పివి నర్సింహారావుపై వైఎస్ జగన్ కు కక్షా.. వివక్షా..?

(డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి)
తెలుగు ప్రజల ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు పట్ల ఎపి ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచు కున్నారా లేక వివక్ష చూపుతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
1921 జూన్ 28న పుట్టిన పివి ఈ జూన్ 28తో వంద సంవ్సరాలలు పూర్తి అవుతాయి.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పి వి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వించ డానికి కార్యక్రమాలు చేపట్టింది.
అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి సందడి లేదు.  రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భాన్ని పురష్కరించుకుని ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు.  పి వి ని ఏ మాత్రం పట్టించుకోలేదు. సోషల్ మీడియా నివాళి తో సర్ధిచెప్పుకోవడం కనిపిస్తుంది.

 

ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను ప్రశంసిస్తూ కేవలం ట్విట్టర్ లో నాలుగు వాక్యాల మెసేజ్ పెట్టారు. దీంతో పీవి అభిమానులలో పలు విమర్శలు తలెత్తాయి.
పి వి నరసింహా రావు తెలంగాణాలో పుట్టినప్పటికీ, 1971 సెప్టెంబర్ నుంచి 1973 జనవరి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా సేవలు అందించారు. భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు అండగా నిలిచారు.
1991 ఎన్నికలలో ఆయన లోక్ సభకు ఎన్నిక కాకపోయినప్పటికీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. దీంతో నంద్యాలలో గెలిచిన లోక్ సభ సభ్యుడు గంగుల ప్రతాప రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పివి నిలబడేందుకు అవకాశం కల్పించారు.
అప్పటి ముఖ్య మంత్రి తెలుగుదేశం అధినేత నందమూరి తారకరామారావు పివిపై పోటీ పెట్టనని ప్రకటించారు. తెలుగు బిడ్డ ప్రధాని కావడాన్ని అడ్డుకోబోమని అన్నారు.
దీంతో పివీ నామమాత్రపు పోటీలో గెలిచి ప్రధానిగా కొనసాగారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపికయిన ప్రధాని అయ్యారు.  అంతేకాదు, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ తరఫున ప్రధాని అయ్యారు.  అయిదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ విజయవంతంగా పరిపాలించారు.
ఆర్ధిక సరళీకరణ ద్వారా దేశ ప్రగతికి పునాది వేశారు. ఇంతటి గొప్ప వ్యక్తిని, ఎపి నుంచి ప్రాతినిధ్యం వహించి ప్రధానిగా కొనసాగిన మహనీయుని ఎపి ప్రభుత్వం గుర్తించక పోవడం విమర్శలకు తావిస్తోంది.
గతంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి పదవులు రాకుండా పీవీ అడ్డు పడ్డారన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఆయన పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ వినబడుతూ ఉంది.
వై ఎస్ రాశేఖర రెడ్డి 1978 లో రెడ్డి కాంగ్రెస్ తరపున పులివెందుల నుంచి గెలిచారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయ్యారు. అప్పటిలో ఐదేళ్లలో నలుగురు ముఖ్య మంత్రులు అయ్యారు. మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామా రెడ్డి కోట్ల విజయ భాస్కర రెడ్డి సిఎం లుగా ఉన్నారు.
1983 ఎన్నికల్లో తెలుగదేశం అధికారంలోకి వచ్చింది.1985 మధ్యంతర ఎన్నికల్లోనూ తెలుగు దేశం అధికారం చేపట్టింది. 1989 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికి వైఎస్ కడప నుంచి లోక్ సభకు ఎన్నిక కావడం వల్ల ముఖ్య మంత్రి అవకాశం దొరకలేదు. అయినా ఆయన ప్రయత్నాలు మానలేదు.
అయితే పీవీ నరసింహారావు అడ్డు పడటం వల్లనే తనకు అవకాశం రాలేదని వైఎస్ భావించే వారు.1999 వరకు వైఎస్ లోక్ సభ సభ్యుడుగా ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి కాలేక పోయారు. దీనికీ పివినే కారణమని వైఎస్ తన సన్నిహితుల వద్ద చెప్పే వారు.
Dr NB Sudhakar Reddy
1999లో వైఎస్ మళ్ళీ పులివెందల నుంచి ఎమ్మెల్యేగా గెల్చి ప్రతి పక్ష నేతగా ఉన్నారు.2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. సంవత్సరాల తరబడి తనకు పదవులు రాకుండా పోవడంలో పీవీ నరసింహారావు పాత్ర ఉందని వై ఎస్ కోపంగా ఉండేవారు.
ఈ నేపథ్యంలో జగన్ పివిని విస్మరిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని తెలంగాణ ముఖ్య మంత్రి కె సి ఆర్ కేంద్రాన్ని కోరారు. అలాగే ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఎపి ప్రతి పక్ష నేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
ఈ నేథ్యంలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పీవీ సేవలను గుర్తించాలని తెలుగు ప్రజలు కోరుతున్నారు. బహు భాషా కోవిధుడైన ఆయన పేరును కుప్పంలోని ద్రావిడ విశవవిద్యాలయనికి పెడితే సహేతుకంగా ఉంటుందని అంటున్నారు.
(డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు,చిత్తూరు. ఫోన్ నెంబర్ 9440584400)