ఒక వైపు సిఎల్ పి నాయకుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కాళేశ్వర ప్రాజక్టు నిర్మాణాన్ని తప్పుపడుతుంటే,పార్టీ సంగారెడ్డి జగ్గారెడ్డి మాత్రం కాళేశ్వరం నిర్మాణం తప్పు పట్టాల్సిన అవసరం లేదని సంచలన ప్రకటన చేశారు.
ఈ రోజు ఆయన విలేకరులతో మాట్టాడుతూ కాళేశ్వరం ప్రారంభాన్ని స్వాగతిస్తూ న్నానని అన్నారు. ఈ ప్రాజక్టును ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 21 న ప్రారంభిస్తున్న సంగతితెలిసిందే. ఈ కార్యక్రమాానికి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను, ఆంధ్రముఖ్యమంత్రి జగన్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
కాళేశ్వరం పూర్తి అయితే తన నియోజకవర్గం లోని సింగూరు , మంజీర నీళ్ళు వస్తాయని ఇదే విధంగా సంగారెడ్డి కి ఉపయోగ పడే అత్యంత పురాతన మహబూబ్ సాగర్ కు నీళ్ళు వస్తాయని జగ్గా రెడ్డి అన్నారు.
‘ఈ ప్రాజక్టులకు నీళ్లు వస్తే మా సంగారెడ్డి ప్రజల సాగు , త్రాగు నీటి సమస్య తీరుతుంది. మంచి పని ఎవరు తలపెట్టిన సమర్థించాలి. ప్రాజెక్ట్, డ్యాం లు రైతులు, ప్రజల కోసం ఎవరు కట్టినా మంచిదే,’ అని ఆయన అన్నారు.
’తెలంగాణ తొలి డ్యాం నాగార్జున సాగర్ నెహ్రూ ప్రధానిగా శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ సీఎం లు పూర్తి చేశారు, శ్రీశైలం కూడా ఇందిరా ప్రధానిగా ఉన్నపుడే కాంగ్రెస్ సీఎం లు పూర్తి చేశారు.మా సింగూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లో నే నిర్మించారు,’ అని ఆయన అన్నారు.
నాడు కాంగ్రెస్ సీఎం లు కట్టినా నేడు సీఎం కెసిఆర్ కట్టినా అన్ని తెలంగాణ ప్రజలకోసమే అని భావించాలి.వాటిని రాజకీయం చేయవద్దని ఆయన కాలేశ్వరం విమర్శకులకు సలహా ఇచ్చారు.
ఒక రకంగా సోనియా గాంధీ , రాహుల్ తెలంగాణ ఏర్పాటు చేయటం వల్లే కెసిఆర్ సీఎం అయ్యి కాళేశ్వరం కడుతున్నాడు అందులో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది కదా అని ఆయన అన్నారు.
కాళేశ్వరం పూర్తయిన ఏడాది లో సింగూరు, మంజీర, మహబూబ్ సాగర్ లను నీళ్ళతో నింపితే మా సంగారెడ్డి రైతులు, ప్రజల పక్షాన కెసిఆర్ గారికి ఘనంగా సన్మానం చేస్తానని ఆయనవ్యాఖ్యానించారు.
కాళేశ్వరం అవినీతి గురించి నేను మాట్లాడను అది భట్టి చూసుకుంటారని ఒకప్రశ్నకు సమాధానంగా జగ్గారెడ్డి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి జగన్, మహారాష్ట్ర సీఎం వచ్చినా తప్పులేదని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కార్యక్రమానికి రావద్దనడం సరికాదని ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య అలాంటి సంబంధాలుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరం ప్రాజక్టుకు హాజరుకావద్దని సిఎల్ పి నాయకుడు భట్టి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ను కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే.