తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సరిగ్గా ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్ద శిలాపలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 11.26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. 1.07 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్ ను స్విచాన్ చేశారు. పంప్ హౌజ్ లో మధ్యాహ్నం 1.15 గంటల నుండి నీటి పంపింగ్ ప్రారంభమయింది. దీంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వె.ఎస్. జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు.