ఆంధ్రప్రదేశ్ లో యూనివర్శటీల పాలకమండళ్లకు సభ్యులను నియమించడంలో అవకతవకలుజరిగాయనే చర్చ జోరుగాసాగుతూఉంది. బయట ప్రపంచమంతా కరోనాలాక్ డౌన్ తో ఉన్నపుడు ప్రభుత్వం తనకు ఇష్టమయిన వారిని, ముఖ్యంగా ఒక కులానికి చెందిన వారిని యూనివర్శిటీ పొజిషన్లకు నియమిస్తున్నారనే ది ఆరోపణ. దీనికోసం, ప్రభుత్వం పెద్దలకు ఇష్టమయిన వారిని సూచించలేదనే కోపంతో గతంలో ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలను కూడా రద్దు చేశారని చెబుతున్నారు. ఇపుడు తాజాగా సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ కూడా ఇదే ఆరోపణ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకలేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది:
*రాష్ట్రంలోని14 యూనివర్సిటీల పాలకమండళ్ళ నియామకాల్లో అవకతవకలు జరిగాయి.
*యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ల నియామకాల్లో కూడా అన్ని ప్రమాణాలను తుంగలో తొక్కారు.
*మీ అనుంగులకు వైస్ ఛాన్సలర్ పదవులు కట్టబెట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చారు.
*ఆంధ్ర, ఎస్వి యూనివర్సిటీలకు విసీలను ఏర్పాటు కోసం 2019 ఆగస్టులో వేసిన సెర్చ్ కమిటీలను మీ ప్రభుత్వం రద్దు చేసింది.
*ఆంధ్ర యూనివర్సిటీకి ప్రసాద్ రెడ్డి, ఎస్వీ యూనివర్సిటీకి కె రాజారెడ్డిలను విసిలుగా ప్రతిపాదించలేదనే ఆ సెర్చ్ కమిటీని రద్దు చేశారు.
*మీ ప్రభుత్వం తిరిగి మార్చి 23న కొత్తగా సెర్చ్ కమిటీని వేసింది.
*మీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలో ఉన్నవాళ్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే.
*ఏ సామాజిక న్యాయాన్ని పాటించి మీరు ఈ సెర్చ్ కమిటీ వేశారు?
*అన్ని యూనివర్సిటీలో మేధావులందరూ మీరు పాటించిన సామాజిక న్యాయం గురించి పదేపదే చర్చించుకుంటున్నారు.
*మీకు చిత్తశుద్ధి ఉంటే పాత సెర్చ్ కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని వైస్ ఛాన్సలర్ లను నియమించండి.