నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే మొదటి అన్ని రంగాలలో వెనుకపడి తాగునీటికి, సాగునీటికి అల్లాడుతున్న రాయలసీమ నీటి అవసరాలు తీర్చి, ఈ ప్రాంతంలో విద్య, ఉపాధి, ఆరోగ్య అవసరాలు తీర్చడంతో పాటు, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, అప్పుడే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందగలదని రాయలసీమ కార్మిక కర్షక సమితి కార్యదర్శి రాష్ట్ర అభివృద్ధికి సూచనలు సలహాలు సేకరిస్తున్న కమిటీకి విజ్ఞప్తి చేశారు.
నీరు పుష్కలంగా ఉండి, రహదారులు, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న ప్రాంతంలో పంటలు పుష్కలంగా పండగలవని, తద్వారా ఆ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండి చదువు, నాగరికత పెరుగుతుందనే విషయం చరిత్ర చెప్పిన సత్యం .
అయితే గత అనేక దశాబ్దాలుగా రాజకీయ వివక్షకు గురౌతూ కరువు బారిన పడి జీవశ్చవాల్లా బ్రతుకుతూన్న రాయలసీమ వాసులు మాత్రం తాము బ్రతకడానికి “ఒక్క ఆరుతడి పంటకు సాగునీరు, ప్రజలు, పశువులకు తాగునీరు” కచ్చితంగా అందించాలని కోరుతున్నారు. తాగునీరు కూడా దొరక్క అల్లాడుతూ, వానదేవుడి కరుణపైన ఆధారపడిన సీమ ప్రజలు వ్యవసాయం చేయలేక, వదలలేక తల్లడిల్లుతున్నారు. ఆర్థిక స్తొమత లేక అప్పుల భారంతో వెనుకబాటుతనంతో జీవిస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం కుటుంబ సభ్యులను గల్ఫ్ దేశాలకు పంపడం, కొన్ని నిరుపేద కుటుంబాలలో మహిళలు ముంబాయి, పూనా, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోని రెడ్ లైట్ ఏరియాలకు కూడా వెళుతున్న చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది.
నత్తలకే నడకలు నేర్పుతున్న “సాగు” నీటి ప్రాజెక్టులు
రాయలసీమలో బ్రిటీష్ కాలం నుండి1985 వరకు ప్రారంభించిన నీటి ప్రాజెక్టుల పనులు “నత్తలకే నడకలు నేర్పుతూ ‘సాగుతూ’ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాల్సి ఉంది.
అందులో సీమలోని పడమటి ప్రాంతాలను ఆదుకోడానికి ఉద్దేశించిన హంద్రీ-నీవా 3300 క్యూసెక్కుల కెపాసిటీతో డిజైన్ చేసి అతి కష్టం మీద 2200 క్యూసెక్కుల మేరకు నీటిని తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను కనీసం 24 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రీడిజైన్ చేయాలని సూచించారు.
మాటలకే పరిమితమైన గాలేరు-నగిరి ప్రాజెక్ట్ సామర్త్యాన్ని పెంచడంతో పాటు వెంటనే రెండు దశలను వెంటనే పూర్తి చేయాలని, మద్రాసుకు తాగునీళ్లు, కర్నూల్, కడప చిత్తూర్ జిల్లాలకు సాగునీరు అందించే తెలుగుగంగ, ప్రకాశం జిల్లాకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.
అతి పురాతనమైన కె.సి కెనాల్, టిబి హెచ్ఎల్ సి, ఎల్ఎల్ సి కెనాల్ లను వెంటనే పూర్తి చేసి, ఆ ప్రాజెక్ట్ లకు kdwt-1కేటాయించిన నీటిని ఖచ్చితంగా సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్ లను వెంటనే పూర్తి చేసి ట్రిబ్యునల్ ద్వారా నీటిని కేటాయింపచేయాల్సి ఉంది.
క్రిష్ట్నా బేసిన్ కు గోదావరి నీటిని తక్కువ ఖర్చుతో సులభతరంగా మళ్లించే ప్రాజెక్ట్ లను మాత్రమే చేపట్టాలని కోరారు. అలాగే తెలంగాణతో చర్చించి శ్రీశైలం ను పూర్తిగా రెండు రాష్ట్రాలలోని కరువు ప్రాంతాలకే కేటాయించాలని సూచించారు. ఈ సంవత్సరం శ్రీశైలం ఆరు, ఏడు సార్లునిండి పొర్లి పారినా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు సగం కూడా నింపలేక పోయారు. కారణం ఇక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, కాల్వలు పూర్తి కాకపోవడమే. రేపు గోదావరి నీటిని కృష్ణ బేసిన్ కు మళ్లించినా ఇదే స్థితి కొనసాగుతుంది. అందువల్ల చంద్రబాబు హయాంలో నత్త నడకన సాగిన అన్ని సీమ నీటి ప్రాజెక్ట్ లను యుద్ధ ప్రాతిపదికన మొదట పూర్తి చేస్తేనే ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఊటచెరువులు గా మార్చండి
ఈ ప్రాజెక్టుల ద్వారా సరఫరా చేసే నీటిని నేరుగా వ్యవసాయానికి కాకుండా ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు, వాగులు నింపి భూగర్భ జలాలను వృద్ధి చేయాలి. రాయలసీమలో ఉన్న 35 వేలనుండి 40 వేల చెరువులను ఊటచెరువులుగా మార్చాలని, అందువల్ల ఈ ప్రాంతంలో ఇప్పటికే రైతులు వేసుకొన్న బోర్లలో సంవృద్ధిగా నీళ్లు లభించి రైతులు లబ్ది పొందగలరు. (ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి అన్నది రుజువైంది. అందువల్ల అన్ని చెరువులను ఊటచెరువులుగా మారిస్తే ఫలితం మరింత బాగుంటుంది.) అందువల్ల వ్యవసాయ వసతి కోల్పేయే రైతులకు బోరుబావులు త్రవ్వించాలి. అలాగే విద్యుత్ సౌకర్యం కల్పించాలి. అలాగే “ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్” ఏర్పాటు చేసి “రాయలసీమలో చెరువుల పునరుద్ధరణ, కొత్త చెరువుల నిర్మాణం, వాగులు వంకలను ప్రధాన కాలువలతో అనుసంధానం” చెయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అభివృద్ధి వికేంద్రీకరణ -రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు
రాష్ట్ర విభజన చట్టం మేరకు రాజధాని ఎంపిక విషయమై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసి నిర్దారించ వలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం మేరకు, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాజధానిని ఎంపిక చేయాలి. రాజధాని లేదా హైకోర్టు లలో ఒకదానిని రాయలసీమకు కేటాయించి ప్రజలలో నమ్మకం కలిగించాలి.
అలాగే రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న విద్య, ఆరోగ్య, పారిశ్రామిక సంస్థలలో రాయలసీమకు న్యాయమైన వాటా కల్పించాలని, రాష్ట్రవిభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాలకు బున్దేల్కండ్ తరహా ప్యాకేజి అమలు చేయించడం, శ్రీ భాగ్ ఒడంబడిక మేరకు కోస్తా ప్రాంతంతో సమానంగా రాయలసీమ ప్రాంతానికి ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచడం చేసి ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం కలిగించాలని కోరారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వేజోన్ ను గుంతకల్లులోను, కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం చేయడం, పారిశ్రామికాభివృద్దికి “హైద్రాబాద్ – కర్నూలు – బెంగళూరు” ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై – తిరుపతి – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటుచెయ్యాలని, ప్రారంభించిన వెంటనే నిలిపిన మున్నవరంప్రాజెక్ట్ ను వెంటనే నిర్మించాలని, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచడానికి రాజధానిని ఫ్రీ జోన్ గా ప్రకటించి జోన్ ల వారీగా రిజర్వేషన్లు కల్పించడం తో పాటు రాయలసీమలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో 75% ఉద్యోగాలను సీమ వాసులకే దక్కేలా చర్యలు తీసుకోగలిగితేఈ ప్రాంతం కూడా మిగిలిన ప్రాంతాలతో సమానంగా వృద్ధి చెంది రాష్ట్ర సమగ్రాభివృద్ధి కి దోహదపడగలదని ఆయన సూచించారు.
బడ్జెట్ కేటాయింపులు:
జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో రాయలసీమకు నిధులు ప్రత్యేకంగా కేటాయించి ఆ నిధులను ఈ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయగలిగితే సీమ వేగంగా వృద్ధి చెందగలదని అన్నారు. విద్యుత్ రంగంలో పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తులను గణనీయంగా పెంచడానికి సీమలో సీమలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేయాలని, జలవిద్యుత్ ఉత్పత్తిని తగ్గించి ఆ నీటిని కరువు ప్రాంతాల ప్రజల తాగు, సాగు నీటికి కేటాయించాలని కోరారు.