(CS Saleem Basha)
అసలు సంతోషం అంటే ఏమిటి? ఇది చాలా కాలం నుంచి అందరిని వేధిస్తున్న ప్రశ్న. అసలు మనిషికి సంతోషం ఎలా కలుగుతుంది? దీని మీద కూడా చాలా కాలం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.
ఒక రాజు గారికి ఏదో తెలియని వ్యాధి వచ్చింది. ఏం చేసినా వ్యాధి తగ్గడం లేదు. చివరికి రాజ వైద్యుడు వచ్చి” మహారాజా ఈ వ్యాధి తగ్గడానికి ఒకటే మార్గం ఉంది. ఎవరైతే నీ రాజ్యంలో సంతోషంగా ఉంటాడో వాడి చొక్కా(అంగీ) ఒకరోజు తోడుక్కుంటే నీకు నయమయ్యే అవకాశం ఉంది.” అని సెలవిచ్చాడు. రాజుగారు తలుచుకుంటే కొదవేముంది. ఒక నూరు మంది సైనికులు రాజ్యంలో ఎవరు సంతోషం గా ఉన్నాడో వాడిని పట్టుకోవడానికి బయలుదేరారు. అలా కొంచెం దూరం వెళ్ళగా ఒకడు చెట్టు కింద కూర్చుని హుషారుగా పాటలు పాడుకుంటున్నాడు. ” ఒరేయ్ నీ పేరు ఏంటి?” అని అడిగారు. దానికి వాడు ” చెట్టు కింద మల్లయ్య” అన్నాడు. ” మా రాజు గారి కి నీ చొక్కా ఇస్తావా. ఒకరోజు తొడుక్కుని మళ్లీ నీకు ఇస్తారు”, అంటే వాడు ” భలే వాళ్ళ అయ్యా మీరు, నాకు ఉన్నది ఒకటే చొక్కా. ఇది ఇస్తే నేను బాధ పడతాను” అన్నాడు.
అప్పుడు వాళ్ళు వీడు సంతోషంగా లేడు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తరువాత ఇంకొకడు కూడా నవ్వుకుంటూ పని చేసుకుంటున్నాడు. వాణ్ణి ఇవ్వమని అడిగారు. వాడు అదే సమాధానం చెప్పాడు. అలా సాయంత్రం వరకు తిరిగి తిరిగి అలసి పోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు అదే దారిలో వెళ్తున్న ఒక ముసలాయన వాళ్ళు ఎందుకు అలా కూర్చున్నారు అని అడిగితే, వాళ్లు రాజు గారి వ్యాధి గురించి చెప్పారు. అప్పుడా ముసలాయన ” ఆ పొలంలో ఉన్న కంచె మీద ఒకడున్నాడు. వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు వాడిని అడగండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు వాళ్ళ కంచె దగ్గరికి వెళ్లి ” ఒరేయ్ నీ పేరు ఏంటి?” అని అడిగారు. దానికి వాడు, ” పేరుతో ఏం పని మీకేం కావాలో చెప్పండి” అన్నాడు. వాళ్లు అందరిలాగే వాణ్ణి అడిగారు చొక్కా ఇమ్మని. దానికి వాడు ” ఓస్ ఇంతేనా? చొక్కాయే కదా. తీసుకెళ్లండి” అని అన్నాడు. వాడిని కిందికి దిగమని అడిగారు. వాడు కిందికి దిగాడు. వాడి ఒంటి మీద చొక్కాయే లేదు!
సంతోషంగా ఉండాలంటే అసలు చొక్కా ఉండాల్సిన అవసరం లేదు. ( John Hay రాసిన “The Enchanted Shirt” అన్న చక్కటి, అర్థవంతమైన Poem సారాంశం ఇది). అసలు సంతోషంగా ఉండాలంటే ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేము. ఏమీ లేకున్నా సంతోషంగా ఉండొచ్చు. ఇదే “సంతోషం” యొక్క రహస్యం!
“ 99” క్లబ్ లో చేరితే సంతోషంగా ఉండలేరు. 99 క్లబ్ అంటే ఏంటి?
దీనికి ఒక చిన్న కథ ఉంది . ఒకానొక రాజ్యంలో రాజు మంత్రి మారువేషంలో తిరిగి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ ఉంటారు ఆ రాజ్యంలో దాదాపు (రాజుతో సహా) ఎవరూ సంతోషంగా ఉండరు. అలా ఒక రోజు రాత్రి మారువేషంలో రాజు మంత్రి తిరుగుతుండగా ఒక ఇంట్లో నుంచి నవ్వుతూ, ఉల్లాసంగా, సంతోషంగా ఉన్న భార్యాభర్తలు కనిపిస్తారు అప్పుడు రాజు ఆశ్చర్యంగా “ఏమిటి మంత్రివర్యా ఇద్దరు సంతోషంగా ఉన్నారు? ఏమిటి దీనికి కారణం?’ అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి నవ్వి, “ ఏమీ లేదు రాజా వాళ్ళు 99 క్లబ్ లో చేరడం లేదు అందుకే సంతోషంగా ఉన్నారు” అంటాడు. “ 99 క్లబ్ అంటే ఏమిటి? ” అని రాజు అడిగితే, రేపు చెప్తాను లెండి అంటాడు మంత్రి.
మర్నాడు ఉదయమే మంత్రి రాజు గారిని అడిగి 99 బంగారు నాణేలు తీసుకొని ఒక సంచిలో వేసి గట్టిగా మూట కడతాడు. “ఎందుకు?” అని ఆశ్చర్యంగా మహారాజు అడిగితే. “రాత్రి మీకే తెలుస్తుంది”. అని చెప్తాడు. మళ్లీ రాత్రి ఇద్దరు కలిసి ఆ ఇంటికి వెళ్తారు. మంత్రి తన దగ్గరున్న 99 నాణేల మూట ఆ ఇంటి ముందు పడేస్తాడు. రాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే “ రాజా ఒక నెల తర్వాత మళ్ళీ వద్దాం అప్పుడు తెలుస్తుంది మీకు 99 క్లబ్ అంటే ఏంటో” అంటాడు.
ఒక నెల తర్వాత రాజు మంత్రి తో కలిసి మళ్లీ సంతోషంగా ఉన్నా ఆ దంపతుల ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంట్లో నుంచి అప్పుడు గట్టిగా అరుపులూ , కేకలు వినబడతాయి. భర్త భార్యను తిడుతూ ఉంటాడు. ఆమె కూడా కోపంతో ఏదో జవాబిస్తూ ఉంటుంది. రాజు ఆశ్చర్యపోతాడు, ఒక నెల క్రితం ఎంతో సంతోషంగా ఉన్న ఆ భార్య ,భర్తలు ఇప్పుడు కోపంతో గొడవ పడుతున్నారు, “దీనికి కారణం ఏంటి?” అని అడుగుతాడు, మంత్రి నవ్వి “దానికి కారణం వాళ్ళు 99 క్లబ్ లో చేరడమే మహారాజా” అని చెప్తాడు. రాజు “నాకు అర్థం కాలేదు వివరంగా చెప్పు” అని అడిగితే, మంత్రి ఇలా చెప్తాడు, “నెల క్రితం మనం 99 బంగారు నాణేలు వాళ్ళ ఇంటి ముందు పడేశాము, మీ గుర్తుంది కదా? నేను భార్య,భర్తలను గమనించమని మన వేగులకు చెప్పాను. ఉదయాన్నే భర్త బంగారు నాణేల మూట చూశాడు. ఎవరో పడేసి పోయారు పాపమని సాయంత్రం వరకు ఎదురు. చూశాడు. అలా చూసి,ఛూసి నాలుగు రోజుల తర్వాత మూట విప్పి చూశాడు. అందులో ఉన్నా బంగారు నాణేలు చూసి ఆనందపడి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాడు. 99 ఉన్నాయని తెలిసి, బయట, చుట్టుపక్కల వెతికాడు.ఒక్క నాణేం దొరికేతే బావుణ్ణు అని ఎంతో వెతికి, నిరాశ పడ్డాడు. ఎలాగైనా అ ఒక్క నాణెం సంపాయించి 100 బంగారు నాణేలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నించి తిండీ తిప్పలు మానేసి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భార్యాభర్తలు అదనంగా పనిచేయటం మొదలు పెట్టారు. అసలే 99 ని 100 చెయ్యాలనుకుంటే, కొడుకు ఒక బంగారు నాణెం తిసుకెళ్ళీ ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ 98 ని 99 చెయ్యాలి కదా అని భార్య, కొడుకుతో గొడవ పడుతున్నాడు!!”
ఈ ప్రపంచంలో చాలామంది 99 క్లబ్ సభ్యులు. 99 క్లబ్ లో ప్రవేశం ఉచితమే, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చేరింతర్వాత కూడా అనారోగ్యం, అసంతృప్తి, అశాంతి,దుఖ్ఖం, కోపం వంటివన్నీ ఉచితంగానే వస్తాయి.
ఉన్నదాంతో తృప్తి పడితే, 99 క్లబ్ లో చేరవలసిన అవసరం ఉండదు. సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే తృప్తికి అంతుంది, అసంతృప్తికి అంతులేదు.
Satisfaction is limited but gives unlimited happiness; dissatisfaction is unlimited but gives unlimited unhappiness!
బౌద్ధానికి, సంతోషానికి సంబంధం ఉందా? మరోసారి తెలుసుకుందాం…
(CS Saleem Basha వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)
(Featured Image by Kiran Hania from Pixabay