మధురాంతక రాజారాం కథలను చదవకపోతే, వెంటనే చదవండి. కొన్ని పనులను వాయిదా వేయకూడదు. ఆ జాబితాలోమొదట చేర్చాలని పని మధురాంతకం కథలను చదవడం. ఎందుకంటే, ఊహలకు, మానవాతీతాలకు, అవాస్తవాలకు తావులేని నేలబారు కథలవి.
(చందమూరి నరసింహారెడ్డి)
*విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిన ఉపాధ్యాయులు ఆయన… మధురమైన గేయాలు, రమనీయమైన రచనలు,
*మధురానుభూతిని అందించిన కథలు,మధురాతి మధురమైన నవలలు, సాహితివ్యాసాలు పుస్తక ప్రియులకు అందించిన రచనాశిల్పి అతడు….
*సగటు జీవికి చైతన్యదీప్తి…
*ఆయన రచనలు అభద్రత పారదోలి ఆలోచనలు రేకెత్తించి వెలుగు కిరణాలు అందించే దివిటీలు…..
*మారుమూల జన్మించిన రచనలతో నలుదిశలా మారుమోగుతున్న రచయిత మధురాంతకం రాజారాం.
మధురాంతకం రాజారాం చిత్తూరు జిల్లా పాకాల మండలం మొగరాల గ్రామంలో 1930, అక్టోబర్ 5న జన్మించారు.తల్లి ఆదిలక్ష్మమ్మ, తండ్రి విజయరంగం పిళ్ళై . మొగరాల చిత్తూరు జిల్లాలో ఓ చిన్న గ్రామం. ఈగ్రామంలో వినాయకుని చిన్న ఆలయము ఉంది. సంవత్సరానికొక సారి జరిగే మహా భారత నాటకోత్సవాలు ఈ గ్రామ ప్రత్యేకత.చిత్తూరు జిల్లా రాష్ట్రం లోనే మహభారత హరికథలకు ప్రసిధ్ది. ఈ ఊరిలో ప్రతి సంవత్సరం 18 దినములు మహాభారత యజ్ఞము (హరికథ) జరుగుతుంది. ఇది చూడడానికి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉత్సాహం చూపుతారు. ప్రతి దినము పగలు మహాభారత హరికథ, రాత్రి నాటికలు జరుపుతారు. 18 దినములలో కళ్యాణమహొత్సవము దినము చూడడానికి చాలా చక్కగా ఉంటుంది.
ఆయన ప్రాథమిక విద్య ఒక ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. 1945 లో చిత్తూరులోని జిల్లా బోర్డు హైస్కూలు (ప్రస్తుతం పి. సి. ఆర్ కళాశాల) నుంచి ఎస్. ఎస్. ఎల్. సి పూర్తి చేశాడు. చదువుకునే రోజుల నుంచి ఆయన సాహిత్యం పట్ల అభిరుచి కలిగి ఉండేవాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.
కొవ్వలి లక్ష్మీనరసింహారావు, జంపన చంద్రశేఖరరావు, కృత్తివెంటి వెంకటేశ్వరరావు, ఎం. అప్పారావు పట్నాయక్ లాంటి రచయితల నవలలు చదివేవాడు. తరువాత ఆయనకు ఆంధ్రపత్రిక, భారతి లాంటి పత్రికలతో పరిచయం ఏర్పడింది. అందులో రచనలు, పద్యాలు, గేయాలు చదివి ఆయన సాహితీరంగం వైపు ఉత్తేజితుడయ్యాడు.
పల్లె లో జన్మించిన వాడు పల్లెలతో, గ్రామీణ జీవితాలతో అనుబంధం ఉన్నవారు. ఆ నేపథ్యం నుంచే వీరు కథా వస్తువును ఎన్నుకున్నారు. అధ్బతుమైన శిల్పంతో 400కు పైగా కథలు రచించారు. మధురాంతకం రాజారాం కథలు మాత్రమే కాదు రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, వ్యాసాలు కూడా రాశారు. తమిళ రచనల్ని అనువదించారు. వీరి కథలు తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదాలయ్యాయి. రాజారాం రచించిన ‘చిన్నప్రపంచం – సిరివాడ’ నవల రష్యన్ భాషలోకి అనువాదమైంది.
వృత్తిరీత్యా విశ్యార్ధులకు పాఠాలు బోధించటంతోపాటు ఉత్తమ సంస్కారాన్ని నేర్పిన ఉపాధ్యాయుడు శ్రీ మధురాంతకం రాజారాం. పుట్టింది చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో. తెలుగు కథకు జాతీయస్థాయి గుర్తింపు తెచ్చిన కొద్దిమంది కథకులలో ఒకరుగానే కాక తెలుగు కథపై తనదైన ముద్ర వేసిన సిసలైన కథకుడు రాజారాం.
నాటకాలు బాలగేయాలు మనకు అందించారు. సున్నితమైన విషయాన్ని అంతే సున్నితంగా చెప్పే కథనం, కల్పన కన్నా వాస్తవానికే ప్రాధాన్యతనిచ్చిన గొప్ప కథకుడు.రాయలసీమ కథారత్నం మధురాంతకం రాజారాం. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజల భాషకు పట్టం కట్టిన రచయిత. కథల్లో ఓ జీవితానికి సరిపడా వైవిధ్యాన్ని నింపిన ఘనుడు.
ఎక్కడా ఊహలకు, మారవాతీతాలకు, అవాస్తవాలకు పోకుండా నేలబారు తీరుగా కథను నడిపించిన వాస్తవికవాది.
తెలుగులో మలితరం కథా రచనలో రాజారం గారిదొక భిన్నమైన స్వరం.రాజారాం గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. కథని తన గుండె గూటిలో దీపంగా వెలిగించుకుని ఆరాధించారు.
వొక చిన్న పల్లెటూరి వ్యక్తి తన రచనలతో చుట్టూ ఎంత పెద్ద ప్రపంచాన్ని నిర్మించుకున్నాడో తెలుస్తోంది.
మధురాంతకం రాజారాం గురించి డా.ఎ.రవీంద్రబాబు వివరిస్తూ ‘ కథకి వస్తువుగా ఓ వ్యక్తి జీవితాన్ని మధిస్తే ఓ కథ పుట్టొచ్చు’ అన్న మధురాంతకం రాజారాం అదే సత్యాన్ని ఆచరించి కథలు రాశారు. అందుకే అవి భిన్నంగా ఉంటాయి.
సర్కసు డేరా కథ- సర్కసు ఫీట్లకంటే ప్రమాదకరమైన ఫీట్లు బయట బతుకుకోసం చేస్తున్నారని చెప్తుంది.
ఎడారి కోయిల కథలో తండ్రి విదేశాలలో స్థిరపడినా కొడుకు గ్రామీణ వాతావరణాన్ని వెతుక్కుంటూ వస్తాడు.
పులిపైన స్వారీ కథ జాతకాలను నమ్మి సినీ నిర్మాత మోసపోవడాన్ని వివరిస్తుంది.
ఓటుకత కథలో ఒక్కసారి కూడా ఓటు వేయలేని పశువుల గంగప్ప గురించి చెప్తుంది.
కొండారెడ్డి కూతురు కథలో తులసి భర్తను చంపడానికి వచ్చిన మనుషులకు అన్నం పెట్టి, రక్షణ కల్పించి, వాళ్లను మనసులను మారుస్తుంది. అందుకే రాజారాం కథలు తిట్టవు, అతి తెలివిని ప్రదర్శించవు, సందేశాలు ఇవ్వవు, కంటతడిపెట్టిస్తాయి.
చదివేవారి గుండెలను బరువెక్కిస్తాయి. స్వచ్ఛంగా, అచ్చంగా, మన చుట్టూ ఉన్న జీవన స్రవంతినే మనకు చూపెడతాయి. పంచదార గుళికల్లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. ఆ సారం మనలో ఇంకిపోయి మనసుకు హాయిని కలిగిస్తాయి. పలు రకాల మనుషులు, భిన్న మనస్తత్వాలు, గ్రామీణ జీవితాలు, మధ్యతరగతి మానవులు, సగటు మనిషి సమస్యలు… ఇవీ వీరి కథల అంతఃచిత్రం.
అసలు వీరి కథలు చదువుతుంటే ఆరుబయట నానమ్మో, అమ్మమ్మో ఒడిలో కూర్చోబెట్టుకుని కథ చెప్పినట్లు ఉంటుంది. ఆకట్టుకునే శైలి, శ్లేషతో కూడిన వాక్యాలు, సన్నని నవ్వుతో జీవితసారాన్ని మాటల్లో కూర్చినట్లు తోస్తుంది. పెద్ద బాలశిక్షలా జీవిత జ్ఞానాన్ని బోధిస్తాయి. వీరి కథల్లో స్త్రీ పాత్రలకు ప్రత్యేకత ఉంది. అవి ఆటపట్టిస్తాయి. చిరుకోపంతో అలుగుతాయి, ఒక్కోసారి మురిపిస్తాయి. ప్రేమాభిమానాల్ని పంచుతాయి, అవసరమైతే సుతిమెత్తగా మందలిస్తాయి. మనతోపాటు సహజీవనం చేస్తాయి. అత్యంత సహజంగా, స్వచ్ఛంగా ప్రవర్తిస్తాయి. మొత్తం మీద అనుబంధాలతో అల్లుకపోతాయి. అందుకే అవి ఎక్కడో ఒకచోట మనతో తారసపడినట్లే ఉంటాయన్నారు.
ఆయన రాసిన మొట్టమొదటి కథ కుంపట్లో కుసుమం.
1951లో ఆయన రాసిన పరమానంద శిష్యులు అనే కథా గేయం ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది.
వర్షించిన మేఘం
ప్రాణదాత
కళ్యాణకింకిణి
జీవన్ముక్తుడు
తాము వెలిగించిన దీపాలు
చరమాంకం
కమ్మ తెమ్మెర
స్వేచ్ఛ కోసం
వక్రగతులు
వగపేటికి
రేవతి ప్రపంచం.
కారణభూతుడు
పునర్నవం ,
పాంథశాల
జీవితానికి నిర్వచనం
కూనలమ్మ కోన
నేడు వీరి కథలు మొత్తం నాలుగు సంపుటాలుగా లభిస్తున్నాయి.
1968లో ‘ తాను వెలిగించిన దీపాలు’ కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లబించింది.
1990 లో గుంటూరు అరసం వారిచే కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం అందుకొన్నారు.
1991లో గోపీచంద్ సాహితీ సత్కారం పొందారు.
1993లో ‘ రాజారాం కథల’ కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లబించింది.
1994లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు.
1996లో అప్పాజోస్యుల విష్ణుబొట్ల ఫౌండేషన్ వారి బహుమతి వీరిని వరించింది.
వీరి స్మృతికి నివాళిగా ‘ కథాకోకిల’ పేరిట కథా విమర్శలో, కథా రచనలో ప్రముఖులకు ప్రతి ఏడాది అవార్డులు ఇస్తున్నారు.
ఆయన నాగేంద్ర, దత్తాత్రేయ లాంటి కలం పేర్లతో కూడా రచనలు చేశారు.
వీరి కుమారుడు మధురాంతకం నరేంద్ర తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు మధురాంతకం మహేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అకాల మరణం పొందాడు. వీరిద్దరూ కూడా కవులు, రచయితలే.
ఈయన 1999, ఏప్రిల్ 1వ తేదిన మరణించారు. రాయలసీమ రచయితలల్లో వీరోక కథారత్నంగా మిగిలిపోయారు.
(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసాసుబ్బారావు గ్రామీణ జర్నలిజం అవార్డు గ్రహీత)