మరో వందేళ్లో మీరిపుడున్నట్లుగా మీ వారసులు నిటారుగా నిలబడి ఉంటారన్న గ్యారంటీ లేదు.
అందం డెఫినిషన్ మారిపోవచ్చు. అపుడు అందాలరాణులకు, సినిమా హీరోలకు, హీరోయిన్లకు గూని వుండే అవకాశం ఉంది.
అవును అంతే మరి, దానిని మనం ఒక మానవ పరిణామ వాస్తవంగా స్వీకరించాలి. ఎందుకంటే, మనిషి ఆకారం మీద ఇపుడొస్తున్న టెక్నాలజీ బలమయిన ప్రభావం చూపనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనిషి శరీరాకారం, మనకు ఇష్టమున్నా లేకున్నా, మరొక వందేళ్లలో విపరీతంగా మారిపోతున్నది. ఇపుడు మనం అందవిహీనం అని భావించే లక్షణాలు అపుడు కామన్ కాబోతున్నాయి.
ఇపుడు మనమంతా టెక్నాలజీకి బానిసలయిపోయాం. అయితే, అది మనిషికి కొత్త ఆకారాన్ని తెస్తా ఉంది.
టెక్ దురలవాటు ముదరడంతో వచ్చే వందేళ్లలో మానవులకు గూని వస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2100 నాటి తయారయ్యే కొత్త మానవులను శాస్త్రవేత్తలు ‘మైండీ’ (Mindy) అని పిలుస్తున్నారని యుకె కి చెందిన thesun.co.uk వెబ్ సైట్ ఒక కధనం ప్రచురించింది.
గంటల తరబడి కంప్యూటర్ మానిటర్ ముందు కూలబడటం, మెడను కొంగలాగా వంచి స్మార్ట్ ఫోన్ లలో తలదూర్చి బతుకున్నందున ఈ విపత్కర పరిణామం ఎదురుకాబోతున్నదని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీని ఛాయలు అపుడే శరీరంలో కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఇదంతా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ దెబ్బే నని అంటున్నారు.
మనిషి భంగిమ బలహీనపడుతున్నది కాబట్టి మైండీల మెడ కండరాలు బాగా జంపుగా ఉంటాయని వారు వూహిస్తున్నారు.
2100 నాటికి రానున్న మానవ మైండీల మెదడు పరిమాణం బాగా తగ్గిపోతుంది. అంటే తలకాయలు బాగా బాగా చిన్నవవుతాయి. అంతంగానే ఉన్న మెదడును జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి, పుర్రెముకలు దృఢంగా తయారవుతాయి. (అపుడు హెల్మెట్ అవసరం ఉండదేమో).
చాలా మటుకు కుర్చీకే అతుక్కుపోయి కదలికలేని జీవితం గడుపుతున్నందున ఇపుడున్న మెదడు అవసరం ఉండదు కాబట్టి అదికుంచించుకుపోతుంది.
ఎపుడూ ఫోన్ చేతులో ఉంటుంది కాబట్లి, ఫోన్ ని భద్రంగా చేతి పట్టులో ఉండేలా చేసేందుకు వేళ్లు జంతువుల గోర్ల లాగా తయారవుతాయి.
గంటల తరబడి పోన్ లోకి వంగి తొంగిచూడటం వల్ల మెడ మీద భారం పడుతుంది, వెన్నెముక బ్యాలన్స్ తప్పిపోతుందని మేపుల్ హొలిస్టిక్స్ లో హెల్త్ అండ్ వెల్నెస్ నిపుణుడు కెలెబ్ బాఖ్ చెబుతున్నారు.
ఇదే విధంగా ఎడతెరిపి లేకుండా కంప్యూటర్ ముందుకూర్చోవడం వల్ల మొండెం విల్లులా వంగుతుందని బాఖ్ చెబుతున్నారు.
కంటి మీద ఎక్కువ వెళుతురు పడి కన్నుకు నష్టపోయే ప్రమాదం నివారించేందుకు మనిషి దేహం కూడా ఒక కొత్త వ్యూహం తయారుచేసుకుంటుందని అపుడు రెండో కనురెప్ప తయారువుతుందని Toledo University కి చెందిన కసూన్ రత్నాయకే చెబుతున్నారు.
టెక్నాలజీ మనకి చాలా ప్రయోజనాలు కల్పిస్తున్నది. జీవితంలో సౌకర్యం, కనెక్టివిటి, ఎంటర్టైన్ మెంట్… ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇవి వూరికేరావు. మనిషి ప్రకృతి దీనికి పరిహారం అడుగుతుంది. టెక్నాలజీకి అతిగా బానిసవడం మూలాన ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావం చూపుతుందని TollFreeForwarding.com హెడ్ జేసన్ ఒ బ్రియాన్ చెబుతున్నారు. 2100 లో మనిషి ఎలా ఉంటాడనే మోడెల్ తయారు చేసిందీ కంపెనీయే.
ఇపుడున్న కుర్రవాళ్లని మిల్లినియల్స్అంటారు. వీళ్లంతా 1990 కి అటుఇటుగా పుట్టిన వాళ్లు. స్మార్ట్ ఫోన్ కు బానిస కావడం తో మిల్లినియల్స్ కు పుర్రెల మీద కొమ్ములు మొలుస్తున్నట్లు కనుగొన్నారు. ఈ వార్తప్రపంచమంతా సంచలనం సృష్టించింది.
రోజుకు నాలుగు గంటలకు పైబడి స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోయి చూస్తున్నందున బ్రిటన్ కుర్రవాళ్లలో ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అస్ట్రేలియా లోని సన్ షైన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అనేక మంది మిల్లినియల్స్ పుర్రె దిగువన ఈ కొమ్ములు మొలయడం కనుగొన్నారు. మూడు సెంటిమీటర్ల దాకా పెరిగిన ఈ కొమ్ములను EEOP (Enlarged External Occipital Protuberances)అని పిలుస్తున్నారు. సుమారు 200 మంది కుర్రవాళ్ల ఎక్స్ రేలను పరిశీలించినపుడు ఈ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ డేవిడ్ షహర్, అసోసియేట్ ప్రొఫెసర్ మార్క్ శేయర్స్ కు ఈ కొమ్ములు కనిపించాయి. ఈ ఎక్స్ రే లన్నీ 18-30 సంవత్సరాల వయసున్నవారివి.
మనిషి సాధారణంగా నిమిషానికి 20 సార్లు కనురెప్ప కొడతాడు. అయితే, కంప్యూటర్ స్ర్కీన్ ని చూస్తున్నపుడు ఇది ఒకటి నుంచి మూడింతలు తగ్గిపోతుంది. దీనివల్ల కళ్లు తడారి పోతాయి. కళ్లు బరువెక్కినట్లుంటాయి. చూపు మసక బారినట్లుంటుంది. అంతిమంగా తలనొప్పి వస్తుంది. ఇంగ్లండులో జనాభాలో సగానికి పైగా సగటున అయిదున్నర గంటల పాటు కంప్యూటర్ మానిటర్ కు అతుక్కుపోయిఉంటారు.
(ఈ స్టోరీ నచ్చితే అందరికీ షేర్ చేయండి, trendingtelugunews.com ను ఫాలో చేయండి)