నదీ గర్భాలు, పరీవాహక ప్రాంతాల్లో, నదీ తీరాలు,అడవులు, కొండలలో చేపట్టే ప్రైవేటు కట్టడాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు డిసెంబర్ 13 1996న ఒక తీర్పు చెబుతూ అలాంటి ప్రదేశాలను ప్రయివేటు వారి పరం చేయకుండా నిషేధం విధించింది.
ఈతీర్పును ఉపయోగించి ముఖ్యమంత్రి జగన్ కృష్ణానది కరకట్ట ప్రాంతంలో లేచిన అక్రమ కట్టడాలను కూల్చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే జరిగితే ఉండవల్లి లో నిర్మించిన చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా ముప్పు వున్నట్లే నని చెబుతున్నారు.
ఈ కేసు గురించి క్లుప్తంగా:
MC మెహతా వర్సెస్ కమల్ నాథ్ అండ్ కో కేసుగా పేరుపడిన ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు కుల్ దీప్ సింగ్, సఘ్నార్ అహ్మద్ ల బెంచ్ డాక్ట్రిన్ అఫ్ పబ్లిక్ ట్రస్టు (Doctrine of Public Trust) ముందుకు తెచ్చింది. ఇది ఒక పురాతనమయిన సహజ న్యాయసూత్రం.
ఈ సూత్రం ప్రకారం కొన్ని రకాల సహజ సంపదలు అంటే నదులు, సముద్రాలు, అడవులు, గాలి వంటివి అందరి సొత్తు. వీటిని జనరల్ పబ్లిక్ కు కోసమే వాడాలి. వీటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేటు వోనర్సిప్ ఉండదు. ఇలాగే ఇంగ్లీష్ కామన్ లా కింద కూడా ప్రభుత్వం వీటిని ప్రయివేటు వారికి ఇవ్వకుండా నిషేధం ఉంది. ఎందుకంటే, వీటిని అలా వేరేవారికి ధారాదత్తం చేయడం వల్ల ప్రజాప్రయోజనానికి హాని జరుగుతుంది. అందువల్ల పై కేసులో బియాస్ నది ఒడ్డున ఎంసి మెహతా కంపెనీ కట్టాలనుకున్న మోటెల్ చట్ట వ్యతిరేకమని చెబుతూ నదుల పక్కన కట్టాలను చేపట్టడాన్ని సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
కేసులో ఉన్న కమల్ నాథ్ ఎవరో కాదు, కేంద్రంలో అపుడు అటవీ పర్యావరణ శాఖ మంత్రి. ఆరోపణ ఏమింటే, ఈ కంపెనీ (స్పాన్ మోటెల్స్ ప్రైవేట్ లిమిటెడ్) కమల్ నాథ్ సొంతం అని లేదా కంపెనీలో ప్రధాన భాగస్వామి ఆయనకుటుంబ సభ్యలేనని. కమల్ నాథ్ కేసులో ఎక్కడ ఈ విషయాన్నిఖండించ లేదు. ఇది వేరే విషయం.
కేసుకు కారణం, ఫిబ్రవరి 25, 1996న ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన వార్త. ఈ వార్త ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నది ఒడ్డున స్పాన్ మోటెల్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ స్పాన్ రిసార్ట్స్ పేరుతో స్పాన్ క్లబ్ ప్రాజక్టు ప్రారంభించింది. దీనికోసం ఈ కంపెనీ దాదాపు పదిన్నర ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసింది. ఏప్రిల్ 11, 1994న కేంద్రం అంటే మంత్రి కమల్ నాధ్ ఈ కబ్జాను రెగ్యులరైజ్ చేసి కంపెనీకి అప్పగించారు.
ఇక్కడ బుల్డోజర్లు, ఎర్త్ మూవర్స్ తో తవ్వి నది ప్రవాహం మార్చారు. దీనితో సెప్టెంబర్ 1993లో బియాస్ లో వరదలొచ్చాయి. సుమారు 105కోట్ల ప్రాపర్టీ నష్టం జరిగింది.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ శాఖ స్పాన్ క్లబ్ ప్రాజక్టుకు ఇచ్చిన భూమి బియాస్ నది ఒడ్డున ఉందని కాబట్టి ఇది ప్రజల ఉమ్మడి సొత్తుగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొనింది. బియాస్ నది చాలా చురకైన నది అని, అది కొత్తగా పుట్టిన నది కాబట్టి తరచు తన ప్రవాహ ప్రాంతాన్ని మార్చుకుంటూ ఉంటుందని కోర్టు చెప్పింది.
ఇపుడు స్పాన్ క్లబ్ కట్టాలనుకుంటున్న మోటెల్ భూమి అటవీ భూమి అని, అది పర్యావరణ పరంగా చాలా సున్నితమయింది కాబట్టి ప్రయివేటుపరం చేయడం చెల్లదని కోర్టు చెప్పింది.
ఇక్కడే కోర్టు Dotctine of Trust సూత్రాన్ని కేసుకు అన్వయించింది. చివర కోర్టు లీజ్ డీడ్ ను కొట్టి వేసింది. మోటెల్ పర్యావరణానికి నష్టం కల్గించినందున స్పాన్ మోటెల్స్ పరిహారం చెల్లించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.
అమరావతిలో కూడా డాక్ట్రిన్ అఫ్ ట్రస్టు
ఇపుడు కృష్ణా నది కరకట్ట ప్రాంతంలోని కట్టడాలకూ ఇదే తీర్పు వర్తిస్తుందని జగన్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిజానికి 2016లొనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, న్యాయవాడి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మొత్తం 52 నిర్మాణాలపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాన్ని 2016లో దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్ 15 వ ప్రతివాదిగా చేర్చారు.ఈ కేసు మీద హైకోర్టు ఇపుడు హైకోర్టు పరిశీలనలో ఉంది.
సుప్రీం కోర్టు మెహతా వర్సెస్ కమల్ నాథ్ కేసు తీర్పు అధారంగా ముందుకు వెళ్లేందుకు వీలుందేమోనని న్యాయనిపుణులను సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఇపుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమే నని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ప్రకటించారు.
ఈ ఇల్లు కృష్ణానది ఒడ్డున లింగమనేని గెస్ట్ హౌస్ గా ఉండిన ఒక అక్రమకట్టడం. కాబట్టి నాయుడి నివాసానికి కూడా ముప్పువుందని తెలుగుదేశం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.