శేషాచలం అడవిలో ‘కొంగుమడుగు’ కి ట్రెకింగ్…

(భూమన్)
శేషాచలం అడవుల్లో కొంగుమడుగు అనేది అద్భతమయిన ప్రాంతం.  కొంగుమడుగు  ప్రాంతానికి  ఏనుగులు పెద్ద ఎత్తున వస్తుంటాయి. అవి ఇక్కడే దాహం తీర్చుకుంటాయి.మడుగులో ఈదులాడుతాయి. అపుడు ఈ ఏనుగులు చుట్టుపట్ల ప్రాంతాలలోని వెదురునంతా తింటాయని ఇక్కడి యానాదులు, అటవీ ఉద్యోగులు చెబుతారు.
కొంగుమడుగు తిరుపతికి ఏమంత దూరం కాదు. తిరుపతి నుంచి కుక్కల దొడ్డి దారిపట్టాలి. కుక్కల దొడ్డి దాటాకా బాలపల్లి గెస్టు హౌస్ కు వెళ్లేదారి పట్టాలి. ఆ దారిలో 8 కి.మీ దట్టమయిన అడవిలో తిన్నగా ప్రయాణం చేశాక కొంగుమడుగు చేరుకోవచ్చు.
ఇపుడు బాగా వర్షాలు పడటం వల్ల కొంగుమడుగులో నీళ్లు పారుతున్నాయి. ఇంతకు పూర్వం చుక్కనీళ్లు లేని రోజుల్లో కూడా నేను కొంగమడుగు చూశాను.కొంచెంగా నీళ్లున్న రోజులూ నాకు తెలుసు.ఇపుడు బాగా నీళ్లు పారుతుండే సమయంలో కొంగుమడుగుకు వెళ్లడమనేది మాకు వచ్చిన అపురూప అవకాశం.
అయితే, ఒక  విషయం. కొంగుమడుగు వెళ్లాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి అవసరం. అధికారుల అనుమతి లేకుండా కొంగుమడుగు ప్రాంతంలో ప్రవేశించలేము. శేషాచలం అడవుల్లో స్మగ్గింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి అటవీ శాఖ అధికారులు అనుమతి ఇవ్వడానికి కొంచెం జంకుతున్నారు.
ఈ సారి నేను అటవీ శాఖ అధికారులతో కలసి వెళ్లేందుకు అవకాశం దొరికింది.దీనితో మంచి సీజన్ లో వెళ్లగలిగాను. ఆ దారి గుండా ప్రయాణం చేయడమే ఒక అరుదైన అనుభవం. లోతైన లోయలు, ఎటుచూసినా ఎత్తయిన కొండలు, పచ్చటి అటవీ వాతావరణం…దీనికి తోడు మేం బయలుదేరేటప్పటికి చినుకులు కూడా రాల్తున్నాయి.
అడవుల్లో చినుకులు పడేటప్పుడు ప్రయాణం చేసే అవకాశం దక్కడమనేది మహా అపురూపమయిన అనుభవం. దారంతా, చిన్న చిన్న మొక్కలుపెరిగిపోయాయి. అందుకే ప్రయాణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే, ప్రకృతిలో మమేకం కావాలనుకునే మా లాంటి వారికది పెద్ద ఇబ్బంది అనిపించదు.
కొంగుమడుగు బ్రిటిష్ కాలం నుంచి కూడా ప్రసిద్ది చెందిన ప్రాంతం. కొంగుమడుగు కు ఎడమ వైపున బ్రిటిష్ వాళ్లు నాలుగైదు అతిధి గృహాలు కూడా నిర్మించుకున్నారు.ఇవన్నీ ఇపుడు పాడైపోయాయి. ఇలాంటి అతిధి గృహాలుండేవని చాలా మంది అటవీ శాఖ సిబ్బందికి కూడా తెలియదు. ఈ ఆనవాళ్లను నేను నాతో పాటి వచ్చిన వారికి చూపించాను.ఎపుడో 35 సంవత్సరాల కిందట ఈ ప్రాంతానికి వచ్చాను. ఇపుడు మళ్లీ ఈ కరోనా కాలంలో  ఈ ప్రాంతాన్ని సందర్శించే అకాశం మళ్లీ నాకు దక్కింది.
కొంగు మడుగు గొప్ప విశేషమేమిటంటే, ఎనుగుల జలకాలాడే ఈ మడుగుల్లో కూడా మనం హాయిగా, ఆహ్లాదంగా ఈత కొట్టవచ్చు.ఇక్కడ కొన్ని మడుగులు మురికిపడ్డాయి. అయితే, కొంచెం ముందుకు సాగితే అద్భుతమయిన జలపాత దృశ్యాలు (కింది వీడియో) కనిపిస్తాయి. ఈ జలపాతాలలో మేము తనివితీరా ఈదులాడాం. కొంగుమడుగు యాత్ర ఎడ్వంచరస్ అని చెప్పను గాని, కొండలు ఎక్కిదిగడం గొప్ప అనుభవం.
ఈ ప్రాంతాల్లో బాగా తిరిగి వాడిని, అన్ని ప్రదేశాలు గాలించిన వాడిని కావడంతో పెద్దగా ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతాన్నంతా చూశాను, ఇక్కడి వెదురు వనాలను పరిశీలించాను.
దారిలో ముందుకు సాగుతున్నపుడు మాకు దుప్పులు కనిపించాయి. మరొక చోట ఎలుగుబంటి కూన కూడా కనిపించింది. సహజ సుందర వనంలో వన్యమృగాలను చూడటమనేది చాలా ఆనందం కలిగించే విషయం. ఆ అనుభూతే వేరు. అడవులు గుండా ప్రయాణిస్తున్నపుడు వన్యమృగాలను చూడాలని చాలా మంది అత్రంగా ఎదురు చూస్తుంటారు. ఒక చిన్న పిట్టో, కుందేలో కనిపించినా జనం కేరింతలు కొడతారు.

(Like this story? Share it with friends!)

ఇలాంటి యాత్రలలో ఎపుడూ ఏదో ఒక జంతువు తారసపడుతూనే ఉంటుంది. ఇటీవలే ఇక్కడికి ఏనుగులు వచ్చినట్లు వాటి లద్దెలు చెబుతున్నాయి. కొంగుమడుగులో రెండుమూడు గంటల సేపు గడిపి తిరుగుప్రయాణమయ్యాం. మళ్లీ బాలపల్లి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ మీదు కుక్కల దొడ్డి చేరుకున్నాం. అప్పటికి సాయంకాలం అయిదయింది. శేషాచలం అడవుల్లో మనకు తెలియని ఇన్ని ప్రాంతాలున్నయా అని నాకిప్పటికీ ఆశ్చర్యమేస్తూ ఉంటుంది.

ఈ ప్రాంతాలన్నింటిని గుర్తించి ప్రభుత్వం వాటిని పర్యాటక ప్రాంతాలుతా తీర్చిదిద్దితే చాలా బాగుంటుంది.  అంతో ఇంతో రుసుం నిర్ణయించి, మంచిగైడ్లను ఏర్పాటుచేసి అటవీ శాఖ  సెక్యూరిటీ ఏర్పాటుచేసి సాహసయాత్రలు నిర్వహించవచ్చు. అపుడు శేషాచలం ఫారెస్టు నుంచి  ప్రభుత్వానికి కొంత ఆదాయమూ వస్తుంది. ఈ జన సంచారం వల్లస్మగ్లింగ్ అరికట్టడానికి వీలవుతుందేమో. అలాగే ట్రెకర్స్ కి అద్భుతమయిన అవకాశం ఇచ్చినట్లవుతుంది.  ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలలో ప్రకృతిపట్ల మక్కువ  కలిగించవచ్చు, తద్వారా అటవీ పరిరక్షకు వీలవుతుందని నా నిశ్చితమయిన అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *