(Ahmed Sheriff)
నా మిత్రుడొకడికి శభాష్ రాముడు (1959) చిత్రం లో ని “జయంబు నిశ్చయంబు రా‘ పాట చాల ఇస్టం (నాకు కూడా). ఆ పాటని పొగుడుతూ నాకు వినిపిస్తున్నపుడు, మాటల్లొ పడి నేను ఆ పాటకు మూలం 1957 లో వచ్చిన “బడా భాయి” సినిమాలో మహమ్మద్ రఫీ, ఆశాభోస్లే పాడిన “ఖదం బడాయె జా న డర్ ఖదం బడాయే జా” అనే పాట అన్నాను. అంతే అప్పటినుండి ఆ పాట అంటే ఇష్టపడడం మానేశాడు. ఒక్క దెబ్బతో, పాటపాడిన ఘంటసాల, పాట రాసిన కొసరాజు, గొప్పతనా లన్నీ మాయమై పోయాయి. ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల ఆలోచిస్తే నా మిత్రుడు ఆ పాట మాతృ కను వినే అవకాశమే లేదు. ఎందుకంటే వాడు హింది సినిమా పాటలు వినడు. కాపీ చేయక పోతే వాడి మనసుకు నచ్చిన ఒక ట్యూను వినే అవకాశం వాడికి వుండేది కాదు. ఒక మహత్తర మైన మంచి ట్యూను ను పోగొట్టుకునే వాడు. ఈ ట్యూను వాడి వద్దకు తెచ్చిన వారిని మెచ్చుకోవాలా? లేక తక్కు వఛేసి మాట్లాడాలా ?
ట్యూన్లు కాపీ చేయడానికి అనేక కారణలుంటాయి. వాటిలో మంచి ట్యూన్ల గురించి కొన్ని పాటలు కాపీ అయితే, నిర్మాత దర్శకుల కోరిక మేరకు సంగీత దర్శకులు కొన్ని పాటల్ని కాపీ చేయాల్సి రావచ్చు.
అలాగే పాట ఔన్నత్యాన్ని నిలపడానికో, థీము చెడకుండా వుండటానికో ఒక భాష లోని పాట ట్యూను మరో భాష లోకి యథా తథంగా తీసుకు రావల్సి రావచ్చు..
మంచి బాణీలు (ట్యూన్లు)
ఈ రేయి తీయనిదీ, ఈ చిరు గాలి మనసైనదీ. ఈ హాయి మాయనిదీ ఇంతకు మించి ఏమున్నదీ”
ఈ పాట 1970 లో వచ్చిన ఏ.వి.ఎం వారి “చిట్టిచెల్లెలు” చిత్రం లోనిది. దీనికి సంగీతం ఎస్. రాజేశ్వర రావు. ఈ పాట రచయిత సి.నారాయణ రెడ్డి. అప్పట్లో ఈ పాట జనాదరణ అమోఘం. ఆర్కెస్ట్రాలలో పెళ్లిళ్లలో, వేడుకల్లో ఈ పాట తప్పని సరిగా వుండవలసిందే. ఎస్.పి. బాల సుబ్రమణ్యం, సుశీల పాడిన ఈ పాటలో ఎస్.పి.బి “ఈ రేయి” అని పాడినపుడల్లా ఆ స్వరానికి అభిమాను లంతా సమ్మోహితులయ్యే వారు. ఆ పలుకుల బరువు అలా వుండింది. ఇవి కాక పాట మొదలయ్యే తీరు, దీనిలో ఫ్లూటు బిట్లూ, చరణాన్ని పల్లవితో కలిపే ఒక అకార్దియన్ బిట్టూ అద్వితీయం. ఇవన్నీ ఎస్. రాజేశ్వర రావు సృష్టించిన అందాలు. ఈ పాట గురించి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ పాటకు మూలం 1967 లో వికీ లియాండ్రోస్ పాడిన “ L’amour est bleu” లేదా ” Love is blue” అనే ఓ ఫ్రెంచి పాట.
అయితే ఆ పాట లోని పల్లవి కి చేసిన రాగం తప్పితే ఈ రేయి తీయనిదీ పాటలో మరే విషయాలూ కలవవు. అప్పుడు మనం తెలుగు పాట ఓ ఫ్రెంచి పాట ఇన్స్పిరేషన్ తో తయారయింది అనాలే తప్ప ఈ పాట ఆ పాట కాపీ అని చెప్పరాదు. తెలుగు లో ఎంత అందమైన పాట?
ఇలాంటిదే మరో పాట 2006 లో వచ్చిన పోకిరీ సినిమాలో వినిపించిన “గల గల పారుతున్న గోదారిలా”. ఇది మహేష్ బాబు, ఇలియానా అభినయించిన పాట.
అయితే ఈ పాటకు మూలం సత్యం సంగీత దర్శకత్వం వహించిన గౌరి (1974 ) చిత్రం కోసం ఎస్.పి.బి పాడిన,
“గల గల పారుతున్న గోదారిలా, రెప రెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా, ఆ పచ్చనీ పైరులా ఈ జీవితం సాగనీ హయిగా …హే”
అనే పాట. దీన్ని తెర మీద కృష్ణ అభినయించాడు. మొదిటి పాట, రెండో పాట కు మధ్య పల్లవి లోని “గల గల పారుతున్న గోదారిలా” అనే పలుకులు, పల్లవి ట్యూనూ తప్పిస్తే మిగాతాదంతా వేరే వేరే.
అయితే, ఈ పాట 1973 లో వచ్చిన “రాణి ఔర్ జాని” చిత్రం లోని “మేరె దిల్ ఝూం ఝూం తూ గాయెజా…” అనే పాటకు కాపీ. ఈ పాట పాడింది కిశోర్ కుమార్. తెర మీద భినయించింది అనిల్ ధావన్.
ఈ పాట విషయం లో మనం తెలుసుకోవలిసిన విషయం ఏమిటంటే, రాణి ఔర్ జాని సినిమాకి కూడ సంగీతం వహించింది సత్యమే, కిశోర్ కుమార్ పాడిన పాట బాణీ కూడా సత్యం చేసిందే నని.
అయితే ఈ పాటకు అసలు మూలం (ప్రేరణ అందాం) 1969 లో జోస్ ఫెలిసియానో పాడిన LISTEN TO THE FALLING RAIN అనే పాప్ సాంగ్.
ఇవన్నీ మంచి ట్యూన్ల కోసం కాపీ చేయ బడిన పాటలు. ఇలాంటి మంచి ట్యూన్లను మనకు అంద జేసిన సంగీత దర్శకులకు జోహార్లు.
నిర్మాత దర్శకుల కోరిక:
ట్యూన్ బాగుందనో, లేక నిర్మాతలూ, దర్శకులూ కోరినప్పుడో ఒక భాష లోని పాట ట్యూను మరో భాషలో కి తీసుకోవచ్చు. అలా హిందీ లోంచి తెలుగులోకి వచ్చిన ఒక పాట “శ్రీవారూ మావారు” చిత్రం లోని “పూలు గుసగుస లాడేనని, జత గూడేనని గాలి ఈలలు వేసేనని సైగ చేసే ననీ అది ఈరొజే తెలిసిందీ..” (రచన సి. నారాయణ రెడ్డి, సంగీతం జి.కె. వెంకటేష్, పాడిన వారు : ఎస్.పి.బాలసుబ్రమణ్యం).
ఈ పాటకు మూలం హిందీ కారవాన్ చిత్రం లో అషా భోస్లే పాడిన “దయియ యహ్ మై కహ ఆ ఫసీ” అనే పాట. దీనికి సంగీతం ఆర్.డీ. బర్మన్
కథ కోసం కాపీలు
ఇక ఒక భాష లోని సినిమా మరో భాషలో తీసినప్పుడు. థీము కోసం, లేదా పాట ఔన్నత్యాన్ని నిలపడం కోసం పాటల్ని కాపీ చేయ వచ్చు.
అలాంటి ఒక పాట తెలుగులో కుల దైవం(1960) చిత్రం లో ఘంటసాల పాడిన “పయనించే ఓ చిలుకా ఎగిరి పో పాడై పోయెను గూడు” అనే పాట. దీనికి మూలం హిందీ లో 1957 లో ఎ.వి.ఎం ద్వారా వచ్చిన “భాభీ” (వదిన) చిత్రం లో మహమ్మద్ రఫీ పాడిన “చల్ ఉడ్ జారే పంఛీ” అనే పాట. దీనికి సంగీతం చిత్ర గుప్త.
కులదైవం సినిమా భాబీ చిత్రానికి రీమేక్. సందర్భం ఒకటే వున్నప్పుడు పాట కూడా ఒకటే వుండాలనే వుద్దేశ్యం. ఈరెండు పాటలూ ఒకే వీడియోలో చూడొచ్చు
https://www.youtube.com/watch?v=TvO3MYzdOqA
సినిమాల్లో పాటల గురించి మాట్లాడుతూ, పాట మీదే వచ్చిన సినిమా గురించి మాట్లడక పోవడం బావుండదు.
రామానంద్ సాగర్ నిర్మిత “గీత్” చిత్రం 1970 లో వచ్చింది. కల్యాణ్ జీ ఆనంద్ జీ సంగీతం వహించిన ఈ చిత్రం లో” ఆజా తుఝ్ కొ పుకారే మేరే గీత్ రే ” పాట చాలా హిట్ అయింది.
దీన్లో రాజెంద్ర కుమార్, మాలా సిన్హా, హీరో, హీరోయిన్లు. ఈ చిత్రాన్ని 1976 లో ఆరాధన (అక్కినేని నాగెశ్వర రావు ఆరాధన చిత్రం 1962 వేరే వుంది) చిత్రం గా రిమేక్ చేశారు. దీన్లో ఎన్.టి.రామా రావు, వాణిశ్రీ హీరొ, హీరోయిన్లు. సందర్భానుసారం పై పాటను అదే ట్యూన్లో “నా మది నిన్ను పిలిచింది గాన మై” పాట గా మహమంద్ రఫీ పాడాడు. దీనికి సంగీతం ఎస్. హనుమంత రావు. ఈ పాట అంతే ప్రఖ్యాతి చెందింది”.
అపస్వరాలు
అయితే కొన్ని సార్లు ఈ కాపీ కొట్టడాలు అదుపు తప్పితే అభిమానులకు బాధ కలిగించ వచ్చు. హిందీ తెలుగు తేడా లేకుండా, బాబీ చిత్రం లోని “హం తుం ఎక్ కమరే మె బంద్ హో” పాట ఎంతటి ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిన విషయమే. అయితె బాబీ పాట ధోబీ పాటగా మారి పోయింది జమిందారు గారి అమ్మాయి (1975) చిత్రం లో “మంగమ్మా నువ్వు వుతుకు తుంటే అందం” పాటతో . దీనికి సంగీతం జి.కె.వెంకటెష్
ఇలాంటిదే మరో పాట “ముత్యాలూ వస్తావా అడిగింది ఇస్తావా?” అనె కామెడీ పాట అల్లురామలింగయ్య , రమాప్రభ ల అభినయం లో మనుషులంతా ఒక్కటే (1976) సినిమాలో. దీని బాణీ కిశోర్ కుమార్ కు చాలా పేరు తెచ్చిన ఆరాధన (1970) చిత్రం లోని “రూప్ తెరా మస్తానా ప్యార్ మెరా దీవానా” పాట బాణీ కి కాపీ
కాపీ ట్యూను అనగానే మనలో చాలామంది ఆ పాటను చిన్న చూపు చూస్తారు. ఆ పాట తయారు చేసిన సంగీత దర్శకుడిని చేతకాని వాడనుకుంటారు. ఇది నా స్నేహితుడి ఒక్కడి సమస్యే కాదు. ఇలా ఆలోచించే వారు చాల మందే వుంటారు..
“నా దగ్గర పని చేయడానికి వచ్చే వాడు సింగ్ సింగ్ జైలు నుంచి వచ్చినా, హార్వార్డు నుంచి వచ్చినా నాకొకటే. మనం ఉద్యోగం ఇస్తున్నది మనిషి కే గానీ అతడి చరిత్రకి కాదు.” అన్నాడు హెన్రీ ఫోర్డు.
నిజం, అందుకే ఒక పాట బావుంటే దాన్ని విని ఆనందించాలి. అంతే. దాని చరిత్ర అడగ కూడదు. పాటని ఆదరిద్దాం దాని చరిత్ర మనకు అనవసరం.
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)
Mob: +91 9849310610)