారినే ఎక్కువసేపు మాట్లాడ నిచ్చేవాడు.
అప్పర్ పెన్నా ప్రాజెక్టు సమస్య చేపట్టినాము.దీనికి భూస్వాములంతా వ్యతిరేకం. 1945 లో పేరూరు ప్రాజెక్టు కోసం పేరూరులోనే పెద్ద ‘పేరూరుప్రాజెక్టు మహాసభ ‘ జరిపినాము.మూడువేలకు పైగా రైతులు వచ్చినారు.రాష్ట్ర రైతుసంఘం నుండి కాట్రగడ్డ రాజగోపాల్ హాజరైనాడు. ఆయన్ను తీసుకొని రావటానికి ఎద్దుల బండ్లు ఏర్పాటు చేసినాము.నాగసముద్రం గేట్ నుండి రామగిరి వరకు ఒక బండి, అక్కడినుండి మీటింగ్ స్థలానికి రెండు బండ్లు ఏర్పాటు చేసినాము.రామగిరి దగ్గర మునికొండ వుంది. అక్కడ ఐదారుమందిని కాపలా పెట్టినాం. నసనకోట వైపు నా పెట్టినాం. మీటింగు విజయవంతమైంది. ఆ తరువాత ధర్మవరంలో కుడా ఒక పేరూరు ప్రాజెక్టు మహాసభ జరి పినాం. ఆందోళన కార్యక్రమం తీసుకున్నాం. మేము తీసుకొన్న మొదటి సమస్య –రెడ్లకు, భూస్వాములకు వ్యతిరే కంగా, ఇది మొదటిది, ఇంక రెండోది ప్రాజక్టుల సమస్య. రైతు సమస్య ఏది వచ్చినా వదలిపెట్టెల్లేదు. ‘
మా గ్రామాల్లో రెడ్లదే పెత్తనం. వారివే భూములన్నీ. గ్రామరెడ్లూ వారే ఎక్కువ. రెవెన్యూ ఉద్యోగులు,పోలీసులు వీరితో మిలాఖత్. అందువల్ల వీరి డామినేషన్ ఎక్కువ. మిగతా వారికి కూలి ప్రధానమైన జీవనోపాధి. రోజు తినే తిండి తప్ప వేరే తిండి పేర్లు కూడా తెలీదు. జొన్న, సాములు, కొర్ర, రాగి ఆహారమే తెలుసు. వరి అన్నం పండుగ నాడు మాత్రమే. పాడి మాత్రం దండిగా వుండేది. ఇంట్లో వాడే పాత్రలు కూడా తక్కువే. మట్టికుండలు, ముంతలు వాడేవారు. గ్లాసులు లేవు. పెద్ద ఇండ్లలో సిల్వర్ చెంబులు,కంచు పళ్ళాలు ఉండేవి. అన్నం, కూరలు వడ్డించేందుకు గరిటెలు వాడేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి, సదాశివన్ గార్లు వచ్చినపుడు చేతులతో వడ్డించినాము. రెండోసారి వచ్చినపుడు సదాశివన్ గారు గరిటెలు,గిన్నెలు,చెంబులు, దువ్వెన్లు అదేపనిగా తీసుకొచ్చి, మా కుటుంబాలకు ఇచ్చి,ఇట్లా వాడల్ల అని చెప్పినాడు. చేతులు శుభ్రంగా కడుక్కొని వడ్డించల్ల అని చెప్పినాడు.ప్రతి వూరిలో ఒకటి రెండిండ్లలో ఈ పధ్ధతి మొదలు పెట్టించినాడు.
యుద్ధసమయలో పెద్దకరువు. తిండిగింజలు కూడా దొరకవు. పారలు మొదలగు ఇనుప సామాన్లు దొరక వు. కొత్త గ్యాదిగకుంటలో ఒక చౌకధాన్యపు డిపో ఏర్పాటు చేసినాము. రైతులతో డబ్బు వసూలుచేసి, పది, పదైదు వేలు వసూలు చేసి దాన్ని డిపాజిట్టుగా పెట్టి , లాభము,నష్టము లేని పద్ధతిలో ధాన్యము అమ్మేవారము.చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ధాన్యం సరఫరా చేసినాం.పారలు,కిరోసిన్,గుడ్డలు మొదలగు సరుకులు సరఫరా చేసినాం. ఇది రైతులకు ఎంతో ఉపయోగం. దీనంతటికీ సదాశివన్ దే మార్గదర్శకత్వం.
వార్ ఫండ్ వసులుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ గ్రామానికింత మీ గ్రామానికింత అని దండోరా
వేసి చెప్పేవారు. పచ్చజొన్నలు బాగా 30, 40 మూటలు పండేవి. కందులు, పెసలు, నువ్వులు పండేవి. చెనిక్కా య పంట లేదు.వసూలుకు రెడ్డి కరణాలు పోలీసులతో వచ్చే వారు. వసూలు అయిన దాంట్లో కొంత వారు పంచు కొని, కొంత ప్రభుత్వానికి జమ చేసేవారు. దౌర్జన్యంగా వసూలు చేసేవారు. మేము ఉద్యమం నిర్మించి వార్ ఫండ్ యిచ్చేల్లేదు అన్నాం. ప్రోక్యూర్ మెంటును వ్యతిరేకించినాం. తాసీల్దారు, ఫుడ్ సప్లై ఆఫీసరు పోలీసులతో గ్రామాల్లోకి వచ్చేవారు. ఇండ్ల లోకి దూరి ఏమి దొరికితే, ఎంత దొరికితే అంతా ఎత్తుకొని పోయేవారు. తిండిగింజలు కూడా వీళ్ళకు ఉండాయా లేదా అని చూడకుండా ఒక్క గింజ కూడా ఉన్నీకుండా అన్నీ ఎత్తుకొని పోయేవారు. ఎగువపల్లె కర్ణాటక బార్డరులో వుంది. భూములు ఆంధ్రలో, వూరు కర్నా టకలో వుంది. ఆ రైతులు తమ పంటను పాతర్లలో పోసి భద్రపరచు కొనేవారు. గాలికాలం వచ్చినపుడు ఈ పాతర్లలోని గింజలు వాడుకొనే వారు. శివాయిజమా భూములు ఎక్కువ. సాగుచేసే రైతులు తక్కువ. ఊరికి పది పదైదు మంది రైతులుంటే మిగ తావారంతా కూలీలే. పాతర్ల ధాన్యం కాజేయాలని రెడ్డి రామకృష్ణారెడ్డి అనుకున్నాడు. ధాన్యమంతా మైసూరు స్టేట్ కు పోతావుందని తప్పుడు రిపోర్టుతో తహసీల్దారును పిల్లంపినాడు. వారు పాతర్ల ధాన్యమంతా తీయించి ప్రొక్యూరు మెంటు కింద తీసికొని పోవాలని ప్రయత్నించినారు. కొన్ని పాతర్లలోని ధాన్యాన్ని బయట పెట్టించినారు. మేము దాన్ని అడ్డుకున్నాం మరొక వైపు నడిమింటి వెంకటనారప్ప అనే రైతును అనంతపురం సదాశివన్ గారి దగ్గరకు పంపినాం. నడిమింటి వెంకటనారప్ప గునక పరుగుతో ఏక్ దమ్మున అనంతపురం చేరి సదాశివన్ గారికి విషయం చెప్పినాడు. సదా శివన్ గారు నారప్పను వెంటబెట్టుకొని యం.యల్.సి. గా వున్న మాల్యవంతం వెంకట రెడ్డిని కలిసి సమస్య ను వివ రించినాడు. ఆయనను కలుపుకొని కలెక్టరును కలిసినాడు. తిండిగింజలు కూడా లేకుండా ప్రొక్యూరుమెంట్ చేస్తు న్నా రని, దాన్ని ఆపించి జనానికి ఆహారకొరత లేకుండా చేయాలనీ కలెక్టరును కోరినాడు. కలెక్టరు వెంటనే ఆర్ డి వో ను పంపినాడు. ఆర్ డి వో వాస్తవం గమనించినాడు. అధికార్లను మందలించినాడు. తహసీల్దారును సస్పెండ్ చేసినాడు . ధాన్యం అంతా రైతులకే వాపసు చేసినారు. ఈ పోరాటాలవల్ల, విజయాల వల్ల రైతుసంఘాలు బలపడి నాయి.( నారప్ప కొడుకులు ఇపుడు అమెరికాలో డాక్టర్లుగావున్నారు.)
(విద్వాన్ దస్తగిరి, విశ్రాంత ఉపాద్యాయులు. రచయిత. ఇది గ్యాదిగకుంటలో సి.ముత్యాలప్పతో చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా )
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/top-stories/features/memoirs-of-anatapuram-communist-veteran-chalichieemala-mutyalappa/