-రాఘవ శర్మ
ఎంత నీడనిచ్చిందో!
ఎంత చల్లదనాన్నిచ్చిందో!
ఎన్ని కాయలు కాసిందో!
ఎంత ప్రాణ వాయువును పోసిందో !
చివరికి కొట్టేయాల్సొచ్చింది.
దాని ప్రాణాల్ని లోడేయాల్సొచ్చింది.
బిడ్డలా సాకి సంతరించిన కొబ్బరి చెట్టును ఉరితీయాల్సొచ్చింది.
ఒకటి కాదు రెండు కాదు, నలభై మూడేళ్ళు సాకాం.
బాధాతప్త హృదయంతో ఆదివారం దానికి ఆయువు తీరేలా చేశాం.
నలభై అయిదేళ్ళ క్రితం చేల మధ్య పెంకుటిల్లు కట్టుకున్నాం.
అది తిరుపతి శివార్లలోని ముత్యాలరెడ్డి పల్లి పంచాయతీ ఆఫీసు సమీప ప్రాంతం.
మరో రెండేళ్ళకు బావి తవ్వుకున్నాం.
చెట్లకు కరువాచినట్టున్నాం.
తెలిసిన వ్యక్తి కోనసీమ నుంచి పాతిక కొబ్బరి చెట్లు తెచ్చిచ్చాడు.
ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు నాటాం.
ఉన్న చోటులోనే దగ్గర దగ్గరగా నాటాం.
చాలా చెట్లు చచ్చిపోయాయి.
ఎనిమిది మాత్రం బతికాయి.
నాలుగేళ్ళ క్రితం పెంకుటిల్లు తీసేసి, ఇల్లు కడుతున్నప్పుడు మేస్త్రీతో ఒక ఒప్పదం.
‘ఒక్క కొబ్బరి చెట్టును కూడా కొట్టకూడదు’
‘అదెట్లా’ అన్నాడు మేస్త్రీ.
‘అది అట్లాగే’ అన్నాను.
జేసీబీ, ట్రాక్టర్లు వచ్చినప్పుడు కొన్ని చెట్లు గాయపడ్డాయి.
ఎంత విలవిల్లాడాయో!
ఆ గాయాలు మాని కోలుకున్నాయే తప్ప ప్రాణాలు వదలలేదు.
వాకిలికి కాస్త దూరంగా నాలుగు కొబ్బరి చెట్లున్నాయి.
వాకిలికి దగ్గరగా మరో నాలుగు కొబ్బరి చెట్లున్నాయి.
అవి ఇరువైపులా ద్వారపాలకుల్లా కనిపించేవి.
ఆ నాలుగు చెట్ల మట్టలు ఆకాశంలో పెద్ద పెద్ద గొడుగుల్లా విస్తరించాయి.
ఇంటి ముందర పందిరిలా ఎంత నీడనిచ్చాయో!
ఆకాశంలో చోటు చాలక ఒక చెట్టు ఈశాన్యంవైపు ఒరిగింది.
అది పక్కింటివారి మిద్దెపైకొచ్చేసింది.
చెట్టెక్కి కొబ్బరి కాయలు కోసేవారు కరువయ్యారు.
కాయలు వాటంతట అవి రాలి పడేవి.
ఒక సారి పక్కింటి నీళ్ళ ట్యాంకుపైన పడింది.
మరొక సారి వాళ్ళ పైపు పైన పడి విరగ్గొట్టేసింది.
‘ట్యాంకును మార్చుదాం. ఖర్చు మేం భరిస్తాం’ అన్నాం.
‘వాస్తు అన్నా’ అన్నాడు.
వాళ్ళ మెట్ల పైన పడుతున్నాయి.
తలపైన హెల్మెట్ లా గిన్నెలు తలపై బోర్లించుకుని మెట్లెక్కుతున్నారు.
ఎంత కాలం ఇలా!?
ఆదమరిచినప్పుడు తలపై కొబ్బరికాయ పడితే!?
‘చెట్టు పైన ఒక లావాటి తాడేసి ఇవతలి చెట్టుకు కడదాం’ అన్నాను.
వీలుకాదన్నారు.
ఆపని చిన్నగా ఉన్నప్పుడే చాయాల్సిందన్నారు.
నా వెర్రితనాన్ని చూసి నవ్వుకున్నారు.
కొబ్బరికాయలు తీయమని ఎంత మందిని అడిగామో!
అడిగిన ప్రతి వాడూ కొబ్బరి చెట్టెక్కి కూర్చుంటున్నాడు.
అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు.
కొబ్బరి చెట్టెక్కే వాళ్ళు కరువయ్యారు.
చివరికి చెట్టును కొట్టేయించక తప్పలేదు.
ఈ నలభైమూడేళ్ళలో దానికి ఎంత సేవ చేశామో!
తొలినాళ్ళలో పురుగు పట్టి మట్టలు పడిపోయేవి.
చిన్న ప్లాస్టిక్ కవరులో మోనోక్రోటోఫాస్ 5 మిల్లీ లీటర్లు పోసి, దానికి మరో అయిదు రెట్లు నీళ్ళు కలిపాం.
కొబ్బరి వేరును ఏటవాలుగా కోసి, ఆ కవరులో వేరును పెట్టి దారంతో కట్టేసేవాళ్ళం.
ఇరవై నాలుగు గంటల్లో చెట్టు ఆ మందును పీల్చుకునేది.
అది పీల్చుకోలేకపోతే, మరో వేరుకు కట్టే వాళ్ళం.
వేరు పురుగు చచ్చిపోయేది.
పురుగు పట్టినప్పుడల్లా అలా పదేళ్ళు కాపాడాం.
పదేళ్ళు దాటాక పురుగు పట్టడం మానుకుంది. కాండానికి పురుగులు రంధ్రాలు చేసేవి.
వాటిని ఒదిలేస్తే అవి మరింత పెద్ద పెద్ద తొర్రలయ్యేవి.
ప్రతి రంధ్రానికి సిమెంటు, ఇసుక కలిపి కూరే వాళ్ళం. రంధ్రాలు పూడిపోయేవి.
పాతికేళ్ళక్రితం వరకు నేనే కొబ్బరి చెట్టెక్కేవాణ్ణి.
కొబ్బరి చెట్టుపైనుంచి పడ్డాక, మళ్ళీ ఆ సాహసం చెయ్యలేదు.
అప్పుడది చిన్నది కాబట్టి సరిపోయింది.
ఏడాదికొకసారి కాయలు కోయించినప్పుడల్లా మట్టలు కొట్టించేవాళ్ళం.
మువ్వ దగ్గర శుభ్రం చేయించే వాళ్ళం.
ప్రతి ఆరు నెలలకు ఎరువులు వేసేవాళ్ళం.
పుష్కలంగా నీళ్ళు పట్టేవాళ్ళం.
బావికి మోటారుపెట్టే వరకు నీళ్ళు చేదిపోసే వాళ్ళం.
అది ఎంత కాపు కాసిందో!
కొబ్బరి చెట్లు కాపుకొచ్చాక, మా నాలుగు కుటుంబాల్లో మళ్ళీకొబ్బరి కాయంటూ కొనలేదు.
‘ఒక్కొక్క కొబ్బరి చెట్టు ఒక్కొక్క కొడుకుతో సమానం’ అనేది మా అమ్మ.
మూడు నెలల కిందట మా అమ్మ కన్నుమూసింది.
చెట్టుకొట్టేయాలన్న ఆలోచన అప్పటి వరకు రాలేదు.
కొబ్బరి కాయలు తలపై పడి ప్రాణం పోక మునుపే చెట్టును కొట్టేయక తప్పదు.
చెట్టును మేం కొట్టేస్తాం అంటూ ఒకడొడొచ్చాడు.
అయిదు వందలు అడ్వాన్స్ తీసుకుని మళ్ళీకనిపించలేదు.
వెయ్యి రూపాయలు అడ్వాన్స్ తీసుకుని మరొకడు అడ్రస్ లేకుండా పోయాడు.
ఫోన్చేస్తే ఎత్తడు.
పెరుమాళ్ళపల్లి సమీపం నుంచి ఓ వ్యక్తిని తెలిసిన వాళ్ళు తీసుకొచ్చారు.
ఆరువేలిస్తే చాలు, చెట్టును కొడతాం .
మట్టలు కాండాన్ని తరలించం అన్నాడు.
అడ్వాన్స్ అడగలేదు.
