జనసేనాని పవన్ రాజకీయంగా కీలక మార్పు వైపు పయనిస్తున్నారా ? గుంటూరు వేదికగా పవన్ అధికార TDP ప్రభుత్వం పై చేసిన విమర్శలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటి వరకు తాను 2014 సార్వత్రిక ఎన్నికలలో బాబుకి మద్దతు ఎందుకు ఇచ్చినాను, జగన్ కు ఇవ్వలేదెందుకని వంటి ప్రకటనలు చేస్తూ వచ్చినారు. ఒక్కసారిగా పార్టీ వార్సికోత్సవంలో అధికార పార్టీపై ఆరోపణలు చేయడం చూస్తుంటే పవన్ తన పంధాను మార్చుకున్నట్లు అర్థమవుతుంది. దాని కారణం పవన్ మారినట్లేనా లేదా ఇంకేమైనా ఉందా…
2014 సార్వత్రిక ఎన్నికలలో పవన్ TDP , BJP ల కూటమికి మద్దతు ఇచ్చినారు. వారు మద్దతు ప్రకటించిన పార్టీలే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చినాయి. కొంత కాలం మౌనంగా ఉన్న పవన్ మెల్లగా కేంద్రం పై విమర్శలు చేస్తూ రాష్ట్రంపై పెద్దగా మిమర్శలు చేయలేదు. అంతేకాక ప్రతిపక్షనేత పై అసందర్భంగా విమర్శలు చేసినారు. ఫలితం పవన్ ను బాబు నడిపిస్తున్నారు అన్న విమర్సలను ఎదుర్కొవాల్సి వచ్చింది. కొన్ని ప్రజాసమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెల్లడం వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో బాటూ ప్రతిపక్షం అంటే ఇలా ఉండాలని జగన్ ను అధికారపార్టీ వెటకారంగా మాట్లాడటం వలన పవన్ బాబు చేతిలో ఉన్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సివచ్చింది. అంతేకాక పార్లమెంట్ సభ్యులు సరిగాలేరని మాట్లాడిన పవన్ రాజకీయంగా TDP , BJP లు అధికారిక నిర్ణయం తీసుకోకుండా అందులోని సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించడం సాథ్యం కాదు అన్న సంగతి మరిచినారు. మోదీ, చంద్రబాబులను విమర్శించకుండా వెనక ఉన్న నేతలను విమర్శించడం వలన ప్రజల మద్దతు కూడగట్టలేక పోయినారు.
పవన్ ఒక్కసారిగా అధికార TDP పై తీవ్ర విమర్శలు చేయడం మరీ ముఖ్యంగా బాబును, ఆయన రాజకీయ వారసుడు లోకేష్ లను లక్ష్యంగా చేసుకోవడం పెద్దమార్పే. దీనికి కారణం అధికారపార్టీని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నించితే ప్రజలు సమర్థించరన్న వాస్తవాన్ని పవన్ ఆలశ్యంగా గుర్తించినట్లు ఉన్నారు. అంతే కాదు ఏపీలో 2014 నాటి పరిస్దితులు అంటే కేంద్రంపై రాజకీయ యుద్దం ప్రకటించి సెంటిమెంట్ రాజకీయం చేస్తే కూడా ప్రజలు అంగీకరించక పోవచ్చన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేయాల్సింది ఎంత ఉందో రాష్ట్రం చేయాల్సింది అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ప్రజలు కేంద్రంపై కోపంగా ఉన్నారన్నది నిజం కానీ అదే సంద ర్భంలో బాబు పరిపాలన విషయంలో కూడా అంత సానుకూలంగా లేరన్న విషయం పవన్ గుర్తించనట్లు తెలుస్తుంది.
ఎందుకంటే బాబు పాలన పై వారు చేసిన ప్రధాన విమర్శ అవినీతి, అక్రమ సంపాదన ఆ విమర్శలు ప్రారంభం నుంచే ఉన్నాయి. మరి ఇన్నిరోజులు మాట్లాడలేదు. ఇప్పుడు అర్థం అయి మాట్లాడింది మాత్రం కాదు, కేవలం ప్రజలు ఆలోచనలను పవన్ గుర్తించినారు అంతే. బాబు పాలనను గురించి మాట్లాడకుండా కేవలం కేంద్రంనో, ప్రతిపక్షనేతనో విమర్శిస్తే ప్రజలు అంగీకరించరన్న వాస్తవం అన్న విషయాన్ని పవన్ గుర్తించడమే ఇక్కడ కీలకం. మరో ముక్యమైన మార్పు పవన్ ప్రజల ముందుకు వచ్చి పోరాటం చేయడం లేదు అన్న బావన ఉంది. దానికి పవన్ ఇంత కాలం చెప్పిన కారణం తాను ప్రజలముందుకు వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుంది అని. కానీ ప్రజలు దానిని అంగీకరించరు పవన్ కన్నా అనేక రెట్లు ప్రజాదరణ కలిగిన రామారావు ప్రజముందుకు రాలేదా పవన్ రాకపోవడానికి వారు చేప్పిన కారణం కన్నా ఏదో రాజకీయ కారణం ఆయనను అపింది అన్నట్లు ప్రజలు బావించినారు. నేడు పవన్ ఒక్కసారిగా తన పంథాను మార్చుకుని ఏకంగా నిరవదిక దీక్ష చేస్తామనడం ప్రజలలో ఉన్న ఆలోచనను పవన్ గుర్తించడమే.
రాజకీయంగా కీలక విషయాలు మాట్లడిన పవన్ ఇంకా కొన్ని విషయాలలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తనకు అధికారం మీద మోజు లేదని మాట్లడటం విచిత్రంగా ఉంది. ఎవరైనా పార్టీని పెట్టేది ఇపుడు ఉన్న పార్టీలు సరిగా లేవని వారి స్థానంలో తాను ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయదలుచుకున్నాని ప్రకటించి ప్రజల మద్దతు కోరుతారు. ఈ విషయంలో పవన్ ఇంకా గందరగోళంలో ఉన్నట్లు అర్థం అవుతుంది. నాలుగు సంవత్సరాల క్రింద పార్టీని స్దాపించి ఇప్పటి వరకు కనీసం పార్టీ రాష్ట్రకమిటీని కూడా ఎంపిక చేసుకోకుండా తానే అన్నీ అయినట్లూ, ఒకరే నిర్ణయాలను తీసుకుంటూ పార్టీలో రెండవ పేరు నేటికీ లేకుండా రాజకీయాలు చేస్తున్న పవన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజలు హర్సించరు. TDP, YSRCP, BJP లకు తాను రాజకీయ ప్రత్యామ్నాయం గా ముందుకు వస్దే ప్రజలు ఆలోచిస్తారు గానీ అలాంటి ఆలోచనను , అందుకు తగిన విధానాలు, కార్యాచరణ ప్రకటించకుండా రాజకీయాలు చేస్తే ప్రజల ఆదరణ పొందటం సాద్యం కాదు. ఏది ఏమైనప్పటికి పవన్ రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేసినారు. మరిన్ని అడుగులు వేస్తేగానీ పవన్ పయనం మొదలుకాదు ? అయినా, అలా దారిలోకివస్తారా లేక దారి తప్పుతారా ? ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
-మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి
రాయలసీమ మేధావుల పోరం
తిరుపతి 9490493436