గుంజన.. ఒక జీవ జలపాతం

-రాఘవ శర్మ

గుంజన.. ఒక జీవ జలపాతం..
శేషాచలం కొండల్లో ఏరులన్నీ ఎండిపోయినా, జలపాతాలన్నీ మూగవోయినా, గుంజన మాత్రం నిత్య చలనం.
అది నిత్య నూతనం.. నిత్యగంభీరం..
హెూరెత్తే జలపాతంలో జీవం ఉట్టిపడుతుంటుంది.
‘ఎండిపోవడం’ అనేని దాని భాషలోనే లేదు.

ఎత్తైన కొండ నుంచి లోతైన లోయలోకి దుముకుతూనే ఉంటుంది.
దానికి రాత్రి, పగలు తేడాలేదు.
ఇరువైపులా రెండు కొండల మధ్య నుంచి జాలువారుతూనే ఉంటుంది.
వీస్తున్న గాలికి ఆరిపోకుండా దీపాన్ని చేతులు చుట్టి కాపాడినట్టు, రెండు కొండలూ దాన్ని కాపాడుతున్నట్టున్నాయి. మధ్యలో లోతైన నీటి గుండం.
గుంజనను చూడడం కొత్త కాదు.
ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది.
ఆ జలపాతాన్ని చూడడానికి ఎంత మంది ఉవ్విళూరుతుంటారో!
అది ఎంతమందికి సాధ్యం!
లోయలోకి దిగడం నిజంగా సాహసమే.
నలుదిక్కులా ఉన్న నాలుగు రాష్ట్రాల వారు గుంజనను చూడాలని బయలు దేరారు.
ఒకరా, ఇద్దరా, 28 మంది.
మర్నాడు మరో నలుగురు వచ్చి చేరారు.
శనివారం సాయంత్రం తిరుపతి నుంచి మేం బయలుదేరాం.

అడివిలో గుంజన వైపు సాగుతున్న వాహనాలు

ఇటు చెన్నై నుంచి, అటు బెంగుళూరు నుంచి కొందరు బయలుదేరారు.
దూరంగా ఉండే హైదరాబాదు నుంచి, ఇటు తిరుపతి నుంచి మేం కూడా బయలుదేరాం.
కరకంబాడి దాటాక డాబా దగ్గర అంతా కలుసుకున్నాం.
మా వాహనాలు కోడూరు వైపు దారి తీశాయి.
తిరుపతి నుంచి కోడూరుకు 40 కిలో మీటర్లు.
కోడూరుకు రెండు కిలోమీటర్ల ఈవల ఎడమ వైపునుంచి , గంగరాజు పోడు గ్రామం వైపున అడవిలోకి బయలు దేరాం.
ఎడమ పక్కన ఎండిపోయిన గుంజన ఏరు రాళ్ళతో నిండి ఉంది.
దారి పొడవునా మామిడి, అరటి, కర్బూజా పండ్ల తోటలు.
ఏడు కిలోమీటర్ల వరకు గ్రామాలు.
చుట్టూ పచ్చని తోటలు.
మధ్యలో కళ్ళు తిరిగిపోయే ఖరీదైన భవనాలు.
నివాసాలా, గెస్ట్ హౌస్ లా అంతుబట్టలేదు.
ఆగ్రామాలు దాటగానే అటవీ శాఖ గేటు.
ఇరువైపులా ఫెన్సింగ్.
అంతా ఎగుడు దిగుడు రోడ్లు.
ఇరువైపులా చెట్లు.
కొత్తగా వచ్చిన వారికి వింతైన అనుభూతి.
పాత వారికి అనుభూతు లు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి.
అడవి పలుచగా మొదలైంది.
చీకటి పడక ముందే గుంజన ఏటిలోకి వెళ్ళిపోవాలి.

కార్లకు ముందు పైలట్లా మూడు మోటారు బైకులపై ఆరుగురు సాహసికులు.
దారికి అడ్డంగా వచ్చిన కొమ్మలను, రాళ్లను ఎత్తేస్తున్నారు.
సూర్యుడు కొండల మాటుకు వెళ్ళిపోతున్నాడు.
ఎదురుగా రోడ్డు మధ్యలో నల్లని ఆకారం.
అనుమానం లేదు, అది ఎలుగు బంటు.
ఒక్క సారిగా మోటారు బైకులు ఆగిపోయాయి.
ఆరుగురూ ఖంగారు పడిపోయారు.
కెమెరాలుక్లిక్ మన్నాయి.
ఎలుగు బంటు ఆగిపోయిన మోటారు బైకుల వైపు చూసింది. ఒకరిద్దరైతే దాడి చేసేదే.
ముందు మూడు బైకులు, వాటి వెనుక నాలుగు కార్లు.
వీటిని చూసేటప్పటికి ఎలుగు బంటికి గెండె గుభేలుమంది. కుడివైపునకు పరుగో పరుగు.
ఈలోగా ఎన్ని ఫోటోలు! ఎన్ని వీడియోలు!
చీకటి పడే ముందు అడవి జంతువులు ఇలా రోడ్లోకి వచ్చేస్తాయి.
వాటిని రోడ్లనరు.
రాళ్ళు రప్పలతో నిండిన మట్టి రహదార్లంటారు.
మా వాహనాలు ముందుకు పోయిన కొద్దీ అడవి దట్టంగా కనిపిస్తోంది.
ఘాట్ రోడ్డులో మెలికలు తిరిగిన మట్టి రహదారిలో కొండ ఎక్కుతున్నాం.
అడవిని చూస్తున్న నగర జీవులు ఆశ్చర్య పోతున్నారు.
కిచకిచ శబ్దాలతో పక్షులు గూళ్ళకు చేరుతున్నాయి.
దారి పొడవునా ఏనుగుల విసర్జితాలు.
వాటి పచ్చిదనాన్ని గమనిస్తే, నాలుగైదు రోజుల క్రితం ఏనుగులు ఇక్కడ తిరిగినట్టున్నాయి. అవి విరిచేసిన కొమ్మలు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నాయి.
అటవీ శాఖ గేటు నుంచి దొంగల బండకు దాదాపు 17కిలో మీటర్లు. జాతీయ రహదారి నుంచి వాహనాల్లో రెండు గంటల ప్రయాణం.
ఎంత మంచి వాహనమైనా గంటకు పదికిలో మీటర్లకు మించదు. దొంగల బండ వచ్చేసింది.
చీకటి పడకముందే లోయలోకి దిగాలి.
ఎవరి సామాన్లు వారు తీసుకుని ఒకరొకరు నడుస్తున్నాం. అరగంటలో లోయలోకి దిగేశాం.

గుంజన ఏటిలో

దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు రెండు కొండల నడుమ ఏరు పారుతోంది.
ఏరంతా కొట్టుకొచ్చిన రాళ్ళతో నిండిపోయింది.
ఏటి ప్రవాహానికి వృక్షాలు సైతం వేళ్ళతో పెకిలించుకుని వచ్చేశాయి. ఏటిలో ఓ పక్కగా నక్కినట్టు నీళ్ళు ప్రవహిస్తున్నాయి. కనిపించకపోయినా, రాళ్ళ కింద నుంచి ఏటి ప్రవాహం.
మధ్యలో లోతైన నీటి గుండాలు.
ఏరంతా విశాలమైన బండరాయి. ఆ బండరాయి పైనే విడిది చేశాం. చీకటి పడుతోంది.

నీటి గుండాలలో ఈదులాడుతున్న మహిళలు , పిల్లలు.

శరీరమంతా చెమట పట్టింది.
శరీరాన్ని తాకుతూ చల్లటి గాలి వీస్తోంది.
ఒకరొకరు నీటి గుండాల్లోకి దూకుతున్నారు.
మరో పక్క వంటలు మొదలు పెట్టారు.
దోమలేవీ లేకపోయినా, రెండు గుడారాలు వేశారు. పవర్ బ్యాంకులతో లైట్లు అమర్చారు. మరో పక్క ఎండిపోయిన దుంగలను తోసుకొచ్చారు.
చీకటి పడింది. కబుర్లు, పలకరింపులు.
పగలంతా కాసిన ఎండకు నేలంతా వేడిగా ఉంది. మాలో చలి ఉండదులే అన్న ధీమా.

గుంజన ఏటిలో రాత్రి బస

భోజనాలు ముగించుకుని, నిద్రకు ఉపక్రమిస్తున్నాం.
కొండను ఆనుకుని ఏరు ప్రవహిస్తోంది.
నిత్యం రొద చేస్తూనే ఉంది.
ఊహించని మార్పు.
ఉన్నట్టు డి చలి మొదలైంది.
అందరికీ మధ్యలో చలిమంట వేశారు.
వెల్లకిలా పడుకుంటే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి.
పగలంతా ఎండలు మండిపోయాయి.
నేలంతా వేడిగా ఉంది.
పైనుంచి చల్లని గాలి వీస్తోంది.
ఒక వింత అనుభూతి.
ఇరు వైపులా చెట్లు నిండిన కొండలు.
మధ్యలో రొద చేస్తూ ప్రవహిస్తున్న ఏరు.
అర్ధరాత్రి చలి చంపేసింది.
తెల్లారకముందే ఒకరొకరూ లేస్తున్నారు.
వేడి వేడి టీ తాగుతూ చలి మంట ముందు కూర్చున్నారు. మళ్ళీ వంట మొదలు పెట్టారు.
నీటి గుండాల్లో దూకే వాళ్ళు దూకుతున్నారు.
గుంజన ఏటిలో భిన్న భాషలు, భిన్న సంస్కృతులు.
ఇక్కడ భారత బహుళత్వం ప్రతిబింబించింది.
తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు పరస్పరం పలకరించుకున్నాయి.

వీళ్ళలో వరంగల్ కు చెందిన వారు, హైదరాబాదుకు చెందిన వారు, చెన్నైకి చెందిన వారు, బెంగుళూరుకు చెందిన వారు, చివరికి హర్యానాకు చెందిన ఒక మహిళ కూడా.
ఇద్దరు తల్లులు తమ ఆడ బిడ్డలను ఎత్తుకు వచ్చారు.

ఒక పాప వయసు నాలుగేళ్ళయితే, మరొక పాప వయసు రెండేళ్ళే. ఇక్కడ రెండేళ్ళనుంచి డెబ్బై ఏళ్ళ వయసు వారి వరకూ ఉన్నారు. హర్యానాకు చెందిన మహిళ బెంగుళూరులో ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు చెన్నైకి మారింది.
భర్త వేరే దగ్గరకు వెళ్ళడంతో రెండేళ్ళ బిడ్డను ఎత్తుకుని వచ్చింది.
వరంగల్ కు చెందిన ఓ జంట హైదరాబాదులో ఉంటోంది.
రెండేళ్ళ పాపను ఎత్తుకుని వచ్చారు.
పెద్ద వాళ్ళతో పాటు ఆ ఇద్దరు బిడ్డలు నదురు బెదురు లేకుండా ట్యూబులు కట్టుకుని నీటి గుండాల్లో ఈదులాడారు.
వారి ఆనందానికి అవధులు లేవు.
తొమ్మిదిన్నర అవుతోంది.
మళ్ళీ ఎండ పెరిగిపోతోంది.
మరో నలుగురు తిరుపతి నుంచి వచ్చి చేరారు.
గుంజన వైపు నడక సాగించాం.

ఏరు పక్కనుంచే రాళ్ళను ఎక్కుతూ, దిగుతూ, కొండ అంచులను తాకుతూ, ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగుతున్నాం. ఇద్దరు ఆడ బిడ్డల్లో రెండేళ్ళ పాపను ఒకరు మార్చి ఒకరు ఎత్తుకున్నారు.
నాలుగేళ్ళ పాప వాళ్ళ అమ్మ చేయిపట్టుకుని నడుస్తోంది.
గుంజన ఏటిలో నడుస్తున్నాం.
గుంజన తెగ రొద చేస్తోంది.
ఇదిగో ఎడమ వైపున ఇక్కడ నుంచి కొండ ఎక్కాలి.
ఆ అంచుకు చేరాం.
కొండ పైనుంచి గుంజన దుముకు తోంది.
ఎంత హడావిడి చేస్తోందో!
కిందకు తొంగి చూస్తే కళ్ళుతిరుగుతాయి.

లోయ: ఇక్కడి నుంచే గుంజన దుముకుతోంది

జాగ్రత్తగా కొండ ఎక్కుతున్నాం. కాళ్ళ కింద ఎండిపోయిన బోద వల్ల జారుతున్నాం.
ఒక్కో చోట చెట్ల వల్ల పట్టు దొరుకుతోంది.
చెట్లు లేని చోట కాళ్ళు, చేతులతో పైకి పాకుతున్నాం.
ఎండ చంపేస్తోంది.
నాలుగేళ్ళ పాప ఎక్కడం నిజంగా సాహసమే.
హర్యానాకు చెందిన ఆ పాప తల్లి పదేళ్ళుగా ట్రెక్కింగ్ చేస్తోంది.
కానీ, ఇంత కష్టమైన ట్రెక్కింగ్ ఎన్నడూ చేయలేదంది.
మొత్తానికి కొండ ఎక్కాం.
ఇప్పటి వరకు నడక గంట పట్టింది.
ఇక్కడి నుంచి లోయలోకి దిగాలి.
ఆ దారిలో ఇరు వైపులా దట్టంగా పెరిగిన చెట్లు.
లోయలోకి దారి ఏటవాలుగా ఉంది.
రాళ్ళపైనుంచి ఎక్కుతూ, దిగుతూ, చెట్లు పట్టుకుని, పక్కనున్న కొండ అంచులు పట్టుకుని దిగుతున్నాం.
మధ్యలో తాళ్ళుకట్టబట్టి తేలిగ్గా దిగుతున్నాం.
రెండేళ్ళ పాప ను ఎత్తుకున్నా దిగలేనంది.
దాంతో ఆ పాప తల్లి దండ్రులు ఆగిపోయారు.
అక్కడే చోటు చూసుకుని నిలిచిపోయారు.
లోయలోకి దిగుతుంటే జారుతోంది.
పట్టు దొరకక కూర్చుని దేకుతున్నాం.
కొంత దూరం వచ్చాక ఎదురుగా పెద్ద బండ వచ్చింది.
దాని కింద నుంచి వెల్లకిలా జారుకుంటూ దిగాం. అక్కడి నుంచి మరీ ఏట వాలుగా ఉంది. తాళ్ళు పట్టుకుని దిగేశాం.

గుంజన నీడన…

అదిగో ఎదురుగా రొద చేస్తున్న గుంజన జలపాతం. దాన్ని చూస్తుంటే అలుపు కాస్తా మర్చిపోతున్నాం.
ఎత్తైన రాళ్ళ పైనుంచి గుంజన లోయలోకి దిగేశాం.
మండు వేసవి. గుంజనలో నీడ.
ఆ నీడనే అంతా సామాను పెట్టి, ఒకరొకరు గుండంలోకి దూకుతున్నారు.

ఇంత వేసవిలోనూ గుంజన దుముకుతూనే ఉంది.
బాగా తలెత్తితే తప్ప ఆకాశం కనిపించడం లేదు.
ఇరువైపులా ఎత్తైన కొండ.
కొండ కొస నుంచి జాలువారుతున్న జలపాతం.
ఇది వరలో జలపాతం నేరుగా గుండంలోనే పడేది.
ఏటి ప్రవాహం కాస్త తగ్గింది.
గుండం ముందు పడి, ఆ నీళ్ళు గుండంలోకి జాలువారుతున్నాయి. జలపాతం నీటి ముత్యాలను విరజిమ్ముతోంది.
ఆ గుండం నుంచి పక్కగా బండల సందులోంచి కిందికి పారుతోంది. కింద నేలంతా ఏటవాలుగా ఉంది.
దిగుతుంటే జారిపోతాం.
ఆ ఏట వాలు బండ పైనుంచి కిందకు జలపాతం జారుతోంది.
అలా జారి జారి కింద ఉన్న మరో పెద్ద నీటి గుండంలో పడిపోతోంది. అది ఎంత పెద్ద నీటి గుండం!
దాని కింద మరో మూడు నీటి గుండాలున్నాయి.
వేరే దారిన వస్తే
వాటిని చేరుకోలేం.
ఆ మూడు నీటి గుండాలను చేరగలుగుతాం.
కానీ, అక్కడినుంచి పైకి ఎక్కలేం.
ఎండ కాస్తున్నా, వేడి లేదు. గుండంలో అంతా ఈదులాడుతున్నారు.
మహిళలు, పిల్లలు, మగ వాళ్ళన్న తేడా లేదు.
యువకులు దూకుతున్నారు.
డై కొడుతున్నారు.
కొందరు మహిళలూ దూకుతున్నారు.

గుండం నుంచి లేవబుద్ది కావడం లేదు. ఆకలేస్తోంది. లేవక తప్పదు. అంతా భోజనాలు ముగించారు.

 

జలపాతం పక్కన నీడలోనే కొందరు కునుకు తీశారు. మళ్ళీ మరి కొందరు జలపాతంలోకి దూకారు.
మధ్యాహ్నం మూడున్నర వరకు నీళ్ళలోనే అలా ఈదులాడారు.
ఫొటోలు దిగారు.
బయలు దేరక తప్పదు.
ఒకరొకరు పైకి ఎక్కుతున్నారు.
దిగడం కంటే ఎక్కడం తేలికనిపించింది.
వచ్చేటప్పుడు ఆ ఏటిలోంచి రావడం, కొండ ఎక్కడం, మళ్ళీ కొండ దిగడంతో అలిసిపోయారు. ఇప్పుడు నీడలో కొండ దిగడమే.
గంటలో లోయ నుంచి కొండ ఎక్కేశాం.
మధ్యలో ఆగిపోయిన భార్యాభర్త, రెండేళ్ళ పాప మా కోసం ఎదురు చూసున్నారు.
మమ్మల్ని చూసి ఊపిరి పీల్చుకున్నారు.
పిల్లలతో గుంజనకు రావడం నిజంగా సాహసమే.
మా వాహనాలు వచ్చిన దారినే వెనుతిరిగాయి.
గుంజన అనుభూతులను మూట గట్టుకుని మరీ బయలు రేరారు. చీకటి పడక ముందే గంగరాజు పాడుకు చేరుకున్నాం.
అక్కడి నుంచి ఎవరి దారిలో వారు ఇళ్ళకు బయలు దేరాం.
గుంజన నిజంగా సాహసం.
ఒక్క చెన్నైకి చెందిన శంకర్, వనతి తప్ప, మిగతా వారందరికి జీవితంలో ఇది గొప్ప సాహసమే. గొప్ప అనుభూతిని మిగిల్చిన సాహసం.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *