పొద్దున్నే పోస్టరై పలకరించిన తిరుపాల్.

– రాఘవశర్మ

నలభై ఆరేళ్ళుగా ‘అన్నయ్యా’ అని ఆప్యాయంగా పిలిచే ట్రెక్కింగ్ తిరుపాల్ ఇక లేడు.
నిన్న స్వాతంత్ర్య దినోత్సవం నాటి మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో శాశ్వతంగా కన్నుమూశాడు.
చాలా ఏళ్ళుగా డయాబెటిస్ తో బాధపడుతున్నాడు.
కొంత కాలంగా డయాలిసిస్ పైన నెట్టుకొస్తున్నాడు.
అనారోగ్యంతో పోరాడ లేక తిరుపాల్ ఇక అలసి పోయాడు.
టీటీడీ విజిలెన్స్ విభాగంలో సెక్యూరిటీ గార్డుగా చేస్తూ రెండేళ్ళ క్రితం రిటైరయ్యాడు.
అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
మా కుటుంబం తిరుపతిలోని ఉల్లిపట్టెడ ప్రాంతానికి 1977లో వచ్చేసినప్పుడు, తిరుపాల్ హైస్కూల్ చదివే వాడు.
రోజూ మా ఇంటికి వచ్చేవాడు.
తిరుపాల్ కు ఎప్పుడూ నవ్వు ముఖమే.
చిన్న తనంలో మహా సిగ్గరి.
చిన్నప్పుడు తలొంచుకుని మాట్లాడేవాడు.
అలా తలొంచుకున్నప్పుడు జుట్టంతా కళ్ళపైన పడితే, ఆ జట్టు సందుల్లోంచి తొంగి చూస్తూ మాట్లాడేవాడు.
మేం చూస్తున్నామని గమనించి మళ్ళీ తలొంచుకునే వాడు.
మా ఇంట్లో ఏమైనా పెడితే తలొంచుకునే తినేవాడు.
మా ఇంట్లో అందరినీ అమ్మా, అన్నయ్యా, అక్కా, నాన్న అని వరుసలు పెట్టి పిలిచేవాడు.
అందరికీ తలలోని నాల్కలా ఉండేవాడు.
అంతగా కలిసిపోయేవాడు.
ఊళ్ళో అందరితో అలాగే ఉండేవాడు.
‘అన్నయ్యా..పేపర్ చదవడం నీనుంచే నేర్చుకున్నానన్నయ్యా’ అనేవాడు.
ఓరియంటల్ కాలేజీ ప్రన్సిపాల్ డాక్టర్ నాగసిద్దారెడ్డి ప్రభావం అతనిపైన బలంగా పడింది.
కొంత కాలం హేతువాద ఉద్యమంలో తిరిగాడు.
నాగసిద్దారెడ్డి లాగానే ‘జైహింద్’ కు ప్రతిగా ‘జై హింస‘ అనేవాడు.
‘అలా అనడం సరికాదు తిరుపాల్’ అంటే తరువాత మానుకున్నాడు.
ఎలా చేరాడో కానీ, టీటీడీలో సెక్యూరిటీ గార్డ్ గా చేరిపోయాడు.
తిరుపాల్లో చాలా మార్పు వచ్చింది.
నాస్తికుడు కాస్తా ఆస్తికుడైపోయాడు.
ఉద్యోగం కోసంలే అనుకున్నాను.
ఆదివారం ట్రెక్కంగ్ కు వెళదాం అనేవాడు.
శనివారం ఫోన్ చేస్తే అతని మాట వినిపించేది కాదు.
కనిపిస్తే అంతా మూగ సైగలే.
ప్రతి శనివారం మౌనవ్రతం పాటించేవాడు.

మళ్ళీ ఆదివారం తెల్లవారు జామున కానీ మాట్లడేవాడు కాదు.

తిరుపాల్

ఇరవై ఆరేళ్ళ క్రితం తొలిసారిగా మమ్మల్ని ట్రెక్కింగ్ కు తీసుకెళ్ళాడు.
నేను చేతక్ కొన్న కొత్తలు.
కుమార ధారకు బయలుదేరాం.
మా మేనకోడలు ఉషారాణిని, మా మేనల్లుడు బబ్బి(శరత్ చంద్ర)ని నా స్కూటర్ పైన ఎక్కించుకుని పాపనాశనం వరకు వెళ్ళాను.
అప్పటి వార్త బ్యూరో చీఫ్ పున్నా కృష్ణ మూర్తి, చిరుత పులి ఈశ్వరయ్య, బి.వి. రమణ కూడా వచ్చారు.
మా బబ్బికి మూడేళ్ళ వయసు.
తిరుపాల్ కొంత సేపు, చిరుతపులి ఈశ్వరయ్య కొంత సేపు బబ్బి ని భుజాలపైన ఎక్కించుకుని మోశారు.
తిరుపాల్ తో మా తొలి ట్రెక్కింగ్ చాలా సరదాగా సాగింది.
అక్కడితొ మా ట్రెక్కింగ్ ఆగలేదు.

రామ కృష్ణ తీర్థం, తుంబురు తీర్థం, శేషతీర్థం కూడా తీసుకెళ్ళాడు.
అలిపిరి మెట్ల మార్గం గురించి రాసేటప్పడు ప్రతి అంశం చెప్పాడు.
తరువాత ట్రెక్కింగ్ కొనసాగడానికి తిరుపాల్ చాలా స్పూర్తిగా నిలిచాడు.
ఎంత సహాయం చేసేవాడో !
తిరుపాల్ జీవితం నాస్తికత్వం నుంచి మొదలై భక్తిలోకి పూర్తిగా జారిపోయింది.
ఈ విషయంపై నేనెప్పుడూ తిరుపాల్తో మాట్లాడలేదు.
అతన్ని మార్చాలనీ ఎప్పుడూ ప్రయత్నించలేదు.
అది అతని బతుకు తెరువు.
తుంబురు తీర్థ సమయంలో సామానంతా అక్కడికి మోసుకెళ్ళి, వంటలు చేసి, అన్నదానాలు చేసేవాడు.
టీటీడీ విజిలెన్స్ లో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నప్పుడు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అనేక విన్యాసాలు చేస్తూ, అందరినీ ఆశ్చర్య పరిచాడు.
హేతువాదిగా ఉన్నప్పుడే మ్యాజిక్ నేర్చుకున్నాడు.
తిరుపాల్ కు డయాబెటిస్ వచ్చింది.
స్విమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్యం అందుతోంది.

రామకృష్ణతీర్థం లోకి సామాను పట్టుకుని దిగుతున్న తిరుపాల్.

ఇన్స్ లిన్ కు మారాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించాడు.
పిల్లలిద్దరినీ బాగా చదివించాడు.
మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
వారికి పెళ్ళిళ్ళు కూడా చేశాడు.
వైద్యం గురించి నన్ను సంప్రదించేవాడు.
స్విమ్స్ లో మంచి వైద్య నిపుణులు ఉన్నారు, వారు చెప్పింది అనుసరించమని చెప్పాను.
మనకు తెలియకుండానే మన చుట్టూ అజ్ఞానపు పొర కప్పి ఉంటుంది.
‘తిరుపాలూ.. ఏందియా యోవ్.. షుగర్ కు రోజూ ఇంజక్షన్లు అవసరమా? ఆయుర్వేదం వాడియా తగ్గిపూడుస్తాది’ అన్నారెవరో.
తిరుపాల్ అమాయకంగా నమ్మేశాడు.
ఇన్స్ లిన్ ఆపేసి వాళ్ళు చెప్పింది వాడాడు.
అది ఆయుర్వేదమో, నాటువైద్యమో తెలియదు.
రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. డయాలసిస్ వరకు వెళ్ళింది.
స్విమ్స్ లో చాలా కాలం డయాలసిస్ చేశారు.
ఇద్దరు పిల్లలు చాలా డబ్బులు ఖర్చు చేసి, హైదరాబాద్ లో ఖరీదైన వైద్యం చేయించారు.
ఇటీవలనే తిరుపాల్ అమ్మ రమణమ్మ పోతే, చూట్టానికెళ్ళాను.
తిరుపాల్ మనిషిగా ఏమీ లేడు.
సన్నపడిపోయాడు.
నల్లగా కమిలిపోయాడు.
శవాకారం వచ్చేసింది.
‘ఏం తిరుపాల్’ అంటే ఆపకుండా ఏడ్చేశాడు.
మా మధ్య మాటల్లేవ్.
తిరుపాల్ దగ్గర ఎంత సేపు కూర్చున్నా అదే ఏడుపు.
‘సరే మళ్ళీ వస్తాను తిరుపాల్’ అన్నాను.
వాళ్ళ ఇల్లు దాటాక కూడా తిరుపాల్ ఏడుపు సన్నగా వినిపిస్తూనే ఉంది.
జీవితానికి తెరపడబోతోందని అతనికి అర్థమై పోయింది.
మళ్ళీ వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా.
వాట్సప్ లో ఈ పొద్దున్నే తిరుపాల్ ఫొటో పోస్టరై పలకరించింది.
‘మాట్లాడ్డానికి ఇంకేముందిలే’ అన్నట్టుగా అది నన్ను వెక్కిరించింది.

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్, రచయిత. తిరుపతి. మొబైల్ నం.9493226180)

 

One thought on “పొద్దున్నే పోస్టరై పలకరించిన తిరుపాల్.

  1. కాస్త ఆలస్యంగా మీ ఈ కథనం చదివానండి. పొద్దున్నే పోస్టరై పలకరించిన తిరుపాల్. ఆ మనిషి జీవితాన్ని ఆద్యంతంగా పట్టి పలకరించారు మీరు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని మీరు చెప్పిన మాట అక్షర సత్యం. కానీ మనదేశంలో కోట్లమందికి ఆ పట్టింపే ఉండకపోవడం విషాదకరం. ఆర్థికం… మరే కారణాలైనా కావచ్చు. కానీ ఆరోగ్యాన్ని, శరీర తత్వాన్ని పక్కన బెట్టి లోకంలోని సమస్త పనులనూ చక్కబెట్టుకుంటూ ఉంటాం మనం. శరీరం వ్యాధుల బారిన పడిన తర్వాత కూడా మనం చేసే పనులను కాస్త పక్కనపెట్టి విశ్రాంతి తీసుకోవడం, వ్యాధుల గురించి ఆలోచించడం చేయం. మన ఆరోగ్యం సమాజం చేతుల్లోనూ లేక, మన చేతుల్లోనూ లేక సాగించే పయనంలో ఎవరైనా సరై పొద్దున్నే పోస్టరై కనబడాల్సిందే అనుకుంటాను. విషాదమూ, నిరామయం కలిసిన స్థితిని అనుభూతి చెందుతున్నాను మీ ఈ కథనం చదివాక. చాలా మంచి వ్యక్తి మీకు దూరమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *