‘తుంగభద్రని మరచిన బడ్జెట్ రాయలసీమకు అన్యాయం’

 

తుంగభద్రను విస్మరించిన బడ్జెట్ తో రాయలసీమకు అన్యాయం.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చివరి బడ్జెట్ లో తుంగభద్రపై ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు , ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల రాయలసీమకు అన్యాయం జరిగిందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

రాయలసీమ వెనుకబాటుకు ప్రధాన కారణం నీటి సమస్య పరిష్కారం కాకపోవడం కృష్ణా , తుంగభద్ర , కుందూ నదుల ద్వారా అపార జలవనరులు ఉన్న వాటిపై ప్రాజెక్టులను నిర్మించి సీమ పొలాలకు నీటిని సరఫరా చేయకపోవడం వల్ల సీమ కరువుతో అల్లాడుతుంది. కృష్ణలో నీటి అవకాశాలు తగ్గడం , మిగులు – వరద జలాలని సైతం పంచడం వల్ల రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి ఒకే ఒక్క అవకాశం తుంగభద్ర. తుంగభద్ర నుంచి కృష్ణలో కలపాల్సిన నీరు 31 TMC లు మాత్రమే సగటున ప్రతి ఏడాది 150 TMC లు కలుస్తుంది అదే ఈ ఏడాది 630 TMC లు కలిసాయి. ఈ లెక్కలు బట్టి అర్థం చేసుకోవచ్చు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి తుంగభద్ర ఎంత కీలకమో..

ఎగువ భద్ర నేపథ్యంలో…

కర్ణాటక ప్రభుత్వం బచావత్ కేటాయింపులతో సంబంధం లేకుండా తుంగభద్రపై ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం- దానికి కేంద్రం ఏకపక్షంగా జాతీయ హోదా ఇవ్వడం రాయలసీమకు మునుముందు తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. ఎగువ భద్రపై పోరాటంతో బాటు మారిన పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నదిపై ప్రతిపాదనలో ఉండి అన్ని అనుమతులు ఉన్న గండ్రేవులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. వేదవాతి , సిద్దేశ్వరం అలుగు , HLC , LLC లకు సమాంతర కాల్వ నిర్మాణం కోసం కార్యాచరణ ప్రకటించాలి. కానీ బడ్జెట్ ప్రాధాన్యత, కేటాయింపులు అటువైపు లేకపోవడం అన్యాయం. మరో వైపు గాలేరు నగరి , హంద్రీనీవా మొదటి రెండవ దశ పనులను 2024 , 25 , 26 కి పూర్తి చేస్తామని ప్రతిపాదించడం ఆలస్యం అవడంతో బాటు ఈ ప్రాజెక్టులు పూర్తి అయినా వాటికి నీరు విడుదల చేయాలంటే సిద్దేశ్వరం పూర్తి చేయాలన్న కనీసం తాము రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పధకం పరిస్థితి పై స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం సరికాదు.

 

కర్ణాటక చేపట్టిన ఎగువ భద్రను పూర్తిగా అడ్డుకోవడం అంత సులభం కాదు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణలో కలపడం , తుంగభద్ర నుంచి కృష్ణలో కలపాల్సిన దాని కన్నా ప్రతి ఏటా వందల TMC ల నీరు కలుస్తుంది. మరో వైపుTB డ్యామ్ పూడిక కారణం చూపి కర్ణాటక ఎగువ భద్రకు అనుమతి తీసుకునే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో నీరు సముద్రం పాలు కావడం రాయలసీమలో తగిన వినియోగం చేయకుండా ఉంటే కర్ణాటక ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు నేడు అక్రమం కావచ్చు రేపు అవే హక్కుగా మారుతుంది. కృష్ణను కోల్పోయిన రాయలసీమ భవిష్యత్ లో తుంగభద్రను కూడా కోల్పోతే రాయలసీమ ఎడారిగా మారుతుంది. ఈ నేపథ్యంలో రాయలసీమకు న్యాయం జరగాలన్నా తుంగభద్ర నీటిపై హక్కులు కాపాడుకోవాలన్నా కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఎగువ భద్రను నిలుపుదల చేయడానికి చేసే ప్రయత్నాలు కన్నా రాయలసీమలో తుంగభద్ర నదిపై తగిన ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అలాంటిది నేటి బడ్జెట్ ప్రతిపాదనలలో తుంగభద్ర పై ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు తగిన నిధులు మంజూరు చేయకపోవడం రాయలసీమకు అన్యాయం చేసినట్లే. ప్రభుత్వం గండ్రేవుల , సిద్దేశ్వరం అలుగుకు పూర్తి స్థాయి నిధులు ఖర్చు చేయడానికి అనుగుణంగా బడ్జెట్ సవరణ చేసే విధంగా రాయలసీమ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాయలసీమ మేధావుల ఫోరం కోరుతుంది.

(*మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *