40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు స్థితి గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అగమ్యగోచరంగా మారింది.
అధికారం ఉన్నపుడు చేయగూడని తప్పులు చేసి, అధికారం నిలబెట్టుకోడానికే చేసిన మహాభారత యుద్ధంలో ఓటమి పాలై చివరికి అధికారాన్ని, బంధుమిత్రులను, సైన్యాన్ని, పోగొట్టుకొని ఏకాకిగా మారి కొలనులో దాక్కున్న దుర్యోధనుడి స్థితిలాగా చంద్రబాబు పరిస్థితి మారింది.
దుర్యోధనుడు యుద్ధం ముగిశాక ఏకాకి కాగా చంద్రబాబు మాత్రం ఎన్నికల యుద్ధం ముగిశాక మిగిలిన రాజకీయ పార్టీలు టీడీపీ చేపల కోసం ఆడుతున్న “గేలాలాటలో చిక్కి” ఏకాకిగా మిగులుతున్నాడు.
చక్రబంధంలో చంద్రబాబు
గత ఎన్నికల యుద్ధంలో వైసీపీ ప్రభంజనంలో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అడ్డగోలుగా చక్రం తిప్పిన చంద్రబాబు ఆ ఎన్నికల తర్వాత రాజకీయ చక్రబంధంలో ఇరుక్కున్నారని చెప్పక తప్పదు.
ఎన్నికల ముందు వరకు విడదీయలేని మిత్రుడుగా ఉన్న బీజేపీ చంద్రబాబు ఆడిన రాజకీయ అవకాశవాద క్రీడతో దూరమైంది.
అందుకు ప్రతిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రస్తుతం బాబుగారికి వెన్నుపోట్ల (గతంలో ఆయన లక్ష్మీ పార్వతిని బూచిగా చూపి ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటు) రుచి చూపిస్తున్నది.
బీజేపీ ఆడుతున్న రాజకీయ చదరంగం వల్ల ఇప్పటికే బాబుకు అత్యంత నమ్మకస్తులు (జనవాక్యం బినామీలు) గా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్ లాంటి ఘనాపాఠీలు వెన్నుపోట్లకు శ్రీకారం చుట్టగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ లు కూడా అదే బాట పట్టారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న వైసీపీ కూడా ఇటీవల తన తలుపులు తెరవడంతో ఈ టీడీపీ ఆయారాం, గయారాంలు అధికార పార్టీలోకి దూకడానికి సిద్ధమౌతున్నారు .
ఎపుడు ఎవరు వెన్నుపోటు పొడుస్తారో? ఏ పార్టీ ఎపుడు ఏ నాయకుడికి గాలం వేస్తుందో? వారు ఎపుడు వెళ్ళిపోతారో? అంతు చిక్కక ఉన్న వారిని ఎలా నిలుపుకోవాలో తెలియక టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఆపసోపాలు పడుతున్నారు.
అధికారం అడ్డంపెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డుగోలుగా (పోలవరం, అమరావతి నుండి నీరు చెట్టు వరకు) ఊడ్చుకున్న బాబుగారి అంతేవాసులు, బడా బాబులు, నాయకులు, చోటామోటా నాయకులు ఎన్నికల తర్వాత పొలోమంటూ ఎవరికీ అవకాశం ఉన్న పార్టీలో వారు చేరుతూ చంద్రబాబును ప్రస్తుతం ఏకాకిని చేస్తున్నారు. “అధికారం లేకపోతే అరగంట సేపు కూడా ఊపిరి పీల్చుకోలేని ఘనాపాఠీలు ఎవరికీ తోచిన రీతిలో ఆయనను ఏకాకిని చేస్తూ తమకు నచ్చిన దారి చూసుకోవడం” బాబు గారికి మింగుడు పడటం లేదు. ఒకవైపు మాజీ మిత్రపక్షమైన బీజేపీ, మరోవైపు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ తన బలగాన్ని లాక్కొని వెళుతుంటే నిస్సహాయంగా చూస్తున్నారు.
ఓటమికి కారణాలు వెదకడం లేదు.
వైసీపీ సునామీ వల్ల సంభవించిన ఓటమితో గుక్క తిరగని చంద్రబాబు తన ఓటమికి కారణాలు వెదికి జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోడానికి బదులు మరికొన్ని పొరపాట్లు చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నది.
2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాట చెప్పకుండా వాగ్దానాలు ఇవ్వడం, ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలుపు కోకుండా అడ్డగోలుగా పాలన చేసారనేది జనవాక్యం.
ఆయన తన పాలనా కాలంలో “పోలవరం , అమరావతి” మాత్రమే తన రెండు కళ్ళని చెపుతూ నిస్సిగ్గుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలపై తన మూడవ కన్ను తెరిచారు. పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామని ప్రకటనలు గుప్పించి అందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయడంలో విఫలమయ్యారు. శ్రీభాగ్ ఒడంబడికను తుంగలో తొక్కారు. అసలు రాయలసీమ ఉందనే సంగతినే విస్మరించారు.