ఆదివారం తెల్లారే సరికల్లా ముగ్గురు కలిసి ఇంటి ముందు వాలారు.
ఓ వ్యక్తి చెట్టెకి కొబ్బరి మట్టలు, కాయలు కొట్టి, తాడుతో జాగ్రత్తగా కిందకు దించాడు.
మిషిన్ రంపంతో అయిదడుగులు కోసి, గొడ్డలితో నరికాడు.
ఆ కొసన ఒక తాడు, ఈ కొసన ఒక తాడు కట్టాడు.
ఆ అయిదడుగుల కాండం జాగ్రత్తగా కిందకు దించాడు.
కింద ఉన్న ఒక్క మొక్కా దెబ్బతిన లేదు!
తాళ్ళు కట్టి దించుతుంటే, దాని శరీర భాగాలు ఉరికి వేలాడుతున్నట్టనిపించాయి.
ప్రతి అయిదడుగులకు ఒక కోత.
కొబ్బరి చెట్టు శరీరభాగాలకు రేపు అంతిమ వీడ్కోలు.
ఆ చెట్టు తుది శ్వాస విడుస్తూ కూడా ఎన్ని కాయలిచ్చిందో!
ఆ కొబ్బరి చెట్టు ఉన్న ప్రాంతం ఇప్పుడు ఖాళీగా ఉండిపోయింది.
ఏదో వెలితిగానూ కనిపిస్తోంది.
ప్రాణ వాయువిచ్చిన చెట్టది.
ప్రాణాలు తీస్తుందేమోనని భయపడ్డాం.
కానీ, దాని ప్రాణాలు తీశాం.
నీడనిచ్చిన చెట్టు రెక్కలు నరికించాం.
దాని నీడలో పెరిగిన మేం, దాని ఒడిలో పెరుగుతున్న శిశువుల్లాంటి పిందలను తుంచేశాం.
నిర్దాక్షిణ్యంగా దాని తల నరికించాం.
తాళ్ళతో దాని తలను కిందకు దింపించాం.
ఉరికి వేలాడుతున్న దేహాన్ని కిందకు దించుతున్నట్టనిపించింది.
నిర్ధాక్షిణ్యంగా దాని ఆయువును తీసేశాం.
నిట్టనిలువునా దాని ప్రాణాలను లోడేశాం.
‘మానవుడా ఎంత స్వార్ధ బుద్ధి!’
అది ఎన్ని శాపనార్థాలు పెట్టిందో!?
వృక్ష విలాపం వినడానికి మనకు హృదయం ఉండాలిగా!
( ఆలూరు రాఘవ శర్మ, జర్నలిస్టు, ట్రెక్కర్, సాహిత్య విమర్శకుడు, తిరుపతి)
అయ్యో కొట్టేసారా?
అవునండీ. తప్పలేదు
మా ఇంట్లో కొబ్బరి చెట్టు కొట్టేసినపుడు కూడా ఇలాగే బాధ పడ్డాను
బాధ కదా! బిడ్డలను సాగిన ట్టు సాకి , కొట్టే స్తుంటే ఎంత క్షోభ!
మా ఇంట్లో కొబ్బరి చెట్టును కొట్టేసినపుడు కూడా ఇలాగే బాధ పడ్డాను…
నిర్దాక్షిణ్యం!
మౌడ్యం నక, శిఖ పర్యాంతం ఉంటేనే
నరికి వేస్తారు,
రేపటికి నన్ను గొన్న కొబ్బరి చెట్టు ఏది?
హత, విధి నన్ను కూడ ఈ చాదస్తం చంపి్వెస్తుందేమో, అని దుఖిస్తున్నది ప్రక్క కొబ్బరి చెట్టు!!
ఎవరు లేరా మమ్మల్ని కాపాడటానికి,
ఎంత ప్రమాదం ఈ మూర్ఖపు మనిషి!!!
కొబ్బరి చెట్టును కొట్టేసిన వైనం చాలా బాధ గా అనిపించింది… పక్కనోడి పైకి పోతే మంచి జరగదు…అలాగే చెట్టు పక్కింటి పైకి పోతే కూడా అంతే.. విధి బలీయం…మానవుడు నిమిత్తమాత్రుడు…గతము తలచీ వగచే కన్నా సౌక్యమే లేదు..బాధ పడకండి రాఘవ శర్మ గారూ..