(శ్రీకాంత్ )
సన్నగిల్లిన మది స్ధాణువై
మౌన సంగీతాన్ని వినిపిస్తూనే వుంది
గతమైపోయిన గాయాలు
ముళ్ళై గుచ్చుకుంటూ
జాలి మాటలు చేదు స్వరాలై
గగనం గంభీరమై
గమ్యానికి బాటలు చూపిస్తున్నది
నాటి గాయల వెక్కిళ్ళు
నేడు ఙ్ఞాపకాల కన్నీళ్ళు రాలుస్తూ
శిధిల బంధాలను ఏకరువు పెడుతున్నాయి
తుది దుప్పటి కప్పుకున్నాక
నాదన్నది ఏమి లేదన్నది కూడా
తెలియని అచేతన స్ధితిలో
ఆశల బ్రతుకు
అనుబంధాలకై ఆరాట పడుతూనే వుంటోంది
కొడిగట్టె ప్రాణి కూడా
కోరికల చిట్టా విప్పుతూ
అంతిమ ఘడియలు కూడా
ఊపిరికై ఉరకలు వేస్తూనే వుంటాయి
ప్రతి జీవిత చిత్రంలో
కాలగర్భంలో కలిసిపోయే క్షణాలన్నిటిలో
దుఃఖాన్ని సవరించుకున్న సందర్భాలు వుండే వుంటాయి
చీకటిలో చింతలు
ఓటమి అనుభవాలు
విజయానికి చేరువ చేసే వుంటాయి
కదంతొక్కిన కన్నీళ్ళు
సంకల్ప మనసుతో సావాసం చేస్తూ
నిన్నటి కలలకు
కొత్తఆశల దీపాలు వెలిగిస్తాయి
మౌనం ముందు మోకరిల్లిన మనసు
ఆత్మను అవనతం చేసుకుంటుంది
పశ్చాత్తాపాలు పెదవెనుకన
నిట్టూర్పుల వర్షాన్నీ కురిపిస్తాయి
ఆవిరైన ఆనందాలు
అవసరాల నవ్వులు తొడుక్కుంటాయి
దాచుకున్న గాథలు
వ్యథల కథలు అల్లుతూ
చీకటి కాగితంపై మౌనాక్షరాలు చెక్కుతూ
నిశ్శబ్ద నిశీధిలో
భావాల బావుటానెగరేస్తాయి…!!