ప్రొఫెసర్ జి.హరగోపాల్ తో ఇంటర్వ్యూ-2
–రాఘవ శర్మ
‘‘ ప్రపంచీకరణతో పాటు మతత్వ రాజకీయాలూ దానితో పెనవేసుకుని పెరిగాయి.
మార్కెట్ లాభాల కోసమే ఉంది.
దానికి సంక్షేమ లక్ష్యం లేదు.
హింస ఎక్కడ జరిగినా పౌర హక్కుల సంఘం పట్టించుకోకుండా ఉండలేదు.
పౌర హక్కుల సంఘం నిరంతర చలనంలో ఉందనడానికి ఇది ఉదాహరణ ’’ అంటారు ప్రొఫెసర్ జి. హరగోపాల్.
హరగోపాల్ తో చేసిన ఇంటర్వ్యూలో ఇది మరి కొంత.
ప్రశ్న: ప్రైవేటు హింస గురించి మీరేమంటారు?
హరగోపాల్ : రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రతిఘటనా ఉద్యమాలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో ఒక చర్చ జరిగింది.
రాజ్య హింసను వ్యతిరేకిస్తున్నారు సరే, నక్సలైట్ల నుంచి వచ్చే హింస గురించి పౌరహక్కుల సంఘం ఎందుకు మాట్లాడకూడదు అన్న ప్రశ్న లేవనెత్తారు.
నక్సలైట్ల హింస కూడా శ్రుతి మించితే పౌరహక్కుల ఉద్యమం పట్టించుకోవాలి కదా!
నక్సలైట్ ఉద్యమంలో ‘ఇన్ఫార్మర్’ అని ఆరోపించి ఎవరిపైనైనా చర్య తీసుకుంటే, వారు దాడి చేసినప్పుడు అమాయక ప్రజలు చనిపోతే ఆ హింస గురించి ఎందుకు హక్కుల సంఘం మాట్లాడకూడదనే ప్రశ్నలు వచ్చాయి.
పూర్తిగా ఈ వాదనను నిర్లక్ష్యం చేయకూడదన్న చర్చ మొదలైంది.
రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని సంఘం ఏర్పడితే, ఉద్యమాల హింస గురించి మనమెందుకు మాట్లాడడం అన్న ప్రశ్న కూడా ముందుకు వచ్చింది.
రెండు వాదనలు వచ్చాయి.
హింస ఎక్కడ జరిగినా పౌరహక్కుల సంఘాలు పట్టించుకోకుండా ఉండలేవు.
సమాజం నుంచే ప్రశ్నలు వస్తున్నాయి కనుక, వారెక్కడైనా అకారణంగా హింసను ఉపయోగిస్తే, స్పందించాలి అనే వాదనను నుంచి నక్సలేట్లే కొన్ని ప్రమాణాలు పెట్టుకోవాలి.
ఉద్యమంలో వారు ప్రమాణాలు పాటించకపోతే వాటిని ప్రశ్నించాలి.
పౌరహక్కుల నుంచి విడిపోయిన మానవహక్కుల ఫోరం హింస జరిగితే అన్ని రకాల చర్యలను, చివరికి ఉద్యమాలను కూడా తప్పుపడుతుంది.
పౌరహక్కుల సంఘం ప్రధానంగా రాజ్య హింసను పట్టించుకుంటుంది.
కారంచేడులో భూస్వాములు దళితులను చంపినప్పుడు భూస్వాములు చేసిన హింస ప్రైవేటు హింస కాదా?
దాన్నెలా పట్టించుకుంటారు? అన్నది కూడా ప్రశ్నే.
భూస్వామి కూడా రాజ్యంలో భాగం కనుక పట్టించుకోవాలి కదా అన్నది ఆ ప్రశ్నకు సమాధానం.
పౌరహక్కుల సంఘం కుటుంబ హింస గురించి కూడా పట్టించుకోవాలని ప్రజలు, ముఖ్యంగా మహిళా ఉద్యమాలు ముందుకు తీసుకువచ్చాయి.
ఏడుగురు ఐఏఎస్ ఆఫీసర్లను నక్సలైట్లు కిడ్నాప్ చేస్తే మీరెందుకు వెళ్ళారన్నది ప్రశ్న.
ఆ ఐఏఎస్ ఆఫీసర్లంతా శంకరన్ లాంటి వారు కనుక పౌరహక్కుల సంఘం దాన్ని పట్టించుకోవాలన్నది చర్చ.
ఇలా విమర్శలు రావడం, చర్చలు జరగడం పౌరహక్కుల సంఘం నిరంతర చలనంలో ఉందనడానికి నిదర్శనం.
సవాళ్ళు వచ్చినప్పుడు పౌరహక్కుల సంఘం దానికి సమాధానం వెతుకుతోంది.
రెండు మూడు కిడ్నాప్ ఘటనలు జరిగినప్పుడు నేను కూడా వెళ్ళాను.
సమాజంలో ప్రైవేటు హింస ఉన్నప్పుడు రాజ్యం ఆ హింసను తగ్గించాలి.
రాజ్యం వాటి మూలాల్లోకి వెళ్ళాలి.
రాజ్యమే హింసకు పాల్పడితే, రాజ్యమే హక్కులను ఉల్లంఘిస్తే, ఏం చేయాలి అన్నది పౌరహక్కుల ఉద్యమం పుట్టుకకు ప్రధాన కారణం.
ప్రశ్న: పౌరహక్కుల ఉద్యమంపై ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉంది?
హరగోపాల్ : నిర్బంధ చట్టాలు రావడానికి, ‘ఉపా’ లాంటి చట్టాలు రావడానికి ప్రధాన కారణం రాజ్యం.
రాజ్యం ఎంత అణచివేసే సాధనం అనుకున్నా, శాంతి భద్రతలు మాత్రమే దాని బాధ్యత కాకుండా, అది సంక్షేమ రాజ్యంగా పనిచేయాలి.
రాజ్యం సంక్షేమ భావన లోంచి వచ్చింది.
విద్య, వైద్యం అందలో భాగం.
ప్రపంచీకరణ వచ్చేటప్పటికీ సంక్షేమం, పౌరుల అవసరాలు తీర్చడం మాత్రమే రాజ్యం పని కాదనే వాదన వచ్చింది.
సంక్షేమాన్ని ‘మార్కెట్’కు అప్పగించాలని ప్రపంచీకరణ ఒత్తిడి చేసింది.
దాంతో సంక్షేమాన్ని క్రమక్రమంగా మార్కెట్ కు అప్పగించేస్తున్నారు.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అప్పు ఇచ్చిన మరుక్షణమే కొన్ని షరతులు పెడ్తాయి.
నిరుద్యోగ సమస్యను మార్కెట్ కు అప్పగిస్తే అదే చూసుకుంటుందని భావిస్తున్నారు.
ప్రపంచీకరణ తరువాత 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించింది.
మనిషి తన సమస్య కోసం రాజ్యం దగ్గరకు వెళితే, ఆ బాధ్యత నాది కాదు, మార్కెట్ చూసుకుంటుందని తప్పించుకుంది.
రాజ్యానికి మానవహక్కుల పట్ల, పౌరహక్కుల పట్ల ఏమాత్రం గౌరవం లేదు.
రాజ్యంతోపాటు అంతర్జాతీయ పెట్టుబడి, భారత పెట్టుబడి, భూస్వామ్యం కలిసి పౌరహక్కుల పైన దాడి చేస్తున్నాయి.
ప్రపంచీకరణ 1991లో మొదలయ్యేసరికి అద్వానీ రథ యాత్ర కూడా మొదలైంది.
ప్రపంచీకరణ ఎలా పెరుగుతోందో, దానితోపాటే మతతత్వ రాజకీయాలు కూడా పెనవేసుకున్నాయి.
సంక్షేమ భావనను రాజ్యం ఒదులుకుంటే రాజ్యానికి ఇక మిగిలేది బలప్రయోగమే.
ఆ బల ప్రయోగం భజరంగ్ దళ్ లాంటి సంఘపరివార్ శక్తులు పెంచుతున్నాయి.
బలప్రయోగం చేసే బాధ్యతను ఎంతో కొంత రాజ్యానికి అప్పగించాం.
‘వీపు మీద కొట్టావు కానీ, పొట్ట మీద కొట్టద్దు’ అన్న నానుడి ఉన్నది.
మార్కెట్ పొట్టమీదే కొడుతుంది.
మార్కెట్ లాభాల కోసమే ఉంది.
దానికి సంక్షేమ లక్ష్యం లేదు.
మొత్తం మార్కెట్ కు అప్పగించడం రాజ్యానికుండే విశ్వసనీయతను బాగా దెబ్బతీస్తుంది.
ముఖ్యమంత్రి ఉచితంగా చీరలు పంచుతున్నాడనుకుందాం.
ఆ పని మార్కెట్ చేయదు కదా! సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది.
అది మర్కెట్ ఇవ్వదు కదా!
ఉద్యమాలు చేస్తే కొట్టడమే సాధారణం అయిపోయింది.
గెలవడం, నిర్బంధాన్ని తీసుకురావడం సర్వసాధారణమైపోయింది.
మామూలుగా పోలీసులు అరెస్టు చేస్తే 24 గంటలలోపు న్యాయస్థానాల ముందు హాజరు పరచాలి.
ఇరవై నాలుగు గంటలకు మించి నిర్బంధించడానికి వీలు లేదు.
‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేస్తే, 24 గంటలు కాదు, ఆరు నెలల వరకు జైల్లో వేయవచ్చు.
ప్రజల గురించి మాట్లాడే వారిని జైల్లో పెట్టారు.
ఉపా చట్టం రావడానికి ప్రపంచీకరణ వేగవంతం కావడమే కారణం.
ఒకప్పుడు సంక్షేమం గురించి చర్చ ఉండేది.
ఇప్పుడది లేదు.
ఆకలవుతుంటే తిండి పెట్టవు, కొట్టే అధికారం నీకెక్కడిది అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది?
రాజ్యాం చేయవలసిన పనిచేయడం లేదు.
అది ప్రశ్నించినందుకు తీసుకెళ్ళి జైల్లోపెడుతోంది.
భీమా కోరెగావ్ కేసులో ఉన్న వారంతా చాలా గొప్ప వారు.
వరవరరావు ప్రధాన స్రవంతిలో కవిత్వం రాసి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ్ వచ్చేది.
సుధాభరద్వాజ్ యంఐటీలో చాలామంది పనిచేసేవారు.
దాంట్లో చాలామంది నోబెల్ లారెట్లు ఉన్నారు.
ఆమె నోబెల్ రావాల్సినంత మేధావి.
దేశాన్ని కొల్లగొట్టే వారిని దేశ భక్తులంటున్నారు, దేశం గురించి మాట్లాడే వారిని దేశ ద్రోహులంటున్నారు.
ఈ కేసులో ఇరికింపబడిన పదహారు మంది అరుదైన వ్యక్తులు.
( ఇంకా ఉంది)