ఆగస్టు 15,1947న గాంధీజీ ఎక్కడున్నారు, ఏంచేస్తున్నారు?

ఆగస్టు 15న స్వాతంత్య్ర వచ్చినపుడు ,అధికారం తెల్ల వాడి చేతి నుంచి భారతీయుడి చేతికి వస్తున్నపుడు ఈ దృశ్యాన్ని తిలకించేందుకు మహాత్మాగాంధీ ఢిల్లీ లో లేరు.
ఆయన కలకత్తాలో ఉన్నారు. అక్కడెందుకు వున్నారు?
దేశ విభజన సందర్భంగా అనేక ప్రాంతాలలో మతకల్లోలాలు చెలరేగాయి. హత్యాకాండ మొదలయింది. ఒకర్నొకరు చంపుకుంటున్నారు.  ఈ హత్యాకాండను ఆపడానికి ఆయన కలకత్తా వెళ్లారు. వెళ్తే వెళ్లారు, అక్కడి ప్రభుత్వం, గవర్నర్ చెప్పినా వినకుండా మతకల్లోలాలు తీవ్రంగా ఉన్న ప్రాంతంలోనే బస చేస్తానన్నారు. ఆ ప్రాంతానికి వెళ్లడం ప్రమాదకరం అన్నా వినలేదు. ముస్లింల మధ్యే బస చేస్తానన్నారు. దీనిని  స్థానిక హిందువులు వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు.
అప్పటి కలకత్తా ప్రభుత్వ పెద్దలంతా కలకత్తా నగరంలోనే  ఉండాలని గాంధీజీకి చెబుతున్నా విన లేదు. ముస్లిం వాడకే వెళ్తానన్నారు. వెళ్లారు.
1947 ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 7 దాకా ఆయన కలకత్తాలోని  ఒక ముస్లిం వాడలో మత ఘర్షణలు తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ఒక పాడపడిన ఇంటిలో బస చేశారు.
అక్కడ జరిగిన  రక్తపాతమే తూర్పుపాకిస్తాన్ ఏర్పాటుకు దారి తీసింది.అది పాకిస్తాన్లో భాగంగామయింది. 1971లో ఇండోపాక్ యుద్ధంతో అది స్వతంత్ర బంగ్లా దేశ్ గా అవతరిచింది.
మరి గాంధీ జీ కలకత్తా ముస్లిం వాడలో ఎక్కడ బసచేశారు?
 గాంధీజీ తూర్పు కలకత్తాలోని బెలియఘటలోని ఒక పాత శిధిలమయిపోతున్న మేడలో ఉన్నారు. దీని పేరు హైదరీ మంజిల్. అయితే 2018లో ఈ భవనాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  గాంధీ భవన్ గా మార్చారు. 400 చ.మీ విస్తీర్ణంతో 1000 చ.మీ స్థలంలో నిర్మించిన ఇల్లు అది.
1947కు ముందే హైదరీ మంజిల్ ను గాలి కొదిలేశారు. ఇల్లు బాగా పాతబడింది. ఈ ఇంటికి సరైన రోడ్డు కూడా లేదు. గాంధీకి ఇక్కడ బస ఏర్పాటు చేశారు. గాంధీ ఈ మత కల్లోల ప్రాంతంలో ఉంటానని మొండికేయడంతో ఆయనకు సరైన ఇల్లు ఇదేనని  రాత్రికి రాత్రి  ఆ ఇంటికి బాట ఏర్పాటు చేశారు.
ఆవరణలో ఉన్న చెట్ల పొదలను కొట్టేసి శుభ్రం చేశారు.భవనంలో ఉన్న ఎనిమిది రూమ్ లలో ఒక దానిని మాత్రం గాంధీ కోసం శుభ్రం చేశారు. ఈ విషయాన్ని ఆ రోజు గాంధీ బసకి సాక్షి అయిన పూర్వ కోల్ కతా గాంధీ స్మారక సమితి కార్యదర్శి పాప్రి సర్కార్ చెప్పారు.
రికార్డుల ప్రకారం ఈ భవనాన్ని సూరత్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన దావూది బోరా కమ్యూనిటి కుటుంబమొకటి1850 లో కొనుగోలు చేసింది. అప్పటికి బ్రిటిష్ ఇండియాకు కలకత్తాయే రాజధాని. వ్యాపారం కోసం కలకత్తా కొచ్చిన షేక్ యాడం అనే వ్యక్తి ఈ భవనాన్ని కూతురుకు రాసిచ్చాడు. అయితే వాళ్లు మరొక్కడో సెటిల్ అయ్యారు.
బెలియఘట అనేది  ముస్లింలు ప్రధానంగా నివసించే ప్రాంతం. 1946 మతకల్లోలాలు వచ్చినపుడు ఎక్కువ మంది చనిపోయిందిక్కడే. ఈ హత్యాకాండ 1947 దాకా కొనసాగుతూనే వచ్చింది.  ఆగస్టు 13 న గాంధీ ఈ భవనంలో దిగినప్పటికి ఈ ప్రాంతంలో మతకల్లోలాలు దాడులు తారాస్థాయిలో ఉన్నాయి.
అపుడు బెంగాల్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ చీఫ్ గా హుసేన్ షహీద్ సుహ్రవడీ  ఉన్నారు. ఆయన హిందూమహాసభ శ్యామప్రసాద్ ముఖర్జీకి ప్రత్యర్థి. సుహ్రవడీ బెంగాల్ ను విభజించాల్సిందేనని పట్టుబడుతున్నాడు.
బెంగాల్ విభజనను గాంధీ ఆపాలని చూస్తున్నారు.  అందుకే ఆయన మత ఘర్షనలు జరుగుతున్న ప్రాంతాలకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.. సుహ్రవడీ వారిస్తున్నారు. గాంధీ వినలేదు. తాను ముస్లిం లమధ్యే వుండాలనుకుంటున్నాని, ఈ నిర్ణయం మారదని మొండిగా చెప్పారు. తనతోపాటు శాంతియాత్రకురావాలని ఆయన సుహ్రవడీని కోరారు.
ఇలా ఆయన కలకత్తా పట్టణం నంచి శివార్లలో మత ఘర్షణల కార్చిచ్చు మధ్య ఉన్న హైదరీ మంజిల్ కు ఆగస్టు 13 బసను మార్చారు . ఆగస్టు 9 నే కలకత్తా వచ్చినా అంతవరకు ఆయన పట్టణంలో ఉన్నారు.
గాంధీ ముస్లింల మధ్య నివసించడానికి అంగీకరించని హిందూమహాసభ సభ్యులు గాంధీకి వ్యతిరేకంగా నినాదాలుచేశారు.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు గాంధీ సత్యాగ్రాహం, ప్రార్థనలతో గడిపారు. అంతే, హైదరీ మంజిల్, విద్యార్థులకు ప్రజలకు మేధావులకు రాజకీయ కార్యకర్తలకు దర్శనీయ స్థలమయిపోయింది. మతకల్లోలాలు ఆగిపోయాయి. అయితే, ఆయన ఉనికి వల్ల వచ్చిన శాంతియుత వాతావరణం ఎక్కువ రోజులు నిలువ లేదు.
ఆగస్టు 31 వ తేదీన మతఘర్షణలు మళ్లీ తలెత్తాయి. ఆ మరుసటి రోజే  గాంధీ నిరవధిక నిరశన ప్రారంభించారు. అపుడు పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా రాజగోపాలా చారి ఉన్నారు. నిరశన వత్రం ఆపాలని ఆయన కోరినా గాంధీ వినలేదు. హైదరీ మంజిల్ లో 25 రోజులు గడిపి సప్టెంబర్ 7న ఆయన ఢిల్లీ బయలుదేరారు.

ఫోటో: కలకత్తా మత ఘర్షణలపుడు గాంధీజీ బసచేసిన హైదెరీ మంజిల్ ఇదే…