(సిహెచ్. ఎస్. ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి, ఎఫ్.ఐ.టి.యు)
ప్రముఖసామాజిక ఉద్యమకారుడు, జీవితకాలమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడిన మహనీయుడు స్వామి అగ్నివేష్ 11-09-2020న తన తుది శ్వాస విడిచారు.
ఆయన జీవిత విశేషాలు, ఆయన సిధ్ధాంతాలు, పోరాట కృషి గురించి అనేక పత్రికలు, ఇతర మీడియాల ద్వారా వివరించబడింది. అనేక మంది ప్రముఖులతోపాటు రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు ఆయన కృషిని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాయి
ఆయనను నేను 2015 సంవత్సరంలో గ్రామీణపేదల సంఘం యొక్క 5 వ మహాసభల సందర్భంగా మూడు పర్యాయాలు కలవటం జరిగింది. ఈ మూడు సందర్భాలు కూడా పీడిత ప్రజల ఉద్యమాల పట్ల, వారి హక్కుల పట్ల విశిష్టమైన ,విలక్షణమైన ఆయన నిబద్ధత, అవగాహనల గురించి, ఆయన వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకోవలసిన అంశాల గురించి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా వాటిని అందరితో పంచుకోవడం సముచితం అని భావించి ఆయనకు నివాళిగా రాసినదే ఈ చిన్న వ్యాసం:
వేపా శ్యామ్రావుపేరుతో తెలుగుజాతిముద్దుబిడ్డగా జన్మించి, స్వామి అగ్నివేష్ గా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ఈ సామాజిక ఉద్యమకారుడు గురించి 2015కు ముందు నాకు తెలిసింది తక్కువ.
ఆ సంవత్సరం ఏప్రిల్ నెలలో, ( 27, 28 తేదీలు) విజయవాడలో గ్రామీణ పేదల సంఘం 5వ మహాసభలు ఉమ్మడిగా జరపాలని ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నాయకత్వాలు నిర్ణయించారు.
ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా ప్రారంభ ఉపన్యాసం చేయటానికి స్వామి అగ్నివేష్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. కాషాయ వస్త్రధారి అయిన ఒక స్వామీజీని వ్యవసాయ విప్లవోద్యమ కర్తవ్యాన్ని చేపట్టిన గ్రామీణ పేదల సంఘం యొక్క మహాసభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం గురించి నాకు, మరికొంత మంది కార్యకర్తలకు కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి.
ఆ సందర్భంగా ఈ స్వామీజీ గురించి వివరంగా తెలుసుకోవటం జరిగింది. యోగి వేమన పద్యం గుర్తుందా.
“కాయగూరలు తిని కాషాయవస్త్రముల్
బోడినెత్తి గలిగి పొరయుచుండ్రు
తలలు బోడులైనఁదలఁపులు బోడులా
విశ్వదాభిరామ వినురవేమ”
ఈ పద్యంలో వెటకరించినటువంటి కుహనా సన్యాసి కాదు ఈ కాషాయ ధారి అని, కట్టుకున్న బట్టల రంగు ఏదయినా, నమ్మిన తాత్విక చింతన ఏదయినా, ఆయన జీవితం, కార్యాచరణ పీడిత ప్రజల ఉద్యమాలతో, పోరాటాలతో మమేకమైనాయని, మతం పేరుతో, ముఖ్యంగా “ హిందుత్వ” పేరుతో ప్రజావ్యతిరేక, అభివృద్ధి నిరోధక రాజకీయాలు నడిపే కాషాయశక్తులకు పూర్తిగా విరుద్ధమైన ప్రజాస్వామిక రాజకీయవాది ఈ స్వామి అగ్నివేష్ అని మాకు అర్థం అయ్యింది.
మహాసభలకు ఆయనను ఆహ్వానించడానికి మొదటి పర్యాయం ఆయనను కలవటం జరిగింది. రెండవ పర్యాయం మహాసభలకు ఆయన హాజరై చేసిన ఉద్విగ్నభరితమైన, స్ఫూర్తిదాయకమైన, విశిష్టమైన ఉపన్యాసాన్ని వినడం; మూడవ పర్యాయం ఈ మహాసభల రిపోర్టులు ప్రచురించబడిన “ప్రొలెటేరియన్ లైన్” పక్షపత్రిక కాపీని ఆయనకు అందజేయడానికి ఢిల్లీలో ఆయనను కలవటం; ఈ మూడు సందర్భాలలో నాకు ఆయన జీవితం, కృషి, వ్యక్తిత్వాల గురించి మరింత స్పష్టంగా అర్థమైంది. ఆయనతో ఈ మూడు పర్యాయాల పరిచయం కొన్ని గంటల సమయమే అయినా అవి నా జీవితంలో చిరకాలం గుర్తుండిపోయే అత్యంత విలువైన ఘడియలు! ఈ సందర్భాలలో విశిష్టమైన విషయాల గురించి క్లుప్తంగా….
మొదటి పర్యాయం మహాసభలకు ఆహ్వానించడానికి విజయవాడలోనే గ్రామీణ పేదల సంఘం నాయకులతో పాటుగా ఆయనను చూడటం, కలవటం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి అమరావతి ప్రాంతంలో వేల ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో సమీకరించడానికి వ్యతిరేకంగా విజయవాడలో (27-02-2015) జరిగిన ర్యాలీలో, సమావేశంలో స్వామి అగ్నివేష్ పాల్గొన్నారు. వివిధ మేథావులు, కమ్యూనిస్టు నాయకులు, కార్మికులు, రైతులు తదితర పేద ప్రజలతో కలసి, వారితో పాటుగా ఉత్సాహంగా నినాదాలిస్తూ, విజయవాడ నగర వీధుల్లో ర్యాలీలో నడుస్తున్న ఉద్యమకారుడుగా ఆయనను మొట్టమొదటి సారి చూశాను.
అది మత ప్రచార ర్యాలీ కాదు. ఆధ్యాత్మిక ఊరేగింపు కాదు. నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని ప్రణాళిక–భూమిని నమ్ముకుని బతుకుతున్న వేలాది రైతుల, వ్యవసాయకూలీల, ఇతర గ్రామీణ పేదల ఉపాధిని భంగపరిచే, నిరంకుశ, నష్టదాయక వ్యవహారం– అని ఎలుగెత్తి చెప్పిన, దానిని వ్యతిరేకించే ప్రజలకు మద్దతుగా సాగిన ప్రభుత్వవ్యతిరేక ర్యాలీ!
ఆ రోజు జరిగిన సభలో నాటి ప్రభుత్వం రాజధాని, ల్యాండ్ పూలింగ్ విధానాలను ఘాటుగా విమర్శిస్తూ స్వామి చేసిన ఉపన్యాసం విశేషాలు మరునాడు అన్ని పత్రికలలో వివరంగా ప్రచురించారు.
“రాజధానికి 5000 ఎకరాల భూమి సరిపోతుంది అనీ, 30 వేల ఎకరాల వ్యవసాయ భూముల ల్యాండ్ పూలింగ్ తో ప్రజలు ఉపాధి కోల్పోతారని, ఈ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని” ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఈ కార్యక్రమాల తరువాత మేము ఆయనను గ్రామీణ పేదల సంఘం తరఫున మహాసభలకు ఆహ్వానించడానికి కలిసాము. ఆ సందర్భంగా సంఘ నాయకులపట్ల ఆయన ప్రదర్శించిన గౌరవాభిమానాలు, విషయాలను చర్చించడంలో ప్రదర్శించిన విజ్ఞానం, వినమ్రతలు, గ్రామీణ పేదల సంఘం నిర్వహించు పోరాటాల గురించి కనపరచిన ఆసక్తి, అవగాహన మరచిపోలేనివి. కాషాయ వస్త్రాలకు విలక్షణమైన గౌరవాన్ని కల్పించిన విశిష్ట వ్యక్తి స్వామి అగ్నివేష్ అన్న అభిప్రాయం నాకు కలిగింది.
ఇక రెండవ సందర్భం: గ్రామీణ పేదల సంఘం 5వ మహాసభకు ఆయన హాజరై చేసిన ఉపన్యాసం: ఈ మహాసభలకు హాజరు కావడానికి ఆయన పడిన శ్రమ- కష్టజీవుల, గ్రామీణ పేదల ఉద్యమాలకు ఆయన యిచ్చిన ప్రాధాన్యతను తెలియపరుస్తుంది.
మొరాకో దేశం నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాదుకి, అక్కడ నుండి విజయవాడకు సుధీర్ఘ ప్రయాణాలు, మధ్యలో ఊపిరి సలపని కార్యక్రమాలు సాగించి ఆయన మహాసభలకు హాజరయ్యారు.
దీనివల్ల కొంత ఆలస్యమై ఆయన ఆరోజు మధ్యాహ్నం 2.30 గంllకు సభాస్థలికి చేరుకున్నారు. సుమారు 6000 మంది గ్రామీణ పేదలు, పెద్ద సంఖ్యలో చంకలో బిడ్డలతో సహా మహిళలు రెండు రాష్ట్రాలలోని సుదూర ప్రాంతాలనుండి అంతకు ముందురాత్రి రైళ్లలో, జనరల్ బోగీల్లో శ్రమపడి ప్రయాణాలు చేసి వచ్చి ఆ సభలో ఉన్నారు.
ఏప్రిల్ నెల, మండుతున్న ఎండ. ఆలస్యం అయిన ముఖ్య అతిథి ఆగమనం! ఇదీ స్వామి అగ్నివేష్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన వాతావరణం! వేసవి తాపం, ఆకలి దప్పులు, ప్రయాణబడలిక అన్నీ మరచి స్వామి ఉపన్యాసంలో ప్రజలు లీనమయ్యారు. అత్యంత శ్రద్ధతో, ఆసక్తితో ఆలకించారు. ఉపన్యాసం తెలుగులో కాదు, హిందీలో. ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ తెలుగులోనికి అనువాదం సాగించారు.
అయినా గ్రామీణ పేదలు(అత్యధికులు బి.సి., ఎస్టీ, ఎస్.సిలకు చెందిన పేదలు)ఉత్సాహంగా ఆ ఉపన్యాసాన్ని ఆస్వాదించారు. తరాలుగా ఆ పేదలు అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ, అలుపు సొలుపు లేకుండా తమ మౌలిక సమస్య- “భూమి” సమస్య –పరిష్కారానికి చేస్తున్న పోరాటంపై వారికి బలమైన విశ్వాసాన్ని, క్రొత్త ఉత్సాహాన్ని అందిస్తూ స్వామి ఉపన్యాసం ఉద్విగ్నభరితంగా సాగింది. ప్రారంభసభలో , బహిరంగ సభలో రెండు విడతలుగా సాగిన స్వామి ఉపన్యాసంలో కొన్ని “అగ్ని” కణాలు.
“…మీరు భూమి కోసం పోరాడుతున్నారు. జల్, జంగల్, జమీన్(నీరు,అడవి, భూమి)ల కోసం పోరాటం కన్నా మహత్తరమైన కర్తవ్యం మరొకటి లేదు… గతంలో ప్రజలు పోరాడి లక్షల ఎకరాల భూములు సాధించుకున్నారు..మీరు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు..ఈ భూమిని పెట్టుబడిదారులు, జమీందారులు సృష్టించలేదు..గాలి, సూర్యరశ్మి లాగే భూమి ప్రజల ప్రకృతి సిద్ధమైన జన్మహక్కు, దున్నే వారి చేతిలోనే భూమి ఉండాలి. భూస్వామ్య విధానం రద్దు కావాలి…భూస్వాముల అధికారానికి ముగింపు పలకాలి…ఈ భూమిపై హక్కును మనం పోరాడి సాధించుకోవాల్సిందే…నా దృష్టిలో నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇదే. దీనికి అడ్డుపడే వారు మానవతకు, దేవుడికి కూడా శతృవులే..మీ పోరాటం జీవించే హక్కు కోసం…సత్యం కోసం…న్యాయం కోసం..నా దృష్టిలో ఇంతకన్నా గొప్ప ధర్మం లేదు..బడా పెట్టుబడిదారులు, భూస్వాములు కార్మికులను, రైతాంగాన్ని దోచుకుంటున్నారు…ఈ దోపిడీకి ముగింపు పలకాలి. నిరుపేదలంతా దీనికి వ్యతిరేకంగా విప్లవించాలి…నేను నమ్ముతున్న పరమాత్మ ఇచ్ఛ కూడా ఇదే. ఇదే నిజమైన దైవ పూజ.. నిజమైన ఉపాసన. నేను నా హృదయంలో, అందరిలో, అంతటా వున్న పరమాత్మను నమ్ముతాను, కానీ ఆలయాల్లో, శిలా విగ్రహాలలో బంధింపబడిన దేవుణ్ణి కాదు..ఈ పరమాత్మ నన్ను సత్యం కోసం, న్యాయం కోసం, సమత కోసం పోరాడమని చెబుతోంది. గుడి, మసీదు, చర్చి, గురుద్వారా , మానవులు సృష్టించిన ఏ మతమైనా న్యాయంకోసం పోరాటమార్గం నుండి ప్రజల్ని ప్రక్క దారి పట్టిస్తుంటే, ప్రజల్ని మోసం చేస్తుంటే, అటువంటి దేవుడికి తప్పక స్వస్తి పలకాలి. ప్రజల్ని వంచించడానికి, దగా చేయడానికి, వెర్రివాళ్ళని చెయ్యడానికి ఉపయోగించబడే ఏ దేవుడుతోనూ ప్రయోజనం లేదు…మన దేశంలో చాలా మందిరాలు, మసీదులు ఉన్నాయి..కానీ పాఠశాలలు తగినన్ని లేవు..మన వేదాలు ఆలయాలు, విగ్రహాల ఆరాధనలు గురించి చెప్పడం లేదు..మన మనసే భగవన్మందిరం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి అన్నదే అసలైన మంత్రం.
“మన రాజ్యాంగంలో సమానత్వం గురించి రాశారు..45 కోట్ల మంది గ్రామీణ పేదలు భూమిపై హక్కు లేకుండా పేదరికంలోనే మ్రగ్గిపోతుంటే సమానత్వం ఎలా అమలవుతుంది?…భూమికి, భూమిపై వున్న నీరు,చెట్లు, అడవి తదితర వనరులన్నంటికీ మనమే యజమానులం..వీటిని పోరాడి సాధించుకోవటం రాజ్యాంగంలో చెప్పబడినదానికి అనుకూలమైనదే.. ఈ పోరాటాన్ని మీరు కొనసాగిస్తున్నారు..మహనీయులు కమ్యూనిస్టు విప్లవనాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డిగార్ల ఆశయాలను అనుసరించి మీరు ఈ పోరాటం చేపట్టారు. మీలో వారి జ్ఞాపకాలను నేను చూస్తున్నాను.ఆ మహనీయులకు నా అరుణారుణ జోహార్లు..వారి స్ఫూర్తితో మన పోరాటాన్ని కొనసాగించుదాం..మీ పోరాటంలో మీతోపాటు నేను ఉంటాను..బానిసత్వాన్ని, దోపిడీని, అన్యాయాన్ని మనం సహించవద్దు..మనం విధిరాతను గురించి దుఃఖించం..మన విధిరాతను మన చేతులతో మనమే రాసుకుంటాం…. నూతన ప్రపంచాన్ని, నూతన సమాజాన్ని, నూతన భారత దేశాన్ని, నూతన సంస్కృతిని నిర్మించుదాం..కమానేవాలే ఖాయేగా (శ్రమ చేసేవారు భుజిస్తారు)..లూట్నేవాలా జాయేగా (దోచుకునేవారు తొలగిపోతారు)..నయాజమానా ఆయేగా ( నూతన వ్యవస్థ వస్తుంది)..విప్లవం తథ్యం..దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు…విప్లవం వర్థిల్లాలి”.
ఆ విధంగా సాగిన స్వామి అగ్నివేష్ ఉపవ్యాసం మా అందరిలోనూ విప్లవోత్తేజాన్ని ద్విగుణీకృతం చేసింది. (సుదీర్ఘంగా అనేక అంశాలపై సాగిన ఆయన ఉపన్యాసంలోని భూమి సమస్యకు సంబంధించిన ముఖ్య భాగాలను మాత్రమే ఇక్కడ ఉదహరించటం జరిగింది. ఆ సభలకు స్వామి అగ్నివేష్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అత్యంత సముచితం, సందర్భోచితం, ప్రయోజనకరం అని ఆయన ఉపన్యాసం రుజువు చేసింది.
చివరిగా ఆయనను ఢిల్లీలో కలిసిన సందర్భం గురించి రెండు మాటలు: ఒక ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి నేను ఆ సంవత్సరం మే నెలలో ఢిల్లీ వెళ్లాను. గ్రామీణ పేదల సంఘం మహాసభల కార్యక్రమాలు, స్వామి అగ్నివేష్ ఉపన్యాసం రిపోర్టులు ప్రచురించబడిన ప్రొలెటేరియన్ లైన్ ( పక్ష పత్రిక కాపీని ఆయనకు అందించే పని నాకు అప్పగించబడింది. ఢిల్లీ నుండి తిరుగుప్రయాణం రోజు వరకు అందుకు నాకు తగినంత సమయం దొరకలేదు. ఆయనకు ఫోన్ చేసి పత్రికను అందించాల్సిన నా బాధ్యత గురించి, అందుకు వున్న తక్కువ సమయం గురించి తెలియపరిచాను. ఆయన తన ప్రాధాన్యతలను నా కోసం సర్దుబాటు చేసుకుని నన్ను రమ్మని ఆహ్వానించారు. ఆయన ఒక సమావేశానికి వెళ్లవలసి ఉంది. అయినా నా కోసం వేచి వుండి, నాతో ఎంతో ఆదరణ, ఆప్యాయతలతో మాట్లాడారు. నేను ఆ పత్రికను అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసారు. ఆ పత్రికలో కొన్ని భాగాలు పరికించి, చాలా బాగుంది అని ప్రశంసించారు. తాను సమావేశానికి వెళ్లవలసిన కారణంగా నన్ను త్వరగా వదలి వెళ్తున్నందుకు నొచ్చుకుంటూ బయలుదేరారు. గేటు వరకూ వెళ్లిన ఆయన అకస్మాత్తుగా వెనక్కి తిరిగి వచ్చి, నా భోజనం సంగతి ఏమిటని అడిగారు. ఎక్కడైనా చెయ్యాలి అని నేనంటే, నా చేయి పట్టుకుని ఆయన కార్యాలయం లోని వంటగది/ డైనింగ్ రూమ్ లోకి తీసుకువెళ్ళారు. అక్కడ వున్న సహాయకుడికి నన్ను పరిచయం చేసి, నాకు భోజనం ఏర్పాటు చేయమని చెప్పి ఆ తరువాతనే ఆయన నన్ను విడిచి వెళ్ళారు. ఉద్యమ కార్యకర్తల పట్ల స్వామి అగ్నివేష్ గారి అభిమానం,గౌరవం, ఆదరణ మరువలేము.
ఆయన అమరులైన వార్త నాకు, నా ఉద్యమ మిత్రులందరికీ ఎంతో విచారాన్ని కలిగించింది. ఆధ్యాత్మికతను ప్రజల న్యాయమైన విప్లవోద్యమాలను బలపరిచే ఆయుధంగా మలచిన విలక్షణమైన, సాహసికుడైన, పోరాటయోధుడు స్వామి అగ్నివేష్ (2004 Alternative Noble Prize గ్రహీత) ధన్యజీవి. నిజమైన “భారతీయ సంస్కృతి” అంటే దోపిడీకి, అన్యాయానికి, వివక్షతలకు, అణిచివేతకు వ్యతిరేకంగా, నిర్భయంగా, త్యాగశీలంగా ప్రజలు పోరాడటమే అన్న మహత్తర సందేశం ఆయన జీవితం, కృషి మనకందిస్తున్నాయి. ఆ సందేశాన్ని అందుకుని, భూమి, ఇతర హక్కుల కొరకు సాగు పీడిత ప్రజల పోరాటాలకు Bandhua Mukti Morcha ద్వారా బాసటగా నిలిచి, వాటిలో భాగస్వాములు కావటమే ఆ మహనీయునికి మనం అందించే నిజమైన నివాళి!