ప్రమాదంలో పౌరహక్కులు : ప్రొ. హరగోపాల్ తో ఇంటర్వ్యూ

ప్రొఫెసర్ హరగోపాల్ తో ఇంటర్వ్యూ -1

 

-రాఘవ శర్మ

పౌరహక్కుల ఉద్యమం అనగానే ప్రొఫెసర్ జి.హరగోపాల్ గుర్తుకొస్తారు.
పౌరహక్కులకు ఎక్కడ భంగం వాటిల్లినా ఆయన గొంతు వినిపిస్తుంది.
చాలా సౌమ్యంగా, తెల్లగా, సన్నగా కనిపించే ఆయన మానసికంగా ఎంతో బలంగా ఉన్నారు!
పౌరహక్కుల ఉద్యమంలో అర్ధశతాబ్దపు ఆనుభవాలు వారివి.
పౌరహక్కుల సంఘంలోనే కాదు, పౌరస్పందన వేదికలో, అఖిలభారత విద్యా హక్కు వేదికలో, కరువు వ్యతిరేక పోరాట కమిటీలో, కృష్ణా జలాల పునః పంపిణీ ఉద్యమంలో, పాలమూరు అధ్యయన వేదికలో, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో, నిర్బంధ వ్యతిరేక వేదికలో, పర్ స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థలో; ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాల్లో హరగోపాల్ చురుకైన పాత్ర పోషించారు.
గొప్ప సామాజిక వేత్త హరగోపాల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిపాలనా శాస్త్రాన్ని బోధించిన ఆచార్యులు.
సమాజానికి సంబంధించిన అనేక అంశాలపైన పత్రికల్లో వీరు రచించిన వ్యాసాలతో తెలుగులో ఆరు పుస్తకాలు వెలువడ్డాయి.
హైదరాబాదులోని ఓ.యూ కాలనీలో ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ను ఇంటర్వ్యూ చేయడానికి ఇటీవల ఆయన ఇంటికి వెళ్ళాను.
పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం. రాఘవాచారి కూడా నా వెంట ఉన్నారు.
ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి, పౌరహక్కుల గురించి నేనడిగిన అనేక ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.
ఎనభయ్యోపడిలో పడిన ఈ హక్కుల నేతతో జరిపిన ఇంటర్వ్యూ ఇలా సాగింది.

ప్రశ్నః పౌరహక్కుల ఉద్యమంతో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఎలా ఏర్పడింది? పౌరహక్కుల ఉద్యమంలో నడవడానికి మీకెవరు స్ఫూర్తి నిచ్చారు?

హరగోపాల్ : తొలి నుంచి మాది కాంగ్రెస్ కుటుంబం.
నేను హైదరాబాదులో ఎం.ఏ చదివాను.
నేను చదివిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా డ్రై సబ్జెక్ట్.
అందులో రాజ్య ప్రస్థావనే ఉండదు.
కనుక అది ఒక మేనేజ్ మెంట్ కోర్సు.
ఉస్మానియా ఆర్ట్స్ కాలేజిలో లెక్చర్ గా చేరడం ద్వారా 1970లో అధ్యాపక వృత్తిలోకొచ్చాను.
అదే ఏడాది నవంబర్లో వరంగల్ పీజీ సెంటర్ కు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు.
నక్సలైట్ ఉద్యమం 1969లో ప్రారంభమయ్యాక, దాని ప్రభావం వరంగల్ పైన బలంగా పడింది.
పీజీ సెంటర్ 1974లో కాకతీయ విశ్వవిద్యాలయంగా మారాక అందులో చేరాను.
నన్ను ఆప్షన్ అడిగితే వరంగల్లో ఉంటానన్నాను.
హైదరాబాదులో ఉండగానే 1968-69లో నరహరి దేవరాజు గారి ద్వారా వరవరరావు గారితో పరిచయం ఏర్పడింది.
వరవరరావుగారు కూడా వరంగల్ వచ్చేశారు.
మాకున్న ముందు పరిచయం వరంగల్లో బలపడింది.
వరవరరావు గారిని ఎవరైనా కలిస్తే ఆయన భావాలను ఆమోదించడమో, వ్యతిరేకించడమో జరిగేది.
ఇరిద్దరిపైన ఆయన ప్రభావం ఉండేది.
ఆయన చాలా ప్రభావశీలతగల మనిషి.
నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళంలో ప్రారంభమైందో లేదో ఎన్ కౌంటర్లు కూడా మొదలయ్యాయి.
హైదరాబాదు హైకోర్టు న్యాయవాది పత్తిపాటి వెంకటేశ్వర్లు గారు పౌరహక్కుల కోసం పనిచేస్తున్నారు.
వారు పౌరహక్కుల సంఘానికి మొదటి బాధ్యులు.
వరంగల్లోని కారపువారితోటలో 1972లో పౌరహక్కుల సంఘం సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో వరవరరావుగారు పాల్గొన్నారు.
ఆ సమావేశానికి లాయరు కన్నభిరాన్ గారు వస్తున్నారని ఆహ్వానిస్తే నేను కూడా వెళ్ళాను.
వారితో అదే మొదటి పరిచయం.
అక్కడంతా చర్చ జరిగింది.
పౌరహక్కుల సంఘం అధ్యక్షులుగా కన్నభిరాన్ గారిని ఏడాది పాటు ఉండమన్నారు.
అయితే ఆయన చాలా కాలం ఆ బాధ్యతలు నిర్వహించారు.
1975లో ఎమర్జెన్సీ విధించారు.
పౌరహక్కులు రద్దైపోయాయి.
మేము అప్పటికే అధ్యాపకులం కనుక చదువు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైస్ చాన్సలర్, హెడ్ఆఫ్ ద డిపార్ట్ మెంటు మాకు సూచించారు.
అక్కడ వామపక్ష భావజాలం కల విద్యార్థులు ఉండడం వల్ల రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పారు.
అందరినీ అరెస్టు చేస్తున్నారు.
ప్రొఫెసర్ జి. రామిరెడ్డిగారు మాకు డిపార్ట్ మెంట్ హెడ్ గా ఉండే వారు.
వారికి నేను ఎం.ఏ.లో స్టూడెంట్ ను.
కాకతీయ విశ్వవిద్యాలయంలో వారు నా పీహెచ్ డీకి గైడ్ కూడా.
వారు ఉస్మానియాకు వెళ్ళారు.
ప్రభుత్వంలోని పెద్దలతో రామిరెడ్డి గారికున్న పరిచయాల వల్ల, నన్ను అరెస్టు చేయకుండా ఆపారేమోనని నేను భావిస్తున్నాను.

