తాను రాజకీయాల్లోకి రావడంలో ఆలస్యమయిందని, ఈ మేరకు అది తప్పని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తూర్పు ఉత్తర ప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జ్ ప్రియాంక గాంధీ ఒప్పుకున్నారు.
‘పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగానో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగానో రమ్మన్నపుడు తిరస్కరించాను. అపుడు అలా చేయడం నా తప్పే. అయితే, ప్రజలు తప్పులనుంచే నేర్చుకుంటారు. అలాగే నేనూ నా అనుభవం నుంచి నేర్చుకుంటున్నాను., ఇపుడు మళ్లీ పార్టీ అధ్యక్షుడు ప్రతిపాదించాక ఇక సమయం వచ్చిందని నేను నిర్ణయించుకున్నారు. అపుడు నేను చేసింది తప్పనే భావిస్తున్నాను. ఇపుడు బాధ్యతలను స్వీకరించాను,’అని ప్రియాంక అన్నారు.
వచ్చే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగ ప్రవేశం చేస్తారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ,‘నేనిపుడు సంస్థకు ప్రధాన కార్యదర్శిని. ఇక్కడికి వచ్చింది పార్టీని బలోపేతం చేయడానికి. నాకు పదవీ వ్యామోహంగాని, కాంక్షగాని లేనపుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రతిపాదన గురించి ఎలా మాట్లాడతాను,’అని ప్రియాంక చెప్పారు.