కువాయిట్ ఆమ్నెస్టీ కింద రెండవ విడతగా కువైట్ నుండి నేరుగా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై విమానాశ్రయాలకు వచ్చే వలస ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేక ఏర్పాటు చేసింది.
ఆమ్నెస్టీ కింద భారత రాయబార కార్యాలయం లో నమోదు చేసుకున్న వారిలో మిగిలిన 1,900 మంది ఆంధ్రప్రదేశ్ వలసఉద్యోగులను కువాయిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 విమానాలలో రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. దీంతో, కువాయిట్ ఆమ్నెస్టీ కింద నమోదు చేసుకున్న ఏపీ వలసదారులందరి తరలింపు ప్రక్రియ పూర్తవుతుంది.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చొవరతో ఏపీఎన్ఆర్టీఎస్ కువాయిట్ లోని షెల్టర్లలో చిక్కుకున్న వలసదారులను తిరిగి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత రాయబార కార్యాలయాలతో నిరంతర సంప్రదింపులు జరిపింది.
ఫలితంగా కువైట్ నుండి వలసదారులను రాష్ట్రానికి తీసుకురావడం లో భాగంగా రెండవ దశ ప్రారంభమైంది.
కువాయిట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్ష (ఆమ్నెస్టీ) కార్యక్రమం కింద రాష్ట్రానికి చెందిన వలస ఉద్యోగులు కువైట్ నుండి నేరుగా రాష్ట్రానికి తీసుకురావడానికి జూన్ ౩ వ తేది నుంచే రెండవ దశలో విమానాలు విజయవాడ, విశాఖపట్నం మరియు చెన్నై విమానాశ్రయాలకు రావడంమొదలయింది.
చివరి బ్యాచ్ ఉద్యోగులను రిసీవ్ చేసుకునేందుకు విమానాశ్రయాలలో రాష్ట్ర రిసెప్షన్ బృందాలు, జిల్లా యంత్రాంగం ఏపీఎన్ఆర్టిఎస్ సిబ్బంది సిద్ధమయ్యారు. స్వదేశం వస్తున్నవారికి ఏ ఇబ్బంది లేకుండా సజావుగా తమ జిల్లాలలో పూర్తి ఏర్పాట్లతో సిద్ధం చేసిన క్వారంటైన్ కేంద్రాలకు పంపుతున్నారు.
జూన్ ౩, 4వ తేదీలలో 229 మంది వలసదారులతో విజయవాడకు రెండు విమానాలు, 234 మంది వలసదారులతో విశాఖపట్నం కు రెండు విమానాలు చేరుకున్నాయి. వచ్చిన వారందరినీ క్వారంటైన్ కోసం ఆయా జిల్లాలకు పంపారు.
కువైట్ ఆమ్నెస్టీ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వస్తున్న దాదాపు 2,200 మంది వలసదారులలో, ఇప్పటికే మొదటి దశలో 295 మంది వలసదారులతో రెండు విమానాలు మే 20 మరియు 21 తేదీలలో విజయవాడకు చేరుకున్నాయి.