(బి వి మూర్తి)
బెంగుళూరు: కర్ణాటకలో గురువారం జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 15 స్థానాలకు ఉపఎన్నికలు జరగటం అత్యంత అరుదైన సంఘటన. ఏడాది పాటు సాగిన సంకీర్ణం కథ ముగిసాక గత జూలైలో అధికారంలోకి వచ్చిన యడియూరప్ప సారథ్యంలోని ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో ఈ ఉపఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.
పార్టీ ఫిరాయింపుల అనైతికతే ప్రధానాంశంగా ఓటర్లు తీర్పు ఇచ్చేట్టయితే ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో మరో సుదీర్ఘ రాజకీయ మహానాటకానికి నాంది పలికినట్టవుతుంది. ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9 న జరుగుతుంది.
2018 మే ఎన్నికల్లో వలే ఇప్పటి ఉపఎన్నికల్లో సైతం ఏ పక్షానికీ అనుకూలం కాని రీతిలో ఓటర్లు హంగ్ తీర్పు ఇస్తారేమో నని అన్ని పార్టీలు లోలోపల భయపడుతున్నాయి.
ఈ సరికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పక్షాలు ఉపఎన్నికల ఫలితాల అనంతరం ఎదురయ్యే పరిణామాల కోసం ప్లాన్ ఏ, ప్లాన్ బి వగైరా వ్యూహాల కోసం తెర వెనుక సన్నాహాలు ప్రారంభించాయి.
మొన్న జూలై వరకు ప్రతిపక్షంగా ఉన్న బిజెపి ఇప్పుడు అధికార పక్షంగా మారడానికి మూల కారణమైన మాజీ ఎమ్మెల్యేల్లో 13 మంది ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
శాసనసభలో ఇప్పుడు బిజెపి సంఖ్యాబలం 105 కాగా వారికి ఓ ఇండిపెండెంట్ మద్దతు ఉంది. కర్ణాటక శాసనసభలో మొత్తం 225 స్థానాల్లో అధికారం చేజిక్కించుకోడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113. నిజానికి మొత్తం 17 సీట్లకు ఉపఎన్నికలు జరగాల్సినప్పటికీ మస్కీ, రాజరాజేశ్వరీనగర్ స్థానాలు మినహాయింపు పొందాయి. ఈ సీట్లలో ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం 15 స్థానాలకు ఉపఎన్నికలు ముగిశాక అసెంబ్లీలో మొత్తం 223 మంది సభ్యులుంటారు. మ్యాజిక్ ఫిగర్ 112 అవుతుంది గనుక ఇప్పుడున్న 106 స్థానాలుకు తోడు ఇంకో 6 స్థానాలు గెల్చుకుంటే యడియూరప్ప ప్రభుత్వం మనుగడకు ఢోకా ఉండదు.
ఇప్పుడు కాగ్వాడ్, అతని, గోకాక్ (బెళగావి జిల్లా), రాణెబెన్నూరు, హిరేకెరూర్ (హవేరి), యల్లాపూర్ (ఉత్తర కన్నడ), విజయనగర (బళ్లారి), హుణసూరు (మైసూరు), కృష్ణరాజ పేటె (మండ్య), చిక్కబళ్లాపుర (చిక్కబళ్లాపుర), హొసకోటె (బెంగుళూరు రూరల్), కృష్ణరాజపురం, మహాలక్ష్మీ లేఅవుట్, యశ్వంతపుర, శివాజీనగర్ (బెంగుళూరు అర్బన్) సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
అనర్హులు అగ్ని పునీతులవుతారా?
నాలుగు నెలల క్రితం అధికారం చేపట్టినప్పుడ యడియూరప్ప తన మంత్రివర్గంలో 16 స్థానాలను ఖాళీ పెట్టారు. ఉపఎన్నికల్లో గెలిచి `అగ్ని పునీతు’లై అసెంబ్లీలో కాలుమోపే అనర్హ ఎమ్మెల్యేలకై కర్చీఫు వేసి ఆ స్థానాలను రిజర్వు చేశారు.
అధికారం నిలబెట్టుకోడానికై యడియూరప్ప సర్వశక్తులూ ధారపోసి ఊరూరూ తిరిగి ప్రచారం చేశారు. గెలిస్తే చాలు మంత్రి పదవి గ్యారంటీ, ఇక పైన అభివృద్ధే అభివృద్ధి అంటూ ఊరించారు. ఎవరు ఏది అడిగితే అది తథాస్తు అంటూ ఉదారంగా హామీల కుంభ వృష్టి కురిపించారు. బెళగావి, హవేరీ వంటి అనువైన జిల్లాల్లో లింగాయత్ కులనినాదంతో కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
అయితే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పాత కాపుల నుంచి బిజెపి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఉదాహరణకు బెళగావి జిల్లాలో జర్కిహొళి సోదరులకు పెద్దపీట వేస్తున్నందుకు నిరసనగా బిజెపి పాతతరం నాయకుడు రాజు కాగె కాంగ్రెస్ పంచన చేరారు. హవేరి జిల్లాలోని రాణిబెన్నూరు, హిరేకెరూరు వంటి చోట్ల కూడా పరిస్థితి ఏమంత బాగా లేదు. నిన్నటి వరకు ఆగర్భ విరోధులుగా ఉంటూ ఇప్పుడు కేవలం మంత్రి పదవి కోసం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ కాంగ్రెస్ నాయకుల కోసం ఎన్నికల్లో ప్రచారం చేయవలసి రావడం బిజెపి కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఇలాంటి అవాంతరాలెన్ని ఉన్నా కాంగ్రెస్ లో నాయకుల మధ్య అనైక్యత తమ పార్టీకి శ్రీరామ రక్ష కాగలదని బిజెపి అంచనా వేస్తున్నది.
కాంగ్రెస్, జెడిఎస్ జండాలను కింద పడేసి అమాంతం బిజెపి జెండాలను భుజానికెత్తుకున్న మాజీ ఎమ్మెల్యేలు కేవలం ప్రజల కోసమే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని వోటర్లకు నచ్చజెబుతూ గెలిపించ వలసిందిగా కాళ్లా వేళ్లా పడుతున్నారు. తమను అనవసరంగా అనర్హుల్ని చేసి అన్యాయానికి పాల్పడ్డారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మా (సరికొత్త) నాయకుడు యడియూరప్ప సారథ్యంలో సుస్థిర ప్రభత్వం ఏర్పాటుకై మా ఎమ్మెల్యే పదవులు `త్యాగం’ చేశామంటూ జబ్బలు చరుచుకుంటున్నారు.
జంప్ జిలానీలపైనే ఫోకస్
మరోవైపు సంకీర్ణం కూలిపోవడానికి కారణమైన ఫిరాయింపుదారుల అనైతికతను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రయత్నించింది. బిజెపి వాళ్లిచ్చిన డబ్బులకు, ఇవ్వబోయే పదవులకు అమ్ముడుపోయి, ఏడాది కూడా తిరగక ముందే ప్రజలతీర్పును తుంగలో తొక్కిన ప్రజాస్వామ్య ద్రోహులకు బుద్ధి చెప్పాలంటూ ప్రజలకు పిలుపు ఇచ్చింది. నామినేషన్ల పర్వం, ఎన్నికల ప్రచారం తొలిదశలో కాంగ్రెస్ నాయకులు ఎడమొగం పెడమొగంగా ఉండటం కొట్టొచ్చినట్టు కనిపించింది గానీ తర్వాత్తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. మనీ ల్యాండరింగ్ కేసు విచారణ విషవలయంలో చిక్కుకున్న మాజీ మంత్రి డి కె శివకుమార్ బెయిలుపై విడుదలై వచ్చాక రెండు మూడు రోజులకే కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం ఇనుమడించింది. సిద్ధరామయ్య అనుకూల, వ్యతిరేక వర్గాలు ఒక్కటై పార్టీ ద్రోహులకు వ్యతిరేకంగా కసిగా ప్రచారం చేశారు.
ఫలితాల తర్వాత ఏమవుతుందో?
ఒకవేళ బిజెపి ఆరు లేదా అంత కంటే ఎక్కువ స్థానాలు గెల్చుకోగలిగితే యడియూరప్ప సిఎం పదవికి తక్షణ ప్రమాదం ఉండక పోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ కు ఒకటి రెండు స్థానాలు తక్కువ పడితే మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి మద్దతు పొందడానికి బిజెపి వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ఢిల్లీ కేంద్రంగా మంతనాలు సాగుతున్నట్టు భోగట్టా.
మరో వైపు, ఉపఎన్నికల ఫలితాలను బట్టి ఒకవేళ పరిస్థితులు అనుకూలించినట్టయితే మరోసారి సంకీర్ణం ఏర్పాటు చేసేందుకు సిద్ధమేనంటూ కాంగ్రెస్, జెడిఎస్ నాయకులు చెబుతున్నారు. ఇది వరకు సంఖ్యాబలంలో పైచేయిగా ఉన్న కాంగ్రెస్ అమితౌదార్యం ప్రదర్శించి సిఎం పదవిని జెడిఎస్ కు కట్టబెట్టి అనవసరంగా పార్టీలో, తమ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి తావిచ్చింది. ఈ సారి అలాంటి పొరపాటు చేయకుండా మరింత పకడ్బందీగా, ఉభయులకు ఆమోదయోగ్యమైన ఒప్పందాలతో సంకీర్ణానికి ప్రయత్నించాలని అధిష్టానం వ్యూహరచన చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2018 ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా సాగిన పరిణామాల్లో అన్ని అనర్థాలకు మూలకారణం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే నని కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు అభిప్రాయ పడుతున్నారు. అందువల్ల ఈ సారి సొంత పార్టీ ఎమ్మెల్యేల మన్నన పొందడంతో పాటు జెడిఎస్ నాయకులను కూడా సమన్వయంతో కలిసికట్టుగా నడిపించగల దీటైన నాయకుడిని రంగంలోకి దించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. సిఎం పదవికై మల్లికార్జున ఖర్గే పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఖర్గే పట్ల జెడిఎస్ అధినేత హెచ్ డి దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వివిధ సందర్భాల్లో సుముఖత వ్యక్తం చేసిన సంగతి గమనార్హం.
(BV Murthy is a Benguluru based senior journalist with vast experience in covering and analysing the local and national politics. Now a freelancer, he was with the New Indian Express till recently. He is a well-known sports columnist)