ఈ స్విట్జర్ల్యాం డ్ కొండ మీద ఎకైక రెస్టారెంట్ భారతీయులది, దానిపేరు ‘బాలివుడ్’

(డా. కే.వి.ఆర్.రావు)

మా యూరప్ యాత్ర, ఐదో భాగం: స్విట్జర్ ల్యాండ్;

     ఎనిమిదోరోజురాత్రికి జర్మనినుంచి స్విట్జెర్ ల్యాండ్ లోని జ్యూరిక్ నగరం చేరి అక్కడ బసచేశాము. తొమ్మిదో, పదోరోజు రెండురోజులు మా యాత్ర స్విట్జర్ ల్యాండ్ లో. తొమ్మిదోరోజు మా ప్రయాణం యూరప్ లోని ఎత్తైన ‘యుంగ్ ఫ్రా యుక్’ (Jungfraujoch) అనే పర్వతంపైకి. జ్యూరిక్ నుంచి మొదటి రెండుగంటలు బస్సులో వెళ్లాము. 

     స్విట్జర్ ల్యాం డ్ ప్రకృతి అందాలపరంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా చూస్తే అది నిజమే అన్నది అందరి అనుభవంలోకి వస్తుంది. 

     వెళ్లే దారంతా పచ్చటి కొండలు, వాటి వాలున పచ్చిక మైదానాలు, మధ్య మధ్యన గాఢమైన పచ్చటి అడవులు, ఎత్తుకు పోయేకొద్దీ నీలిరంగుకు ఆపైన తెల్లటి మంచు కప్పబడిన కొండలు, గలగల పారుతున్న సెలయేళ్లు, స్వచ్చమైన సరస్సులు, కొన్ని పచ్చిక మైదానాల్లో బొమ్మరిళ్లలాంటి ఇళ్లతో గ్రామాలు, మరికొన్ని చోట్ల ఆవులమందలు. 

     గ్రీటింగ్ కార్డులపైనుండే ప్రకృతి చిత్రాలను అక్కడ యదార్థంగా చూస్తున్నట్టుంది. ఫోటోలలో చూసే బొమ్మలకంటే కంటితో ప్రత్యక్షంగా చూడ్డంలో ఇంకా బావున్నాయి. ప్రయాణంలో ప్రతి ఐదునిముషాలకు సీన్ మారిపోతూ మరో కొత్త అందమైన సీన్ వస్తూంటుంది. ఎంతటి జఢులైనా చూస్తూ మైమరచి ఆనందించక తప్పదు. 

     ఐతే ఆ అందమైన ప్రదేశాలు చూసినప్పుడు ఆ మైదానాలు, సెలయేళ్లు, గ్రామాలు అలా తీర్చిదిద్దినట్టుగా, పరిశుభ్రంగా ఉండడానికి కారణం ప్రకృతేకాక ‘ప్రకృతి పట్ల అక్కడి మనుషుల అవగాహన, గౌరవం, దాన్ని అలావుంచడంలో మనుషులు పడుతున్న కష్టంకూడా’ అని తెలుస్తుంది.  

     దాదాపు రెండుగంటల బస్సుప్రయాణం తరువాత గ్రిండెల్వాల్డ్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడ ‘యుంగ్ ఫ్రా యుక్’ కి వెళ్లే మీటర్ గేజ్ రైలు ఎక్కాము. అక్కడినుంచి ముప్పావుగంట పచ్చటి కొండలు, మంచుతో కప్పబడిన శిఖరాలు చూస్తూ కొంత ఎత్తుకు ప్రయాణం చేసి ‘క్లైన్ షైడెగ్’ స్టేషన్ చేరాము. 

     అక్కడ దిగి మరో ప్రత్యేకమైన రైలెక్కి కొండవాలులో చాలావరకు   సొరంగమార్గాల్లో దాదాపుగా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి పదకొండువేల అడుగుల ఎత్తులోవున్న యుంగ్ ఫ్రా యుక్ రైల్వేస్టేషన్ కి చేరాము. అది ప్రపంచంలోకెల్లా ఎత్తైన స్టేషన్. 

