మరిచిపోలేని మానవ సంబంధాలు

వనపర్తి ఒడిలో-21

రాఘవశర్మ

 

ప్యాలెస్ నుంచి మళ్ళీ ఊర్లోకి వచ్చాం.
బాపన గేరిలో ఇల్లు అద్దెకు తీసుకున్నాం.
బ్రాహ్మణ వీధినే ‘బాపన గేరి’ అనే వారు.
అది తాళాల క్రిష్ణమూర్తి ఇల్లు.
తాళాల క్రిష్ణమూర్తి అంటే ఆ గేరిలో చాలా ప్రసిద్ధి.
పౌరోహిత్యం చేసేవారికి ఒక పెద్ద తలకాయ.
అప్పుడెప్పుడో పురోహితులకు ఏవో ఆటంకాలేర్పడ్డాయి.
వారి తరపున నిలబడి పోరాడిన వ్యక్తి తాళాల క్రిష్ణమూర్తి.
వైదిక విశ్వాసాలను చిత్తశుద్ధితో నమ్మిన వ్యక్తి.
అంతే చిత్త శుద్దితో ఆచరించే వ్యక్తి.
శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టేవారు.
పేరు ఫలాలు చెప్పే వారు.
పెళ్ళిళ్ళు చేయించేవారు.
పేరుఫలాలు, ముహూర్తాల కోసం వచ్చేవారంతా ఆయన్ని ‘అయ్ గా రు’ అని పిలిచేవారు.
ఆయన లేని సమయంలో ఆయన సతీమణి కూడా పేరు ఫలాలు చెప్పేవారు.
వాళ్ళింట్లో దాదాపు రెండేళ్ళు అద్దెకున్నాం.
అది 1970-71 నాటి మాట
పెద్దాయనంటే భయమో, భక్తో తెలియదు కానీ, ఆ ఇంట్లో అంతా సంప్రదాయాలు పాటించేవారు. బైటికొస్తే ఆధునికంగా ఉండేవారు.
తాళాల క్రిష్ణమూర్తి కుటుంబానికి వ్యవసాయం ఉండేది.

బ్రాహ్మణ వీధిలో రెండవది పాపయ్య శాస్త్రి ఇల్లు, దూరంగా కనిపించేది తాళాల కృష్ణ మూర్తి ఇంటి వెనుక వైపు నుంచి ఉన్న పాటక్.

ఆరోజుల్లో గ్రామాల్లో బ్రాహ్మల ఇళ్ళకు ఎర్రని, తెల్లని పట్టీలుండేవి.
ఆ పట్టీలుంటే అది బ్రాహ్మల ఇల్లని గుర్తు.
అలాంటి గుర్తు వనపర్తి లో మాత్రం ఉండేవి కావు.
దేవాలయాలకు ఉండేవి.
తాళాల క్రిష్ణ మూర్తిది చాలా పెద్ద ఇల్లు.
ఇంటి వెనుక పెద్ద ఖాళీ జాగా.
చుట్టూ ఎత్తైన ప్రహరీ.
దానికి పెద్ద పాటక్(పెద్ద గేటు).
భారీ ఆకారంతో ఎద్దులు, నల్లని దున్నపోతులో, బర్రెలో ఉండేవి.
వాళ్ళింటికి వెనుక వేపు వీధిలో వారిదే చివరి ఇల్లు.
ఆ వీధిలో వరుసగా బ్రాహ్మణ కుటుంబాలుండేవి.
నాకు తెలిసి అప్పయ్య శాస్త్రి కూడా ఆ వీధిలోనే ఉండేవారు.
మా తాతయ్య, బామ్మ తద్దినాలకు అప్పయ్య శాస్త్రి వచ్చేవారు. అప్పటికే బాగా పెద్ద వారు.
ఎంత దూరమున్నా, నడవ లేక నడవ లేక నడిచివచ్చేవారు.
భోజనం చేశాక కాసేపు నేలపైన పడుకునే వారు.
తన వెంట ఒక నున్నని రాయి తెచ్చుకునేవారు.
ఆ రాయితో పొట్టకేసి రాసుకునే వారు.
ఎందుకలా రాసుకుంటున్నారంటే, తొందరగా అరుగుతుందనే వారు.
నాలుగు నెలల క్రితం వనపర్తి వెళితే అప్పయ్య శాస్త్రి ఇల్లు కూలిపోయి ఉంది.
ఆయన వారసులు ఎవరున్నారో, ఎక్కడున్నారో తెలియదు.
ఆ పక్కనే శివాలయం.

బ్రాహ్మణ వీధి శివాలయం.

శివాలయం పక్కనే ఒక పురాతన రాచరిక భవనం.
శివాలయం ఎదురుగా మదిరిక, ప్రేమిక అనే ఇద్దరు టీచర్లుండేవారు. తాళాల క్రిష్ణమూర్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు.
పెద్ద కొడుకు సబ్ ట్రెజరీ ఆఫీసర్.
ఆయనకు ఎనిమిది మంది ఆడ పిల్లలు, ఒక్క కొడుకు.
పిల్లలందరినీ బాగా చదివించారు.
తాళాల కృష్ణ మూర్తి రెండవ కొడుకు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్.
ఆయన పేరు శ్రీనివాస మూర్తి.
ఆరోజుల్లోనే ఎం. ఎస్ చదివారు.
పెద్ద కొడుకు గంభీరంగా ఉంటే, చిన్న కొడుకు సరదాగా ఉండేవారు.
ఇంట్లో పిల్లలంతా డాక్టర్ని ‘శీనప్ప’ అని పిలిచేవారు.
ఆయనకు పిల్లలు లేరు.
అన్న పిల్లల్లో తానూ ఒక పిల్లవాడిగా వ్యవహరించేవారు.
పదిహేను మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం అది.
వాళ్ళింట్లో కిరాయికుంటే, కిరాయి (అద్దె, బాడుగ) ఇల్లులాగా ఎప్పుడూ అనిపించేది కాదు.
ఆ ఇంటి యజమానుల్లాగా వాళ్ళెప్పుడూ వ్యవహరించేవారు కాదు.
మంచి స్నేహ శీలురు.
వాళ్ళది చాలా పెద్ద ఇల్లు.
ఎత్తైన ప్రహరీ గోడ, దానికి పెద్ద తలుపు.
లోపలి నుంచి తలుపుకు తాళం వేస్తే బైటవాళ్ళెవరూ కనిపించరు.
ప్రహరీ గోడను ఆనుకుని, బైట వైపు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఆరుగులు.
ఆ ఇంటికి ఉత్తర దిక్కున ఉండే పోర్షన్లో మేముండే వాళ్ళం.
దక్షిణ దిక్కు పోర్షన్లో వేరేవారెవరో ఉండేవారు.
మధ్యలో తాళాల కృష్ణ మూర్తి కుటుంబం.
వారిల్లు దాటి వెళితే, అంతా తెలుగోళ్ళు.
తెలుగోళ్ళు అంతా వ్యవసాయ కూలీలు, తోటల కాపలా దారుల, భవననిర్మాణ కార్మికులు.
పాలమూర్ లేబర్ అంటే వీరే.
వాళ్ళ ఇళ్ళు, వీధులన్నీ ఇరుగ్గా ఉండేవి.
సాయంత్రమైతే చాలు వచ్చి అరుగుల మీద కూర్చునుండేవారు.
ఒక్కొక్క సారి వచ్చి మా మెట్లపైన కూడా కూర్చునే వారు.
ఏడాదికోసారి ఏవో పండగలా జరిపేవారు.
వారంతా మా ఇంటి ముందు రోడ్డులోకొచ్చి అనేక విన్యాసాలు చేసేవారు.
నాకు బాగా గుర్తున్నది కర్రతిప్పడం.
కర్రతిప్పడాన్ని నేను మొదటి సారి చూసింది అక్కడే.
ఎంత వేగంగా తిప్పే వాళ్ళు!
వాళ్ళ విన్యాసాలన్నీ చూసేవాణ్ణి.
ఆ బాపన గేరి లోనే డాక్టర్ బాల కృష్ణయ్య ఆస్పత్రి.
మరి కాస్త ముందుకు వెళితే కమాన్.

కమాన్ ప్రాంతం

ఆరోజుల్లో కమాన్ దగ్గరే కూరగాయలు అమ్మే వాళ్ళు.
కమాన్ దగ్గరే
తాళాల కృష్ణ మూర్తి కుటుంబానికి మడిగెలు (షాపులు) ఉండేవి.
వాటిని కిరాయికిచ్చారు.
టెన్త్ క్లాస్ పరీక్షలు రాయడానికి గద్వాల వెళ్ళాను.
ఆరోజుల్లోనే తాళాల కృష్ణమూర్తి మనవరాళ్ళలో చాలా మంది గద్వాలో డిగ్రీ చదివేవారు.
వనపర్తిలో కొందరు ఇంటర్ చదివేవాళ్ళు.
వాళ్ళ ఏడవ మనుమరాలు లక్ష్మి ఇంటర్లో నా బ్యాచ్మేట్.
వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే మా చివరి చెల్లెలు గాయత్రి(1971) పుట్టింది. తాళాల క్రిష్ణమూర్తి ఆరవ మనుమరాలి పేరుకూడా గాయత్రి.
ఆయన ఏకైక కుమార్తె అంజనమ్మ.
అంజనమ్మ అప్పటికే బీఎస్సీ పూర్తిచేసింది.
అంజనమ్మ మేనత్తైనా, వాళ్ళింట్లో పిల్లలందరూ అంజక్కా అనిపిలిచేవారు.
మేం కూడా అంజక్క అని పిలిచే వాళ్ళం.
అది పాత కాలం చవుడు మిద్దె.
టేకు దూలాలుండేవి.
ఆ దూలాల పైన నాపరాళ్ళు పరిచేవాళ్ళు.
నాపరాళ్ళపైన చవుడు వేసే వాళ్ళు.
ఇంటి లోపల చల్లగా ఉండేది.
మూడు నాలుగేళ్ళ వరకు చవుడు మార్చాల్సిన పనిలేదు.
వేసవి వచ్చిందంటే మేడపైన పడుకునే వాళ్ళం.
అంజక్క పొట్టిగా, కాస్త లావుగా ఉండేది.
చాలా మంచి మనిషి, నిగర్వి.
ఏడెనిమిదేళ్ళ క్రితం వనపర్తి వెళ్ళినప్పుడు వాళ్ళింటికి వెళ్ళాను.
నలభై ఏళ్ళైనా అంతా గుర్తు పట్టారు.
ఎంత ఆప్యాయత!
భోజనం చేసి వెళ్ళమన్నారు. చేయలేదు.
ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
కుశల ప్రశ్నలు మొదలయ్యాయి.
తాళాల కృష్ణమూర్తి ఏకైక మనవడు శ్రీహరి చిన్నప్పటి పోలికలున్నాయే కానీ , గుర్తుపట్ట లేనంత పెద్దవాడైపోయాడు.
తాళాల కృష్ణమూర్తి, ఆయన సతీమణి ఎప్పుడో పోయారు.
మేం అక్కడ ఉన్నప్పుడే పెద్ద వయసు.
వారిద్దరి కుమారులూ పోయారు.
ఆ ఇంటి ఇల్లాళ్ళిద్దరూ పోయారు.
ఆయన మనుమ రాళ్ళలో నలుగురు మాత్రమే కనిపించారు.
మిగతా వాళ్ళు వేరే వేరే ఊర్లలో స్థిరపడ్డారు
అదే పాత ఇల్లు, అవే రూపు రేఖలు.
అవే ఆప్యాయతలు.
కాకపోతే చవుడు మిద్దె కాస్తా తీసేసి స్లాబ్ వేశారు.
మా కళ్ళు అంజక్క కోసమే వెతికాయి.
ఆ మధ్యనే పోయిందని చెప్పారు.
బాధనిపించి, గుండె బరువెక్కింది.
అంజక్క అనగానే, చివరి సారిగా కమాన్ దగ్గర కనిపించిన దృశ్యం.
మేం వనపర్తి వదిలి తిరుపతి వచ్చేసేటప్పుడు కమాన్ దగ్గర కనిపించింది.
‘మేం తిరుపతి వెళ్ళిపోతున్నాం’ అని చెప్పే సరికి, ఆమె కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగియి.
కన్నీళ్ళు కనిపించకుండా తలొంచేసుకుంది.
ఆ దృశ్యాన్ని నేనిప్పటికీ మర్చిపోలేను.
అంజక్కను మళ్ళీ చూడలేదు.
కలుక్కుమంటున్న  జ్ఞాపకం.
కన్నీళ్ళతో తలొంచుకునేసిన దృశ్యం.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *