ఎగువభద్ర ప్రాజెక్టుపై రాయలసీమకు నష్టం కలిగేలా ఏపీ ప్రభుత్వ వైఖరి.
విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సామాదానంతో అయినా ప్రభుత్వ వైఖరి మారాలి.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
రాయలసీమకు ప్రాణపదమయిన తుంగభద్ర నీటిని వినియోగించే విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల మునుముందు రాయలసీమకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని , కేంద్రం ఇచ్చిన సమాధానంతో అయినా ఏపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
కృష్ణ నీటికి పరిమితులు ఏర్పడిన నేపథ్యంలో రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి తుంగభద్ర నీళ్లు ప్రదానం అవుతుంది. తుంగభద్ర నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు సరఫరా చేసేలా చర్యలు, ఎగువ రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టుల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. పై రెండు విషయాల్లో ఏపీ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని చెప్పక తప్పదు.
పోరాటంలో గందరగోళం
అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఎగువభద్రకు జాతీయ హోదా ఇవ్వడంపై ప్రశ్న అడిగిన సందర్భంగా కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ ఎగువభద్ర కు జాతీయ హోదా ఇవ్వడం వల్ల రాయలసీమకు నష్టం వాటిల్లదని అర్థం వచ్చేలా సమాధానం ఇచ్చారు.
విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నలోనే బలహీనత ఉన్నది. కర్నాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఎగువభద్ర వల్ల కృష్ణలో రాయలసీమ నికరజలాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అంచనా వేశారా అని అడిగినట్లు పత్రికా కధనాలను బట్టి తెలుస్తోంది. విజయసాయి రెడ్డి గారు అధికార పార్టీ కీలక నేత కాబట్టి ప్రభుత్వ ఆలోచన గానే వారి ప్రశ్నను అర్థం చేసుకోవాలి. బచావత్ ప్రకారం తుంగభద్ర నుంచి కృష్ణలో కలపాల్సినది 31.5 TMC లు. కానీ సగటున 100 – 150 TMC లు కలుస్తున్నాయి. ఈ ఏడాది ఏకంగా 630 TMCలు కలిసాయి. గణాంకాలు చెపుతుంది తుంగభద్ర నుంచి కృష్ణలో కలపాల్సిన నీటి కన్నా వందల TMC ల నీరు కలుస్తుంది. తుంగభద్ర ఎక్కువ శాతం కర్ణాటకలోనే ప్రవహిస్తోంది. ఈ విషయంపై గణాంకాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రాన్ని ప్రశ్న అడగడం సరికాదు. గందరగోళ వ్యవహార శైలితో ఎగువభద్ర విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా పోరాడుతుంది ?
ఎగువభద్రపై పోరాటం కన్నా గండ్రేవుల నిర్మాణంపై శ్రద్ద పెట్టాలి.
తుంగభద్ర పై క్రిష్ణా నీటి వివాదా ట్రిబ్యునల్ (KWDT 2) కర్ణాటక ప్రభుత్వానికి నీటి కేటాయింపులపై సుప్రీంలో స్టే ఉన్నది. స్టే ఉండగా జాతీయ హోదా ఎలా ఇస్తారు అన్న విషయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి అవకాశం ఉంది. దాని చుట్టే ఏపీ ప్రభుత్వం పరిభ్రమించడం సమస్యకు పరిష్కారం కాదు. తుంగభద్రలో నీరు పుష్కలంగా ఉన్నాయి , TB డ్యామ్ పూడిక కారణంగా తాము ఎగువ భద్ర ఎత్తిపోతల పథకాన్ని అమలు చేసుకుంటాము అని కర్ణాటక వాదిస్తే తీర్పు వారికి అనుకూలంగా వచ్చే అవకాశం లేకపోలేదు. రాయలసీమ ప్రాజెక్టులకు తుంగభద్ర డ్యామ్ ఎగువన నీటి కేటాయింపులు తక్కువ ఎగువ భాగంలో తుంగభద్ర ప్రవాహం తగిన రీతిలో ఉంటే అదికూడా వారికే అనుకూలంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేయాల్సినది సుప్రీంకోర్టులో ఫిటిషన్ వరకే పరిమితం కాకుండా తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఎగువభద్రకు జాతీయ హోదాను కేంద్రం ప్రకటించింది. అదే తుంగభద్రపై వెనుకబడిన రాయలసీమలో అన్ని అనుమతులు ఉన్న గండ్రేవుల, HLC , LLC కి సమాంతర కాల్వ జాతీయ రహదారిలో బాగంగా కృష్ణపై కేంద్రం నిర్మించ తలపెట్టిన తీగల వంతెన స్థానంలో సిద్దేశ్వరం అలుగును కేంద్ర నిధులతో చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. తాజా బడ్జెట్ లో అలాంటి ఆలోచనే ఏపీ ప్రభుత్వం చేయకపోవడం వల్ల రాయలసీమకు నష్టం జరిగింది.
ఎగువభద్ర నేపథ్యంలో అధికార పార్టీ సబ్యులు విజయసాయి గారి ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం దృష్టిలో ఉంచుకుని వెంటనే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఉద్యమ సంస్థలు , ప్రజాప్రతినిధులతో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. న్యాయ పోరాటం , రాజకీయ ఒత్తిడి చేసే విధంగా అధికార వైసిపి వెంటనే కార్యాచరణను ప్రకటించాలి.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,
సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం)