-శిరందాసు నాగార్జున
విజయవాడ,విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రాల ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే) పదోన్నతిపై విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్)గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
దూరదర్శన్ లోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. జర్నలిజంలో డాక్టరేట్ చేసిన జీకే ప్రాంతీయ వార్తా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
రోజుకు 16 గంటలు జర్నలిస్టుగా పని చేయడం జీకేకు హాబీ. దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గా తగిన వ్యక్తికి ప్రమోషన్ లభించింది. ఆకాశవాణి వార్తా విభాగం అధిపతిగా కొండలరావు అలుపెరగని శ్రామికుడిగా పని చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురంలో 1965 మార్చి 10వ తేదిన గుత్తికొండ సత్తిరాజు, గుత్తికొండ వెంకట నాగరత్నం గార్లకు డాక్టర్ గుత్తికొండ కొండలరావు జన్మించారు. తెలుగు కథకు ప్రపంచ ఖ్యాతిని సాధించిన పాలగుమ్మి పద్మారావు స్వగ్రామం కూడా ఇదే. కొండలరావు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తిరుపతిపురం, బల్లిపాడు, అత్తిలిలో జరిగింది. ఆంగ్ల సాహిత్యంలో బీఏ నర్సాపురంలోని వైఎన్ కళాశాలలో చదివారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పోస్టు గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు.
బాబాయి, మెకానికల్ మెరైన్ ఇంజనీర్ గుత్తికొండ సత్యనారాయణ, చిన్నక్క స్వర్ణలతల ప్రోత్సాహం, ప్రోద్భలంతో కొండలరావు ఈ స్థాయికి ఎదిగారు.ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆచార్య పి.బాబీవర్థన్ ప్రోత్సాహం, సహాయసహకారాలతో జర్నలిజంలో డాక్టరేట్ పూర్తి చేశారు. పీహెచ్డీ కోసం ఆయన రాసిన ‘ట్రైబల్ అండ్ ఇంటర్నెట్’ అనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు.
తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం ( డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు.
ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. జర్నలిజం పట్ల ఆసక్తితోపాటు ఆ రంగంలో డాక్టరేట్ సాధించిన అనుభవంతో పని రాక్షసుడిలా ఆకాశవాణి కోసం పని చేశారు.కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
12వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరోనాపై శ్రోతలకు అవగాహన కల్పించడంలో కూడా కొండలరావు కృషి అద్వితీయం.జింగిల్స్ విషయంలో కొండలరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హిరిచందన్ కూడా కొండలరావును ప్రత్యేకంగా అభినందించారు. పలు విశ్వవిద్యాలయాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు.
ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. జీకే సేవలను గుర్తించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏప్రిల్ 14న విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ‘విశిష్టసేవారత్న’ పురస్కారంతో సత్కరించింది.
(*శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్)