ఆయన ఒకే కులానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఆ కులం వారు కూడా గుడ్డలు చింపుకొని ఊరేగి మిగిలిన కులాలలో వ్యతిరేకత మూటకట్టుకోవడం జరిగింది. అలాగే జగన్ ను ఓడించడానికి పులివెందులకు నీళ్లిచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేశామని చెప్పడం, తాను గెలవడానికి కుప్పంకు నీళ్లు తీసుక వెళ్లడం లాంటి చర్యల వల్ల ఈ ప్రాంతంలో తీవ్ర అసంతృప్తి కలిగింది. కడప ఉక్కు కర్మాగారం పేరుతొ మరో మోసం చేశారు కూడా.(ఇవి రెండు కూడా టీడీపీ నేతలు సతీష్ రెడ్డి గడ్డం తీయడానికి, సీఎం రమేష్ (బూటకపు) నిరాహారదీక్ష విరమించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి.)
ఆయన రెండు కళ్ళైన అమరావతి భ్రమరావతిగానూ, పోలవరం తెలుగు తమ్ముళ్ల పాలిట ఎటిఎం గా మారినదని (ప్రధాని) జనం వాపోయారు. ఇక అవినీతి, అధికారులపై దౌర్జన్యాలు, అర్హత లేని వారికి అందలాలు లాంటి అంశాలు అనేకం.
అలాగే విశాఖలో జగన్ పై జరిగిన దాడి పట్ల టీడీపీ చేసిన యాగీ, రోజుల తరబడి అధికారులను పని చేయనీకుండా (జనం అవసరాలు, సమస్యలు తీరకుండా) సమీక్షల పేరుతొ కాలయాపన, రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం లాంటి అమలు కాని వాగ్దానాలు ఎన్నికలలో ఆయన కొంప ముంచాయి.
జరిగిన పొరపాట్లు సర్దుకొని కార్యకర్తలలో ధైర్యం నింపడానికి బదులు ఆయన, ఆయన పుత్రరత్నం, మిగిలిన ముఖ్య నాయకులు, తన అనుకూల మీడియా సహకారంతో 4 నెలలు నిండని వైసీపీ ప్రభుత్వంపై దాడి చేయడానికే ప్రధాన్యమిస్తున్నారు.
ఇందిరమ్మ వ్యూహాన్నే బాబు కూడా అనుసరిస్తున్నాడా?
కేంద్రంలో 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడినపుడు కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అనుసరించిన రాజకీయ వ్యూహాన్నే ప్రస్తుతం చంద్రబాబు కూడా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించవలసి వస్తున్నది.
ఆమె “తాను చేసిన తప్పులను ఎత్తి చూపిన కేంద్రం పై తిరుగుబాటు చేసి, విపరీత ప్రచారం పొందడం, జనతా ప్రభుత్వంలో ఉన్న అభిప్రాయభేదాలను ఉపయోగించుకొని వారిని చీల్చి తాను అధికారం సాధించింది. అదే వ్యూహాన్ని చంద్రబాబు ప్రస్తుతం అమలు చేయడానికి పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నది.
అందులో భాగంగానే ఆయన, ముఖ్య సహచరులు వైసీపీపై విమర్శలకు పదును పెట్టారు. బీజేపీ నాయకులు వైసీపీపై చేస్తున్న విమర్శలకు వంత పాడుతున్నారు.
“2021 నాటికి తిరిగి దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని, వైసీపీ చేస్తున్న తప్పుల వల్ల అధికారం తిరిగి తమదేనని” బాబుగారు తమ్ముళ్లను నమ్మించే యత్నం చేస్తున్నారనేది టీడీపీ వర్గాల భోగట్టా!
బీజేపీతో తిరిగి చేతులు కలపడానికి, తన రాజకీయ మిత్రుడైన పవన్ కళ్యాణ్ తో కలసి సాగడానికి ఆయన సిద్ధంగా ఉన్నా బీజేపీకి బద్ద శత్రువులైన తన చిరకాల ప్రత్యర్థి(ఇటీవలి మిత్రుడు) కాంగ్రెస్ తోనూ, పాతమిత్రులైన కమ్యూనిస్టులతో ఎలాంటి సంభందాలు పెట్టుకోవాలో తేల్చుకోలేకుండా ఉన్నారు చంద్రబాబు .
అయితే 1977 నాటి పరిస్థితులు రాష్ట్రంలోనూ, కేంద్రంలోను లేవనే విషయాన్ని ఆయన మరచినట్లున్నారు. వైసీపీలో జనతా నాటి మహా మేధావులు లేరు. పైగా ఎక్కువ మంది శాసనసభ్యులు జగన్ ప్రభంజనంలో గెలిచినవారే! జనతా ప్రభుత్వంపై అతి తక్కువ కాలంలోనే జనంలో అసంతృప్తిని కలిగించడం ఇందిరాగాంధీకి కలసి వచ్చింది.
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, అనుసరిస్తున్న సామాజిక న్యాయం లాంటి అంశాల వల్ల అంత తొందరగా జనంలో అసంతృప్తి చెలరేగి జగన్ ను ముంచుతుందనుకుంటే అది పొరపాటు అంచనా అని చెప్పక తప్పదు.
పైగా రాజకీయాలలో కాకలు తీరిన యోధులు ప్రధాని మోడీ, అమిత్ షాలు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. టీడీపీ ని మింగి రాష్ట్రంలో బలపడాలనేది వారి వ్యూహం. ఇటీవల టీడీపీని బీజేపీలో విలీనం చేయాలని జివిఎల్ చేసిన ప్రకటన అందుకు తార్కాణం. ఈ నేపథ్యంలో రాజకీయంగా తప్పుడు ఎత్తులు వేసి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి కాంగ్రెస్ మకిలి పట్టించిన చంద్రబాబు తన ఎత్తులతో టీడీపీని ముంచుతారో? తెలుస్తారో? వేచి చూద్దాం