‘రాజధాని రైతుల ఒప్పందాన్ని అమలు చేయాలి’

 

అమరావతి రాజధాని నిర్మాణానికి 34,387 ఎకరాల భూములిచ్చిన 30,000 రైతు కుటుంబాల జీవితాలను ప్రశ్నార్థకంచేస్తూ, చెలగాటమాడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం తథ్యమని ప్రముఖ కమ్యూనిస్తు – రైతు ఉద్యమ నేత అమరజీవి కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు తృతీయ వర్ధంతి సభలో మాట్లాడిన వక్తలు ఉద్ఘాటించారు.

“దున్నేవానికి భూమి” నినాదంతో చల్లపల్లి జమీందారు మిగులు భూముల పంపిణీకై సుదీర్ఘ కాలం పాటు చిన్న, సన్నకారు రైతులు సాగించిన ఉద్యమానికి నాయకత్వం వహించి విజయ తీరాలకు చేర్చిన ధన్యజీవి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక భూ పోరాటాలకు నాయకత్వం వహించిన మరియు శ్రీకాకుళం జిల్లాలో కంబిరిగాం భూ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన అమరజీవి కా. కొల్లి నాగేశ్వరరావు తృతీయ వర్ధంతి సభ, నేడు విజయవాడలోని దాసరి భవన్ లో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ప్రధాన కార్యదర్శి కా. కె.వి.వి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రివర్యులు, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ శ్రీ వడ్డే శోభనాధ్రీశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కా.కె. రామకృష్ణ, సహాయ కార్యదర్శి కా. ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కా.అక్కినేని వనజ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పూర్వ అధ్యక్షులు కా.వై. కేశవరావు, తెలుగు రైతు, అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, వామపక్ష రైతు సంఘాల నేతలు కా. హరినాథ్, కా. ప్రసాద్, విశ్రాంత ఇంజనీర్ శ్రీ పాపారావు, అమరావతి రైతు జేఏసి కన్వీనర్ శ్రీ. పువ్వాడ సుధాకర్, ఏఐటియుసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా. జి.ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు కా.జములయ్య, తదితర ప్రముఖులు పాల్గొని, ప్రసంగించారు. సభకు పెద్ద సంఖ్యలో రైతు, కమ్యూనిస్టు, ప్రజల సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు హాజరైనారు.

సామాజిక ఉద్యమకారుడు టి. లక్ష్మీనారాయణ రచించిన “భూమి కోసం పోరు – భూమిచ్చి పోరు; చారిత్రాత్మక రైతాంగ ఉద్యమాలు – అమరావతి ఉద్యమం అజరామరం” శీర్షిక – ఉపశీర్షికలతో వ్రాసిన పుస్తకాన్ని కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ప్రచురించింది.

ఆ పుస్తకాన్ని అమరావతి రాజధాని పరిరక్షణోద్యమంలో అగ్రభాగాన నిలిచిన మహిళా శక్తి ప్రతినిధిగా, రాజధానికి 1.27 ఎకరాల భూమిచ్చి – మూడున్నరేళ్ళుగా పోరు భూమిలో ముందు వరుసలో నిలబడ్డ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి లంకా రాజ్యలక్ష్మీ(75) ఆవిష్కరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన దాదాపు ముప్పేయ్ వేల మంది రైతులు 34,387 ఎకరాలను, తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి ఇచ్చారు.

భూ సేకరణ చట్టం – 2013 ప్రకారం నష్ట పరిహారం తీసుకొని, పునరావాస పథకం ద్వారా లభించే ప్రయోజనాలు పొంది ఇవ్వలేదు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారసత్వంగా సంక్రమించిన భూములను, తమ కష్టార్జితంతో సముపార్జించుకొన్న భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన భూ సమీకరణ చట్టం మేరకు, అంటే అమరావతి రాజధాని నిర్మాణం – అభివృద్ధి ప్రాతిపదికపై ఏపిసీఆర్డీఏతో ఒప్పందం చేసుకొని ఇచ్చారు.

ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మూడున్నరేళ్ళుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అవమానాలు, అక్రమ కేసులు, పోలీసుల నిర్భందకాండ, అష్టకష్టాలు అనుభవించారు, అనుభవిస్తున్నారు. అనేక మంది మరణించారు.

అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ కొనసాగుతున్న పూర్వరంగంలో మాస్టర్ ప్లాన్ లోని రెసిడెన్షియల్ జోన్ బయట వాణిజ్య అవసరాల కోసం కేటాయించిన 1400 ఎకరాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ళ స్థలాల పథకం పేరుతో సెంటు భూమి చొప్పున దాదాపు యాభై వేల మందికి కేటాయించడానికి పూనుకోవడాన్ని ముక్తకంఠంతో వక్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దుష్టప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతూ కర్ణాటక ప్రజలు బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించారని, రాబోయే సాధారణ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటమి చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

బీటీ పత్తి విత్తనాలకు వ్యతిరేకంగా అమరజీవి కొల్లి నాగేశ్వరరావు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసి, పోరాడి విజయం సాధించారని, మోడీ ప్రభుత్వం బీటీ ఆవాలు ఉత్పత్తికి అనుమతి ఇవ్వడం అత్యంత గర్హనీయమని శ్రీ వడ్డే శోభనాధ్రీశ్వరరావు విమర్శించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కొల్లి నాగేశ్వరరావు చూపెట్టిన పోరాట స్ఫూర్తితో పోరాడాలని వక్తలు పిలుపిచ్చారు.

అమరావతి రాజధాని పరిరక్షణ కోసం మూడున్నరేళ్లుగా అవిశ్రాంతంగా సాగుతున్న ఉద్యమం, భూమికోసం – భుక్తికోసం, నైజాం ప్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం, 1954లో కర్నూలు రాజధానికి కరవు యాత్ర, 1980 దశకంలో దేశ వ్యాప్తంగా జరిగిన రైతాంగ ఉద్యమాలు, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమంపై టి. లక్ష్మీనారాయణ తన పుస్తకంలో వివరించారు. 1900 – 1956 మధ్య ఆంధ్ర రైతు ఉద్యమం చరిత్రలోని ఉజ్వల ఘట్టాలకు సంబంధించి కొల్లి నాగేశ్వరరావు వ్రాసిన చరిత్ర భాగాన్ని అనుబంధంగా పుస్తకంలో చేర్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *