(వనపర్తి ఒడిలో-17)
-రాఘవ శర్మ
(పాఠకులకు గమనిక : మా అమ్మ ఆలూరు విమలాదేవి(91) మృతితో ‘వనపర్తి ఒడిలో’ శీర్షికకు పక్షం రోజులు విరామం ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ ఈరోజు నుంచి)
గ్యాస్ స్టౌలు తెలియని రోజులవి.
కాస్త కలవారిళ్ళలోనే కిరసనాయిల్ స్టౌలు.
మా అమ్మ కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటిపైనే వంట చేసేది.
వనపర్తిలో కట్టెల అడితీకెళ్ళి కట్టెలు తెచ్చే వాణ్ణి.
వర్షాకాలంలో కట్టెలు బైటపడేస్తే తడిసిపోయేవి.
విశాలమైన బాత్రూంలోనే కట్టెలు పేర్చేవాళ్ళం.
బొగ్గుల బస్తాకు కూడా బూత్రూంలోనే చోటు.
వేడినీళ్ళకు మా అమ్మ పొట్టుపొయ్యి వెలిగించేది.
వనపర్తిలో ఊరుబయట ఉండే రంపపు మిల్లుల దగ్గరకెళ్ళి సైకిల్ పై పొట్టు బస్తాలు తెచ్చేవాణ్ణి.
పొట్టుపొయ్యికి వరి ఊక కూడా వాడే వాళ్ళు కానీ, చాలా తక్కువ.
వరి ఊక సరిగా నిలబడేది కాదు.
పొట్టు పొయ్యి ఎలా ఉండేది!?
పొట్టు పొయ్యి అంటే మందపాటి, గుండ్రటి ఇనుప డబ్బా.
పైన గిన్నె నిలబడడానికి కొక్కేలుండేవి.
అడుగున మందపాటి రేకుండేది.
కింద వైపు పక్కగా ఒక కర్ర పట్టేటంతటి రంద్రముండేది.
రాత్రి పడుకోబోయే ముందు మా అమ్మ పొయ్యిలో పొట్టు కూరేది.
పొట్టు కూరే ముందు పొట్టులో కాస్త నీళ్ళు చల్లేది.
ఆ తడికి పొట్టు జారిపోకుండా నిలబడేది.
పొయ్యి మధ్యలో పచ్చడి బండ పెట్టి, లోపలంతా పొట్టు పోసి కూరేది.
కింద ఉన్న రంద్రం నుంచి పచ్చటి బండను తాకేలా ఒక గుండ్రటి కట్టెపెట్టేది.
ఆ పచ్చడి బండ, కర్ర రాత్రంతా అలాగే ఉండేవి.
తెల్లవారు జామున 5 గంటలకు లేచి పొట్టు పొయ్యి మధ్యలో పెట్టిన పచ్చడి బండను, నిదానంగా తిప్పుతూ, పొట్టు జారిపోకుండా బైటికి తీసేది.
అలాగే కింద ఉన్న గుండ్రటి కర్ర ను కూడా తీసేసేది.
ఒక కర్రకు కాస్త కిరసనాయిలు అంటించి కింద ఉన్న రంద్రంలో పెట్టేది.
పొట్టుకు అంటుకుని నిదానంగా కాలేది.
పొట్టుపొయ్యిపైన రాగి కాగు పడేసేది.
చలికాలం, వర్షాకాలం అంతా వేడినీళ్ళు స్నానం చేసే వాళ్ళం.
ఆ పొట్టు పొయ్యి తెల్లవారు జామున 5 గంటల నుంచి పదిగంటలవరకు అలా వెలుగుతూనే ఉండేది.
అంత సేపు కాలినా దానికి ఒక్కటంటే ఒక్క కట్టె చాలు.
చివరికి అన్నం కూడా దాని మీదనే వండేది.
అయితే గిన్నెలకు బాగా మసిపారేది.
తోమేటప్పుడు చాలా ఇబ్బంది.
అందుకని అన్నం గిన్నెకు బైటవైపు తడి చేసి బూడిద రాసి పొయ్యిపైన పడేసేది.
ఉడికాక, కాగితంతో తుడిచేస్తే మసి ఏమాత్రం ఉండేది కాదు.
వనపర్తి ప్యాలెస్ ఆవరణలో ఉండే మరి కొన్ని కుటుంబాలు కూడా వేడి నీళ్ళకు పొట్టుపొయ్యి వాడేవాళ్ళు.
ఎలక్ట్రికల్ విభాగాధిపతి సోమసుందరం నాయుడు తల్లి కూడా మమ్మల్ని చూసి పొట్టు పొయ్యి వాడడం నాకు బాగా గుర్తు. వాళ్ళు చిత్తూరు జిల్లాకు చెందిన వారు.
చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతపు అచ్చమైన మాండలికం సోమసుందరం నాయుడు తల్లి నొటి వెంటే తొలి సారిగా విన్నాను. తెలుగు, తమిళం కలబోసినట్టు ఆ రోజుల్లో నాకు వింతగా ఉండేది.
మా ఇంటి వెనుక వరుసలో ఉండేవారు.
కొన్ని కట్టెల మీద, కొన్ని బొగ్గుల కుంపటి మీద మా అమ్మ వంట చేసేది.
పొగ వల్ల కళ్ళకు మంచిది కాదు కానీ, కట్టెల పొయ్యి మీద వంట ఎంత రుచిగా ఉండేదో!
గ్యాస్ స్టౌ పైన పాలు కాస్తే కాసేప టికి బుస్సున పొంగిపోతాయి.
బొగ్గుల కుంపటి మీద పాలు సన్నని సెగకు నిదానంగా కాగితే మీగడ కట్టేది.
కుంపటిలో బొగ్గుల బదులు పిడకల మీద పాలు కాస్తే ఇంకా బాగుండేది. గిన్నెల లాగా రాచిప్పలుండేది.
అవి మెత్తటి రాతితో తొలిచిన గిన్నెలు.
రాచిప్పలకు మూతి వెడల్పుగా ఉండేది.
రాచిప్పల్లో పప్పు చేసినా, పప్పుపులుసు (సాంబారు) చేసినా ఎంత రుచిగా ఉండేదో!
మొన్నీ మధ్య వరకూ మా ఇంట్లో రాచిప్పలుండేవి.
రాచిప్పలన్నీ బాపట్ల నుంచి తెచ్చినవే.
చూద్దామన్నా ఇప్పుడా పొట్టుపొయ్యీ లేదు, బొగ్గుల కుంపటి లేదు, రాచిప్పా లేదు.
కాలగమనంలో ఎన్ని మార్పులు!
వంట చేయడం కూడా ఒక కళ.
అది మా అమ్మ నుంచే నేర్చుకున్నాను.
వంటిల్లు ఒక నిత్య ప్రయోగ శాల.
మన అమ్మలంతా శాస్త్రవేత్తలు.
మన అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, అవ్వలు,స్త్రీ మూర్తులైన వారి పూర్వీకులంతా శాస్త్ర వేత్తలే. వేలాది సంవత్సరాల వారి ప్రయోగాల ఫలితమే మనం ఈరోజు తింటున్న రుచికరమైన తిండి.
ఎంత ఉప్పు వేయాలి? ఎంత కారం వేయాలి? ఎన్ని దినుసులు వేయాలి? ఎప్పుడేయాలి? ఎంత ఉడకాలి? ఎంత వేడిలో ఉడకాలి? ఎప్పుడు దించాలి?
ఎన్ని ప్రయోగాలు! ఎన్ని ఫలితాలు!
ఈ ప్రయోగ ఫలితాలకు ఎన్ని లక్షల డీలిట్లు ఇస్తే సరిపోతుంది!
ఎన్ని కోట్ల పీహెచ్ డీలు ఇస్తే సరితూగగలవు!?
ప్యాలెస్ కు ఆగ్నేయ దిశగా కోటమైసమ్మ దేవాలయం ఉండేది.
ఆ రోజుల్లో కోట మైసమ్మ అంటే పెద్ద పాముపుట్ట.
దాని చుట్టూ చిన్న నిర్మాణం.
ఆ రోజుల్లో అమ్మవారు, (ఆట్లమ్మ, చికెన్ పాక్స్,) పెద్దమ్మవారు (మశూచి,స్మాల్ పాక్స్) పోస్తే కోట మైసమ్మకు మొక్కుకునే వారు.
నేను హైస్కూలుకొచ్చిన కొత్తల్లో అమ్మవారు పోసింది.
ఆరోజుల్లో వేప మండలేసి పడుకోబెట్టేవారు.
చాలా చికాగ్గా ఉన్నా, దానంతట అదే తగ్గేది.
పెద్దమ్మవారు సోకకుండా టీకాలు వేసేవారు.
నాకు అమ్మవారు పోయగానే మా ఇంట్లో పనిచేసే శేషమ్మ మా అమ్మకు చెప్పి మైసమ్మకు మొక్కించింది.
నాకు అమ్మవారు తగ్గాక కల్లు పోయిస్తానని ఆ మొక్కు.
అంత వరకు మైసమ్మ గురించి మాకు పెద్దగా తెలియదు.
అమ్మవారు దానంతట అదే తగ్గింది.
తగ్గాక మా అమ్మ పని మనిషి శేషమ్మను పిలిచి కల్లుకు రూపాయిచ్చింది.
శేషమ్మ నన్ను, మా పెదనాన్న కొడుకు హరిని కోట మైసమ్మ ఆలయానికి తీసుకెళ్ళింది.
మా చేత పుట్టకు మొక్కించింది.
తాను తెచ్చిన కల్లును కాస్త పుట్టలో పోసింది.
మా పెదనాన్న కొడుకు తీర్థం లాగా చెయ్యి పట్టి, దోసెడు నిండా కల్లు తాగేశాడు.
నేను ఒద్దన్నాను.
‘ఇది తీర్థం , తాగకపోతే మైసమ్మకు కోపం వస్తుంది తాగాలి’ అన్నాడు మా అన్నయ్య.
చెయ్యిపట్టి చెంచాడు పోయించుకుని తాగాను కదా!
తియ్యగా, ఉప్పగా, పుల్లగా, కారంగా, చేదుగా నోరంతా వికారంగా అదోలా తయారైంది.
జీవితంలో అదే తొలిసారి కల్లు తాగడం.
అదే చివరి సారి.
ఇప్పటి వరకు మరే మద్యమూ రుచిచూడ లేదు .
వనపర్తి పరిసరాల్లో తాటి కల్లుకంటే ఈత కల్లు ప్రసిద్ధి.
తాటి చెట్లు చూద్దామన్నాకనిపించేవి కావు.
అంతా ఈత చెట్లు.
అందు చేత అక్కడ ఈత కల్లు చాలా ప్రసిద్ది.
పాలిటెక్నిక్ వర్క్ షాపులో పనిచేసే కమ్మరి కిష్టయ్య కమ్మరి పనిలో చాలా నైపుణ్యం ఉన్నవాడు.
స్మితి సెక్షన్లో అతన్ని స్కిల్డ్ వర్కర్ అనేవారు.
కమాన్ అవతల అతని ఇల్లు.
ఇంటి దగ్గరే కొలిమి పెట్టి పనిచేసుకునే వాడు.
మాకు గొడ్డలి, కత్తిపీట వంటి పనిముట్లు చాలా చేసి ఇచ్చాడు.
ఆరోజుల్లో కట్టెల పొయ్యి వాడేవారు కనుక, ప్రతి ఇంట్లో గొడ్డలి తప్పనిసరిగా ఉండేది.
కమ్మరి కిష్టయ్య చేసిచ్చిన గొడ్డలి ఇప్పటి వరకు మా ఇంట్లో అలాగే ఉంది.
అతను చేసిచ్చిన కత్తిపీట పదేళ్ళ క్రితం వరకు ఉండేది.
మా కత్తిపీట బాగుందంటే మా నాన్న కమ్మరి కిష్టయ్య దగ్గర మరో నాలుగు కత్తిపీటలు చేయింది తలా ఒకటి ఇచ్చాడు.
అలా మా అక్కకు ఒకటి, రంగనాయకులు కుమార్తె రాధక్కకు ఒకటి, మాకొకటి, సోమసుందరం నాయుడు తల్లి అడిగితే ఒకటి చేయించి ఇచ్చాడు.
హైదరాబాదులో మా అక్క పక్కింటావిడ అడిగితే కత్తి పీట ఇచ్చింది.
వెళ్ళి చూస్తే చేపలు తరుగుతోంది.
‘మేం కూరగాయలు తరుక్కునే కత్తిపీటతో మీరు చేపలు తరుగుతారా!? అంటూ మా అక్క ఆమెతో గొడవ పడి తెచ్చి ఇచ్చిన ఆ కత్తిపీటను వారింట్లోకి విసిరి కొట్టింది.
‘ఎంత పనిచేశావు పెద్ద పాప! కడుక్కుంటే పోయేది కదా! చక్కని కత్తిపీటను పారేశావు’ అని మా అమ్మ చాలా బాధ పడిపోయింది.
మా ఇంట్లో ఉండే కత్తి పీట పదేళ్ళ క్రితం వరకు పనిచేసింది.
మా అమ్మ దాదాపు యాభై ఏళ్ళు
ఆ కత్తిపీటతోనే కూరగాయలు తరిగింది.
ఆమె తరిగిన కూరగాయల రాపిడికి కత్తిపీట అరిగిపోయి, సన్నపడిపోయి రెండు ముక్కలైంది.
విరిగిపోయిన కత్తిపీట రెండు ముక్కలు ఈ మధ్య వరకు ఉండేవి.
‘అయ్యో.. కత్తిపీట విరిగిపోయిందా!’ అని మా అమ్మ చాలా బాధపడిపోయింది.
అర్ధ శతాబ్ద కాలం మా అమ్మ ఎన్ని కూరగాయలు తరిగితే ఆ కత్తిపీట అరిగిపోయి, విరిగిపోయిందో!
మా కోసం, మా తిండి కోసం ఎంత శ్రమపడిందో!
మా నాన్న వర్క్ షాపులో లేత్ మిషన్ పైన గూటం కూడా చేయించుకొచ్చాడు.
మా ఇంట్లో ఆ గూటాం ఇప్పటికీ ఎక్కడో ఉండాలి.
సోమసుందరం నాయుడు ఇంటికోసం కూడా మరో గూటాం చేయించి ఇచ్చాడు.
ఆవకాయ వేయడానికి మామిడికాయలు తరిగే కత్తిపీట కూడా కమ్మరి కిష్టయ్య చేసిచ్చాడు.
అది ఇప్పటికీ మా ఇంట్లో ఉంది.
ఇప్పటికీ ఆ కత్తి పీటతోనే మామిడి కాయలు తరిగి ప్రతి ఏటా ఆవకాయ వేస్తాం.
వచ్చే నెలలోనే, పై నెలలోనే ఆవకాయ వేసేటప్పుడు అటకపై నుంచి ఆ కత్తిపీటను మళ్ళీ దించాలి.
ఆ కత్తిపీటను ఆవకాయ కోసం ఎంతో మంది ఇప్పటికీ తీసుకెళుతూ ఉంటారు.
ఇవ్వన్నీ కమ్మరి కిష్టయ్య చేతి కష్టం, అతని చేతి నైపుణ్యం.
కమ్మరి కిష్టయ్య చాలా కష్ట జీవి.
అతనికి మా నాన్న వయసు. ఇప్పుడు ఉండే అవకాశం లేదు.
నిజమే అతను లేడు కానీ, అతను చేసిన పనిముట్లు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి.
“వంటిల్లు ఒక నిత్య ప్రయోగ శాల.
మన అమ్మలంతా శాస్త్రవేత్తలు.
మన అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, అవ్వలు,స్త్రీ మూర్తులైన వారి పూర్వీకులంతా శాస్త్ర వేత్తలే. వేలాది సంవత్సరాల వారి ప్రయోగాల ఫలితమే మనం ఈరోజు తింటున్న రుచికరమైన తిండి.”
మీ ఈ ఆర్టికల్ మొత్తం ఒకెత్తు.. పై వాక్యం ఒకటీ ఒకెత్తు. వంట చేసే సంచిత జ్ఞానానికి మారుపేరైన స్త్రీమూర్తులు శాస్త్రవేత్తలే. ఎంత గొప్పమాట ఇది. మన దరిద్రపు అర్ధ శాస్త్రం వంటపని అనుత్పాదక శ్రమగా వ్యాఖ్యానించబట్టే మహిళల వంటపని ఎందుకూ కొరగానిదైపోయింది సమాజం దృష్టిలో. కానీ హోటల్స్ లో పనిచేస్ వంట పుంగవులు చెఫ్ లు గా మారి సంపాదనలో ఆరితేరిపోతున్నారు. మనది తల్లకిందుల సమాజం అని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు కదా మరి.
మీ వ్యాఖ్య చాలా బాగుంది. డాక్టర్ లాగా నా డి చక్కగా పట్టుకున్నారు
ఈ వ్యాసం చదివిన తరువాత నా చిన్ననాటి జ్ఞాపకాలు, అన్నీ మా ఇంటిలో వున్న ఇటువంటి వస్తువులవే గుర్తుకు వచ్చి చాలాసేపు గతంలోని మధురానుభూతులలోనికి తీసుకొని వెళ్ళాయి. రచయితకు ధన్యవాదములు.
నా బాల్యం నేను ఇటువంటివి మా ఇంట్లోనే ఉండేవి. మరియు dhali undedi
పాలు కుండలో పోసి పిడకలు పైన కాగా పెట్టిది. గోడకు దిద్ది ఉండేది. రెండు వైపులా చిన్న కిటికీలు. మరియు సాయంత్రం kandillu (lanter) గాల్స్ బూడిడితో తుడుచుడి ఉండేది. ఇన్కను చాలా చిన్నానాటి గ్యాప్కాలు
Very good remembrance. My mother also used this type of
Pottu poyyi. I used to sit near this type of poyyi in winter & rainy days. Very very sweet memories of childhood.
Thank you very much for taking me to my childhood.
వనపర్తి పేరు కనపడగానే మీ వ్యాసం చదివాను. మాకు చాలా సంతోషంగా అనిపించింది. మా చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చారు.
ముఖ్యంగా ఇందులో మీరు ప్రస్తవించిన కమ్మరి కిష్టయ్య గారు మా దగ్గర బంధువు అవుతారు. ఆయన 20 ఏళ్ల క్రితమే మరణించారు. వారి కుమారుడు ప్రస్తుతం polytechnic college లో పని చేస్తున్నారు.
సాధారణంగా, ప్రతి ఒక్కరి చిన్న నాటి జ్ఞాపకాలు, దైనందిన సంఘటనలు, ఎప్పటికీ మధురానుభూతులను కలిగిస్తాయి. ఈ అంశాల్లో కల్లు వంటివి కాకుండ, మిగతా అన్నిటిలో నా చిన్న తనంలో నేను కూడా పాల్గొన్నాను.
రూపకరౖకు, ప్రచురణకర్తకు, పంచుకొన్న వారికి ధన్యవాదాలు.