(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
తాటిపర్తి రాఘవ బళ్లారిలొ స్థిరపడడంతో తన ఇంటి పేరు బళ్ళారి రాఘవ అయింది. సాధారణంగా ఇంటి పేరు స్థానంలో ఊరిపేరు జనవ్యవహారంలో నిలబడాలంటే గొప్ప కార్యాలు చేసినవాళ్ళకే సాధ్యం. ఉద్యోగార్థం బళ్లారి వెళ్ళిన రాఘవ కుటుంబం బళ్ళారి నే ఇంటి పేరుగా పొందగలిగిందటే నాటకరంగంలో ఆయన చేసిన సుదీర్ఘ కృషికి నిదర్శనం. రాఘవ అనగానే నాటక నాటకరంగ నటుడుగానే అందరికీ ప్రసిద్ధి. చాల మందికి తెలియని విషయం, వెలుగులోకి రాని విషయమేంటే రాఘవ నాటక రంగానికి సంబంధించిన విలువైన వ్యాసాలు రాసారు, ఉపన్యాసాలు చేసారు. వీటన్నింటికీ మించి అయనే స్వయంగా ‘సరిపడని సంగతులు’ అనే సాంఘిక వచన నాటకం 1933 లోనే రాసారు.
అనంతపురము జిల్లా, తాడిపత్రి లో నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు 1880 ఆగష్టు 2 న జన్మించారు. శ్రీవైష్ణవ సాంప్రదాయం అనుసరించే నరసింహాచార్యులు బళ్ళారి మున్సిపల్ పాఠశాలలో తెలుగు పండితుడుగా ఉద్యోగం రావడంతో రాఘవ బళ్ళారి కేంద్రంగా ఉంటూ ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తి చేశాడు. మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో ఆ తరువాత లా కళాశాలలో న్యాయవాద విద్య అభ్యసించాడు. అ తర్వాత బళ్ళారి చేరి స్వయానా మేనమామ అయిన, ఆంధ్ర నాటకరంగ పితామహుడుగా బిరుదుపొందిన ప్రముఖ న్యాయవాది శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యుల వద్ద ప్రాక్టీసు ప్రారంభించాడు. రాఘవ కళాశాల రోజుల నుండే నాటకాల పై ఆసక్తి పెంచుకొన్నాడు. బళ్ళారి కేంద్రంగా ‘షేక్స్పియర్ క్లబ్’ ను ఏర్పరచి మిత్రులతో నాటకాల సాధన , ప్రదర్శనలు మొదలు పెట్టాడు.
ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి ‘సరసవినోదిని సభ’, ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు గారి ‘సుమనోరమ సభ’ల వారి నాటకాలలో రాఘవ నటించేవారు. బెంగుళూరు లోని ‘అమెచ్యూర్ డ్రమటిక్ అసోషియేషన్’వారి ఆధ్వర్యంలోను ప్రదర్శనలు ఇచ్చాడు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఐదు భాషలలో అరవై నాటకాలలో రాఘవ ప్రదర్శించారు. సారంగధర, అర్జున , ధశరథ, నల, కీచక, హరిశ్చంద్ర, ధుర్యోధన, శివాజి, చాణక్య, రామదాసు,పఠాన్ రుస్తుం, శ్రీధర, షైలాక్,మెక్ బెత్,హామ్లట్ తదితర పాత్రలు పోషించేవాడు.
1919 లో బెంగుళూరు లో ప్రదర్శించిన ‘విజయనగరపతనం’ నాటకాన్ని అథిదిగా విచ్చేసి వీక్షంచిన రవీంద్రనాథ్ ఠాకూర్ రాఘవ నటనా సామర్థ్యాన్ని కొనియాడి శాంతినికేతన్ కు ఆహ్వానించాడు. 1927 లో బెంగళూరులో ప్రదర్శించిన ‘దీనబంధు కబీర్’ నాటకాన్ని చూసిన మహాత్మాగాంధీ రాఘవ అభినందిస్తూ మరుపురాని మధురానుభూతిగా మిగిల్చిందని పేర్కొన్నాడు.
1928 లో పాశ్చాత్య దేశాలలోని నాటకరంగ అధ్యయనానికి, భారతీయ నాటక ప్రశస్తిని తెలియజేయడానికి యూరప్ పర్యటన వెళ్ళాడు. ఇంగ్లాండ్ ,ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాలు సందర్శించాడు సర్ ఫోర్భస్, రాబర్ట్ సన్, అస్ ట్లీ డ్యూక్ , మిసెస్ విలోల్లీ, సర్ ఆర్ధర్ పినిరో, జార్జ్ బెర్నార్డ్ షా తదితర ప్రముఖులను కలిశాడు. నాటక ప్రదర్శనలు, చర్చాగోష్టులలో పాల్గొన్నాడు. ప్యారిస్ లో ‘అఖిల ఐరోపా థియోట్రికల్ కాంగ్రెస్’ పాల్గొని ‘ భారతీయ నాట్య కళా వైశిష్ట్యం’ పై ప్రసంగించాడు.
మైసూరు విశ్వవిద్యాలయంలో ‘దక్షిణ భారత రంగస్థలం’పై ప్రసంగం, మద్రాసులో ఆంధ్ర కళాపరిషత్ లో చేసిన ప్రసంగం, ఆలిండియా రేడియోలో చేసిన ప్రసంగం, బందరులో డి.వి సుబ్బారావు గారి సత్కారసభల్లో చేసిన ప్రసంగాలలో రాఘవ గారికి నాటక రంగంపై ఉన్న ఆలోచన ధోరణులను, తాత్వికతను అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి.
నెలల తరబడి పాత్రయందు ఏకాగ్రత పూనితేగాని నటుడు పాత్ర నిర్వహించడానికి పనికిరాడు. అభినయానికి ఎంతో తపస్సు అవసరం, ఎంతో శిక్షణ అవశ్యం అని పేర్కొన్నాడు. నాటక ప్రదర్శన పాటల కచేరీ గాను, హరికథ కాలక్షేపము గాను మారకూడదంటాడు. నాటకం సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించాలని కోరుకున్నాడు. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని ప్రచారం చేశాడు. అనేకమంది స్త్రీలు నాటకరంగంలోకి రావడానికి ఎంతగానో తోడ్పడింది. విద్యావ్యవస్థలో నాటకరంగానికి ప్రాధాన్యత ఉండాలని అనుకున్నాడు. ఆధునిక నాటక ప్రదర్శనశాల ఎలా ఉండాలో తెలియజేస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఒక నివేదికను సమర్పించాడు.
1935 లో మిత్రుల ప్రోద్బలంతో సినిమారంగంలోకి రాఘవ ప్రవేశించాడు ద్రౌపదీ మానసంరక్షణము , చండిక, రైతుబిడ్డ తదితర సినిమాలలో నటించాడు. తానే స్వయంగా నిర్మించాలని ‘రాయలసీమ ఫిల్మ్ కంపెనీ’ స్థాపనకు పూనుకున్నాడు.1938 లో సినిమాల విషయమై విలువైన వ్యాసం ‘సాధన’ పత్రికలో రాసాడు.
1935లో ఆంధ్రవిశ్వవిద్యాలయం పక్షాన ‘భారత దేశ పతనానికి పదకొండు కారణాలు’ అన్న అంశంపై రాఘవ చేసిన ప్రసంగం ఆయనకున్న సామాజిక అవగాహనకు అద్దం పడుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి నుండి కళాప్రపూర్ణ బిరుదు అందుకొన్నాడు.సంప్రదాయక శ్రీవైష్ణవ కుటుబ వాతావరణంలో పెరిగిన రాఘవ ఆ సంప్రదాయంలొని సమతాతత్వాన్ని పాటించి ఆదర్శంగా నిలిచాడు. హరిజన విద్యార్థుల కోసం సొంత ధనంతో ‘ముద్దుతార పాఠశాల’ ను కొనసాగించాడు. హరిజనులను ఆహ్వానించి సహపంక్తి భోజనం చేసేవాడు.
1933 లో వితంతువివాహం ఇతివృత్తంగా ‘ సరిపడని సంగతులు’అనే సాంఘిక వచన నాటకం రాసాడు. పద్యనాటకాలు రాజ్యమేలుతున్న రోజులలో సాంఘిక ఇతివృత్తంగా , వ్యవహార భాషలో మూడంకాల నాటకం రాయడం ఆయన ప్రజాస్వామిక దృష్టిని తెలుపుతుంది. నటుడే నాటకరచయిత కావడంతో ఈ నాటకం మరింత మెరుగు దిద్దుకొంది. ప్రదర్శనానుకూలమైన ఈ నాటకం ఇన్నాళ్ళు సాహితీలోకంలో వెలుగులోకి రాకుండా పోయింది. ఆనాటి సమాజ స్థితిగతులనున, సంప్రదాయాల చాటున పబ్బం గడుపుకొనే వారిని ఈ నాటకం తేటతెల్లం చేస్తుంది. స్త్రీల ఆత్మాభిమానానికి, హక్కుల సాధనకు ఈ నాటకం ఇతోధికంగా ఆ రోజులలోనే తోడ్పాటునిచ్చింది. ఈ వ్యాసకర్త సంపాదకత్వంలో ఈ మధ్యనే ఈ నాటకం పునర్ముద్రిత మయింది.
బళ్ళారి రాఘవ నాటకరంగ నటుడు నటుడు గానే కాక, నాటక రచయిత గా, నాటక రంగంపై విలువైన వ్యాసాలు రాసిన నాటక విమర్శకుడుగా కూడా చిరకాలం నిలిచి ఉంటాడు.
(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి,అనంతపురము.99639 17187)