ప్రొఫెసర్ జి.హరగోపాల్ తో ఇంటర్వ్యూ -3
–రాఘవ శర్మ
‘ఆర్థిక సంబంధాలే అన్నీ నిర్ణయిస్తాయని మార్క్స్ చెప్పిన మాటను కొంత యాంత్రికంగా తీసుకున్నామేమో అనిపిస్తుంది.
కుల వ్యవస్థపైన ఆధారపడి మనుగడ సాగించేవారు, కులం దాటేసిన వారిని కూడా కులంతో ముడిపెట్టడం ఏమిటి?
ఏ అంశంపైన పరిశోధన చేయాలన్నా ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు స్వేచ్ఛ లేదు.’ అంటారు హరగోపాల్. ప్రముఖ రాజనీతి శాస్త్ర నిపుణులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ఆచార్యులు ప్రో. హరగోపాల్ తో జరిపిన ఇంటర్య్యూలో మరికొంత భాగం.
ప్రశ్న : సామ్రాజ్యవాదాన్ని ప్రపంచీకరణ ఎలా స్థిరీకరిస్తోంది? వీటిని ఎదుర్కోలేకపోవడంలో స్థానిక బలహీనతలు ఏమిటి?
హరగోపాల్ : ప్రపంచీకరణలో చాలా ఉన్నాయి.
మంచి ఉంది, చెడు ఉంది.
చెడు ఫలితాలనే ప్రపంచీకరణ అంటున్నారు.
ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మనం నిరసన తెలపడం ప్రపంచీకరణే కదా!
అలాంటి విలువలు ధ్వంసమై అణచివేయడమే సామ్రాజ్యంవాద లక్ష్యం.
పెట్టుబడిని ప్రపంచీకరిచడమే దాని లక్ష్యం.
ప్రపంచవ్యాపితంగా హక్కులు ఉన్నాయి.
సామ్రాజ్య వాదం అనే మాటను సరళీకరణ, ప్రపంచీకరణ అనే మాటలుగా మార్చేశారు.
ప్రపంచీకరణ అంటే రెండు అర్థాలు ఉన్నాయి.
పాజిటివ్, నెగటివ్.
‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అన్నది పక్కకు పోయి, పెట్టుబడి ప్రపంచీకరణ కోసం ఎల్ పీ జీ(లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) తెచ్చి మార్కెట్ ప్రమేయం పెంచారు.
ప్రశ్నః ప్రపంచీకరణ ద్వారా మతం సామ్రాజ్యవాదానికి ఏమైనా దోహదం చేస్తోందా?
హరగోపాల్ : సామ్రాజ్యవాదానికి హేతుబద్దత ఉంటుంది.
తనకు ప్రయోజనం ఉంటేనే మనిషి ఆలోచనను, ప్రశ్నించే తత్వాన్ని సామ్రాజ్య వాదం ప్రోత్సహిస్తుంది.
ప్రశ్నించడం తనకు ఉపయోగపడుతుందని భావిస్తేనే ప్రశ్నించడానికి సామ్రాజ్య వాదం అవకాశం కల్పిస్తుంది.
ప్రశ్నించడం వల్ల తనకు నష్టం వస్తుందని భావిస్తే, సామ్రాజ్య వాదం దాన్ని అణచివేస్తుంది.
వాడు చెప్పిన జ్ఞానాన్ని నీవు చెప్పాలి.
వాడికి నష్టం కలిగే జ్ఞానాన్నే నీవు చెపితే ఎలా?
ఏ అంశంపైన పరిశోధన చేయాలన్నా ఒకప్పుడు విశ్వవిద్యాలయాలకు స్వేచ్ఛ ఉండేది.
ఇప్పుడు ఆస్వేచ్ఛ తగ్గుతున్నది.
ఇప్పుడు ‘జాతీయ పరిశోధనా సంస్థ’ అంగీకరిస్తేనే పరిశోధన చేయాలి.
ఒక శాస్త్ర వేత్త ‘ఇది చర్చించాలి, దీనిపైన చర్చ జరగాలి’ అంటే ఒప్పుకోవడం లేదు.
విశ్వవిద్యాలయాల పునాదిపైన, స్వయం ప్రతిపత్తిపైన, నియామకాలపైన దాడి చేస్తున్నారు.
అన్ని రంగాల్లో ఒక నిర్బంధ వాతారణాన్ని తీసుకొచ్చారు. ఇక్కడుండే రాజ్యం మన అవసరాలేంటి అని కాకుండా, వాడు చెప్పినట్టు చేసే పరిస్థితికి దిగజార్చారు.
మనిషికున్న నిజమైన సమస్యలు వదిలేసి, మౌలిక ప్రశ్నలు వదిలేసి, మత విద్వేషాలు పెంచడం సామాజ్యవాదం చేస్తున్న పని.
మౌలిక సమస్యలపైనుంచి దృష్టిని మళ్ళిస్తారు.
ప్రజలు కాస్త చైతన్యవంతులు అవుతున్న సమయంలో ఈ విభజన తెస్తున్నారు.
ప్రశ్న : మతాన్ని ఆధారం చేసుకుని పాలకులు ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్నారు కదా. అభ్యుదయ కాముకులు ఆర్థిక దోపిడీని పట్టించుకున్నంతగా, సాంస్కృతిక పీడనను పట్టించుకోలేదన్న వాదనపైన మీరేమంటారు?
హరగోపాల్ : మార్క్సిస్టు పద్ధతిలో సమాజాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది ఒక పరిమితిలో ఉండిపోయారు.
మార్క్స్ జీవించిన కాలంలో ఆనాటి పరిస్థితుల రీత్యా ఆర్థిక సంబంధాలే అన్నీ నిర్ణయిస్తాయని ఆయన చెప్పిన మాటను కొంత యాంత్రికంగా తీసుకున్నామేమో అనిపిస్తుంది.
గ్రామ్సీ, రేమండ్ విలియమ్స్, క్రిస్టఫర్ కాడ్వెల్ కూడా సూపర్ స్ట్రక్చర్ గురించి ఆలోచించారు.
అందుకే మావో సాంస్కృతిక విప్లవానికి పోవలసి వచ్చింది.
పైకప్పునుంచి పడే నీరు కూడా ఇంటికి ఉన్న పునాదిని ప్రభావితం చేస్తుంది.
ఆర్థిక పునాది ప్రధానమైనా, మానవ చైతన్యం భిన్న ప్రభావాలకు లోనవుతుంటుంది.
ముఖ్యంగా ఆసియా ఖండంలోని దేశాల సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను మరింత అధ్యయనం చేయవలసిన అవసరముంది.
గ్రామ్సీ చెప్పినట్టు ఇటాలియన్ సమాజానికి మన సమాజానికి చాలా పోలికలు ఉన్నాయి.
మన దగ్గర మతం కంటే కులం ప్రధానం.
కులం నిర్మాణం. మతం భావజాలం.
వీటిని ఎందుకో అంతగా పట్టించుకోలేదు.
మార్క్సిజం ఈ దేశ పరిస్థితులనుంచి అన్వయించుకున్నట్టయితే బుద్దుడి నుంచి ప్రారంభించే వాళ్ళం.
రష్యన్ విప్లవం ఆ నాటి చారిత్రక పరిస్థితిలో విజయవంతం అయ్యింది.
చైనాకు కూడ ఒక అనుకూలత ఏమిటంటే అంతా ఒకే భాష, అందరికీ ఒకే భాషలో చెప్పే అవకాశం ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధ సందర్భం ఉంది.మన దేశంలో అనేక భాషలున్నాయి.
భారత దేశ చరిత్రను, దేశ వైవిధ్యాలను అర్థం చేసుకుని, ఆ వైవిధ్యం నుంచి మార్క్సిస్టు అవగాహన పెరగాలి. స్వాతంత్ర్యోద్యమ కాలంలోనే బీహార్ , తెలంగాణాలో చాలా వెనుకబడిన ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమించింది. భారతదేశానికి సంబంధించినంతమటుకు మనం మతాన్ని లోతుగా అర్థం చేసుకోలేదు.డాక్టర్ అంబేద్కర్ కులం, మతం మూలాలను పరిశీలించారు.
కమ్యూనిస్టు నాయకులు అంబేద్కర్ ని బీహార్ తీసుకెళ్ళి కుల సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
కమ్యూనిస్టు నాయకులు వర్గాలు పోతే కులం పోతుందని చెప్పారు.
తెలంగాణా సాయుధపోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీ ఒక దేవాలయాన్ని కట్టించింది.
దీనిపైన ప్రశ్నించినప్పుడు ప్రజల చైతన్యం ఆ స్థాయిలో ఉందని, వారిలో చైతన్యం పెరిగితే వారుకట్టిన దేవాలయాన్ని వారే కూలగొడతారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అప్పట్లో అంతకు మించి లోతులకోకి వెళ్ళలేదు. భూస్వామ్యం ఒక సిద్ధాంతం. భూస్వామి వేరు, భూస్వామ్యం వేరు.
రష్యా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. రష్యన్ ప్రభావంతో పనిచేశాం.
చైనాలో జరిగిన విప్లవం లాంటిది భారత దేశంలో జరిగే అవకాశం ఉందా అన్నది సవాలు.
అప్పటి చారిత్రక సందర్భంలో గాంధీ చేతిలో భగవద్గీత పట్టుకుని మతాన్ని ఒక ప్రతీకగా తీసుకున్నాడు.
మత చిహ్నాలని ప్రజల సమీకరణకు ఉపయోగించాడు.
విజయవంతం అయ్యాడు.
కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక జీవితాన్ని, చైతన్య స్థాయిని పూర్తిగా విశ్లేషించలేకపోవడం వల్ల విఫలమైంది. బీజేపీ వారు మతపర సాంస్కృతిక అంశాలను ఉపయోగించి, రాజకీయాలలో పరిమితంగా ఐనా విజయవంతం అయ్యారు. భారత దేశంలో కులం ఇప్పటికీ బలంగా పనిచేస్తున్నది.
ఒకసారి రజకుల సమావేశంలో మాట్లాడాను. అసలు బట్టలు ఉతకడమే తమ ఆత్మాభిమానానికి సంబంధించిందనుకుంటే బట్టలు ఉతకడం మానేయండని అన్నాను. దళితుల బట్టలు మాత్రమే ఉతకమనడం సరికాదన్నాను. సభలో ఉద్రిక్తత ఏర్పడింది.
ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టమైంది.
మనం ఎంత ప్రయత్నం చేసినా, పుట్టుకతోనే కులం నిర్ధారణ జరగడంతో ప్రశ్న సంక్లిష్టమైపోయింది.
దాని శక్తి ప్రతి రోజు మన జీవనాన్ని శాసిస్తూపోతోంది.
దీన్ని పూర్తిగా పట్టించుకోకుండా, భూసమస్యలు మారితే ఇది మారుతుందని అనుకోవడం యాంత్రికం అంటాను. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండే నమ్మకాలు, భూ సంబంధాలు కల్చర్పైన ఒక క్రిటిక్ ఉండాలి. అంబేద్కర్ ఈ అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించారు.
మతం మనిషి చైతన్యాన్ని మొత్తంగా అదిమిపట్టింది.
భూ సంబంధాలు మారితే అన్ని సంబంధాలు మారుతాయనుకోవడం సరికాదు.
చైనాలో సాంస్కృతిక విప్లవం తీసుకురావడంతో మళ్ళీ ఒక విప్లవ ప్రయోగం జరిగింది.
దాంట్లో కొంత మంచీ జరిగిందీ, కొంత అరాచకాలూ జరిగాయి. బహుశా మన దేశంలో సమాజాన్ని సంసిద్ధం చేయకుండా భూమిని, భౌతిక స్థితిని ఆధారం చేసుకోవడం వల్ల పోరాటాలు దెబ్బతింటున్నాయి.
పూర్తిగా త్యాగం చేసినవారికి కూడా కులం అంటగడుతున్నారు.
చాలా మంది ఈ ఉద్యమాల్లో డిఫెన్స్ లో ఉన్నారు.
ఎంత మారినా గుర్తించడానికి ఒక వర్గం సిద్దంగా లేదు.
మీ నేపథ్యం వేరు, మీ సమస్యలు వేరు.మా నేపథ్యం వేరు, మా సమస్యలు వేరు అంటున్నారు ఒక దళిత వ్యక్తి. దళితులను ఎలా అర్థం చేసుకోవాలో, అగ్రకులాలను కూడా అలాగే అర్థం చేసుకోవాలి.
మతం పేరుతో రాజకీయాలు చేసే వారికి చరిత్రలో చోటు లభించింది.
కులం గురించి మాట్లేడేవారికున్న చోటు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి లేకుండా పోయింది. కులం పోవాలని చెప్పవచ్చు.
కుల వ్యవస్థపైన ఆధారపడి మనుగడ సాగించేవారు, కులం దాటేసిన వారిని కూడా కులంతో ముడిపెట్టడం ఏమిటి? కులానికి అతీతంగా జీవిత ఆచరణలో ఉన్నవారు కూడా కులం కోణం నుండే చూస్తున్నారు. కులం లేకుండా మతం లేదు.
ఈ దేశంలో కులం మతానికి పిల్లర్. ఆంటోనియో
గ్రామ్సీ నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంది.
మతంలో ఏమైనా అభ్యుదయ శక్తులు ఉన్నాయా అని ఆలోచించాలి.
సాంఖ్యను తీసుకోవాలి.
బుద్ధుడు నుంచి తీసుకోవాలి.
భావ ఉద్యమం కూడా ప్రధానమే.
ఆదివాసీల పోరాటాలను, విప్లవోద్యమాలను తమ చారిత్రక వారసత్వంగా భావించాలి.
ఆ చరిత్రపునాదిగా మనం ఇంకా ముందుకు పోవాలి.
బూర్జువా రాజ్యాంగమని తిరస్కరించాం.
ఆర్ఎస్ఎస్ వారు అదే చేశారు.
కమ్యూనిస్టులూ అదే చేశారు.
స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఐదేళ్ళ తరువాత కూడా విప్లవ పార్టీలు సెక్యులరిజం గురించి, సోషలిజం గురించి చెపుతున్నాయి.
ఆ రోజుల్లో రాసిన రాజ్యాంగంలో ఉన్న విషయాలను అమలు చేయగలరా?
అమలుచేసే క్రమంలో ప్రజలను మళ్ళీ తీసుకురాగలమా?
ఎన్నికలను తిరస్కరిండం ద్వారా, రాజ్యాంగాన్ని తిరస్కరించడం వల్ల ప్రజలకు దూరమయ్యారు.
దీన్ని పునఃసమీక్షించుకోవాలి.
పార్లమెంటరీ వామపక్ష పార్టీలైతే పూర్తిగా రాజీ పడ్డాయి.
విప్లవ పార్టీలు పునఃసమీక్షించుకోవాలి.
రాజ్యాంగాన్నైనా ఒక మేల్కొల్పుగా భావించాలే తప్ప పూర్తిగా తిరస్కరించడం సరికాదు.
ప్రశ్న : మత కార్యక్రమాల పేరుతో స్త్రీలను ఆధారంగా చేసుకుని మార్కెట్ విస్తరిస్తోంది. ప్రజలను ఇలా కొల్లగొట్టి నాశనం చేసే శక్తి మార్కెట్ కు ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి రుద్దితే వచ్చిందా? క్షేత్ర స్థాయినుంచి వచ్చిందా?
హరగోపాల్ : మనిషిలో కోరికలు ఉన్నాయి.
భౌతికంగా సంపద పెరుగుతున్నప్పుడు మార్కెట్ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తుంది.
వస్తువుల అవసరం మనుషులకు ఉంటుంది.
మనిషి అవసరాలకు, కోర్కెలకు మధ్య ఉన్న గీతను మార్కెట్ చెరిపేసింది.
కోర్కెలను అవసరాలుగా మార్చింది.
ఒక్కొక్క సారి తన అవసరాల కంటే కోర్కెలకే ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి మార్కెట్ కల్పిస్తుంది.
మార్క్సిస్టు ఆలోచనలోకూడా మతం పోవాలని, రాజ్యం పోవాలనే అంశాలు ఉన్నా మార్కెట్ కు ప్రత్యామ్నాయం ఏముంటుందని ఆలోచించలేదు.
మార్కెట్ కు ప్రత్యామ్నాయంగా సోషలిస్టు సమాజంలో ఏముంటుంది అనేది మనకు ఊహలో కూడా లేదు.
కరెన్సీని తీసేస్తే ఈ కొనుగోళ్ళు ఎలా సాధ్యమవుతాయి.
ప్రశ్న : ప్రపంచ వ్యాప్తంగా మిగతా జాతులలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
హరగోపాల్ : రష్యాలో జాతులు విడిపోయాయి. మతం పోలేదు.
ఆ ప్రాంతాలన్నీ మతం గుప్పెట్లో ఉండిపోయాయి.
మత ప్రభావం, జాతీయ అస్తితాత్వలు అలాగే ఉండిపోయాయి.
ప్రశ్న ః దేశం దారుణమైన గుజరాత్ అల్లర్లను చవి చూసింది. ఢిల్లీ, ముంబైలలో మత ఘర్షణలు జరిగాయి. మణిపూర్లో నెలల తరబడి జాతుల మధ్య ఘర్షణలు జరిగి, మారణ హోమం సాగుతుండగా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
హరగోపాల్ : ప్రభుత్వమే ఈ అల్లర్లలో భాగస్వామి కావడంతో సమస్య సంక్లిష్టమైపోయింది.
గుజరాత్ అల్లర్లలో రాజ్య వ్యవస్తే ఉంది.
1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమంలో రాజ్యవ్యవస్థ ఉంది.
మణిపూర్ గొడవల వెనుక పాలకులే ఉన్నారు.
గుజరాత్ లో జరిగిన మారణ హెూమానికి ప్రధాని కనీసం చింతిస్తున్నానని మాటమాత్రంగానైనా చెప్పలేదు.
ప్రతి మత ఘర్షణ వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజ్యం ఉంది.
రేపు హైదరాబాదులో బీజేపీ అధికారంలోకి వచ్చిందనుకోండి మతం ముందుకు వస్తుంది.
మత ఘర్షణలు కూడా పెరగవచ్చు.
ప్రశ్న ః భారత దేశ గొప్పదనం అంతా బహుళత్వంలోనే ఉందని చరిత్రకారులు అంటున్నారు. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలతో జీవిస్తున్న ఈ దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఎలా సాధ్యమవుతుంది?
హరగోపాల్ : రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కామన్ సివిల్ కోడ్ ప్రస్తావన వచ్చింది.
దేశంలో వైవిధ్యము, భిన్నత్వమే కాకుండా, ఆధిపత్యము, కొన్ని అసమానతలు కూడా ఉన్నాయి.
అంబేద్కర్ కూడా ఈ దృష్టితో నైతికతల స్థానంలో రాజ్యాంగ నైతికత చోటు చేసుకోవాలని ప్రతిపాదించారు.
రాజ్యాంగంలో కామన్ సివిల్ కోడ్ పెట్టాలని సూచించినా, ఆచార వ్యవహారాల్లో ఏకత్వం తీసుకురావడానికి ప్రయత్నించలేదు.
వైవిధ్యంలో చాలా అనుకూలాంశాలున్నాయి, ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి.
కామన్ సివిల్ కోడ్ తెస్తామనే వారు సమాజంలో మానవ సంబంధాలు మెరుగు పడాలని కాకుండా, దాన్ని రాజకీయాలకు ఎలా ఉపయోగించుకోవాలి, మైనారిటీల ఆచారాలపైన ఎలా దాడి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నారు.
21వ లా కమిషన్ దీన్ని అనవసరమని, అవసరం లేని ఆకాంక్ష అని అంది.
నేడు అన్ నెసిసరి, అన్ డిజైరబుల్ అనేకాకుండా అమలు చేయడం అంత సులభం కాదు.
ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వస్తే, రాజకీయ ప్రత్యర్థి ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వారిపైన దాడి జరగడానికి వీలవుతుంది.
ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో యూనివర్సల్ సివిల్ కోడ్ దుర్వినియోగం చేయడానికే ఎక్కువగా ఉపయోగపడుతుంది.
ప్రశ్న : ప్రజలకు, పాలకులకు మధ్య ఒక సామాజిక ఒడంబడిక ఉంటుందని రూసో చెప్పాడు. మీరు కూడా ఒక వ్యాసంలో ఈ విషయాన్ని గుర్తుచేశారు. అసలు ఈ ఒప్పందం అంటూ ఒకటుందని పాలకులకు తెలుసా? దీనిపై ప్రజలకు ఏమైనా అవగాహన ఉందా?
హరగోపాల్ : రాజ్యం ప్రజలు అంగీకరించడం వల్లనే వచ్చింది.
తాము అత్యంత స్వేచ్ఛా జీవులైనా, భద్రత కొరకు రాజ్యాన్ని సృష్టించుకున్నారు అనేది ప్రాథమిక వాదన.
దీనికి బదులుగా ప్రజలకు ఇతర హక్కులతో పాటు స్వేచ్ఛతో కూడిన భద్రత కల్పిచారు.
అందుకోసం తమ హక్కులను కొన్ని రాజ్యానికి ఇచ్చేశారు.
ఈ పాలకులకు ఆ భావన తెలియదు.
రూలింగ్ క్లాస్ లో అవగాహన ఉన్నవాళ్ళలో నెహ్రూ ఒకరు.
నెహ్రూ ‘,రెలిజియన్ అండ్ మార్క్సిజం’ అంశాన్ని విశ్లేషిస్తూ, మతం మానవ జీవితాన్ని చాలా అంశాల్లో నియంత్రిస్తుంది.
దీనికి ప్రత్యామ్నాయంగా మార్క్సిజం కనిపిస్తుంది అని వ్రాశారు.
రాజ్యం ఎందుకొచ్చింది, అది చేయవలసిన పనేమిటి అన్న ప్రాథమిక అంశాలు కేసీఆర్ లాంటి వారికి అవగాహన కావడం కష్టం.
(ఇంకా ఉంది)