1. కరోనా మహమ్మారికి కర్నూలు జిల్లా వణికి పోతున్నది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే వైరాలజీ ల్యాబొరేటరీ కర్నూలు కేంద్రంలో లేదు.
2. “నావెల్ కరోనా వైరస్” సోకిందో! లేదో! వ్యాధి నిర్ధారణ పరీక్షలు వైరాలజీ ల్యాబొరేటరీల్లోనే నిర్వహించగలరు. నేడు వాటికి ఎనలేని ప్రాధాన్యత, ఆవశ్యకత ఏర్పడింది.
3. కరోనా మహమ్మారి విజృంభించడానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు కేంద్రాల్లో విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలల బోధనాసుపత్రుల్లోను, తిరుపతి స్విమ్స్ లో మాత్రమే వైరాలజీ ల్యాబొరేటరీలు ఉండేవి. తాజాగా మరో మూడు, గుంటూరు, విశాఖపట్నం, కడప కేంద్రాల్లో కూడా వైరాలజీ ల్యాబొరేటరీలు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ -19 విపత్తును ఎదుర్కోవడానికి వీటిని సమర్థవంతంగా వినియోగించుకొంటూనే, మిగిలిన ప్రభుత్వ వైద్య కళాశాలల బోధనాసుపత్రుల్లో కూడా నెలకొల్పడానికి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం కృషి చేయాలి.
4. వైరాలజీ ల్యాబొరేటరీలను నెలకొల్పుకొంటే రెండు కోట్ల రూపాయల వరకు నిథులను కూడా మంజూరు చేస్తామని, దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు దరఖాస్తు చేసుకోమని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐ.సి.యం.ఆర్) 2013 నాటి నుంచే ప్రోత్సహిస్తున్నది..
5. విజయవాడ, కాకినాడ, అనంతపురం కేంద్రాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, తిరుపతి స్విమ్స్ దరఖాస్తు చేసుకొని, ఐ.సి.యం.ఆర్. విధించిన నిబంధనల మేరకు మౌలిక వసతులను కల్పించి, అనుమతులు పొంది, నిథులను మంజూరు చేయించుకొని, వైరాలజీ ల్యాబొరేటరీలను నెలకొల్పుకొన్నాయి.
6. తరువాత దశలో, బహుశా 2016లో గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, కడప ప్రభుత్వ వైద్య కళాశాలలు కూడా దరఖాస్తు చేసుకొన్నాయి. ఇ.సి.యం.ఆర్. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడంతో అనుమతులు పొంది 2020 ఏప్రిల్ 2వ తేదీ నుండి గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో పరీక్షలు నిర్వహించడం మొదలు పెట్టారు.
7. విశాఖపట్నం, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలు కొంత అలసత్వం ప్రదర్శించడంతో ఐ.సి.యం.ఆర్. నుండి మంజూరు చేయించుకోవడంలో వైఫల్యం చెందాయి. కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికపైన కృషి చేసి విశాఖపట్నానికి అనుమతి సాధించుకొని, వైరాలజీ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ విషయంలో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల వెనుకబడింది.
8. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలకు, జనరల్ హాస్పిటల్ కు గొప్ప పేరు, ప్రఖ్యాతలున్నాయి. రాయలసీమలోని కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం, కడప జిల్లాలు, ప్రకాశం జిల్లా, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, కర్నాటకలోని బళ్ళారి, రాయచూర్ జిల్లా ప్రజానీకానికి కూడా విశేషమైన సేవలను కర్నూలు జనరల్ హాస్పిటల్ అందిస్తున్నది. అలాంటి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొన్న కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల బోధనాసుపత్రిలో వైరాలజీ ల్యాబొరేటరీని నెలకొల్పుకోవడంలో జరిగిన అలసత్వం గర్హనీయం. కర్నూలుకు రావలసిన వైరాలజీ ల్యాబొరేటరీని అనంతపురంకు తరలించుకు పోయారంటూ ఒక డాక్టర్ ఆరోపించడం టీవిలో విన్నాను. నాకున్న సమాచారం మేరకు అది నిరాధారమైన ఆరోపణ.
9. రాష్ట్రం మొత్తంలో కర్నూలు జిల్లాలోనే కరోనా వ్యాధి సోకిన వారి సంఖ్య అధికంగా నమోదయ్యింది. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి, యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు తీసుకొని కర్నూలులో వైరాలజీ ల్యాబొరేటరీని నెలకొల్పడానికి ఐ.సి.యం.ఆర్. నుండి అనుమతులు సాధించి, సత్వరం కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల బోధనాసుపత్రిలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
10. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నెలకొల్పాలని తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటిలోను తప్పనిసరిగా వైరాలజీ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి జిల్లాలోను ఉండేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి. కరోనా లాంటి ప్రాణాంతకమైన అంటువ్యాధి ప్రభలినప్పుడే కాకుండా, ఎల్లప్పుడు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడానికి ప్రభుత్వ వైద్య కళాశాలలను, ఆసుపత్రులను బలోపేతం చేయాలి.