ఆరోజుల్లో వరంగల్ కు సమర్ జిత్ రే అనే కలెక్టర్ ఉండేవారు.
ఆయన బెంగాల్ కు చెందిన వారు.
ప్రభుత్వం నన్ను అరెస్టు చేయకుండా ఉండడానికి కలెక్టర్ నన్ను పిలిచి ‘మీకు ఒక పని అప్పచెపుతాం’ అన్నారు.
ఆ పని చేస్తే మంచిదన్నారు.
రామిరెడ్డిగారు నాగురించి రే గారికి చెప్పడం వల్ల ఆ పని నాకు అప్పగించారు.
ఆ రోజుల్లో సిమెంట్ కొరత చాలా తీవ్రంగా ఉంది.
సిమెంట్ మంజూరు చేసే అధికారం నాకప్పగించారు.
రెండు మూడు నెలలు చేశాను.
పరిచయం లేని వారు కూడా వస్తున్నారు.
నాకు ఏమాత్రం ఆసక్తి లేని పని.
నన్ను రక్షించడం కోసం మాత్రమే నాకాపని అప్పగించారు.
ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977లో ఒక సంఘటన జరిగింది.
ఖమ్మం జిల్లా పండితాపురంలో రైతులు తమ భూములను సాగు చేసుకుంటున్నారు.
‘‘చెరువు నా భూమిలో ఉంది కనుక దాని కింద ఉన్న భూమి కూడా నాదే” అని ఓ భూస్వామి పట్టుపట్టాడు.
ఆ భూమి సాగు చేసుకునే రైతులు ఆందోళన చేశారు.
ఆ సందర్భంగా కాల్పులు జరిగాయి.
ఆ సంఘటన పైన పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీ వేసింది.
ఆ కమిటీకి రావలసిన లాయర్ రాలేదు.
ఒకరిద్దరు పౌరహక్కుల సంఘం కార్యకర్తలతో కలిసి వెళ్ళి నివేదిక తయారు చేశాం.
నేను పాల్గొన్న తొలి నిజనిర్ధారణ కమిటీ అది.
అప్పటి నుంచి పౌరహక్కుల కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైంది.
అధ్యాపకుల సమస్యల పరిష్కారం కొరకు పనిచేయడం మొదలు పెట్టాను.
పంచాయితీరాజ్ టీచర్స్ అసోసియేషన్ సమావేశాలకు వరవరరావుగారు వెళ్ళేవారు.
నేను కూడా వెళ్ళేవాణ్ణి.
ఉపాధ్యాయ సమస్యలపైన వరవరరావుగారు మూడు నాలుగు గంటలు మాట్లాడేవారు.
నేను అరగంట మాట్లాడితే ఎక్కువ.
దాంతో ఉపాధ్యాయ ఉద్యమంతో సంబంధం ఏర్పడింది.
పంచాయితీ రాజ్ టీచర్స్ అసోసియేషన్ తరువాత ఏపీటీఎఫ్ ఏర్పడింది.
వరుసగా వారి మీటింగులకు వెళ్ళే వాణ్ణి.
వారిపై నిర్బంధం వస్తే, దానికి వ్యతిరేకంగా పనిచేశాను.
ఉపాధ్యాయ ఉద్యమంలో పని చేసే అనుభవం కూడా పౌరహక్కుల ఉద్యమంలో పనిచేయడానికి దోహదం చేసింది.
వరంగల్ ఒక చైతన్యవంతమైన ప్రాంతం.
అక్కడ చాలా పనులు చేశాం.
1982-83 నాటికి బాలగోపాల్ పౌరహక్కుల ఉద్యమానికి వచ్చారు.
వచ్చీ రాగానే చాలా వేగంగా పనిచేయడం మొదలు పెట్టారు.
దాంతో ఆయన రెండేళ్ళకే పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
వెంగళరావు కాలంలో నిర్బంధంకంటే, 1985లో తెలుగుదేశం అధికారంలో కొచ్చాక ఎన్టీయార్ కాలంలో నిర్బంధం చాలా పెరిగిపోయింది.
ఆ నిర్బంధం పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనాథం గారిని చంపేసే దాకా వెళ్ళింది.
నేను 1980 జూన్ నాటికి హైదరాబాదు వచ్చేశాను.
నిజానికి నాకు వరంగల్ వదిలి రావడం ఇష్టం లేదు.
రామిరెడ్డిగారి కృషి వల్ల హైదరాబాదులో కొత్తగా సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ పెట్టారు.
నన్ను ఈ సెంటర్ కు రమ్మని ఆయన చాలా ఒత్తిడి చేశారు.
ఆయన నాకు టీచర్ కనుక ఆయన మాటను కాదనలేకపోయాను.
ఆరోజుల్లో కాకతీయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా జయశంకర్ గారు, వైస్ చాన్సలర్ గా జాఫర్ నిజాం గారు ఉండేవారు.
రామిరెడ్డిగారు జాఫర్ గారికి ఫోన్ చేసి నన్ను హైదరాబాదకు పంపించమని చెప్పారు.
జాఫర్ నిజాం గారు నన్ను పిలిచి నాకు రిలీవింగ్ ఆర్డర్ చేతికిచ్చారు.
నా అంగీకారం లేకుండానే ఇది జరిగిపోయింది.
నేను కాదనలేకపోయాను.
నా కుటుంబం వరంగల్ లో ఉండిపోయినా, నేను హైదరాబాదు రాక తప్పలేదు.
డాక్టర్ రామనాథం గారిని చంపేసే కాలానికి నేను పౌరహక్కుల సంఘంలో పనిచేస్తున్నాను.
పౌరహక్కుల ఉద్యమానికి బాలగోపాల్ ఒక ఊపు తీసుకొచ్చారు.
నెల్లూరులో జరిగిన పౌరహక్కుల సంఘం సభలో రామనాథంగారి స్థానంలో నన్ను ఉపాధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.
బాలగోపాల్ 1983 ప్రాంతంలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం పౌరహక్కుల ఉద్యమం పనిలోకి వచ్చేశారు.
గిరాయిపల్లిలో పెద్ద ఎన్ కౌంటర్ జరిగింది.
ఆ ఎన్ కౌంటర్లో ఆనంద్, మురళి, సూరపనేని జనార్ధన్ చనిపోయారు.
వారంతా వరంగల్ ఆర్ ఈసీ విద్యార్థులు.
బాలగోపాల్ తో సూరపనేని జనార్ధన్ కలిసే వారు.
మార్క్సిజం గురించి మాట్లాడేవారు, చర్చించేవారు.
ఇంత మంచి మనిషిని కూడా రాజ్యం దారుణంగా చంపేయడమేమిటని బాలగోపాల్ లో ఆలోచన మొదలైంది.

సూరపనేని జనార్ధన్ చనిపోయాక బాలగోపాల్ జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగింది.
బాలగోపాల్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పౌరహక్కుల సంఘంలో పూర్తి సమయం పనిచేయడానికి దోహదపడింది.
పౌరహక్కుల సంఘం నుంచి విడివడి మానవ హక్కుల సంఘం ఏర్పాటు చేసేదాకా ఆయనే పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

ప్రశ్న : పౌరహక్కులకు, ప్రజాస్వామిక హక్కులకు, మానవ హక్కులకు మధ్య తేడా ఏమైనా ఉందా?

హరగోపాల్ : ‘పౌరహక్కులు‘ అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు.
రాజ్యాంగంలో హామీ ఇచ్చిన హక్కుల అమలు కోసం పోరాటం చేయడమే పౌరహక్కుల సంఘం ధ్యేయం.
‘ప్రజాస్వామిక హక్కు’లంటే భూమిపైన హక్కు , దున్నేవారికే భూమిని పంచాలని కోరే హక్కు , జీవించడం కోసం పోరాడే హక్కు.
భూమికొరకు పోరాడే హక్కు సహజమైన హక్కు.
గిరిజనులు అడవిలో ఉంటున్నారు కనుక అడవి వారిదే.
ఇవి ప్రజాస్వామిక హక్కులు.
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం పేరుకు పౌరహక్కుల సంఘం.
కానీ, అది ఆచరణలో ప్రజాస్వామిక హక్కులకొరకే పోరాడుతున్నది.
ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు వారి పౌరహక్కులకు భంగం కలిగేస్తే పౌరహక్కుల సంఘం ముందుకు వస్తుంది.
‘మానవ హక్కులు’ అనేది అంతర్జాతీయంగా వచ్చిన భావన.
మానవ హక్కులు అంటే మనిషిగాపుట్టిన వారికి సహజంగా ఏర్పడిన హక్కులు.
మాట్లాడే స్వేచ్ఛ భూమి పైన నివసించే హక్కు, కూడు, గూడు, దుస్తులు కోరడం వంటివి ఎవరూ ఇచ్చేవి కాదు.
మనిషిగా పుట్టిన ప్రతి వారికి సహజంగా ఉండే హక్కులు.
మానవ చరిత్ర పరిణామక్రమంలో వచ్చినవి ఈ హక్కులు సార్వజనీనమైనవి.
ప్రపంచ వ్యాప్తంగా ‘మానవులు’ అనే వారికి ఉండవలసిని హక్కులు మానవ హక్కులు.
భూస్వామ్య వ్యవస్థకి, అలాగే ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాట క్రమంలో మానవ హక్కుల భావన వచ్చింది.
రాజ్యం కొన్ని పరిమితుల్లోనే ఉండాలనేది ఆ భావనలో భాగం.
ఫాసిజం ద్వారా వచ్చిన దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐక్యరాజ్య సమితి 30 సార్వజనీన హక్కులను ప్రతిపాదించింది.
ఆ ప్రతిపాదనపై అన్ని దేశాల చేత సంతకం చేయించింది.
ఈ 30 హక్కులు కేవలం ప్రకటన కాకుండా, తప్పని సరి అమలుచేయాలని భారత ప్రతినిధి ఉషా మెహరా ప్రతిపాదించారు.
ఐక్యరాజ్య సమితిలో ఈ 30 హక్కులను తప్పనిసరి చేయాలని 1948లో భారత దేశం ప్రతిపాదిస్తే, అదే భారత దేశం 1993లో వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో వీటిని అమలు చేయడం అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాధ్యం కాదని వాదించింది.
వియన్నాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి 6000 మంది హాజరయ్యారు.
పి.వి.నరసింహారావు ప్రధానిగా వచ్చారు.
నేను కూడా వెళ్ళాను.
స్వాతంత్య్రానంతర భారత దేశంలో 1958 నుంచే ప్రజల హక్కులను హరించడం మొదలైంది. రాను రాను హక్కులు కుంచించుకుపోతున్నాయి.

ప్రశ్న : పౌరహక్కుల అణచివేతలో ఎమర్జెన్సీని ఒక గీటురాయిగా తీసుకుంటే, ఎమర్జెన్సీకి ముందు పౌరహక్కుల పరిస్థితి ఎలా ఉంది? ఎమర్జెన్సీ తరువాత ఎలా ఉంది?

హరగోపాల్ : రాజ్యాంగం అమలులోకి వస్తూనే భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా వచ్చింది.
రాజ్యాంగ తొలి సవరణ ద్వారా భావప్రకటనా స్వేచ్ఛపైనే వేటు పడింది.
నిజానికి భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలంటే దేశద్రోహ నేరం, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం తీసేయాలి.
నెహ్రూకాలం లోనే హక్కులను కుంచించడం మొదలైంది.
1958లో సైనిక ప్రత్యేక అధికారాల చట్టం తీసుకురావడం ద్వారా పౌరహక్కుల అణచివేతకు మార్గం ఏర్పడింది.
భారత దేశంలో 1967 – 1971 మధ్య కాలంలో పాలన పట్ల తీవ్ర అసంతృప్తి మొదలైంది.
నక్సలైట్ ఉద్యమంతో పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, స్వయం ప్రతిపత్తి కోసం చేసే ఉద్యమాలు వచ్చాయి.
పంజాబ్ లాంటి రాష్ట్రాలు దేశం నుంచి విడిపోవాలనే ఉద్యమం జరిగింది.
భారత దేశం నుంచి విడిపోవాలని తమిళనాడులో ద్రవిడ కజగం 1952 ఎన్నికల ప్రణాళికలోనే పెట్టింది.
అయినా అప్పుడెవరూ దాన్ని దేశ ద్రోహం అనలేదు.
వారిపైన దేశద్రోహ కేసులు పెట్టలేదు.
పంజాబ్ కూడా దేశం నుంచి విడిపోవాలనుకుంది.
అస్సాం విడిపోవాలనుకుంది.
మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యేక ఆలోచన స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది.
ప్రస్తుతం బీజేపీ వారు ఈశాన్య రాష్ట్రాలలో వెళ్ళి ద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తున్నారు.
ఒక వేళ 2024 లో బీజేపీ మళ్ళీ అధికారంలోకొస్తే మరింత దారుణంగా ఉండవచ్చనే ఆందోళన కూడా ఉంది.
ఈశాన్య రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించడం వల్ల, దాన్ని ఆసరా చేసుకుని పౌరహక్కుల భావనను ఎలా దెబ్బతీయాలి, మనుషుల్లో ఉండే స్వేచ్ఛా భావన నుంచి హక్కులను ఎలా తగ్గించాలి అనేది పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఉదాత్తమైన హక్కుల భావన పెరుగుతుంటే, మనదేశంలో ఆచరణలో ప్రపంచ వ్యాప్తంగా హక్కులను మొత్తంగా తగ్గిస్తూ వస్తున్నారు.
పౌరహక్కుల పరిస్థతి చాలా ప్రమాదకరంగా తయారవడంతో దేశ వ్యాప్తంగా పౌరహక్కుల ఉద్యమాలు బలపడుతున్నాయి.
ఉన్న హక్కులను కాపాడుకోవాలి, కొత్తవి సాధించుకోవాలన్న భావన మొదలైంది.
నిర్బంధం పెరిగినప్పుడు, దానికి సమాంతరంగా హక్కుల ఉద్యమం కూడా పెరుగుతుంది.
ఇది ఒక చారిత్రక ప్రక్రియ.
పౌరహక్కుల విషయంలో ఒక ఆందోళనకరమైన మలుపులో ఉన్నాం.
(ఇంకా ఉంది)

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్, రచయిత. తిరుపతి. మొబైల్ నం.9493226180

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *