నా షుగర్ కి మందులు ఆపి నేటికి 18 నెలలు!

 

-ఇఫ్టూ ప్రసాద్

 

నా వయస్సు 66. నా షుగర్ వయస్సు 32. మందులు ఆపి ఈరోజుకి ఏడాదిన్నర! ఐనా పూర్తి నియంత్రణలోనే ఉంది. మందులు వాడే రోజుల్లో కంటే మెరుగ్గానే ఉంది.

నా షుగర్ 14-11-1991 నాడు బయట పడింది. అనువంశికంగా వచ్చింది. నేను అప్పటికే ఏలూరు, నెల్లిమర్ల కార్మికోద్యమాల నిర్మాణం, నిర్వహణల్లో వుండేవాణ్ణి. సగటున రోజుకి 16 నుండి 18 గంటల అసాధారణ శారీరక శ్రమ చేసేవాణ్ణి. అందులో భాగంగా రోజూ గంటల తరబడి సైకిల్ తొక్కేవాణ్ణి. దానివల్ల కాబోలు, షుగర్ బయట పడ్డాక పదకొండున్నర ఏళ్ళు మందులు వాడే అవసరం రాలేదు.

2003 మేలో టాబ్లెట్స్ మొదలు పెట్టా. 2011 లో బ్యాక్ పెయిన్ వల్ల పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. శారీరక శ్రమ లేదు. నా జీవన క్రియల్లో తేడా వచ్చింది. నా బాడీ మందుల్ని కోరింది. వైద్య సలహాతో 2011 మే లో ఇన్సులిన్ వాడకంలోకి మారా. అప్పటికి షుగర్ వ్యాధి పై నాకు శాస్త్రీయ అవగాహన లేదు. అదే సమయంలో ఇన్సులిన్ నుండి వెనక్కి రావాలనే దృష్టి మాత్రం ఉండేది. బ్యాక్ పెయిన్ రికవరీ క్రమంలో ఓ వైద్య మిత్రుని మానిటరింగ్ లభించింది. ఓ క్రమపద్ధతిలో టాబ్లెట్స్ తగ్గిస్తూ వచ్చా. 2012 ఆగస్టులో ఇన్సులిన్ ఆపి తిరిగి టాబ్లెట్స్ కి మారా.

ఇదిలావుండగా కెనడా నెఫ్రాలజిస్ట్ జాసన్ ఫంగ్ రచించిన పుస్తకం *THE DIABETES CODE* నా మిత్రులైన ప్రజావైద్యుని సిఫారసుతో 2021లో చదివా. వ్యాధి పట్ల పూర్తి శాస్త్రీయ అవగాహన ఏర్పడింది. మందులు లేకుండా నియంత్రణ చేయడం సాధ్యమేననే నమ్మకం కలిగింది. దాన్ని పాటించాలని దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నా.

ఈ శాస్త్రీయ వైద్య విధానం “బ్రహ్మవిద్య” కాదు. మనం తీసుకునే ఆహార నియమాల్లోనే ఉంది. కార్బోహైడ్రేట్లని తగినట్లుగా తగ్గించాలి. మరోవైపు పెంచాల్సిన ఫ్యాట్స్ వంటివి కూడా ఉన్నాయి. తగ్గించేవి మన చేతిలో ఉన్నవే. మన నాలుకను మన మనస్సు అదుపు చేస్తే చాలు. పెంచేవి మాత్రం మన చేతిలో లేనివి. ఖర్చుతో కూడినవి. తగ్గేంచే వాటిపై కేంద్రీకరణచేశా. ఆహారం లో పెంచాల్సిన రెండవ భాగం పై దృష్టి పెట్టలేదు. ఆహారంతో పాటు షుగర్ వ్యాధి నియంత్రణ కోసం పాటించాల్సిన శారీరక, మానసిక నియమాలపై కూడా కేంద్రీకరణ చేశా. నా సాటి షుగర్ పేషెంట్ల దృష్టికి తేవడం మంచిదని అనిపించింది.

మందులు ఆపేముందు ఒక జాగ్రత్త తీసుకున్నా. చాలా కాలం నుంచి నా దేహవ్యవస్థ మందులకు అలవాటు పడింది. దాని నుండి ఒకేసారి బయట పడలేము. రోజుకు రెండు టాబ్లెట్స్ వాడే అలవాటు నుండి ఓ క్రమపద్ధతిలో వెనక్కి వచ్చా. కొన్నాళ్ళు 1+1/2 చొప్పున; మరికొన్నాళ్ళు 1/2+1/2 చొప్పున; ఇంకొన్నాళ్ళు 1/2 చొప్పున టాబ్లెట్స్ డోస్ తగ్గిస్తూ వచ్చాను. తుదకు 24-9-2021న మందుల్ని పూర్తిగా ఆపా. ఈరోజుకు 18 నెలలు!

3-1-2023న థైరో కేర్ టెస్ట్ లో HB A1C కౌంట్ 6.8 ఉంది. క్రియాటినిన్ 1.1 ఉంది. మొదటిది కొద్దిగా గీత దాటిన మాట నిజమే. మందులు వాడే కాలంలో అవి 7.1 & 1.3 చేరినస్థితి కూడా వుంది.

HB A1C ని 6.5 కి తగ్గించడం నా ప్రస్తుత లక్ష్యం! గత టెస్ట్ చేసి 80 రోజులైనది. ఇప్పుడు టెస్ట్ చేయిస్తే 6.5 కి తగ్గవచ్చు. కనీసం 6.6కి తగ్గవచ్చుని అంచనా! నేను పాటించే ఆహార, శారీరక, మానసిక నియమాల్ని బట్టి వేస్తున్న అంచనా యిది.

నా ఆహార అలవాట్లలో రాడికల్ మార్పు వచ్చింది. అందువల్ల 18 నెలలలో నా బరువు ఆరేడు కేజీలు తగ్గినమాట నిజమే! నేను బలహీనపడ్డట్లు మిత్రులు ఆందోళన చెందడం సహజమే! నా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నా శారీరక కదలికల్లో గతం కంటే క్రియాశీలత పెరిగింది. నా ఆరోగ్యస్థితి మెరుగైనది. స్వానుభవం చెబుతున్న వాస్తవమిది.

సర్వం వ్యాపారీకరణ చేస్తున్న కార్పోరేట్ వ్యవస్థ ప్రజారోగ్యాన్ని మార్కెట్ పరం చేసింది. రోగాలను సరుకులుగా మార్చింది. ఇందులో *అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్* (ADA) పాత్ర ఉంది. వ్యూహాత్మక దృష్టితో షుగర్ వ్యాధిని ప్రపంచ వ్యాప్త లాభసాటి వ్యాపారంగా మార్చడం లో ADA ఒక సాధనంగా మారింది. నేడు మెడికల్, ఫార్మా మాఫియా శక్తుల నిలువు దోపిడీకి ADA సహకరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది షుగర్ పేషెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది నిప్పులాంటి నిజం!

పెట్టుబడికి వ్యతిరేకంగా శ్రమశక్తి తరపున పోరాడే సైద్ధాంతిక నిబద్ధత గల వాణ్ణి. నా లాంటి వాళ్ళు సైతం బోల్తా పడుతున్న స్థితి ఉంది. ఇక సామాన్య ప్రజల్ని కార్పోరేట్ వ్యవస్థ ఎంతమోసం చేయగలదో! స్వయంగా నేసాధించిన ఫలితాన్ని వెల్లడించడం కనీస నైతిక బాధ్యతగా భావిస్తున్నా.

మన షుగర్ వ్యాధిని కార్పోరేట్ శక్తుల చేతుల్లో సరుకుగా మార్చకుండా మనకి సాధ్యమైన మేరకు ప్రయత్నిద్దాం. మందులు వాడకుండా నియంత్రణ చేసే దిశలో ప్రయత్నిద్దాం.

సాటి షుగర్ పేషెంట్లకు ఒక సూచన చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఇలా మందులు లేని చికిత్సా విధానాన్ని పాటించే ప్రయత్నం చేసే మిత్రుల్ని ఉద్దేశించిన విజ్ఞప్తి యిది.

నేను వైద్యుణ్ణి కాదు. మీ లాంటి షుగర్ పేషంట్ ని మాత్రమే! ప్రయోగం చేశా. ఫలితాన్ని సాధించా. నా స్వానుభవంతో సూచన చేస్తున్నా. షుగర్ వ్యాధి నియంత్రణ కోసం కఠిన మనోనిగ్రహం అవసరం. ఆహార అభిరుచులనూ అలవాట్లనీ అధిగమించే స్థిర సంకల్పం ఉండాలి. అవి లేకుండా ప్రయత్నిస్తే ఫలితాలు రావు. తర్వాత ఫలితాలు రాలేదనడం సమంజసం కాదు. ఈ నిజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నా సాటి షుగర్ పేషెంట్లకు చివరగా సూచనను చేస్తున్నాను.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *