చేనేత సంప్రదాయాన్ని కాపాడుకునే ప్రణాళికే లేదా?

(అవ్వారు శ్రీనివాసరావు)
 భారతీయ సాంస్కృతిక, ఆర్తిక రంగంలో చేనేత రంగానిది విశిష్ట స్థానం. భారతదేశానికి “Home of Cotton Textiles”అని పేరుంది. భారతీయులు క్రీ.పూ 2000లకు ముందే పత్తిని పండించినట్లు ఆధారలున్నాయి. హరప్పా మొహంజోదారో ప్రజలకు పత్తి,బట్టలు నేయడం గురించి తెలుసు. అంటే బట్టలు నేయడానికి భారత ఉపఖండంలో దాదాపు అయిదు వేలసంవత్సరాల చరిత్ర ఉంది.
వేదాలలో, రామాయణంలో శిల్క్  వస్త్రాల ప్రస్తావన ఉంది. అంటే అప్పటికే నేత అనేది గౌరవప్రదమయిన వృత్తిగా ఎదిగింది. గ్రీక్ చరిత్రకారుడు భారతీయ పత్తి చెట్టు గురంచి చిత్రంగా వర్ణించినట్లు మనం పుస్తకాల్లో చదువుకున్నారు. “ The Indian possess a kind of plant which, instead  of fruit produces wool of fine and better quality that that of sheep of this the Indians make clothes.” అని హెరెడో టస్ రాశారు.
భారతదేశంలో ఎంత ఫైన్ క్వాలిటీ బట్టలు  తయారయ్యే వంటే వాటికి సూదూర ఖండాలలో అంటే దూర ప్రాచ్య నుంచి  ఒక వైపు కైరో, మరొక వైపు చైనా దాకా  విపరీతంగా డిమాండ్ ఉండేది.  ఇక ఆంద్రప్రదేశ్ విషయానికి వస్తే, భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖ చేనేత వస్త్రాల హబ్. భారతదేశానికి సిల్క్,నూలు వస్త్రాలలో కీర్తితెచ్చిన ప్రాంతాలలో తెలుగు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక్కడి చీరాల,మంగళగిరి, బందరు ఒకప్పుడు హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ వాణిజ్య కేంద్రాలు.

weavers at work

ఇక క్వాలిటీ విషయానికి వస్తే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క నాణ్యతది. కొన్ని కేంద్రాలు సిల్క్ కేంద్రాలయితే, కొన్ని నూలు వస్త్రాల కేంద్రాలు. పొందూరు ,పోచంపల్లి, వెంకటగిరి,దర్మవం,గద్వాల, పుల్లంపేట… ఇలా జిల్లాకొక కేంద్రం ఉండేది. ఇది నాటి స్వర్ణయుగం. ఆరోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత అత్యధిక ప్రాధాన్యం ఉండింది చేనేత రంగానికే. అంతర్జాతీయ వాణిజ్యాని సుగంధ ద్రవ్యాల తర్వాత శాసించింది చేనేత వస్రాలే. దీనికికారణం, నాణ్యతతోపాటు చేనేతలో దాగి ఉన్నకళ. అయితే, ఇపుడు పరిస్థితులు తారుమారయ్యాయి.  చేనేత వృత్తి అంతరించిపోయే దశకు చేరుకుంది. చేనేత కుటుంబాలు  పేదరికంలో మగ్గిపోతున్నాయి.
నేటి దీనావస్థ
జాతీయ ఉద్యమంలోనూ సముచిత పాత్ర. అంతటి సుదీర్ఘ చరిత్ర గల చేనేత రంగం నానాటికి తీసికట్టుగా మారుతోంది. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచ బ్యాంక్ నిర్దేశిత విధానాలు, పాలక వర్గాల దృక్పథం వంటి పరిణామాల నేపథ్యంలో చేనేత రంగం సంక్షోభంలోకి నెట్టబడింది. వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి రంగంగా చేనేత పరిశ్రమ నిలుస్తుంది. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ చేనేత కార్మికుల్లో 15 శాతం మంది మాత్రమే సహకార సంఘాల పరిధిలో ఉన్నారు. అధిక శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారు.
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో సుమారు 2.20 లక్షల కుటుంబాలు చేనేత రంగంలో ఉపాధి పొందేవి. నవ్యాంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వేలో 90,775 చేనేత కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించింది. అయితే, రాష్ట్రంలో సుమారు ఒక లక్షా 80 వేల మగ్గాలు ఉండగా, చేనేత ఉప వృత్తులు కలిపి సుమారు నాలుగు లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నట్లు చేనేత కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. స్వయం ఉపాధిలో అత్యధికంగా ఉన్న చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతోందనే విమర్శలు లేకపోలేదు. చేనేతను రక్షిస్తామని, చేనేత కార్మికుల జీవితాలను మెరుగుపరుస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించడం తప్ప ఆచరణలో మాత్రం కానరాడం లేదు.
చేనేతకు చేయూత లేకపోవడంతో చేనేత కార్మికులు ఉపాధి కరువై, చాలీచాలని మజూరీల (వేతనాల)తో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో అనేక మంది అనివార్యంగా ఇతర పనుల్లోకి వలస వెళ్లాల్సిన దుస్థితి. చేనేత వృత్తిలో పెరిగిన జీవన అవసరాలు కూడా తీరే పరిస్థితులు కానరావడం లేదు. బతుకుదెరువు కోసం కళాత్మకమైన చేనేత వృత్తిని విడనాడి భవన నిర్మాణ కార్మికులుగా, పెయింటర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా చివరకు హోటళ్లలో సప్లయిర్లుగా వెళ్లిన పరిస్థితులు ఉన్నాయంటే చేనేత రంగం ఎంతగా చితికిపోయిందే అర్థం చేసుకోవచ్చు.
చేతి వృత్తుల పతనం
మారుతున్న కాలం, యంత్రయుగం చేతివృత్తులను దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా చేనేత రంగంలో ఆకలి చావులు, అనారోగ్య చావులు, అప్పుల ఆత్మహత్యలు చోటుచేసుకునేలా చేశాయి. చేనేత సృష్టించుకున్న డిజైన్లను ఏ ఒక్కటీ వదలకుండా రాష్ట్రంలో పవర్ లూమ్స్ కబ్జా చేశాయి. అంతేకాదు చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లను లెక్క చేయకుండా, నకిలీ వస్త్రాలను మార్కెట్ లోకి తెచ్చి చేనేతను చావు దెబ్బతీస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పాలకులకు మరమగ్గాలపై మమకారమే తప్ప చేనేత సమస్యలపై దృష్టి సారించే పరిస్థితులు కానరావడం లేదు. దీంతో రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించి చీరలు, ధోవతులు, టవల్స్, లుంగీలు, బెడ్ షీట్లు, పట్టు వస్త్రాలు, ఫర్నిషింగ్ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ పవర్ లూమ్ మీద తయారు చేస్తున్నారు. హ్యాండ్ లూమ్ మార్క్ దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోవడం లేదు. హద్దు, అదుపు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి చిలపల నూలు ధరలనూ, నూలు తయారీని (యాంకీ యారన్ ఆబ్లికేషన్) శాసిస్తున్న మిల్లులను కట్టడి చేసే పరిస్థితులు లేవు. చేనేతకు అవసరమయ్యే జరీ, రంగులు, రసాయనాలు, పట్టు వంటి సామగ్రి ధరలను అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.
సహకార రంగంలో అతి తక్కువ మంది చేనేత కార్మికులకు మాత్రమే పని దొరుకుతుంది. ఎక్కువమంది కార్మికులు మాస్టర్ వీవర్ల వద్ద షెడ్డు కార్మికులుగా చాలీచాలని మజూరీ (వేతనం)తో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో చేనేతకు అవసరమైన చిలపల నూలు ధరలు భారీగా పెరగడంతో మాస్టర్ వీవర్లు తమ ఉత్పత్తులను తగ్గించుకుంటున్నారు. చేనేతకు కావలసిన ముడిసరుకు చిలపల నూలు, పట్టు, సిల్కు, రంగులు, రసాయనాల ధరలు విపరీతంగా పెరుగుతున్నా… వీటి ధరలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. నూలు మిల్లులు తయారుచేసే ఉత్పత్తుల్లో 50 శాతం చిలపల నూలు ఉండాలనే నిబంధన ఉన్నా 26 శాతం మించి ఉండడం లేదు. నూలు మిల్లుల యజమానులు ఎక్కువగా పవర్ లూమ్, టెక్స్ టైల్ మిల్లులకు ఉపయోగపడే కోన్ దారం తయారుచేస్తున్నారు. కోన్ దారానికి అంతర్జాతీయంగా గిరాకీ ఉండడమే కాకుండా ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించకపోవడంతో మిల్లు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చేనేతకు కావాల్సిన చిలపల నూలుకు మార్కెట్ లో కొరతను సృష్టించి వ్యాపారులు వాటి ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. దీంతో చిలపల నూలు కొరత ఆకాశాన్నంటే ధరలతో.. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగి మార్కెట్ లో పవర్ లూమ్ వస్త్రాలతో రేటు విషయంలో పోటీ పడలేక చేనేత చితికిపోతోంది. అసలే సంక్షోభంలో ఉన్న చేనేత రంగంపై జీఎస్టీ విధింపు మరింత దెబ్బతీసినట్లయింది.
ఉన్నట్లుండి కాటేసిన కరోనా
అనుకోని విపత్తుగా కరోనా వచ్చి పడిన నేపథ్యంలో చేనేత కార్మికుల పరిస్థితి మరింత దుర్లభంగా మారింది. లాక్ డౌన్ తో ఎక్కడి మగ్గాలు అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత సడలింపుతో అక్కడక్కడా నేత కార్మికులు పనుల్లోకి దిగినా ముడిసరుకు నిల్వలు లేకపోవడంతో మాస్టర్ వీవర్లు, సహకార సంఘాలు వారికి పని కల్పించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.
తెలంగాణలో పోచంపల్లి హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కరోనా సంక్షోభంలో పడిపోయింది. ఈ ప్రాంతంతలో మాస్టర్ వీవర్ల దగ్గిర సుమారు రు. 200కోట్ల వలువయిన చీరెల స్టాక్ మిగిలిపోయింది.దీనితో కూలీలకు మగ్గం పని ఆగిపోయింది. సాధారణంగా పోచంపల్లి చీరెలకు ఢిల్లీ,ముంబై, చెన్నై, కోల్ కత వంటి మెట్రోపాలిటన్ నగరాలనుంచి డిమాండ్ ఉంటుంది.అయితే, లాక్ డౌన్ తో షాపులు బంద్ అవడంతో స్టాక్ ఖర్చు కాలేదు.
చిల్కూర్ శ్రీనివాస్ (చందూర్, నల్గొండ జిల్లా మాస్టర్ వీవర్)
చేనేత కార్మికులకు ఉపాధి పోయిందని నలొండజిల్లా చందూర్ కుచెందిన చిల్కూర్ శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం ఈ స్టాక్ కొనుగోలు చేసి ఉద్యోగులకు సబ్సిడీ తో విక్రయమిస్తే కేవలం రు 200 కోట్లలో  వేలాది మందికి ఉపాధి లభిస్తుంది, ఆకలి నుంచి చేనేత కార్మికులు బయటపడతారని ఆయన చెబుతున్నారు. అయితే, ప్రభుత్వంలో ఈ ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేవారు.
నేతన్న నేస్తం కొంతలో కొంత మేలు
ఆంధ్రప్రదేశ్ ష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ పథకం కింద 81వేల మందికి రూ.24 వేల వంతున ఆర్థిక సాయం చేసి కొంతలో కొంత ఆదుకుంది. అయితే ఈ పథకం కిందకు షెడ్డు కార్మికులు రాకపోవడంతో వారికి ప్రభుత్వ లబ్ధి చేకూరలేదు. తాజాగా ప్రభుత్వ మరో 15 వేల మందిని నేతన్న నేస్తం పథకానికి అర్హులుగా గుర్తించడం కొంతమేర ఊరట కలిగించే అంశం. ఇక పేరుకుపోయిన చేనేత ఉత్పత్తుల నిల్వలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాతిపదికగా తీసుకుని చేనేత కార్మికులకు నెలకు రూ.7,500 వంతున డిసెంబరు వరకు ఆర్థికసాయం అందించాలని కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాలను కోరుతున్నాయి.
చేనేతను జౌళి శాఖ నుంచి విడదీసి వేర్వేరుగా నిధులు కేటాయించాలని, వేర్వేరు శాఖలుగా నిర్వహించాలని చేనేత సంఘాల నాయకులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు కూడా క్రమంగా తగ్గించి వేస్తుండడం పాలకులకు చేనేత రంగంపై గల మక్కువను తెలియజేస్తుంది. చేనేత పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నప్పడల్లా… గతంలో చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య గళం చట్టసభల్లో గట్టిగా వినిపిస్తుండేది. చేనేత సమస్యలను సమగ్రంగా ప్రస్తావించేవారాయన. ఆయన తదనంతరం అలాంటి పోరాట పటిమ, కార్యదక్షత గల నేతన్న చేనేత రంగంలో కానరాలేదు. కుటీర పరిశ్రమల్లో మేటి చేనేతను ఎందుకు ప్రోత్సహించాలంటే… పేదలకు జీవనోపాధి, అతి తక్కువ పెట్టుబడితో ఉపాధి, పర్యావరణానికి అనుకూలమైనది, దేశ సంస్కృతికి చిహ్నమైనది, కులామతాలకు అతీతమైనది. అంతేకాదు జాతీయ ఉద్యమంతో విడదీయరాని బంధం.. మన జాతీయ పతాకంలో రాట్నంతో అనుబంధం.
Avvaru Srinivasa Rao
(అవ్వారు శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, మంగళగిరి,సెల్: 9492080519)