కొంతమంది సివిల్స్ ఎంపికయిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ల సివిల్స్ జర్నీ చాలా స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను చదివిన సివిల్స్ విజయ గాథలలో బాగా నచ్చినది వివేక్ చౌహాన్ పాస్ అయిన తీరు.
జీవితంలో కష్టాలు పడుతూ వాటితో పోరాడి వాటి నుంచి విముక్తి అయ్యి ఇక సివిల్స్ రాద్దామనుకునే అలోచన వచ్చే సరికి వివేక్ చౌహాన్ కు బాగా ఆలస్యమయింది.
జనరల్ క్యాండిడేట్ గా ఆయనకు నాలుగు అవకాశాలే వస్తాయి. పటుదలతో చదివాడు. బాగా చదివాడు. కాని పాస్ కాలేదు. ఒక సారి రెండు సార్లు కాదు, అర్హత ఉన్న నాలుగు సార్లు సివిల్స్ రాసి, కనీసం ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. ఇంత వైపల్యం ఎవరినైనా కృంగ దీస్తుంది, అనుమానం లేదు.
ఇంత పెద్ద అపజయం ఆయనకెపుడూ జీవితంలో ఎదురు కాలేదు. కన్నీరు మున్నీరయ్యాడు. ఆయనతో పాటు ఇంట్లో ఉన్నవాళ్లంతా బాధ పడ్డారు.
చిన్నవయినా పెద్దవయినా చౌహాన్ కు ఎపుడూ విజయమే ఎదురవుతూ వచ్చింది. అందుకే సివిల్స్ రాయాలని ఆయన అనుకున్నపుడు అంతా విజయం ఆకాంక్షించారు. నువ్వు ఈజీగా కొట్టేస్తావన్నారు. సివిల్స్ రాయాల్సిందే నని అంతా ప్రోత్సహించారు.
కాని వ్యవహారం తలకిందులయింది. ఆయనకు పరాజయం ఎదురయింది. నాలుగు ప్రయత్నాలు అయిపోయాయి. పరాజయం, పరాభవంతో కృంగిపోయాడు.
అయితే, ఆయన జీవితంలోకి సెరెండిపిటి ప్రవేశించింది. ఆయన సివిల్స్ కు ఎంపికయ్యాడు.మంచి ర్యాంకు సాధించాడు.ఐఎఎస్ కాలేకపోయినా ఐఆర్ ఎస్ అయ్యాడు.
Serendipity అని ఇంగ్లీషులో ఒక మంచి మాట ఉంది. దీనికి తెలుగులో సరైన అర్థం తోచడం లేదు. ఒక ఆన్ లైన్ డిక్ష నరీలో వెదికితే ‘వూహించని’ అని మాత్రం ఉంది. ఇది సెరెండిపిటిలో ని పూర్తి అర్థాన్ని పట్టుకున్నట్లు లేదు. సెరెండిపిటి అంటే ఆక్స్ ఫోర్డ్ డిక్షనరీలో ‘the fact of something interesting or pleasant happening by chance’ అని రాసి ఉంది.
ఈ మాటకి తెలుగు ఇంగ్లీష్ అర్ధాలు ఎలా ఉన్నా మనకు ఆ మాటకి కరెక్ట్ అర్థం తెలియాలంటే ఆ పరిస్థితి అనుభవంలోకి రావాలి. వివేక్ చౌహాన్ సివిల్స్ కి ఎంపిక కావడం అనేది సెరెండిపిటి అనే మాటకు కరెక్ట్ అర్థం చెబుతుంది.
ఆయన ఎలా ఐఎఎస్ అయ్యాడో తెలుసుకునే ముందు ఆయన గురించి కూడా నాలుగు ముక్కలు తెలుసుందాం.
ఢిల్లీ దగ్గిర ఘాజియాబాద్ లో ఆయన కుటుంబం ఉండేది. పేదకుటుంబం. ఆయన పాఠశాల విద్య సాగింది ఢిల్లీ సివిల్ లేన్స్ లో ఉండే గవర్నమెంట్ స్కూల్ లో. ఇంటి నుంచి 35 కిమి దూరం.
రోజూ ఘాజియాబాద్ లో ఉదయం అయిదున్నరకే ట్రెయిన్ పట్టుకుని ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి బస్ పట్టుకుని స్కూల్ కు వెళ్లాలి. ఇలా రోజు స్కూలు కి రాకపోకలకు అయిదుగంటల టైం పట్టేది.
డాక్టర్ కావాలన్నది ఆయన జీవితాశయం. డాక్టర్ కావాలన్నది కోరిక ఖరీదయినది. చదువు కొనసాగించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. జీవితం ఆయన్ని మరొక వైపు లాక్కెళ్లింది. తను సులభంగా సాధించగలిగిందేమిటని ఆలోచించాడు. పన్నెండో తరగతి తర్వాత టీచర్ ట్రైనింగ్ తీసుకున్నాడు. పరీక్షపాసయ్యాడు.
2003లో ఢిల్లీ మునిసిపల్ స్కూల్ లో టీచరయ్యాడు. అపుడాయన వయసు 19 సంవత్సరాలు.
ఉద్యోగమొచ్చాక చాలా మంది మిడిల్ క్లాస్ అబ్బాయిలు చేసే పనేమిటి?
‘ప్రేమలోపడటం, అవునా. ప్రేమపెళ్లికి అడ్డంకులొచ్చాయి. అరేడేళ్లు పెళ్లికోసం పోరాటం చేశా, విజయంసాధించే సరికి నా వయసు 25కు వచ్చింది. ఈలోపు ఇంట్లో ఆయన తమ్ముడి చవువులు, చెల్లెలు వివాహ బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వచ్చింది. ఈ బిజీ లైఫ్ నుంచేబిఎ ఓపెన్ యూనివర్శిటీ నుంచి పాసయ్యాను, ఎమ్మే పాసయ్యాను. బిఇడి కూడా పాసయ్యాను. ఇవన్నీ పూర్తయ్య సరికి 2010 అయింది. అపుడు నాకు సివిల్స్ మీద మనసు పడింది.’ అని ఒకచోట ఆయనే రాసుకున్నాడు.
తను నాలుగు సార్లు సివిల్స్ రాసేందుకుఅవకాశముంది. అందుకని 2010లో ఒక ప్రయత్నం చేశాడు. ఫెయిలయ్యాడు. ఇదే సమయంలోనే ఎల్ ఎల్ బి, ఎల్ ఎల్ ఎమ్ కూడా చదివాడు.
సివిల్స్ ఆలోచన ఎలా వచ్చింది
టీచర్ గా ఉన్నపుడు మునిసిపల్ టీచర్ల అసోసియేషన్ లో చురుకైన పాత్ర పోషించేవాడు. 2009లో ఆయన అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కూడా అయ్యాడు. ఈ హోదాలో ఆయన ఐఎఎస్ అధికారులతో కలవాల్సి వచ్చేంది. సీనియర్ అధికారులను ఇలా దగ్గరి నుంచి గమనించే అవవకాశం యూనియన్ కార్యకలాపాల వల్ల వచ్చింది.
ఒక ఐఎ ఎస్ అధికారి చేతిలో ఎంత అధికారం ఉంటుంది, దానితో ఎలాంటి పనులు చేయవచ్చు, ప్రజలకు ఎంతమేలు చేయవచ్చో ఆయన కళ్లారా చూశాడు.
అక్కడే సివిల్స్ కు బీజం పడింది, మొలకెత్తింది. తను సివిల్స్ ఎందుకు రాయకూడదనుకునాడు. 2010లో ఒక ప్రయత్నం చేశాడు. ప్రిలిమ్స్ లోనే ఫెయిలయ్యాడు.
మొదటి ప్రయత్నం ఇలా అయిందే ననే దిగులు పడుతూనే 2011లో రెండో ప్రయత్నం చేశాడు. ఈ సారీ ఫెయలయ్యాడు. తేడా ఏడు మార్కులే. ఫెయిలయ్యానన్న బాధ ఉన్నా, తాను విజయానికి చేరువగా జరిగినట్లు గుర్తించాడు.
ఇంతవరకు వచ్చాక ఆ ఏడు మార్కులను ఎందుకు దాటకూడదనుకున్నాడు. మూడో ప్రయత్నం చేశాడు. ఈ సారి ప్రిపరేషన్ పెంచాడు. భార్య పూజ కూడా రంగంలోకి దిగి ఆయనకు సహకరించడం మొదలుపెట్టింది.
కొంతమంది మిత్రులు కూడా ఆయనకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఈ సారి ప్రిలిమ్స్ దాటడం ఈజీ అనిపించింది.
2012 లో చేసిన మూడో ప్రయత్నం విఫలమయింది. చెప్పలేనంత బాధేసింది. ఇక మిగిలింది ఒకే ప్రయత్నం. నాలుగో ప్రయత్నం. ప్రిపరేషన్ పద్దతులన్నీ మార్చి చివరి ప్రయత్నం చేయాలనుకున్నాడు.
ఇదీ పోతే.. పెద్ద ప్రశ్నార్థకం ఆయన ముందు నిలబడింది. నాలుగో వైఫల్యానికి తాను తట్టుకుని నిలబడాలి. లేదా విజయం సాధించాలి.
ఈ సారి ప్రయత్నం ఇంకా బలంగా చేశాడు. అంతేకాదు, ఒక సివిల్స్ విజేత మిత్రుడు కూడా ఆయన సలహాలివ్వడం మొదలుపెట్టాడు.
ఇల్లంతా ఆయన విజయం కోసం అన్ని రకాలుగా సాయమందిస్తూ ఉంది.ఇల్లంతా పరీక్ష రాస్తున్నంత సందడి. హడావిడి.
ఇక భార్య పూజ తనే పరీక్ష రాస్తున్నంతా టెన్షన్ తో కష్టపడుతూ ఉంది.
ప్రిలిమ్స్ లో 232 మార్కులొచ్చాయి. తనకు మెయిన్స్ అవకాశమొచ్చినట్లే అనుకున్నాడు. అయితే, పరాజయం మళ్లీ వెంటపడింది. ఆ యేడాది కటాఫ్ పెంచి 241 చేశారు. దీనితో చౌహన్ నాలుగో ప్రయత్నం కూడా విఫలమయింది.
ఆయన మెయిన్స్ కి క్వాలిఫై కాలేదని తెలిసిన రోజు రాత్రి ఇల్లంతా శోక సముద్రమయయిపోయింది. చౌహాన్ ఏడ్చాడు. తల్లీ, తండ్రి కూడా ఏడ్చారు. భార్య పూజ కూడా దుఁఖమాపుకోలేకపోయింది. ఈ పరిస్థితిని మాటల్లో చెప్పడం కష్టం.
సివిల్స్ ప్రిపేరయ్యే చాలా ఇళ్లలో పరిస్థితి ఉంటుంది. “My final battle was lost, at this point what I had experienced can’t be summarized. It was agony, pain, failure all around, and a flood of tears, it was all over me w.r.t UPSC. I was 30 years old by then I was ineligible to write this exam henceforth అని ఆయన తన చివర ప్రయత్నం విఫలమయినపుడు చెప్పిన మాటలు.
నాలుగు దండయాత్రల్లో ఓటమి పాలయ్యాక ఆయన స్కూలు కు తిరిగొచ్చినపుడు అంతా ఎగతాళి చేశారు.
రకరకాల ఎత్తిపొడుపు మాటలతో ఏడిపించారు. సూటిపోటి మాటలతో నొప్పించారు. చుట్టు ఉన్నవాళ్లలో నామీద కొద్ది చులకన భావం వచ్చినట్లు కనిపించింది. సివిల్స్ పనికిరానని, తాను ఆ సరుకుకాదని, కనీసం ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేని వాడు, అంత పెద్ద గోల్ పెట్టుకుంటే ఎట్లాఅని అనే వారు. నేనేదో చేయకూడదని చేసినట్లు చూశారు.
ఇలాంటి నైరాశ్యంలో ఉన్నపుడు ఆయనకు సెరెండిపిటి అనేది ఎదురయింది.
ఆ రోజు డిసెంబర్ 5. కూతురు బర్త్ డే.ఈ ఏర్పాట్లలో ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది.
యుపిఎస్ సి రాసే విద్యార్థులకు మరొక రెండు ప్రయత్నాలు పెంచుతున్నట్లు.
ఇది తన కూతురు తీసుకువచ్చిన అదృష్టంగా చౌహాన్ భావిస్తాడు. అపుడాయన వయసు 31 సంవత్సరాలు. అయిదో ప్రయత్నం చాలా కట్టుదిట్టంగా చేశాడు. ప్రిలిమ్స్ పాసయ్యాడు. మెయిన్స్ పాసయ్యాడు. ఇంటర్వ్యూ వచ్చింది. అక్కడ నెగ్గలేదు.
ఇది వరుసాగా ఐదోసారి ఎదురయిన పరాజయం. ఒక వైపు ఈ పరాజయం కృంగదీస్తూ ఉంది. మరొక వైపు తాను ఇంటర్వ్యూ దాకా వెల్లగలిగాన్న వాస్తవం ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ ఉంది.
ఫెయిలయ్యానని క్రుంగిపోకుండా, విజయం బారెడు దూరంలోనే ఉంది, ఈ సారి తప్పక అందుతుందనే ఆత్మ విశ్వాసంతో 2015లో 32వ యేట ఆరోప్రయత్నం , చివరి ప్రయత్నం చేశాడు.
గతంలో చేసిన తప్పులేమిటో సమీక్షించుకున్నాడు. కొత్త పద్ధతులేమిటో తెలుసుకున్నాడు.
ప్రిలిమ్స్, మెయిన్స్ పాసయ్యాడు. ఇంటర్వ్యూకు వెళ్లాడు. చివరకు 2016 మే 10 వ తేదీన ఆయన కు శుభవార్త అందింది. సివిల్స్ లో అల్ ఇండియా 300 ర్యాంకు వచ్చింది. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్ ఎస్ ) కు ఎంపికయ్యాడు.
పేదకుటుంబంనుంచి వచ్చినా, ఎలాంటి కాలేజీ చదువు లేకపోయినా, పరీక్షలన్నీ ప్రయివేటుగా రాసి డిగ్రీలు సంపాయించిన వ్యక్తి కూడా సివిల్స్ నెగ్గ వచ్చు అని రుజయిందని ఆయన ఇపుడు అందరికీ చెబుతున్నాడు.