     యుంగ్ ఫ్రా యుక్ ఎత్తైన మంచుపర్వతం మీద కట్టిన యాత్రాకేంద్రం. నాలుగైదు అంతస్తులతో, కాంక్రీటు సొరంగమార్గాలు, రెస్టారెంట్లు, షాపులు, వ్యూపాయింట్సే కాక పరిశోధనా కేంద్రాలుకూడా కలిగిన విస్తృతమైన ఎయిర్ కండిషన్డ్ భవనం. 

     భవనం చుట్టూ ఎటుచూసినా కొండశిఖరాలు, మంచు, హిమానీ నదాలు (గ్లేసియర్స్) ఉన్నాయి. వివిధ వ్యూ పాయింట్స్ కి వెళ్లి యెముకలుకొరికే మంచుగాలుల మధ్య వాటన్నిటినీ చూసి ఒక తీవ్రమైన అనుభూతికి అందరూ లోనయ్యారు. మొదటిసారిగా అంత దగ్గరగా ఊదారంగులో ఉన్న శిఖరాలను, మరకలేని తెల్లని మంచుతో ఏర్పడి దిగంతాలవరకు కనిపిస్తున్న హిమానినదాలనుచూడ్డం మరచిపోలేని అనుభవం. 

     ఆ ఎత్తైన పర్వతాలను, తెల్లని హిమానినదాలను చూస్తే మనిషి ఎంత అల్పజీవో అనిపిస్తుంది కానీ అదే సమయంలో అలాంటిచోటకూడా అన్ని వసతులతో బహుళ అంతస్తులభవనం కట్టడము, దానికి కొండను తొలిచి రైలుసౌకర్యము కల్పించడం చూస్తే పరిణామక్రమంలో ఆ మనిషే ఎంత ఎంతఎదిగాడో అనికూడా అనిపిస్తుంది. 

(ఈ స్టోరీ నచ్చితే ఫేస్ బుక్ లో లైక్ కొట్టండి, మీ మిత్రులకు షేర్ చేయండి)

     అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అక్కడున్న ఎకైక రెస్టారెంట్ భారతీయులది, దానిపేరు ‘బాలివుడ్’ రెస్టారెంట్. ఆపరిస్థితుల్లో, ఆ వాతావరణంలో, ఆ ఆల్ప్స్ పర్వతశిఖరాల్లో కూడా తృప్తిగా భారతీయ భోజనం చేశాము. మనవాళ్ల ఎంట్రప్రెన్యూర్షిప్ కి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది?    

     ఆ తరువాత సొరంగమార్గాలగుండా మంచులోకి వెళ్లి కాసేపు తిరిగాము. అక్కడ అప్పుడప్పుడే స్కైయింగ్ క్రీడలు మొదలౌతున్నాయి. ఆబిల్డింగు మధ్య ఆవరణలో మాత్రమే ఆక్సిజన్ మామూలుగా లభ్యమౌతుంది. మిగతాచోట్ల ముఖ్యంగా వయసులో పెద్దవాళ్లు కాస్త నెమ్మదిగా నడవకపోతే కళ్లు తిరుగుతాయి. మూడుగంటలపాటు అక్కడే గడిపి ఆ చలిలో వేడిగా కాఫీలు తాగి అదేరైళ్లలో తిరిగివచ్చాము. 

     బస్సు వచ్చే దారిలో ‘ఇంటర్ లేకెన్’ అనే చిన్న టౌన్లో దిగాము. ‘ఇంటెర్ లేకెన్’ అనేది పేరుకుతగ్గట్టే రెండు సరస్సుల మధ్య ఉన్న అందమైన ఊరు. చుట్టూ కొండలు. అక్కడ మన బాలివుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో చాలా సీన్లు తీశారు. ముఖ్యంగా యాష్ చోప్రా. అతన్ని ఆవూరివాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు. అక్కడి క్యాసినో పార్కులో అతని విగ్రహంకూడా పెట్టారు. దాన్ని బట్టి ఆవూరికి మన బాలివుడ్ కి ఎంత అనుబంధమో తెలుస్తుంది. ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలో చాలా సన్నివేశాలు అక్కడే తీశారట. 

     ప్రశాంతంగా ఉన్న ఆ చిన్న టౌన్ లో వీధిపక్కన రెస్టారెంట్లు, అన్ని ప్రముఖ స్విస్ రిస్ట్ వాచిల షాపులు, పక్కనే వున్న పచ్చని మైదానంలో కొండలమీదినుంచి దిగుతున్న ప్యారాచూటర్లను చూస్తూ కాస్సేపు తీరిగ్గా గడిపాము. అక్కడున్న ఒక ఫౌంటేన్ చూపించి అక్కడే దిల్వాలే దుల్హనియా సినిమాలో ఒక ముఖ్యమైన సీన్ తీశారని చెప్పారు. 

     ‘ఏమాత్రం హడావుడి లేకుండా మనుషులంతా ఈ అందమైన ప్రదేశంలో ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నారో’ అనుకున్నాము.  

     తిరిగి బస్సెక్కి రాత్రికి జ్యూరిక్ చేరుకున్నాము.

     పదోరోజు యాత్ర ల్యూసెర్న్ నగర సందర్శన, దాదాపు పదివేల అడుగుల ఎత్తున్న టిట్లిస్ శిఖరం పైకెళ్లడం. 

     జ్యూరిక్ నగరంనుంచి బయలుదేరి గంటసేపు ప్రయాణించి ల్యూసెర్న్ నగరం చేరాము. ఎనభైవేల జనాభాగల ఆచారిత్రక నగరం చుట్టూ మంచుకనిపిస్తున్న కొండలు, ఒకవైపున రూస్ నది మరోవైపున ల్యూసెర్న్ సరస్సు ఉండడం ఆనగరాన్ని అందంగాను, ముఖ్యమైన కేంద్రంగానూ చేశాయి. 

     మొదటగా అక్కడ లయన్ మ్యానుమెంట్ ని చూశాము. లయన్ మాన్యుమెంట్ దగ్గర ఒక చిన్న కొలను దానికి ఆనుకునివున్న కొండరాయిపైన చెక్కిన సింహం బొమ్మ ఉన్నాయి. అందులోని సింహం దెబ్బతగిలి చనిపోతూవుంటుంది. ఆ సింహం ఫ్రెంచ్ విప్లవంలో పదహారవ లూయీని కాపాడ్డానికి ప్రాణాలర్పించిన స్విస్ సైనికులకు ప్రతీకగా మలిచారు. ఐతే ఆ బొమ్మ చుట్టూ ఒక పంది ఆకారం అవుట్ లైన్ గా ఉంది. దానికి కారణం ఆ శిల్పికి ఇస్తానన్న డబ్బు పూర్తిగా ఇవ్వనందున అప్పటిపాలకులపైన అతను తన నిరసనను అలా చూపించారని చెప్పారు.  

     అక్కడినుంచి వెళ్లి రూస్ నదిపైన కట్టిన 14వ శతాబ్ధపు పొడవైన చెక్క బ్రిడ్జిని చూశాము. ఇన్ని శతాబ్ధాలు గడిచినా అది ఇంకా చక్కగా వాడకంలో ఉంది. మరోవైపున్న పెద్ద సరస్సు, దానిచుట్టూ పెద్ద భవనాలు ఉన్నాయి.

     దారిలో ఒకట్రెండు స్విస్ బ్యాంకులు కనబడ్డాయి. స్విస్ బ్యాంకులను గురించి వినడమేగాని అప్పుడే చూడ్డం. సహజంగానే వాటిమీద మా సహయాత్రీకులు కొందరు జోక్స్ కూడా వేసుకున్నారు. 

     ఆ తరువాత స్విస్ చాకొలెట్లు కొనడం, ఇతర షాపింగు పూర్తిచేసుకుని మా సహచరులందరం బస్సెక్కాం. స్విట్జర్ ల్యాండ్ కి ప్రత్యేకమైన కరెన్సి ‘స్విస్ ఫ్రాంక్ ‘ ఉన్నా, ఇక్కడ యూరోలు కూడా చెల్లుతాయి. మూడువందల స్విస్ ఫ్రాంకులకు పైగా షాపింగ్ చేస్తే ట్యాక్స్ వాపసు ఇచ్చే సౌకర్యం ఇక్కడి కొన్ని షాపుల్లోవుంది. మేము కొందరం ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాం.

     దాదాపు రెండుగంటల బస్సు ప్రయాణం తరువాత మేము టిట్లిస్ శిఖరం పాదభాగాన్ని చేరుకున్నాం. అక్కడినుంచి శిఖరాగ్రానికి కేబుల్ కార్లలో వెళ్లాలి. కొంతదూరం ఎనిమిదిమంది పట్టే కేబుల్ కారులో వెళ్లి మధ్యలో ఒకచోటదిగి మరో కేబుల్ కారు ఎక్కాము. ఈ కేబుల్ కారు తనచుట్టూ తాను తిరుగుతూ ప్రయాణంచేసే రొటైర్ కేబుల్ కార్. అందువల్ల మనం చుట్టూ చూడగలుగుతాం. 

     వెళ్లే దారంతా పచ్చని పర్వతాలతో, చిక్కటి చెట్లతో, సరస్సులతో చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంది. పైకి వెళ్లేకొద్దీ చుట్టూ అన్నీ పెద్ద మంచుపర్వతాలే. కేబుల్ కారు టిట్లిస్ పర్వత శిఖరం పైన కట్టిన బహుళంతస్తుల భవనంలో ఆగింది. అందులోనూ లిఫ్టులు, క్యాంటీన్లు, షాపులు అన్నీ ఉన్నాయి. బయట మంచుకొండలమీదికి వెళ్లడానికి వివిధరకాల మార్గాలు ఉన్నాయి.

     భవనంలోంచి బయటికి వస్తే అంతా తెల్లని మంచే. చుట్టూ లోతైన తెల్లని మంచుతో కూడిన లోయలు, చుట్టూ కనిపిస్తున్న తెల్లని మెఘాలు అంతా ధవళమయంగా ఉంది. అక్కడకూడా మానవుడు అన్ని ఏర్పాట్లూ చేసుకుని మనుగడ సాగించడం అబ్బురమనిపిస్తుంది. 

     మంచులో నడుచుకుంటూ వెళ్లి అక్కడున్న గాలికి ఊగే చెక్కపలకల బ్రిడ్జి ఎక్కి మరోవైపుకు వెళ్లి అటువైపు శిఖరాల్ని చూసి వచ్చాం. ఆ బ్రిడ్జి ఊగినప్పుడంతా కిందవున్న అగాధాలు కనిపిస్తూ పడమని తెలిసినా పడిపోతామేమో అని భయమేసింది. 

     అక్కడ సరదాగా గడిపేందుకు ‘కేబుల్ ఉయ్యాల’లాంటి ఇంకా ఒకట్రెండు ఏర్పాట్లున్నాయి. అక్కడ చాలాసేపు గడిపి, మంచులో నడిచి తిరిగొచ్చాం. 

     ఆ శిఖరంమీద మంచులో షారుఖ్ ఖాన్, కాజోల్ ల కట్ ఔట్లు పెట్టివుండడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మన బాలీవుడ్ ఖ్యాతి ఇక్కడిదాకా వ్యాపించిందా అనుకున్నాము.

     అక్కడకూడా కాఫీ తాగి, ఆసాయంత్రానికి కిందికి వచ్చి బస్సెక్కి రాత్రికి జ్యూరిక్ చేరుకున్నాము. ( తరువాయి ఆరోభాగంలో) 

నాలుగో భాగం ఇక్కడ చదవండి

https://trendingtelugunews.com/english/features/superstition-among-belgium-people-europe-tour/