(CS Saleem Basha)
నెగిటివ్, పాజిటివ్, ఒకే నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి
ఒక గ్లాసులో సగం వరకే నీళ్లు ఉన్నాయి. “గ్లాసు సగం ఖాళీ ఉంది” అని కొంతమంది ఆలోచిస్తే మరికొంతమంది ” గ్లాసులో సగం వరకు నీళ్లు ఉన్నాయి” అంటారు. మొదటి అభిప్రాయం నెగిటివిటీ ని సూచిస్తే, రెండో అభిప్రాయం పాజిటివ్ థింకింగ్ ని సూచిస్తుంది. అంతే తేడా!
“Winners don’t do different things, they do things differently” అంటాడు శివ్ ఖేర తన “You Can Win” అన్న పుస్తకంలో. సింపుల్ గా చెప్పాలంటే ” విజేతలు భిన్నమైన పనులు చేయరు; పనులను భిన్నంగా చేస్తారు” . పాజిటివ్ దృక్పథం ఉన్నవారి జీవితాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక పనిని భిన్నంగా చేయడమే వారు చేసేది అంతే తప్ప భిన్నమైన పనులు ఎప్పుడూ చేయరు.
డేవిడ్ అండ్ గోలియత్ కథ అందరికీ తెలిసిందే. ఒకసారి డేవిడ్ మైదానంలో పిల్లలు ఆడుకోకుండా కూర్చుంటే ” ఎందుకు మీరు ఆడడం లేదు అని అడుగుతాడు” అప్పుడు ఆ పిల్లలు ” అక్కడ పెద్ద బాన కడుపుతో ఒక దయ్యం ఉంది” అంటారు. అప్పుడు డేవిడ్ ” దాన్ని మీరు అందరూ కలిసి చంపేయొచ్చు కదా” అని అడిగితే ” అది చాలా పెద్దది చంపటం చాలా కష్టం” అంటారు పిల్లలు ముక్తకంఠంతో. డేవిడ్ వెళ్లి ఒక ఈటె విసిరి దాన్ని చంపేస్తాడు. “పెద్దది కాబట్టే చంపడం సులువు, చిన్నదాన్ని చెప్పడం కష్టం. పెద్దది కాబట్టే గురి చూడాల్సిన అవసరం లేదు. ఈటె ఎలా విసిరిన దానికి తగులుతుంది” అని పిల్లలకి చెప్తాడు. నిజమే కదా. ఒక తుపాకీతో చిట్టెలుకను చంపటం సులభమా? ఏనుగు ని చంపడం సులభమా? అన్నది ఎవరికైనా తెలుసు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే పెద్దది కాబట్టి చంపడం కష్టమనుకుంటే, పెద్దది కాబట్టే చంపడం సులభమని పాజిటివ్ థింకింగ్ చెబుతుంది.
ఇద్దరు తండ్రీ కొడుకులు సరదాగా గాలిపటాన్ని ఎగరేస్తున్నారు. కొడుకు తండ్రిని ” గాలిపటం అలా పైకి ఎగరడానికి కారణం ఏంటి?”, అని అడిగితే తండ్రి ” దారం” అని చెబితే, కొడుకు ” తప్పు నాన్న! అసలు దారమే దాన్ని పైకి పోకుండా ఆపుతుంది” అంటాడు”. అప్పుడు తండ్రి ” కాదు, ఆ దారం లేకపోతే గాలిపటం అసలు పైకే ఎగరలేదు ” అని వివరించబోతే, కొడుకు ” లేదు నువ్వు చెప్పేది తప్పు” అంటాడు. తండ్రి నవ్వి, “ అయితే దారం తెంపేసి చూడు” అంటాడు. కొడుకు అత్యుత్సాహంగా దారాన్ని తెంపు తాడు. గాలిపటం నేలకు రాలి పోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. ( కొడుకు తెలియని విషయాన్ని తెలిసినట్లు వాదించటం,. అలా చెప్పటం నెగటివ్ థింకింగ్ కి మొదటి మెట్టు కావచ్చు. తల్లిదండ్రులు ఇలాంటి సందర్భాల్లోనే పిల్లలకి ఆ విషయం వివరించాలి.)
ఏదైతో మనల్ని ఆపుతుందనుకుంటామో, అదే మనల్ని ముందుకు తీసుకెళ్ళేది కావచ్చు. ఎదైతే నెగటివె అనిపిస్తుందో అదే పాజిటివ్ కావచ్చు. అందుకే పాజిటివ్, నెగటివ్ నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి.
పాజిటివ్ దృక్పథం ఉన్న వాళ్ళు ప్రతి దానిలో పాజిటివ్ ను చూస్తే, నెగిటివ్ వాళ్ళు ప్రతి దానిలో నెగటివ్ నే చూస్తారు. నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా మార్చుకోవటం పాజిటివ్ థింకర్స్ కి తెలిసిన విద్య. ప్రతికూల పరిస్థితులను కూడా తమకు అనుగుణంగా మార్చుకోవడంలో పాజిటివ్ థింకింగ్ పనికొస్తుంది. ఒకవేళ మార్చుకో లేకపోతే, దాన్ని స్వీకరించడానికి కూడా పాజిటివ్ థింకర్స్ సిద్ధంగా ఉంటారు.
ఒక రాజు గారి దగ్గర అందమైన వజ్రం ఉండేది. అదంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. ఒకసారి ఆ వజ్రం కింద పడింది. దాంతో ఆ వజ్రానికి సన్నని గీత ఏర్పడింది. అది వజ్రానికి మచ్చలాగా ఉండిపోయింది. రాజు ప్రముఖ వజ్రాల వ్యాపారులు అందరినీ పిలిపించి, ” ఆ గీతను సరి చేయమని అడిగాడు. ఆ వర్తకులు వజ్రాన్ని పరిశీలించి పెదవి విరిచారు. ” అది సరి చేయడం సాధ్యం కాదు” అన్నారు. రాజు నిరాశలో పడిపోయాడు. ఒక నాడు రాజు దగ్గరికి ఒక చిన్న వర్తకుడు వచ్చాడు. ” రాజా! నాకు కొంత సమయం ఇస్తే నేను ప్రయత్నం చేస్తాను ” అన్నాడు. రాజు సరేనని వజ్రాన్ని ఆ వర్తకుడి కి అప్పగించాడు. రోజులు వారాలు గడిచాయి. అయినా వర్తకుడు తిరిగి రాలేదు. చివరికి ఒక రోజు వర్తకుడు వచ్చి పెట్టను రాజు కి ఇచ్చాడు. ” అయ్యా నేను ఎంత ప్రయత్నించినా, ఆ గీతను సరి చేయలేకపోయాను. అయితే అలాంటి వజ్రమే నా దగ్గర ఉంది. చూడండి” అని ఇచ్చాడు. రాజు పెట్టె తెరిచి చూస్తే . ఒక అందమైన వజ్రం ఉంది. దాని అందమంతా చాలా నేర్పరి తనం తో చెక్కిన రోజా పువ్వు ద్వారా వచ్చింది. రాజు సంతోషంతో ” ఈ వజ్రం అద్భుతంగా ఉంది. నేను తీసుకుంటాను. నువ్వు నా వజ్రం ఉంచుకో” అన్నాడు. అప్పుడా వర్తకుడు నవ్వి” రాజా! ఇది మీ వజ్రమే. నేను వజ్రానికి పడిన గీతను ఉపయోగించి రోజా పువ్వుని చిత్రీకరించాను!” అన్నాడు
“Living in favourable and unfavourable conditions is part of living, but smiling in both the situations is art of living”. “అనుకూల, ప్రతికూల ఈ పరిస్థితులలో ఉండడం జీవితంలో ఒక భాగం. కానీ, ఏ పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ఉండటం ఒక కళ!”. అన్నది స్థూలంగా ఇంగ్లీష్ లో ఉన్న ఆ కొటేషన్ కి అర్థం అనుకుంటే. నవ్వుతూ ఉండటం అన్న ఆ కళ పేరే , ” పాజిటివ్ థింకింగ్!”
(సి.ఎస్.సలీమ్ బాషా వ్యక్తిత్వ వికాస నిపుణుడు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలలో సాఫ్ట్ స్కిల్స్, ఉద్యోగ నైపుణ్యాల పై పాఠాలు చెప్తుంటాడు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఒత్తిడిని ఎలా అధిగమించాలో అందరికీ చెప్తుంటాడు. లాఫ్ తెరపి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఈ అంశాలపై వివిధ పత్రికలకు, వెబ్ మ్యాగజైన్లకు కథలు, వ్యాసాలు రాయటం ఇతని ప్రవృత్తి – 9393737937)
తదుపరి విశ్లేషణ
ఏ వాహనానికైనా బ్రేకులు ఎందుకుంటాయో తెలుసా?