(CS Saleem Basha)
నేను నా జీవితంలో నుంచే ఒక సంఘటన చెప్తాను. మేము ఐదు మంది ఫ్రెండ్స్ కలిసి ఇన్నోవా కార్లో ఊటీ ట్రిప్ కి వెళ్ళాం. కర్నూల్ నుంచి ఉదయం 6 గంటలకు ప్రయాణం మొదలు పెట్టాము. 7:30 ప్రాంతంలో ఒక ధాబ కనబడింది, అక్కడ దిగి వేడివేడి టీ తాగాం. మా ఫ్రెండు ఒకతను కార్ దిగలేదు. దిగమని అడిగితే ఇక్కడ ఏంటబ్బా ఊటీ కి పోయినాక ఎంజాయ్ చేస్తాను అన్నాడు.
మధ్యలో ఒక చోట వేడి వేడి దోశలు తిన్నాం. తర్వాత మధ్యలో ఒక చోట తాటి ముంజలు ఒల్చుకొని తిన్నాము. అయితే ఆ ఫ్రెండ్ దిగలేదు. ఎప్పుడు తినే తాటి ముంజలు కదా ఊటీ లో ఏవైనా కొత్త రకమైన దొరికితే తిందాం అని దిగలేదు. అనంతపురంలో భోజనం చేశాం., అక్కడ మాత్రం అతను దిగాడు, మళ్లీ అనంతపూర్ నుంచి బెంగళూరు వరకు ఇదే తంతు, మేము అక్కడక్కడ దిగడం అతను దిగకపోవడం.
బెంగళూరులో రాత్రి స్టే చేశాము. బయటికెళ్ళి అలా తిరుగుదాం అంటే నేను రూమ్ లోనే ఉంటాను, మీరు వెళ్ళి రండి అన్నాడు. సరే మేము అలా తిరిగి తిరిగి భోజనం కూడా బయట చేసి హోటల్ హోటల్ కి వచ్చేశాము. మళ్లీ తెల్లారగానే ప్రయాణం మొదలు పెట్టాము, మధ్యలో కొబ్బరి నీళ్లు తాగడం, బజ్జీలు తినడం , మధ్యలో నీళ్లు కనిపిస్తే దిగడం, అక్కడ అక్కడ ఫోటోలు తీసుకోవడం, ఐస్ క్రీం తినడం ఇలాంటి ఎన్నో పనులు చేశాం. అతను చాలా సార్లు కిందికే దిగలేదు కారులో నుంచి. మధ్యలో శ్రీరంగపట్నం, టిప్పు సుల్తాన్ సమాధి దగ్గర కారు ఆపిదిగడం ఫోటోలు తీసుకోవడం. మా ఫ్రెండ్ మాత్రం మామూలే. రాత్రికి ఊటీ చేరుకున్నాం. మేము ఊటీ లో ఒక్కరోజు మాత్రమే ఉండాలి అనుకున్నాం. మా ఫ్రెండు ఊటీ కి ఫస్ట్ టైం వచ్చాడు, మేము ఇదివరకే చూశాం, రాత్రి ఊటీ కి చేరుకున్న
తర్వాత ఒక పిడుగు లాంటి వార్త. మరుసటి రోజు ఊటీ బంద్! దాంతో మేము ఊటీ లో పెద్దగా ఏం చూడలేకపోయాం. 12:00 కి బయలుదేరి బెంగళూరు చేరుకోవాల్సి వచ్చింది, మేము మళ్ళీ అక్కడి నుంచి శ్రావణ బెళగొళ, హలేబీడు, బేలూరు మఠం వంటి ప్రదేశాలు చూస్తూ చివరికి కర్నూల్ చేరుకున్నాం. మా ఫ్రెండు బాగా డిసప్పాయింట్ అయ్యాడు. మేం పెద్దగా ఫీల్ కాలేదు. మా ఫ్రెండ్ అద్భుతమైన బేలూరు మఠం దగ్గర కూడా ఏమి ఎంజాయ్ చేయలేక పోయాడు. పదే పదే ఊటీ చూడలేకపోయాను అన్న విషయమే ఫీల్ అవుతూ వచ్చాడు .
జీవితంలో చాలామంది మా ఫ్రెండ్ మాదిరే ఉంటారు. సంతోషం అంటే ఒక గమ్యం కాదు , ప్రయాణం. మా ఫ్రెండు గమ్యాన్ని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. మేము ప్రయాణం తో పాటు గమ్యాన్ని కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాం. అందుకే గమ్యం అనేది మాకు బోనస్ మాత్రమే. ఈ ప్రపంచంలో చాలామంది ఇదే తరహాలో ఉంటారు కాబట్టి సంతోషంగా ఉండటం అనేది చాలా కష్టం.
మామూలుగా క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ప్రతి షాట్ ని, ప్రతి బౌండరీ ని, ప్రతి ఆరు ని, ప్రతి క్యాచ్ ని, ప్రతి వికెట్ ని ఎంజాయ్ చేస్తాం. అయితే చాలామంది ఇండియా గెలుస్తుందా లేదా అన్న టెన్షన్ తో నే ఉంటారు. గెలిస్తే సంబరాలు చేసుకుంటారు, పటాసులు కాలుస్తారు, స్వీట్లు పంచుతారు. మనదేశం ఓడిపోతే చాలా ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మనదేశం గెలవాలి. ఒక్క క్షణం ఆలోచిస్తే అది ఎంత అర్థరహితమైన విషయం అర్థమవుతుంది. సెహ్వాగ్ లాంటి వాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయకుండా, చాలామంది 50 పరుగులు ఎంత సేపట్లో చేస్తాడు, సెంచరీ కొడతాడా లేదా అన్న యాంగిల్ లోని మ్యాచ్ ను చూస్తారు. జీవితం కూడా అంతే. పదో తరగతి లో ఫస్ట్ క్లాస్ కోసం ఎదురు చూడడం, ఇంటర్లో అంతే, ఎంసెట్లో ర్యాంకు, మంచి ఇంజనీరింగ్ లేదా మెడికల్ కాలేజీలో సీటు కోసం ఎదురు చూడడం, తర్వాత ఇంజనీరింగ్ లో మంచి మార్కులు, క్యాంపస్ సెలక్షన్, మంచి జాబ్, పెళ్లి, పిల్లలు, డబ్బు సంపాదించడం, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, ఆ పిల్లలు కూడా ఇదే సర్కిల్ ని ఫాలో కావడం! అంటే ఒక డెస్టినేషన్ మాత్రమే ఎంజాయ్ చేయడం. పోనీ డెస్టినేషన్ చేరిన తర్వాత అయినా ఎంజాయ్ చేస్తారా అంటే, మళ్లీ ఇంకో గమ్యం రెడీగా ఉంటుంది. ఈ మొత్తం సర్కిల్లో ఎంజాయ్ మెంట్, సంతోషం ఎక్కడుంది?
నేను ఇంజనీరింగ్ కాలేజీలో పని చేసేటప్పుడు గమనించిన విషయం ఏంటంటే. దాదాపు 70 శాతం మంది పిల్లలు ఇంజినీరింగ్ ని ఎంజాయ్ చేయరు. ఫస్ట్ ఇయర్ మార్కులు, సెకండ్ ఇయర్ మార్కులు.. ఇలా ఫైనలియర్లో క్యాంపస్ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తారు.
చాలామంది ఉద్యోగస్తులు ఇరవై తొమ్మిది రోజులు కష్టపడి పని చేస్తారు, 30 వ రోజు కోసం! ఆ రోజు జీతం వస్తుంది! ఆ రోజు కొంచెం సంతోషంగా ఉంటారు.. ఒక్క రోజు కోసం ఇరవై తొమ్మిది రోజులు కష్టంగా, కోపంగా, చికాగ్గా, విసుగ్గా పని చేస్తారు.(అందరూ కాదనుకోండి). అలాంటివాళ్లు ఒకరోజు సంతోషంగా ఉంటారు. వాళ్లు 30 సంవత్సరాలు ఉద్యోగం చేశారు అనుకుంటే 30× 365= 10,950 రోజుల్లో 360 రోజులు మాత్రమే సంతో షంగా ఉంటారు. అంటే 10650 రోజులు వృధానే కదా?( ఇది కేవలం ఒక ఉదహరణ కోసమే. ఎక్కువ రోజులు సంతోషంగా ఉండరని చెప్పటం నా ఉద్దేశ్యం. మళ్ళీ అందరూ కూడా కాదు).
చాలా మంది ఫలితం కోసం(గమ్యం) పని చేస్తారు. ఫలితం రాకపోతే(అనుకున్న విధంగా) నిరాశ పడతారు, వస్తే సంతోషంగా ఉంటారు. పరీక్షల కోసం చదవటం, పరీక్ష రాయటం ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? అలాగే ఆటల్లో గెలిస్తేనే సంతోషం, ఓడిపోతే సంతోషం ఉండదు.
ఆటను ఎంజాయ్ చేసే వాళ్ళకి గెలిచినా, ఓడినా ఒక్కటే. గెలిస్తే బోనస్,ఓడిపొతే అల్రెడీ ఆటను ఎంజాయ్ చేసి ఉంటారు కదా?
జీవితం ఒక ప్రయాణం, దాన్ని ఎంజాయ్ చేయాలి, గమ్యం(లేదా గమ్యాలు) మాత్రమే ఎంజాయ్ చేస్తే ఎలా?
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటారు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాస్తుంటారు. ఫోన్: 9393737937)