గత వారం రోజులుగా ,రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ,సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో వ్యవసాయ కూలీలకు పేదలకు కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది . ఇప్పటికే కరోనా లాక్- డౌన్ వలన గత మార్చి నెల నుండి సరైన పనులు లేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన వ్యవసాయ పనుల వలన ఉపాధి దొరుకుతుందని ఆశ పడుతున్న వేళ ,వారి ఆశలపై నీరు జల్లుతూ ,భారీ వర్షాలు సామాన్య ప్రజల కుటుంబాలను తలకిందులు చేస్తున్నాయి.
రైతులు దుక్కి దున్ని ఎంతో ఆశతో వ్యవసాయ పనులకు సిద్ధపడుతున్న వేళ ఇప్పుడు పడుతున్న వర్షాల వలన వ్యవసాయాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే వేసిన వరి పత్తి పంటలు నీటి పాలవగా తిరిగి అప్పులు ఎలా తెచ్చుకోవాలి అసలు అప్పు పడుతుందా లేదా చేసిన అప్పులు ఎలా తీర్చాలని రైతాంగం మదన పడుతుంది.
మరీ ముఖ్యంగా గా చత్తీస్గడ్ ,మహారాష్ట్రలలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరి నది వరద ప్రవాహం ఉద్ధృతంగా వచ్చి పడుతుండడంతో, గోదావరి పరివాహక ప్రాంతంలో లోతట్టు గ్రామాలు ముంపుకు గురయ్యాయి.
పైన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షపు నీరు శబరి నది ద్వారా దిగువ ప్రాంతానికి ప్రవహించడం వలన ,తెలంగాణ రాష్ట్రంలోని ని వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని పలు గ్రామాల తో పాటు ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని చాలా గ్రామాలు జలమయమయ్యాయి.
ఈ ప్రాంతమంతా వరదలతో ముంచెత్తి బడింది , ఏపుగా ఎదిగిన వరి పంట, ముంపు గ్రామాల్లో గిరిజనులు సాగు చేస్తున్న పత్తి పంటలన్నీనీట మునిగాయి. పోలవరం ప్రాజెక్టు లోని ముంపు గ్రామాలు లు ప్రతియేటా జూలై ఆగస్టు నెలలో వచ్చే తీవ్ర వరద వలన ముంపుకు గురవుతాయి అని అందరికీ తెలిసిందే.
అదే క్రమంలో ఇప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలోకి వచ్చే ఎనిమిది మండలాలలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విలీన మండలాల్లో అయినా కుక్కునూరు ,వేలేరుపాడు, వరరామచంద్రపురం ,కూనవరం ,ఎటపాక ,చింతూరు మండలము లకు బ్యాక్ వాటర్ తీవ్రత ఎక్కువ అయింది. ఇంకా రా 41వ కాంటూరు పరిధిలో ఉన్న దేవీపట్నం, పోలవరం మండలం లలోని గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ప్రతియేటా,జూలై -ఆగస్టు నెలల్లో ఈ ప్రాంతానికి వరదలువచ్చే అవకాశం ఉందని అధికారులకు తెలియనిదేమీ కాదు. అయినా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో ఎప్పటిలాగానే అలసత్వం కనబర్చారు. వాతావరణ శాఖ రాబోయే భారీ వర్షాల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ అధికారులను అప్రమత్తం చేస్తుంది ఈ విషయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం మినహాయింపు ఏమీ కాదు.
వరద ముప్పు గురించి చి ప్రభుత్వానికి ముందుగా అవగాహన ఉన్నప్పటికీ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది.ఇది పూర్తిగా విధుల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు అర్థమవుతుంది.
గత ఏప్రిల్ నుండి ముంపు గ్రామాలలో లో అధికార యంత్రాంగం త్వరలో 41వ కాంటూరు పరిధిలోనికి వచ్చే గ్రామాల ప్రజలను 17 వేల కుటుంబాలను ఆగస్టు నెల నాటికి పునరావాస కాలనీలకు తరలిస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కానీ ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. దీనికి కారణాలు 1) నిర్వాసితులకు చెల్లించాల్సిన పునరావాస పునరావాస ప్యాకేజీ పూర్తిగా చెల్లించకపోవడం, 2) గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూములకు, చట్టం (గిరిజనులు ఇతర సంప్రదాయ అటవీవాసుల హక్కుల గుర్తింపు చట్టం -2006) ప్రకారం హక్కు పత్రాలు అందివ్వక పోవడం. ఈ పత్రాలను కోరుతూ గతంలో గిరిజనులు చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉండన్నాయి. 3) అదే విధంగా “భూ సేకరణ చట్టం -2013″ప్రకారం పునరావాస కాలనీల్లో కల్పించాల్సిన 25 రకాల మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం.
70 శాతం ప్రాజెక్టు పూర్తి కావచ్చింది అని చెప్తున్నా అధికారులు, పనుల పురోగతి మీద ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చే ప్రజాప్రతినిధులు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు ఆసక్తి కనబరచడం లేదో అర్థం కావడం లేదు.
దీనివలన ప్రభుత్వ చిత్తశుద్ధిపై నిర్వాసితులకు అనేకమైన అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం ఈ ప్రాంత రైతాంగానికి వారిని ఇప్పటికిప్పుడే పునరావాస కాలనీలకు తరలించరనే ఒక బలమైన విశ్వాసం కలిగిస్తుంది.
ఆ క్రమంలోనే రైతాంగం మరల ఈ సీజన్లో కూడా ఎంతో ఆశతో వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. చాలా గ్రామాల్లో వరి, పత్తి పంట పెట్టగా ,ఇప్పుడు అది నీటి పాలు అయ్యింది. ఈ ప్రాంతంలో విస్తారంగా పండించే మిర్చి సాగు కోసం, రైతులు దుక్కులు దున్ని, నాట్లు వేయడానికి మిరపనార్లు సిద్ధం చేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు ముంపుకు గురయ్యాయి.
చిరుజల్లుగా ప్రారంభమై భారీ వర్షాలు గా మారడంతో మొత్తం వ్యవసాయ భూములు వరద నీటితో నిండిపోయాయి. పోలవరం మండలంలోని 19 గిరిజన గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
తెలంగాణ నుంచి విలీనం చేసిన మండలాల్లో కుక్కునూరు మీదుగా బూర్గంపాడు వెళ్లే రోడ్డు పూర్తిగా వరద నీటితో నిండి పోయి రాకపోకలు నిలిచి పోయేలా చేసింది.
గత రెండు రోజులుగా కోట రామచంద్రపురం ఐటీడీఏ అధికారులు స్థానిక పోలవరం నియోజకవర్గ శాసన సభ్యుడు తెల్లం బాలరాజు పర్యవేక్షణలో కుక్కునూరు మండలం నెమలి పేట పునరావాస కాలనీ కి 186 కుటుంబాల వారిని తరలించి వారికి సహాయ చర్యలు అందిస్తున్నారు.
ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇస్తాం అంటున్నారు. అయితే ఈ సహాయం ఏవిధంగా సరిపోతుందని బాధితులు వాపోతున్నారు. సహాయం అనేది ఇండ్లు మునిగిన కుటుంబాలకు మాత్రమే కాకుండా గ్రామాలను యూనిట్గా తీసుకుని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే వేసిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం నుండి విత్తనాలు ,ఎరువులు ఉచితంగా అందించాలని, ప్రతి కుటుంబానికి మూడు నెలలపాటు ఉచిత రేషన్ తో పాటు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే తే.గీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది?
ముంపు గ్రామాల పోలవరం ప్రాజెక్టు కోసం భూములను ప్రభుత్వం సేకరించిన వెంటనే ఆ వివరాలను రెవెన్యూ రికార్డుల్లో పోలవరం ప్రాజెక్టు ముంపు భూములుగా, వర్గీకరణను మార్పు చేసి నమోదు చేశారు. కాబట్టి నష్టపరిహారం లెక్క కట్టాలి అంటే ఏ రైతు ఏ ఏ సర్వే నంబర్లలో సాగు చేస్తున్నారు?ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నాడు ?ఎంత పంట ముంపుకు గురైంది? అనే సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటుందని నమ్మకం లేదు.
ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి వ్యవసాయ పనులు చేయడం దండగ అని అనుకుని గత్యంతరం లేక ఇక్కడ ఉండలేక, ప్రజలు బయటకు వెళ్లడానికి మానసికంగా సిద్ధ పడే విధంగా ప్రభుత్వ యంత్రాంగంతీరు ఉందే మోనని భావించవచ్చు.
వేలేరుపాడు మండలం లోని పేరంటాలపల్లి కాకీస్ నూరు ,టేకుపల్లి, కోయిదా , పూసుమామిడి, అంతా కొండ రెడ్డి గిరిజనులు గోదావరి నడిబొడ్డున దట్టమైన అడవులలో ఉంటారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు, సహాయక చర్యలు అందించడానికి, అధికారులకు గోదావరి లో ప్రయాణం చేయడం సాధ్యమయ్యే పని కాదు.
టేకూరు ,పోలవరం మండలంలో లో సిరివాక, తూటిగుంట, పైడా కుల మామిడి ,సరుగుడు ములగల గూడెం , కోండ్రు కోట మొదలగు, గ్రామాలలో ఎక్కడ చూసినా చిమ్మ చీకటి .కరెంటు లేదు. బయట గ్రామాలతో రాకపోకలు లేవు. ఒకవైపు సీజనల్ జ్వరాలు పీడిస్తుంటే, సరిహద్దు అడవి నుండి ఇళ్లల్లో చేరుతున్న విషసర్పాలు . ఏదైనా అనారోగ్యం వస్తే కనీసం వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లలేని దుస్థితి.
చింతూరు మండలంలో ఒక గిరిజన గర్భిణీ స్త్రీకి నొప్పులు వచ్చి సకాలంలో వైద్యం అందక మృతి చెందినట్లు ఈ వార్తను ఈరోజు టీవీ లో చూడడం జరిగింది. దీనికి బాధ్యులెవరు?
ప్రస్తుతం అధికారులు కూడా సహాయ చర్యలు అందించడానికి గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. సరుకు లేక తినడానికి తిండి లేక గుట్టలపై ఎత్తయిన ప్రదేశంలో తలదాచుకుంటున్న గిరిజనుల బాధలు వర్ణనాతీతం.
చివరికి త్రాగడానికి మంచినీరు లేక కలుషితమైన గోదావరి నీళ్లు తాగుతున్నారు. దీనివలన మరల వారికి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. ఈ సంవత్సరం వరద ఉధృతి ఎక్కువ కావడమే కాకుండా ,దిగువన నిర్మిస్తున్నా “పోలవరం ప్రాజెక్టు డ్యాం “వలన బ్యాక్ వాటర్ పోటెత్తి గిరిజన గ్రామాలు ఎక్కువగా ముంపుకు గురి కావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు .ఇలా జరుగుతుందని అధికారులకు తెలిసి కూడా వారు ఏ విధమైన ముందస్తు చర్యలు చేపట్టకపోవడం పూర్తిగా బాధ్యతారాహిత్యం.
పాలకుల మాటల్లో ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధి కోసమే ప్రాజెక్టులు చేపట్టి నట్లు ప్రతి సందర్భంలో చెబుతుంటారు. ఆ “అభివృద్ధి నమూనా”లో సర్వం త్యాగం చేసే నిర్వాసితులకు దక్కుతున్నది ఏమిటి? బలవుతున్నది దేనికోసం?
ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు, వారి స్పందనలు ఏ విధంగా ఉంటాయి? తల్లిగా భావించిన అడవిని ,నమ్ముకున్న సాగు భూమిని ,పుట్టిపెరిగిన ఊరిని, విడిచి పెడుతున్న తల్లిదండ్రుల స్మశానాల జ్ఞాపకాలను, బంధుమిత్రులను , ఏమని వర్ణించాలి?
ఇంత త్యాగం చేసే వారినీ , ఆదుకోవడం లో ప్రభుత్వాలు ఎందుకు అలసత్వం చూపుతున్నాయి? అర్థం కావడం లేదు. ప్రజా సమస్యలు పట్టవా?ఆదివాసీలు, వారి సంక్షేమం కోసం ఎన్నో చేస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు ఆచరణలో మాత్రం చేసి చూపడం లేదనేది జగమెరిగిన సత్యం. రాజ్యాంగపరంగా గిరిజనులకు రక్షణ గా ఉన్నా చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ,అమలు చేయాల్సిన యంత్రాంగం చిత్తశుద్ధితో వాటిని అమలు చేయకపోతే ,ప్రభుత్వాలు నిలబడతాయి అంటారా! మరల ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగ గలరా! తిరిగి ప్రభుత్వాన్ని నిలబెట్టుకో గలరా! ఆలోచించాలి.
(బాబ్జి, కన్వీనర్, వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ (ఏపీ.వి.వి. యు), ఆంధ్రప్రదేశ్ )