న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2 ట్వీట్ల వెనక ఎంత ధిక్కారం ఉంది?:.గొర్రెపాటి మాధవరావు

(గొర్రెపాటి మాధవరావు)
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న సుప్రీంకోర్టు సీనియర్  న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు లో న్యాయవాది. ఈ నెల 14 న సుప్రీంకోర్టు ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగా తీర్పు చెప్పింది. ఇంతకీ ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన రెండు ట్వీట్లు పోస్టు చేసాడు.ఆ ట్వీట్లే అభ్యంతరకరం అని సుప్రీం కోర్టు నిర్ణయించింది
మొదటి పోస్టు:
“భవిష్యత్ చరిత్రకారులు గత ఆరు సంవత్సరాల కాలంలో దే శంలో , ఎమర్జెన్సీ లేకుండానే, ప్రజాస్వామ్యం ఎలా ధ్వంసం అయిందో పరిశీలించేప్పుడు, ఈ విధ్వంసం లో సుప్రీంకోర్టు పాత్రను, మరీ ముఖ్యంగా గత నలుగురు ప్రధాన న్యాయమూర్తుల పాత్రను ప్రత్యేకించి గమనిస్తారు.”
“When historians in future look back at the last years to see how democracy has been destroyed in India even without formal emergency, they will particularly mark the role of the Supreme Court in this destruction, & more particularly the role of the last 4 CJI.”
ఇది మొదటి ట్వీట్, జూన్ 27 న పోస్టు చేసింది.
ఇక రెండో పోస్టు: దీన్ని జూన్ 29 న పోస్టు చేసాడు.
screen shot via the wire
“భారత ప్రధాన న్యాయమూర్తి బిజెపి నాయకుడికి చెందిన 50 లక్షల రూపాయల విలువ చేసే మోటారు సైకిల్ పై నాగపూర్ లోని రాజభవన్ వద్ద రైడింగ్ చేస్తాడు సుప్రీంకోర్టు ని లాక్డౌన్ ల్ ఉంచి, ప్రజలకు న్యాయం పొందే ప్రాథమిక హక్కును నిరాకరణకు గురిచేసి.”
ఈ రెండు ట్వీట్లనూ కోర్టు పై చీత్కార భావాన్ని కలిగించే ఉద్దేశంతోనూ, న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కించపరిచే ఉద్దేశంతోనూ చేసినట్లుగా తాము నమ్ముతున్నట్లు ముగ్గురు జడ్జీలతో కూడిన ధర్మాసనం భావించింది. ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరం చేశాడని తీర్పు చెప్పింది బెంచ్.
సత్యాన్ని కనుక్కోవడమే కోర్టు అంతిమ లక్ష్యం అని చెబుతూ ఉంటారు. సత్యాన్ని నిర్ధరించాలంటే కోర్టు ఓపికతో పరిశీలన జరపాలి. కోర్టు ధిక్కార నేరంలో ఆరోపణ చేసేదీ కోర్టే. తానే ప్రాసిక్యూటరు, తానే తీర్పరి. అందువల్ల కోర్టు ధిక్కార అధికారాన్ని అతి అరుదుగా మాత్రమే వాడాలి.
పడమటి దేశాలలో, మరీ ముఖ్యంగా ఏ ఇంగ్లాండులో ఈ కోర్టు ధిక్కార భావన పుట్టిందో ఆ ఇంగ్లాండ్ లో కోర్టు ఉత్తర్వులను ఉద్దేశ్య పూరితంగా అమలు చేయకుండా, తీర్పులను ఉల్లంఘించిన ఘటనలకు మాత్రమే కోర్టు ధిక్కార నేరాన్ని పరిమితం చేశారు.
అలా పరిమితం కావడానికి అక్కడ ఏళ్ల తరబడి ప్రజాస్వామిక శక్తులు చేసిన పోరాటం కారణంగా నెలకొన్న ఉన్నత ప్రజాస్వామిక విలువల నేపథ్యం ప్రధాన కారణం కాగా, ఆ ప్రజాస్వామ్య సంస్కృతిలో ఎదిగి వచ్చిన న్యాయమూర్తుల తీర్పులు కూడా దోహదం చేసాయి.ఉదాహరణకు లార్డ్ డెన్నింగ్ ఇచ్చిన ఒక తీర్పు ఒక ఆలోచనా రీతినే ప్రభావితం చేసింది.
ఇండియాలో క్రిమినల్ కోర్టు ధిక్కారం ఇంకా ఎందుకు కొనసాగుతోంది? ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కార నేర నిర్ధారణ సమంజసమేనా కాదా అని తేల్చాలంటే ముందుగా ఈ భావన తలెత్తిన సందర్భాన్ని చూద్దాం.
శాసన,కార్య నిర్వాహక, న్యాయపాలన లు గా అధికార విభజన అనేది ప్రజాస్వామిక భావన. అది ఉనికిలోకి రాక ముందు రాచరిక పాలనలో అన్ని అధికారాలూ రాజు లోనే కేంద్రీకృతమై ఉండేవి. రాజు విమర్శకు అతీతుడు. అందుకే రాజు తప్పు చేయడు (కింగ్ కెన్ డూ నో రాంగ్) అనే భావనను అభివృద్ధి చేశారు. రాజుకి పని భారం ఎక్కువైపోయి తీర్పు చెప్పే పనులను తన కింది అధికారులకు పురమాయించాడు. మన “మర్యాద రామన్న” కథలు దీన్నే పట్టిస్తాయి. అలా జడ్జీలకు అధికారం రాజు నుంచి సంక్రమించింది. రాజు ఎలానైతే విమర్శకు అతీతుడో తాము కూడా విమర్శ కు అతీతులమని జడ్జీలు కూడా భావించడం మొదలెట్టారు. ఫ్యూడల్ భావజాలం అలా జడ్జీల మెడళ్లలో కూడా తిష్ట వేసుకు పోయింది.
విల్మాట్ అనే జడ్జి 1765 లో రాసిన ఓ తీర్పులో కోర్టు ధిక్కారం కింద ఓ వ్యక్తికి శిక్ష విధించడంతో ఇది మొదలైంది అని చెప్పుకోవచ్చు. 1688 లో బ్రిటన్ లో రాచరికం మీద తిరుగుబాటు జరిగినా అది రాజీ తో ముగిసింది. 1789 లో ఫ్రాన్సులో జరిగిన విప్లవమే రాచరికాన్ని తుడిచి పెట్టేసింది కాబట్టి చరిత్రకారులు దాన్నే ప్రజాస్వామిక విప్లవం అంటారు. అప్పటినుంచి అధికార విభజన జరిగినట్లు కనిపించినా అసలు స్పష్టమైన అధికార విభజన ఎలా ఉంటుందో, చర్చికీ ప్రభుత్వానికీ గల సంబంధం మానవ హక్కులకు ఎంత విఘాతం కలిగిస్తోందో, జడ్జీలను కూడా ప్రజలే ఎన్నుకునే పద్దతిని ప్రవేశపెట్టి వారి అధికారం కూడా ప్రజలనుంచే వస్తుందని వారు ప్రజలకు జవాబుదారీ గా ఎందుకు ఉండాలో లోకానికి చాటింది మాత్రం 1871 నాటి పారిస్ కమ్యూనే. ఇక అప్పటినుంచీ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పాలన క్రమంగా యూరప్ లో ఒక్కో దేశంలో నెలకొనడం మొదలైంది.
ఫ్యూడల్ ఇండియా వలస పాలనలో కునారిల్లి కునారిల్లి 1947 లో శృంఖలాలు తెంపుకుని బయట పడినట్లు కనిపించినా, పార్లమెంటరీ పరిపాలనా పద్దతిని రాజ్యాంగ పరంగా నెలకొల్పుకున్నా ఫ్యూడల్ భావజాలం నుంచి ఇప్పటికీ బయట పడలేకున్నది.
న్యాయమూర్తులు ఇంకా తమరిని ‘మి లార్డ్’ అనే సంబోధించాలని కోరుకుంటారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్ డే కూడా ‘యువర్ ఆనర్ ‘ అని సంబోధించిన ఓ న్యాయవాదిని ‘ఏం ఇండియా సుప్రీంకోర్టు లో వాదిస్తున్నావని మర్చిపోయినవా’ అని ఆగస్టు 13, వీడియో అప్పియరెన్స్ లో  అన్నాడని పేపర్లు రిపోర్టు చేసినై.

 

ఈ కోర్టు ధిక్కారానికి శిక్ష అనుభవించిన మొదటి ప్రముఖ వ్యక్తి కమ్యూనిస్టు నేత ఇ ఎం ఎస్ నంబూద్రిపాద్, కేరళ ముఖ్యమంత్రి. సుప్రీంకోర్టు కోర్టు దాకా పోయింది కేసు (EMS Sankaran Namboodripad Vs T Narayana Nambiar 1970) కోర్టులు కలిమి కలిగిన వారికి అనుకూలంగా పని చేస్తాయి అని అన్నాడట. ఏ జడ్జీని ఉద్దేశించీ అనలేదు. ఓ సార్వత్రిక సూత్రం వల్లె వేసాడు. అంతే.. అదే తప్పయి పోయింది. కేరళ హైకోర్టు వెయ్యి రూపాయల ఫైను కట్టమనింది. సుప్రీంకోర్టు దాన్ని 50 రూపాయలకు కుదించింది.ఈ కేసులు సుప్రీంకోర్టు
“an attack upon judges…which is calculated to raise in the minds of the people of general dissatisfaction with, and distrust of all judicial decisions…weakens the authority of law and law of courts”. అని నంబూద్రిపాద్ ను తప్పు పట్టింది.
నంబూద్రిపాద్ పుణ్యమా అని తాను మార్క్సిస్టు మూల గ్రంథాలను చదివామని సుప్రీంకోర్టు తీర్పు వ్రాసిన ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా చెప్పుకున్నట్ల తన “మార్క్స్, లా అండ్ జస్టిస్” పుస్తకం మొదటి ఖండికలో ఉపేంద్ర బక్షీ అంటాడు గానీ అది నిజం అనిపించదు.
గమ్మత్తు ….ఆర్టికల్ 19 (ప్రాథమిక హక్కులు) కీ ఆర్టికల్ 21 (జీవించే+ వ్యక్తి స్వేచ్ఛ) కీ అంతఃసంబంధం ఉందని ఆ సంబంధం తెగగొడితే ప్రాథమిక స్వేచ్చలు నిరర్థక మై పోతాయనే మౌలిక పాయింటును లేవనెత్తిన ఏ.కె గోపాలన్ కూడా కేరళ కమ్యూనిస్టు నేతనే. ఆనాడు ఆ వాదనను తోసిపుచ్చినా చివరికి సుప్రీంకోర్టు ఆ వాదనే కరెక్టు అని అంగీకరించాల్సి వచ్చింది.
డెన్నింగ్ గొప్ప ఖ్యాతి గడించిన న్యాయమూర్తి. ఇంగ్లాండ్ లో జడ్జి. 1968 లో ఆయన ఇచ్చిన ఓ తీర్పులో ఏమన్నాడంటే ” మేం మా డిగ్నిటీ ని నిలబెట్టుకోవడానికి ఈ కోర్టు ధిక్కార అధికారాన్ని వాడుకోము అని తెగేసి చెబుతున్నా. మాకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మీద కూడా ఈ అధికారాన్ని వాడం. మేం విమర్శకు భయపడం. విమర్శను మేం నిరసించం కూడా. ఎందుకంటే దానికన్నా చాల విలువైన దానికి విఘాతం కలుగుతుంది. అదేమిటంటే….భావ ప్రకటనా స్వేచ్ఛ.” ( అంటే భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కోర్టు ధిక్కార నేరం కన్నా చాలా విలువైనది అనడం. మరో మాటలో చెప్పాలంటే కోర్టు ధిక్కారం ని భావవ్యక్తీకరణ స్వేచ్ఛ తో పోల్చితే కోర్టు ధిక్కారం అల్పమైంది అనడం).

“Let me say at once that we will never use this jurisdiction to uphold our own dignity. That must rest on our sure foundations. Nor will we use it to suppress those who speak against us. We do not fear criticism, nor do we resent it. For there is something far more important at stake. It is no less than freedom of speech itself…  All that we ask is that those who criticize us should remember that, form the nature of duties, we cannot reply to their criticism. We cannot enter into public controversy. We must rely on our conduct itself to be its own vindication.(R.Vs. Commr. Of Police(1968)2 QB 150)

అంతకన్నా నాలుగేళ్ల ముందే , 1964 లోనే గజేంద్ర గడ్కర్ నేతృత్వం లోని ఓ ధర్మాసనం విమర్శకు భయపడకూడదని ” తీర్పు లోని నాణ్యత తో, నిర్భీతి నిజాయితీలతో కూడిన వ్యవహార శైలితో , వస్తుగత పరిశీలనా పద్దతితో విమర్శకు జవాబు చెప్పాలి గానీ కోర్టు దగిక్కార అధికారాన్ని ఉపయోగించుకొని కాదు” అనింది.
ఈ తీర్పు సారాన్ని నంబూద్రిపాద్ కేసులో హిదాయతుల్లా పట్టించుకోలేదు కదా అంటే ఇంకా పైకి పోతే పట్టించుకునే వారేమో కానీ ఆ పైన మరోటి లేదుకదా! అందుకే సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అంటే దానిలో తప్పులు ఉండవని కాదు ఆ పైన మరోటి లేదు కాబట్టి అది అంతిమం!!!
నంబూద్రిపాద్ కేసు ను నిర్ణయించే నాటికి కోర్టు ధిక్కరణ కు సబంధించి ప్రత్యేక చట్టం లేదు. ఆ చట్టం 1971 లో తయారైంది.మరి ఎలా శిక్షించారు అనే సందేహం రావొచ్చు. రాజ్యాంగం లోని 129 వ ఆర్టికల్ సుప్రీంకోర్టు కు,215 వ ఆర్టికల్ హై కోర్టులకు కోర్టు ధిక్కార నేరానికి శిక్షించే అధికారాన్ని కట్టబెట్టాయి.
ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ పై మోపిన ఆరోపణల్లోని పటుత్వాన్ని పరిశీలిద్దాం.
గత ఆరు సంవత్సరాలలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యిందా? పరిఢవిల్లిందా? ప్రజాస్వాఁమ్యానికి పట్టుగొమ్మ ‘అసమ్మతిని గౌరవించడం’.  అధికార గణానికి వ్యతిరేకంగా రాస్తున్నదనేగా గౌరీ లంకేశ్ ని చంపించింది. గొడ్డు మాంసం తిన్నందుకు చంపింది ఎవరు? తిండిని ఎంచుకునే హక్కు సయితం లేని ప్రజాస్వామ్యమా ఇది? కశ్మీర్ లో లాక్డౌన్ ప్రకటించి, ఇంటర్ నెట్ ని బందు చేసి లక్షల మంది విద్యార్థులను చదువులకు దూరం చేయడం ఏం ప్రజాస్వామ్యం? కశ్మీర్ లో ఇద్దరు మాజీ ముఖ్య మంత్రులతో సహా నిర్బంధిస్తే వారి విడుదలకై వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లను విచారించకుండా నెలల తరబడి వాయిదాలు వెయ్యడం ఏ ప్రజాస్వామ్య సంస్కృతి? దాదాపు పదివేలమంది కశ్మీరీలను దేశంలోని వివిధ జైళ్లలో నిర్బంధించి ఉంచారు. ఎవరిని ఏ జైలులో మూసి పెట్టి ఉంచారో కూడా కుటుంబ సభ్యులకు తెలీదు. వారి ఆచూకీ ఏమైందో చెప్పండి ప్రభో అని వారి అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, సతీమణులు సుప్రీంకోర్టు వచ్చి మొర పెట్టుకుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి పోవడం ఏ ఘనమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం? కాశ్మీరీల మనసుల్లో భారత రాజ్యాంగ వ్యవస్థల మీద ఎలా నమ్మకం కలిగించడం? వారికి కలిగించడం తర్వాతి సంగతి. ముందు మన రాజ్యాంగ విలువలపై మనకు నమ్మకం ఉందా? ఎదుటి వాడి అభిప్రాయాన్ని బట్టి మన నమ్మకాలు, మన విలువలూ అమలు చేస్తామా? లేక మన విలువలంటే మనకే విలువ లేకుండా పోయిందా ?
సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్ కేసులను ఎంత త్వరగా పరిష్కరించాలో అంత త్వరగా పరిష్కరించి ఉంటే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొనేది కాదా?
సుప్రీంకోర్టు చర్యలు దేశంలో అప్రజాస్వామిక పాలన, సంస్కృతి నెలకొల్పడానికి పాలకులకు దన్ను ఇవ్వడం లేదా? సుప్రీంకోర్టు అలా సంకల్పించక పోవచ్చు. కానీ పర్యవసానం? ఎమర్జెన్సీ లో హెబియస్ కార్పస్ కేసులను గంప గుత్తగా కొట్టేయలేదా….. జీవించే హక్కుతో సహా అన్ని హక్కులూ హుళక్కి అయిపోతాయని వ్యాఖ్యనించలేదా?
భవిష్యత్ లో మళ్లీ ఎమర్జెన్సీ పెట్టడానికి అంత తేలిగ్గా సాధ్యం కాని పరిస్థితిని కల్పించడం కోసమే గదా 44 వ రాజ్యాంగ సవరణ ను తీసుకొచ్చింది. ఇప్పుడు లాంచనప్రాయమైన ఎమర్జెన్సీ లేకుండానే కశ్మీరీల హెబియస్ కార్పస్ పిటీషన్లను ఎందుకు విచారించడం లేదు? ఇప్పుడు చెప్పండి.ప్రశాంత్ భూషణ్ అన్నదానిలో న్యాయ వ్యవస్థని కించ పరిచే ఉద్దేశం ఎక్కడుందో? ప్రశాంత్ భూషణ్ ది ఆవేదన. ఇందులో అపహాస్యం ఎక్కడుంది? ఆవేదనకీ అపహాస్యానికీ అంతరం తెలవాలి కదా.
ఏ న్యాయ ప్రక్రియా సంస్కృతి?
నాలుగు గంటల నోటీసుతో అనాలోచిత లాక్డౌన్ ను ప్రధాని ప్రకటిస్తే వలస కార్మికుల వెతలు లోకానికంతా కనిపించినా, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే ఎవరు నడిచి వెళ్ళమన్నారు వారిని, మేం కేసును వినం అని బాధ్యతా రహితంగా సుప్రీంకోర్టు పక్కకు పెట్టెస్తే 150 మంది సుప్రీం కోర్టు లాయర్లు లేఖ రాసిన తర్వాత కదా కోర్టు ఆ వ్యాజ్యాన్ని పరిశీలించి తగిన ఆదేశాలను ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వ చర్య అప్రజాస్వామికం. కేసును విచారణకు తీసుకోవడానికి నిరాకరించడమూ అప్రాజాస్వామి కమే కదా.
ఎస్ సి ఎస్ టి అత్యాచార నిరోధక చట్టంను నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు బెంచ్ చెప్పిన తీర్పు అప్రజాస్వామికం కాదా? దాన్ని సరిచేయడానికి చట్టానికి సవరణలు చేయాల్సి వచ్చింది కదా. దళిత యువకులు పోలీసు కాల్పుల్లో మరణించాల్సి వచ్చింది కదా? ఆ బెంచికి కూడా అరుణ్ మిశ్రానే నేతృత్వం వహించడం కాకతాళీయమే కావచ్చును లెండి.
ప్రజాస్వామ్యం ధ్వంసం కావడంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలూ తమ దోహదం తాము చేశాయి.
అమాటే ప్రశాంత్ భూషణ్ అంటే ఆయన మాట పచ్చి అబద్ధం అని సుప్రీంకోర్టు ఆయన మాటలను కొట్టి పడేసి ఆయన్నే నెరస్థుడ్ని చేసింది.
ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేయగానే ఒక రాష్ట్ర గవర్నర్ అవుతాడు! మరొకతను రాజ్య సభ సభ్యుడు అవుతాడు!! ఎందుకో అంత అవ్యాజ ప్రేమ అలాంటి న్యాయమూర్తులపైన?
ఇది స్వచ్ఛ ప్రజాస్వామ్యమా? కుమ్మక్కు ప్రజాస్వామ్యమా?క్విడ్ ప్రో కో కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే పరిమితమా? సుప్రీంకోర్టు కోర్టులో న్యాయ ప్రక్రియ బ్రష్టు పట్టిందని నలుగురు న్యాయ మూర్తులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతోందనే కదా దాని అర్థం!
ఇక రెండో ట్వీట్:
లాక్ డౌన్ పీరియడ్లో మాస్క్ కట్టుకోమని ప్రభుత్వం మార్గదర్శకాలను ఇచ్చిందా లేదా. అది లా(Law) తో సమానం. హెల్మెట్ పెట్టుకోవడం మోటారు వాహనాల చట్టం ప్రకారం విధి. ఈ నియమాలను భారత ప్రధాన న్యాయమూర్తి ఉల్లంఘించాడా లేదా? బిజెపి నాయకుడి మోటారు సైకిలు పై ఎక్కడం ఏమిటి
అసలు? సుప్రీం కోర్టు దీనిలో నిజానిజా లతో తనకు సంబంధం లేదు అనేసింది!
లాక్డౌన్ వల్ల మొత్తం కోర్టు నడుస్తోందా? ముగ్గురితో కోర్టు నడిస్తే మొత్తం సుప్రీం కోర్టు నడిచినట్లా? మొత్తం కోర్టు నడిస్తే పరిష్కారం అయ్యే కేసులు ఎన్ని? మొత్తం కోర్టులు నడిస్తే పరిష్కారమయ్యే కేసులు ఎన్ని? న్యాయవాదులందరికీ వర్చ్యల్ హియరింగు అవకాశం లేకపోవడంతో కేసులన్నీ పెద్ద పెద్ద లా ఫార్ములూ, అన్ని సాధన సంపత్తులూ ఉన్న లాయర్లే కొట్టుకు పోతున్నారనీ, అలాకోర్టు ఖర్చులు విపరీతంగా పెరిగి పోయి సామాన్యుడికి న్యాయం అందడం లేదనికొందరు సుప్రీంకోర్టు లాయర్లే మొత్తుకున్నది నిజమే కాదా? బార్ కౌన్సిల్ కూడా ఫిజికల్ కోర్టులను ప్రారంభించాలని సుప్రీంకోర్టు ను కోరింది ఈ కారణంగానే కదా? ఉదాహరణకి 2019 ఏప్రిల్ లో 14వేలకు పైగా కేసులు లిస్టింగ్ అయితే 2020 ఏప్రిల్ లో లిస్టు అయిన కేసులు 14 వందలు సంఖ్య చేరుకోలే!! కోర్టు లాక్డౌన్ వల్లనే కదా ఇది జరిగింది.
ప్రశాంత్ భూషణ్ కూడా కొన్ని కేసులలో వర్చ్యుయల్ హియరింగుకు హాజరు అయ్యాడు అని సుప్రీం కోర్టు అంటున్నది. అంత మాత్రాన ఆయన ఆవేదనలో నిజం మాయమై పోదుకదా.
అయినా ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని ఏమీ అనలేదే. ఏ కోర్టు తీర్పునూ ఎగతాళి చేయలేదే?ఏ తీర్పునూ అగౌరవ పర్చలేదే? కోర్టుని ఎద్దేశించి ఏమీ అనలేదే? విడి న్యాయమూర్తిని ఏమైనా అంటే అది కోర్టును అన్నట్లా? సుప్రీం న్యాయ దేవత అంత మట్టికాళ్ల పై నిలబడిందా ఒక్క మాట అంటేనే కూలిపోవడానికో ఈ వానల్లో కరిగి పోవడానికో?
సుప్రీంకోర్టు కు న్యాయపాలనా ధికారాలు వచ్చింది రాజ్యాంగం కింద. రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 (1) (a) కింద ప్రజలు తమకు రిజర్వు చేరుకున్నది తమ హక్కును. ఆర్టికల్ 129 కింద సుప్రీంకోర్టు కోర్టుకు అధికారాన్ని ఇచ్చింది ప్రజలు.ప్రజలకు అన్ని రాజ్యాంగ సంస్థలూ, సమస్త ప్రభుత్వ యంత్రాగమూ సేవకులు. ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలమైన మాకు మేమే ఇచ్చుకున్నాం. ప్రజల హక్కులకన్నా , పాలనాధికారాలు గొప్పవి కావు.
లాక్డౌన్ పీరియడ్లో ఇలాంటి కేసులను పరిష్కరించడం సుసంప్రదాయం కాదు. ఫిజికల్ హియరింగు లో సంపూర్ణ వాదనలను కోర్టు వినాలి. అప్పటివరకూ శిక్షను ప్రకటించకుండా ఆపేయాలి. అలా సుప్రీంకోర్టు తన స్థితప్రజ్ఞతను, ఔన్నత్యాన్ని చాటుకోవాలి.
(గొర్రెపాటి మాధవరావు, న్యాయవాది,మానవ హక్కుల వేదిక
తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు)