అక్టోబర్ 15: అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం
సందర్భంగా ఈ వ్యాసం
– అశాలత
రాష్ట్ర ప్రభుత్వ 2021 జనాభా లెక్కల అంచనా ప్రకారం మొత్తం రాష్ట్ర జనాభా 3,77,25,000 లో మహిళల జనాభా 1,87,47,000 మంది .
గ్రామీణ జనాభాలో మహిళలు 50 శాతం పైగా ఉన్నారు. రైతులుగా , వ్యవసాయ కూలీలుగా, పశు పోషకులుగా, మత్స్య కారులుగా, అటవీ ఉత్పత్తుల సేకరణ దారులుగా, రాష్ట్ర వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం మహిళల చేతుల్లో 36% కమతాలు మహిళలే సాగు చేస్తున్నారు. ప్రభుత్వ భూ పంపిణీ పథకాల కారణంగా కొంత భూమి మహిళల చేతుల్లోకి వస్తే , రైతు బీమా లాంటి పథకాల కారణంగా కూడా మరి కొంత భూమి మహిళల చేతుల్లోకి వచ్చింది. కొన్ని కుటుంబాలలో భూమిపై పట్టా హక్కు మహిళల పేరున ఉన్నా, ఆ కుటుంబంలో మహిళలకు దక్కే గౌరవం , నిర్ణయాధికారంలో భాగస్వామ్యం పై ఆధారపడి మాత్రమే, ఆ మహిళకు భూమిపై నిజమైన అధికారం దక్కిందా లేదా అనేది చెప్పాల్సి ఉంటుంది.
గ్రామీణ మహిళలు రాష్ట్ర వ్యవసాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణ కు సంబంధించి మెజారిటీ పనులను ,ఆయా రైతు కుటుంబాలలోని, మహిళలు , లేదా మహిళా వ్యవసాయ కూలీలే నిర్వహిస్తున్నారు. కానీ సమాజంలో ఆయా మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ విస్తరణ లో కూడా గ్రామీణ మహిళలను రైతులుగా గుర్తించే జండర్ స్పృహ లేదు.
అసెంబ్లీ ఆమోదించిన చట్టం స్పష్టంగా నిర్దేశిస్తున్నప్పటికీ , కుటుంబంలో పెళ్లి కాని స్త్రీలకు , భర్త నుండీ దూరంగా ఉంటున్న ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు, ఆయా కుటుంబాలలో భూమి హక్కుగా దక్కడం లేదు.భర్త మరణించిన సందర్భంలో అ భూమి పై హక్కు దారుగా భార్యను గుర్తించి, భూముల బదలాయింపు (మ్యుటేషన్ ) వెంటనే చేయడం లేదు.
చట్ట బద్ధంగా హక్కుదారులయిన మహిళల పేరున భూమి బదలాయింపు చేయడానికి ఆయా కుటుంబాలలోని మిగిలిన సభ్యులలో విముఖత ప్రధానంగా వ్యక్తమవుతున్నది. ఈ పని చేయాల్సిన రెవెన్యూ శాఖ సిబ్బందికి కూడా, సకాలంలో మహిళల కుటుంబ సభ్యులను ఒప్పించి, ఆ మహిళ పేరున భూమి బదలాయింపు చేయాలనే స్పృహ కూడా ఉండడం లేదు.
రాష్ట్రంలో గత 25 ఏళ్లుగా మహిళలు స్వయం సహాయక బృందాలుగా (SHG),మండల, జిల్లా సమాఖ్యలుగా నిర్మాణమై పొదుపు ,రుణాల లాంటి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 4,39,886 గ్రూపులలో 47,57,468 మంది మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. రైతులుగా గుర్తింపు లేకపోయినా, ఈ మహిళలు తాము తీసుకున్న బ్యాంకు రుణాలను ( 3,68,936 గ్రూపులు 14,048.80 కోట్లు ) పంట సాగు కోసం, పశు పోషణ కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెడుతున్నారు.
రాష్ట్ర గ్రామీణ కుటుంబాల ఆర్ధిక సంక్షోభంలో నుండీ కుటుంబాలు ఎంతో కొంత బయట పడడానికి మహిళల నిరంతర శ్రమ, నెల నెలా పొదుపు, బ్యాంకుల నుండీ ఎంతో కొంత అందుతున్న తక్కువ వడ్డీ రుణాలు కారణమవుతున్నాయి.
రాష్ట్రంలో 2022-2023 గణాంకాల ప్రకారం ఆసరా పెన్షన్ పొందుతున్న మొత్తం 44,12,310 మందిలో 15,73,185 మంది వితంతు మహిళలు , 1,43,366 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. 4,22,246 మంది మహిళా బీడీ కార్మికులు కూడా పెన్షన్ పొందుతున్నారు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ (నిర్ధిష్ట ఆదాయ పరిమితికి లోబడి) వృద్ధాప్య పెన్షన్ కు అర్హులే. 2021 జనాభా లెక్కల అంచనా ప్రకారమే రాష్ట్రంలో 60 నుండీ 80 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిలో మహిళలు 22, 29, 000 మంది ఉంటే, పురుషులు 19, 29, 000 మంది మొత్తం 41, 58, 000 మంది ఉన్నారు.
వీరిలో అత్యధికులు గ్రామీణ,ఆదివాసీ ప్రాంతాలలో ,లేదా పట్టణాలు,నగరాల బస్తీలలో నివాసం ఉంటున్న 80 శాతం మంది ఈ పెన్షన్ కు అర్హులుగానే ఉన్నారు. కానీ ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పొందుతున్న వృద్ధులు 15,94,650 మంది మాత్రమే. అంటే అర్హులైన స్త్రీ ,పురుషులకు కూడా ఎక్కువ మందికి ఇంకా ఆసరా పెన్షన్ అందడం లేదని అర్థం.
తెలంగాణ గ్రామీణ మహిళలు బీడీ కార్మికులుగా , చేనేత కార్మికులుగా కూడా పని చేస్తున్నారు. కానీ ఆయా రంగాలలో నెలసరి ఆదాయాలు అతి తక్కువ గా ఉంటున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ లేని బీడీ కార్మికులకు ప్రభుత్వం బీడీ కార్మికుల పెన్షన్ కూడా అందించడం లేదు.
ఎక్కువ భాగం గ్రామీణ మహిళలు నగరాలకు, దగ్గర లోని పట్టణాలకు వెళ్ళి గృహ కార్మికులుగా , భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. కొందరు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు స్థానిక పరిశ్రమలలో కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు. వీరికి సరైన సాంఘిక బధ్రత పథకాలు అందడం లేదు.
రాష్టంలో 1973 లో ప్రారంభమైన భూ సంస్కరణలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. మరీ ముఖ్యంగా గత 10 ఏళ్లలో భూ సంస్కరణలు సరిగా అమలు కాలేదు. భూమి లేని దళిత కుటుంబాలకు మూడెకారాల భూమి కొనుగోలు పథకం కూడా అరకొరగా అమలైంది. పంచిన భూములు కూడా పూర్తిగా వ్యవసాయ యోగ్యంగా లేవు.
దాదాపు 23 లక్షల దళిత కుటుంబాలకు భూమి ఇవ్వాల్సి ఉండగా 2014 నుండి 2022 వరకు ఈ పధకం క్రిందా కేవలం 6996 మంది మహిళలకు 17,099.14 ఎకరాల భూమిని పంపిణి చేశారు. కానీ వాగ్దానం ప్రభుత్వ జి ఓ లో ఆదేశించినట్లు ఆ భూమికి సాగు నీటి వసతి, కరెంటు మోటార్లు, భూమి, సాగుకు మద్దతు అందించలేదు. దీనివల్ల దళిత మహిళలు దానిపై పెట్టుబడులు పెట్టి సాగు చేయాల్సిన భారం మోస్తున్నారు. ఈ పథకం ప్రస్తుతం పూర్తిగా ఆగిపోయింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలకు భూములు దక్క లేదు.
మరో వైపు తెలంగాణ భూ వినియోగంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. సాగు భూములు పెద్ద ఎత్తున వ్యవసాయేతర అవసరాల పేరుతో, రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయి. ఈ పరిణామం గ్రామీణ మహిళలకు ఉపాధి దొరకకుండా చేస్తున్నది. ప్రాజెక్టులు, రోడ్లు, పారిశ్రామిక ప్రాంతాల పేరుతో ప్రభుత్వం భూములు లాక్కోవడం వల్ల, గ్రామీణ ప్రజలు,ముఖ్యంగా అసైన్డ్ భూముల రైతు కుటుంబాల సభ్యులు నిర్వాసితులై పోతున్నారు. ముఖ్యంగా మహిళలు స్థానికంగా ఉపాధి కోల్పోతున్నారు. వారికి చేతిలో పని లేదు. ఆదాయం లేదు.
రాష్ట్రంలో మోనో క్రాపింగ్ వల్ల వరి,పత్తి 75 శాతం సాగు భూములను ఆక్రమించాయి. వరిలో యాంత్రీకరణ (నాట్లు,కోత /నూర్పిడి ) పెద్ద ఎత్తున జరుగుతున్నది. పంటల సస్య రక్షణలో, కలుపు నియంత్రణలో విషాల వినియోగం విస్తృతంగా పెరిగి , మహిళా వ్యవసాయ కూలీల ఉపాధిని దెబ్బకొడుతున్నాయి. పొలాలలో పని చేస్తున్న మహిళల ఆరోగ్యాలను ఈ రసాయనాలు పూర్తిగా దెబ్బ తీస్తున్నాయి. రాష్ట్రంలో క్యాన్సర్, తదితర రోగాల పెరుగుదలకు, వీటి వినియోగానికి సంబంధం ఉంది .
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రౌండ్ 5 గణాంకాల ప్రకారం 15-49 వయస్సు మహిళలలో 57.6 శాతం మంది రక్త హీనతతో ఉన్నారు. రాష్ట్రంలో 12.8 శాతం మహిళలు చక్కర వ్యాధి సమస్యతో బాధ పడుతున్నారు. మరో 14.4 శాతం మంది మహిళలు బ్లడ్ ప్రెజర్ సమస్యలతో ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో విష పూరిత వాతావరణం, గాలి, నీరు, ఆహారం పూర్తిగా కలుషితమవ్వడం, తెల్ల బియ్యం వినియోగం పెరగడం, మద్యం అలవాటు మహిళలలో కూడా పెరుగుతూ ఉండడం, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు లాంటి పౌష్టిక ఆహారం గ్రామీణ కుటుంబాలకు సరిగా అందక పోవడం లాంటి కారణాలు ఈ ఆరోగ్య సమస్యలకు కారణాలుగా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుండీ వలస వస్తున్న కూలీ బృందాల వల్ల, కూడా స్థానిక మహిళలకు ఉపాధి దొరకకుండా పోతున్నది. కూలీ రేట్లు కూడా పడి పోతున్నాయి. పరిశ్రమలు,సేవా సంస్థలకే పరిమితం కాకూడా, గ్రామీణ ప్రాంత పనుల లోకి కూడా ఈ వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
సామాజికంగా, సాంస్కృతికంగా వచ్చిన మార్పుల వల్ల కూడా మహిళలు ఇతరుల పొలాలలో పని చేయడానికి కూలీకి వెళ్ళక పోవడం తో పాటు, మొత్తంగా కొన్ని సామాజిక వర్గాల గ్రామీణ మహిళలు వ్యవసాయంలో ఉండే శారీరక శ్రమకు దూరం జరుగుతున్నారు. వ్యవసాయంలో మహిళల జీవనోపాధిని పోగొట్టే యంత్రాలు వచ్చినట్లుగా, ఇప్పటికీ సాగు పనుల్లో ఉన్న మహిళల శ్రమను తగ్గించే పని ముట్లు , చిన్న యంత్రాలు ఎక్కువగా అందుబాటు లోకి రాలేదు.
పశువులకు మేత అందించే పంటల విస్తీర్ణం తగ్గి, ఉమ్మడి మేత భూములు పరాధీనమవుతూ ఉండడంతో రాష్ట్రంలో పశుపోషణ కూడా తగ్గిపోతున్నది. ఫలితంగా జీవనోపాధిగా పశుపోషణ చేసుకునే మహిళలకు ఆదాయం తగ్గి పోవడంతో పాటు, ఆరోగ్యకరమైన గుడ్లు, పాలు, మాంసం లాంటి పౌష్టిక ఆహారం కూడా వారికి దొరకడం లేదు.
ఈ నేపధ్యంలో గ్రామీణ మహిళల జీవనపాధి రక్షణ , ఆహార ,ఆదాయ, సాంఘిక బధ్రత, ఇతర హక్కులను సాధించేందుకు నిర్ధిష్ట డిమాండ్లను మహిళా రైతుల హక్కుల వేదిక (MAKAAM) రూపొందించింది. వీటిని అన్ని రాజకీయ పార్టీల ముందు, ప్రజా సంఘాల ముందు, మీడియా ముందు ఉంచడం ద్వారా ఈ డిమాండ్లకు విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తున్నాం.
2023 డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీటిని అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకు వెళ్ళి,ఆయా పార్టీల ఎన్నికల మానిఫెస్టో లో పెట్టేలా చూడాలని , ఈ డిమాండ్లను గ్రామీణ వ్యవసాయ కుటుంబాల దృష్టికి తీసుకు వెళ్ళేలా విస్తృత ప్రచారం చేయాలని “మకాం “ భావిస్తున్నది. సమాజంలో ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని రూపు మాపేలా, గ్రామీణ మహిళలకు రైతులుగా గుర్తింపు దక్కేలా వ్యవసాయ కుటుంబాలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని “మకాం”, రైతు స్వరాజ్య వేదిక గుర్తిస్తున్నాయి..
గ్రామీణ వ్యవసాయ కుటుంబాల మహిళలను
రైతులుగా గుర్తించడం :
గ్రామీణ కుటుంబాల మహిళలను రైతులుగా, ఉత్పత్తి దారులుగా గుర్తించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలు, మార్గ దర్శకాలు జారీ చేయాలి.
వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులకు, సిబ్బందికి , రెవెన్యూ,అటవీ శాఖల అధికారులకు , సిబ్బందికి మహిళా రైతులను గుర్తించి విస్తరణ సేవలు అందించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.
అవసరమైన శిక్షణను అందించాలి.
మహిళల పట్ల వివక్ష లేని భావాలను, జండర్ న్యూట్రాలిటి ని సూచించే భాషను,చిత్రాలను ఆయా శాఖలు ప్రచురించే సాహిత్యంలో,జీవో లలో, మార్గ దర్శకాలలో వినియోగించేలా వ్రాత పూర్వక ఆదేశాలు ఇవ్వాలి.
భూమి వినియోగ విధానం తీసుకు రావాలి:
రాష్ట్రంలో భూమి వినియోగ విధానం వెంటనే తీసుకు రావాలి. వ్యవసాయ భూములను , విచ్చలవిడిగా ఇతర అవసరాలకు మళ్లించే చర్యలను అడ్డుకోవాలి. ఒక గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న మొత్తం భూమిలో 10 శాతానికి మించి , వ్యవసాయేతర అవసరాలకు భూములను మళ్లించకుండా నిషేధం పెట్టాలి.
ప్రజా ప్రయోజనం పేరుతో, రాష్ట్రంలో అసైన్డ్ భూములను ప్రభుత్వం మళ్ళీ వెనక్కు తీసుకోవడం మానేయాలి.గత 7 దశాబ్ధాలుగా పేదలకు చేసిన భూమి పంపిణీ కూడా అతి పెద్ద ప్రజా ప్రయోజనం గా గుర్తించాలి. అసైన్డ్ భూముల యజమానులకు నిర్ధిష్ట గడువు తరువాత వారి అభీష్టం మేరకు పూర్తి స్థాయి పట్టా హక్కులు కల్పించాలి.
భూ సంస్కరణలు అమలు చేయాలి :
ప్రభుత్వం భూ సమగ్ర సర్వే పూర్తి చేసి, మిగులు భూములను వెలికి తీసి, 1973 భూ గరిష్ట పరిమితి చట్టాలను అమలు చేసి, గ్రామీణ భూమి లేని కుటుంబాలకు కనీసం మూడు ఎకరాల భూమి హక్కుగా దక్కేలా కుటుంబంలో మహిళల పేరుతో పట్టా హక్కులు కల్పించాలి. భూ గరిష్ట పరిమితి చట్టంలో, చట్టం నుండీ భూ యజమానులకు అనుకూలంగా ఇచ్చిన మినహాయింపులను రద్ధు చేయాలి.
గ్రామీణ ప్రాంత ఉమ్మడి భూములను ఇతరులు ఆక్రమించిన సందర్భంలో , 2012 సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామ పంచాయితీలకు అప్పగించాలి. ఆ భూముల నుండీ మహిళలు వంట చెరకు , పశువులకు మేత సమీకరించు కునేందుకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలి.
ఇల్లు, ఇంటి స్థలం లేని గ్రామీణ కుటుంబాలకు కనీసం గ్రామాలలో 10 సెంట్ల ఇంటి స్థలం (homestead land ),లేదా నగరాలు, పట్టణాలలో కనీసం 100 గజాల భూమిని మహిళల పేరుపై పంపిణీ చేయాలి. స్థలం ఉన్న వాళ్ళకు ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు ఇచ్చే గృహ నిర్మాణ పథకాన్ని వీరికి కూడా విస్తరించాలి.
1950 హైదరాబాద్ కౌలు దారీ చట్టం స్పూర్తితో, వ్యవసాయేతర ఆదాయం 3 లక్షలకు మించి ఉన్న ఇతర వృత్తుల వాళ్ళు ,వ్యవసాయ భూములు కొనకుండా నిషేధం విధించాలి. రాష్ట్రంలో లాండ్ బ్యాంక్ లో ఉన్న భూములను గ్రామీణ పేద కుటుంబాలకు మహిళల పేరుతో పట్టాలు ఇవ్వాలి.
మహిళలకు భూమిపై పట్టా హక్కులు :
కుటుంబంలో మహిళలకు కూడా, పురుషులతో సమానంగా భూమిపై సమాన హక్కులు కల్పించేలా 1983 లో వచ్చిన హిందూ సక్సెషన్ యాక్ట్ కు విస్తృత ప్రచారం కల్పించాలి. ఒక కుటుంబం మహిళ పేరుతో భూమి రిజిస్టర్ చేసినప్పుడు, రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ ఇవ్వాలి. కుటుంబంలో భూమి హక్కులు కలిగిన వ్యక్తి చనిపోయినప్పుడు, ఆ వ్యక్తి భార్యకు, కూతుర్లకు కూడా వెంటనే భూమిలో వాటాను హక్కుగా బదలాయించేలా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టాలి. కుటుంబంలో భూమిపై యాజమాన్య హక్కు కలిగిన మహిళ చనిపోయినప్పుడు, ఆమె పేరుతో ఉన్న భూమిపై కేవలం కొడుకులకు మాత్రమే కాకుండా, కుమార్తె లకు కూడా సమాన హక్కు కల్పించేలా చట్ట సవరణలు చేయాలి.
భూమి పై పట్టా హక్కులు కలిగిన పురుష రైతు మరణించిన , లేదా ఆత్మహత్య చేసుకున్న సమయంలో, ఆయన భార్యకు వాటాగా వచ్చే భూమిని రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో మూడునెలల లోపే మ్యుటేషన్ చేసి ఇచ్చేలా రెవెన్యూ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జండర్ బడ్జెట్
ప్రత్యేకంగా ప్రవేశ పెట్టాలి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ పథకాలలో మహిళా రైతులకు 33 శాతం వాటా కేటాయించాలి:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రవేశ పెట్టే ఆర్ధిక బడ్జెట్ లో జండర్ బడ్జెట్ ప్రత్యేకంగా ఉండాలి. రాష్ట్రంలో మహిళల సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల మహిళలకు సుస్థిర జీవనోపాధి లక్ష్యంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉండాలి.
వ్యవసాయంలో మహిళలపై శారీరక ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన పని ముట్లను, చిన్న యంత్రాలను సమకూర్చాలి. పొలంలో పని చేసే మహిళల ఆరోగ్యానికి చేటు తెస్తున్న విష రసాయనాల వాడకం పై నిషేధం విధించాలి. వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల రాష్ట్రంలో బోరు బావులలో,బావులలో నీళ్ళన్నీ విష పూరితమై పోయాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) సూచించినట్లుగా, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్ళే దారులలో మంచినీటి ట్యాంకర్లను నిర్మించాలి. మిషన్ భగీరథ క్రింద ఈ కార్యక్రమం చేపట్టాలి.
మహిళా రైతులతో ఏర్పాటు అవుతున్న సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ఇతర సహకార సంఘాలలో కూడా మహిళా రైతుల భాగస్వామ్యం పెరిగితే , సంఘాలకు కూడా ప్రోత్సాహకాలు అందించాలి.
భూమి లేని మహిళలు బృందాలుగా ఏర్పడి , భూమిని ఉమ్మడిగా, లేదా విడివిడిగా కౌలు సాగు చేయడానికి వీలుగా వారికి భూమిని ఇప్పించాలి. కౌలు ధరలపై నియంత్రణ విధించాలి. కేరళ కుటుంబ శ్రీ పథకం తరహాలో గ్రామ పంచాయతీ గ్యారంటీగా ఉండి, రుణాలు ఇప్పించాలి. ఈ రుణాలపై వడ్డీ రాయితీ ప్రభుత్వం అమలు చేయాలి.
వికారాబాద్ జిల్లా అనంతగిరి మహిళా FPO తరహాలో రాష్ట్ర వ్యాపితంగా మహిళా రైతుల FPO లు కస్టమ్ హైరింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్ధిక సహకారం అందించాలి. కేరళ గ్రీన్ ఆర్మీ తరహాలో రాష్ట్ర మహిళా వ్యవసాయ కూలీలను సంఘాలుగా నిర్మించి, వారికి పని ముట్లను, చిన్న యంత్రాలను సమకూర్చాలి.
గ్రామీణ మహిళలకు వ్యవసాయేతర జీవనోపాధులపై శిక్షణ గ్రామ పంచాయితీ స్థాయిలో ఇవ్వాలి. స్థానిక రైతు వేదికలను ఇందుకు కేంద్రాలుగా చేసుకోవాలి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర తరహాలో పశు, పంట వ్యర్ధాల ఆధారంగా కంపోస్ట్ తయారీ , ప్రాధమిక పశు వైద్యం లాంటి అంశాలను కూడా ఇందులో చేర్చాలి .
రైతు కుటుంబాలకు స్వయంగా పశు పోషణ కష్ట తరంగా మారింది. పశువులకు మేత , నీళ్ళు అందించడం, పాల ఉత్పత్తి చేసి మార్కెట్ కు అందించడం లాంటివి ఉమ్మడిగా చేసేలా మహిళా గ్రూపులకు జీవనోపాధిగా కల్పించడానికి (గుజరాత్ లో పశువుల హాస్టల్స్ గ్రామాలలో ఏర్పాటు చేశారు) కొత్త పథకాలు ప్రవేశ పెట్టవచ్చు. వీటి వల్ల పొలాలకు సేంద్రీయ ఎరువు, కుటుంబాలకు పౌష్టిక ఆహారంతో పాటు, అదనపు ఆదాయం ఇందులో నుండీ వస్తుంది. భూమి లేని కుటుంబాలకు, ఒంటరి మహిళలకు కేవలం ఆసరా పెన్షన్ ఇచ్చి చేతులు దులుపు కోకుండా, అదనపు ఆదాయం కోసం పశువులను, చిన్న జీవాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను చేపట్టాలి.
గ్రామ పంచాయితీ స్థాయిలో గ్రామీణ విత్తన బ్యాంకులను మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి , స్థానికంగా మహిళల నుండీ విత్తనోత్పత్తి చేసే రైతులను ఎంపిక చేసి, విత్తనాలను పండించి , మిగిలిన రైతులకు పంపిణీ చేసేలా ఈ బ్యాంకులు పని చేయాలి. యూనివర్సిటీలు అభివృద్ధి చేసే పేరెంటల్ లైన్స్ , ఫౌండేషన్ విత్తనాలు , ఈ మహిళా బృందాలకు ఉచితంగా ఇవ్వాలి.
రాష్ట్రంలో విష రసాయనాల వాడకాన్ని తగ్గించడానికి సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలి . ఈ విధానం మహిళలపై అదనపు పని భారాన్ని పెంచే విధంగా ఉండకుండా చూడాలి. గ్రామ స్థాయిలో NPM షాపుల ఏర్పాటు, స్థానిక విత్తన రకాల అందుబాటు, సేంద్రీయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్, పండిన సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పన, ఇవన్నీ ఈ పథకం లో భాగంగా ఉండాలి.
స్థానిక రైతు బజార్లలో, మార్కెట్ యార్డులలో మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించాలి. విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయాలి. మార్కెట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలి. 33 శాతం మంది మహిళలు డైరెక్టర్లుగా ఉండేలా చట్టంలో మార్పులు చేయాలి.
గ్రామీణ కుటుంబాలకు, ప్రత్యేకించి
మహిళలకు పోషకాహార బద్రత :
ప్రస్తుత ఆహార బధ్రత కార్డులను ఇతర అవసరాలకు ప్రాతిపదికగా ఉపయోగించే పద్ధతిని రద్ధు చేసి, ఆహార బధ్రత చట్ట నిబంధనల ప్రకారం అర్హులందరికీ రేషన్ కార్డులను విడిగా ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి. కేవలం వరి బియ్యానికి పరిమితం చేయకుండా రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లో పంపిణీ చేసే ఆహార బాస్కెట్ పెంచాలి . ముఖ్యంగా చిరు ధాన్యాలను (జొన్నలు,కొర్రలు,రాగులు,సజ్జలు ) ఈ బాస్కెట్ లో చేర్చాలి. ఆహార బధ్రత చట్టం క్రింద రైతుల నుండీ బియ్యం తోపాటు , వీటిని సేకరించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఆర్ధిక సహాయం అందిస్తుంది. ఫలితంగా రైతులకు మద్ధతు ధరలు, వినియోగదారులకు పోషకాహారం అందుతాయి.
సహకార సంఘాల ద్వారా వీటిని సేకరిస్తే నిరుపేదలకు సబ్సిడీ ధరలపై పప్పు ధాన్యాలు, నూనె గింజలు,వంట నూనెలు అందించవచ్చు. నగరాలలో రైతు బజార్లు లేదా ప్రత్యేక సెంటర్ల ద్వారా,మధ్యతరగతి వినియోగదారులకు కూడా ప్రస్తుత మార్కెట్ ధరకంటే తక్కువ ధరలకు సరుకులు అందించవచ్చు. రైతులకూ, వినియోగదారులకూ మేలు చేసే ఈ విధానం వల్ల, ప్రభుత్వానికి నష్టం కూడా లేదు. భారం పడేదేమీ ఉండదు. BRS ప్రభుత్వం “రైతు బంధు కార్పొరేషన్” ఏర్పాటు సందర్భంగా తెచ్చిన జీవో లో ఇదే అంశం పేర్కొంది. కానీ అమలు చేయలేదు. దేశ వ్యాపితంగా పెరుగుతున్న నిత్యావసర ధరల భారం నుండీ, బడా రిటైల్ సంస్థల దోపిడీ నుండీ ప్రజలను విముక్తి చేయాలంటే ఇదొక్కటే సరైన మార్గం.
ఆహార బద్రత చట్టం తెలంగాణ రాష్ట్ర రూల్స్ ప్రకారం ఒంటరి మహిళలకు, అంత్యోదయ కార్డులను ఇవ్వడానికి అవకాశం ఉంది . కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిని అమలు చేయడం లేదు. రూల్స్ ప్రకారం అర్హులైన కుటుంబాలకు అంత్యోదయ కార్డులను పంపిణీ చేయాలి. కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల బియ్యం అందించాలి.
ప్రజా పంపిణీ వ్యవస్థ , విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం , అంగన్ వాడీ పథకాల కోసం అవసరమైన ఆహార పంటలను, కూరగాయలు ,పండ్లు, పాలు , గుడ్లు లాంటి ముడి ఉత్పత్తులను స్థానిక రైతు సహకార/ FPO సంఘాల నుండీ సేకరించాలి. ప్రాసెస్డ్ ఉత్పత్తులను స్థానిక గ్రామీణ మహిళా గ్రూపులతో తయారు చేయించాలి. ఇందు కోసం గ్రామ పంచాయితీ స్థాయిలో గిడ్డంగులను , శీతల గిడ్డంగులను, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. స్థానిక యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి, వీటిలో ఉపాధి కల్పించాలి.
గ్రామీణ మహిళలకు సామాజిక బధ్రత :
గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలలో 57 సంవత్సరాలు నిండిన మహిళలకు జీవో ప్రకారం వృద్ధాప్య పెన్షన్ అందించాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి వినియోగదారీ ధరల సూచీతో (CPI ) అనుసంధానించాలి.
వితంతు , ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ అందించడం తో పాటు, వారి జీవనోపాధి కల్పనకు , తద్వారా కుటుంబ ఆదాయ పెంపుకు వన్ టైమ్ ఆర్ధిక సహకారం – కొంత గ్రాంట్, కొంత రుణం రూపంలో అందించాలి.
వ్యవసాయ పని స్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి , గ్రామ స్థాయిలో స్థానికంగా ICC కమిటీలను ఏర్పాటు చేయాలి.
ఒంటరి మహిళలతో సహా , 18 సంవత్సరాలు నిండిన గ్రామీణ కుటుంబాల సభ్యులను రైతు బీమా లాంటి సాంఘిక బధ్రత పథకం పరిధిలోకి తీసుకు రావాలి. మృతి చెందిన వారి వారసులకు 5 లక్షల రూపాయల పరిహారం అందించాలి.
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన e shram లో ఉపాధి హామీ కార్మికులు సహా, గ్రామీణ కుటుంబాల సభ్యులను నమోదు చేయాలి. ప్రమాద మరణాలకు 2 లక్షల రూపాయల పరిహారంతో చెల్లించడం తో పాటు, భవన, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను కూడా అమలు చేయాలి.
తెలంగాణ గ్రామీణ మహిళలలో అక్షరాశ్యత శాతం అతి తక్కువగా ఉంది. నిర్ధిష్ట కాల పరిమితిలో మహిళలందరినీ అక్షరాస్యులుగా చేయడానికి ప్రత్యేక పథకం అమలు చేయాలి.
మహిళలపై హింస పెరగడానికి , పురుషుల అకాల మరణాలకు మద్యం ఒక ప్రధాన కారణంగా ఉంది. ఆర్ధికంగా కూడా కుటుంబాలు చితికి పోతున్నాయి. ఈ నేపధ్యంలో మద్యాన్ని నిషేధించుకునే అధికారం గ్రామ పంచాయితీలకు ఇస్తూ, హర్యానా తరహాలో చట్టం చేయాలి. తక్షణమే మద్య నియంత్రణకు వీలుగా అన్ని బెల్ట్ షాపులను రద్ధు చేయాలి. మద్యం అలవాటు నుండీ బయట పడడానికి వీలుగా అవసరమైన వైద్య సహాయం అందించడానికి ప్రతి ఐదు గ్రామాల మధ్యలో ఒక డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ అటవీ ఫలసాయాన్ని సేకరించి బ్రతుకుతున్న ఆదివాసులపై గత 10 ఏళ్లుగా, ప్రత్యేకించి “హరిత హారం” పధకం అమలులోకి వచ్చిన తర్వాత తీవ్రమైన నిర్బంధం అమలుజరుగుతున్నది. ముఖ్యంగా తమ భూములను ఆక్రమించటానికి వస్తున్న అటవీ శాఖ సిబ్బంది, పోలీసులను ప్రతిఘటిస్తున్న ఆదివాసీ మహిళలను కొట్టటం, అరెస్టు చేయటం, కేసులు పెట్టటం, వాళ్ళ గూడేల నుండి గర్భిణీ స్త్రీలు అని కూడా చూడకుండా హింసించి నిర్వాసితులను చేయటం నిరంతరాయంగా జరుతున్నది. ఈ నిర్బంధాన్ని వెంటనే నిలిపివేయాలి.
అటవీ హక్కుల చట్టం ప్రకారం రాష్ట్రంలో 2005 కు ముందు సాగుచేసుకుంటున్న ఆదివాసులకు అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలి, సాముదాయక పట్టాలు మంజూరు చేయాలి. అటవీ హక్కుల చట్టంలో భాగంగా స్త్రీల వ్యక్తిగత, ఉమ్మడి, సాముదాయిక హక్కులను గుర్తించాలి, అటవీ హక్కుల పట్టాలు ఇచ్చిన వారందరికీ రైతు బంధు, రైతు భీమా, పంట రుణాలు, పంట నష్టపరిహారం వంటి పథకాలన్నీ వర్తింపచేయాలి.
(ఆశాలత, మహిళా రైతుల హక్కుల వేదిక,
రైతు స్వరాజ్య వేదిక నాయకులు)